నింగి, నేల, నీరు, నిప్పు, గాలి… అనేవి పంచభూతాలు. మనిషి శరీరం పాంచభౌతికం అన్నది శాస్త్రం. ‘‘పంచభూతాల సమాహారమే ఈ ప్రకృతి’’ అంది ప్రాచీన సాహిత్యం. అయితే మనిషి ఈ పరమసత్యాన్ని విస్మరించాడు. పంచభూతాల్లో దేన్నీ సజావుగా, సహజంగా మననీయడం లేదు. మనిషి ఎక్కడున్నా విచ్ఛిన్నమే! అడుగిడిన ప్రతిచోటా పర్యావరణ విధ్వంసమే అని మనిషి – ప్రకృతి గ్రంథంలో పెర్కిన్స్ మార్ష్ చెప్పిన మాటలు అక్షర సత్యాలు. పచ్చటి అడవులన్నీ మటుమాయమై కాంక్రీట్ అరణ్యాలుగా మారుతూ… చెరువులు, వాగులు, వంకలూ కాలుష్య కాసారాలుగా మారడం వల్ల భూమిపై నున్న జీవజాలం విలవిలలాడి పోతోంది. అనేక జీవులు ఇప్పటికే అంతరించిపోగా, లెక్కకు మిక్కిలి జీవులు మనుగడ కోసం, శక్తికి మించిన పోరాటం చేస్తూ, మాకూ జీవించే స్వేచ్ఛ నివ్వరూ అంటూ కనిపించిన వారినందరినీ దీనంగా వేడుకుంటున్నాయి. ఇలా ఉనికి కోసం పోరాటం చేస్తున్న పక్షిరాజమే గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ (బట్టమేక పక్షి). గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ పరిరక్షణ కొరకు తగు చర్యలు సూచించా ల్సిందిగా కోరుతూ సుప్రీంకోర్టు ఇటీవల ఒక నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసిన నేపథ్యంలో, ఆ పక్షి దయనీయ గాథను మనమూ తెలుసుకుందామా..!!
బట్టమేక పక్షి – విశిష్టత
గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ పక్షి శాస్త్రీయనామం ఆర్డియోటిస్ నైగ్రిసెప్స్ (Ardiotircs Nigriceps). ఈ పక్షి భారత ఉపఖండంలో కనిపించే అతిపెద్ద భూగోళపక్షి. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద ఎగిరే పక్షిగా గుర్తింపు పొందింది. ఇది వివిధ రాష్ట్రాల్లో వివిధ పేర్లతో పిలవబడుతోంది. మల్దోక్, ఎర్‍బాట్, ఘోరడ్, గోడవాన్, తుక్దర్, సోహన్ చిడియా, బట్టమేక పక్షి లాంటివి వివిధ రాష్ట్రాల్లో గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ను పిలిచే ప్రసిద్ధ పేర్లు. ప్రసిద్ధ భారత పక్షిగా శాస్త్రవేత్త డా।। సలీం అలీ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ను భారత జాతీయ పక్షిగా ఎంపిక చేయాలన్న నిర్ణయానికి తన పూర్తి మద్దతును ప్రకటించాడు. అయితే భారత ప్రభుత్వం గ్రేట్ ఇండియన్ బస్టర్డ్కు బదులుగా ఇండియన్ పీ ఫౌల్ (Indian Pea Fowl)ను భారత జాతీయ పక్షిగా ప్రకటించింది.
భౌతిక లక్షణాలు
గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ పొడవాటి కాళ్ళు, ఉష్ట్రపక్షిలాగా పొడవాటి మెడతో చాలా పొడవుగా ఉండి, దాదాపు ఒక మీటర్ ఎత్తు ఉంటుంది. రెక్కలు, నలుపు, గోధుమ మరియు బూడిద రంగులను కలిగి ఉండగా, శరీరం లేత గోధుమ రంగులో ఉంటుంది. ఈక రంగు మగ మరియు ఆడ బస్టర్డ్ల మధ్య తేడాను గుర్తించడంలో సహాయపడుతుంది. పొట్ట, మెడ భాగాల్లో తెల్లగా, వీపు గోధుమ రంగులో ఉంటుంది. తల మరియు మెడపైనున్న నల్లటి టోపీ లాంటి నిర్మాణం దానిని ఇతర పక్షుల నుండి వేరు చేస్తుంది. ఛాతి వద్ద నలుపు, తెలుపు ఈకలు హారంలా ఉంటాయి. మగ పక్షి 1.1-1.20 మీ।। పొడవు, 8-18 కిలోల బరువు కలిగి ఉంటాయి. ఇది ముదురు మరియు ఇసుక బఫ్ రంగును కలిగి ఉంటాయి. ఆడపక్షి మగపక్షి కన్నా పరిమాణంలో చిన్నగా ఉండి 3.5 నుండి 6.75 కేజీల బరువును కలిగి ఉంటాయి. అవి నివసించే ప్రాంతంలో గ్రేట్ ఇండియన్ బస్టర్డ్లు అతిపెద్ద ఎగిరే పక్షులైనప్పటికీ కోరి బస్టర్డ్ (శాస్త్రీయనామం Ardiotircs Kori) మరియు గ్రేట్ బస్టర్డ్ (otis trade)లు పరిమాణంలో గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ల కన్నా పెద్దవిగా ఉంటాయి.
నివాసం మరియు విస్తరణ
గ్రేట్ ఇండియన్ బస్టర్డస్ శుష్క మరియు అర్ధ శుష్క ప్రాంతాలలోని గడ్డిభూముల, పొదలు, పంట దిగుబడి తక్కువగా ఉన్న భూములు కలిగిన ప్రాంతాలలో ఎక్కువగా నివసిస్తాయి. నీటి పారుదల కలిగిన ప్రాంతాలో ఇవి నివసించవు. ఇవి ఎక్కువ సమయం భూమి మీద గడపడానికే ఇష్టపడతాయి. విభిన్న ప్రాంతాల మధ్య ఇవి తక్కువ దూరం మాత్రమే ఎగురుతూ ప్రయాణిస్తాయి.
శుష్కప్రాంత గడ్డి భూముల్లో వీటిని అత్యున్నత పక్షి జాతులుగా (Flagship Bird Species of Grass lands)పిలుస్తారు. మెరుగైన రీతిలో గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ల యొక్క విస్తరణ ఈ పర్యావరణం యొక్క సుస్థిరతను సూచిస్తుంది. ఒకప్పుడు భారత ఉపఖండంలోని కొన్ని నిర్దిష్ట ప్రాంతాలకు మాత్రమే పరిమిత మయ్యాయి.
గతంలో ఇవి మనదేశంలో 11 రాష్ట్రాల్లో కనిపించేవి. ప్రస్తుతం 6 రాష్ట్రాల్లో మాత్రమే తమ ఉనికిని చాటుతున్నాయి. అవి ఆంధప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, కర్నాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్. రాజస్థాన్ ప్రభుత్వం గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ను రాష్ట్ర పక్షిగా ప్రకటించి, అంతరించిపోతున్న ఈ పక్షి జాతిని సంరక్షించడానికి ‘‘ప్రాజెక్ట్ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్’’ పేరుతో ఒక ప్రాజెక్ట్ని ప్రారంభించింది. రాజస్థాన్‍లో ఈ పక్షిని స్థానికంగా గోదావన్ అని పిలుస్తారు.
ఆహారం:
గడ్డి భూముల్లో విరివిగా సంచరించే ఈ పక్షులు 1 లేదా 2 సం।।రాలకు ఒకసారి గుడ్డుపెట్టి, 25-30 రోజుల పాటు పొదుగుతాయి. తమకు సమీపంల ఎలాంటి ఆహారం లభ్యమైనా తిని జీర్ణించుకోగలవు. సాధారణంగా ఇవి మిడతలు, కీటకాలు, తొండలు, బల్లులు, చిన్నపాటి పాములు, గింజలు, పడ్లను తిని జీవిస్తాయి.
తెలుగు రాష్ట్రాలలో ఉనికి:
తెలుగు రాష్ట్రాలలో ఈ పక్షి ఆంధప్రదేశ్‍లో ఒకప్పుడు విరివిగా కనిపించేది. 1979లో గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ (బట్టమేక పక్షి) ప్రాధాన్యతను గుర్తించిన ముంబైకి చెందిన ప్రముఖ పక్షి శాస్త్రవేత్త సలీం అలీ కర్నూలుకు 45 కి।।మీ దూరంలోని నంది కొట్కూరు నుండి నంద్యాలకు వెళ్ళే దారిలోని రోళ్ళపాడు వద్ద 1980లో ఈ పక్షిని సంరక్షించేందుకు చర్యలు తీసుకోవలసిందిగా ప్రభుత్వానికి సూచించారు. దీంతో అప్పటి ప్రభుత్వం 1988లో ఈ ప్రాంతాన్ని అభయారణ్యంగా ప్రకటించి 600 హె।।ల భూమిని వీటి సంరక్షణ కోసం కేటాయించింది. అదేవిధంగా అలగనూరుకు సమీపంలోని సుంకేసుల వద్ద మరో 800ఎకరాలు కేటాయించి, ఈ పక్షి సంరక్షణకు సిబ్బందిని కూడా కేటాయించారు.
గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ – ఐయూసీఎన్ స్టేటస్ :
ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్సర్వేషన్ ఆఫ్ నేచర్ (IUCN) అన్న సంస్థ భూగోళం మీద నున్న జంతువుల, పక్షుల స్థితిగతుల ఆధారంగా కొన్ని జీవితాలు ప్రచురిస్తూ ఉంటుంది. గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ను ఈ సంస్థ క్రిటికల్లీ ఎండేంజర్డ్ (Critically Endangered) జాబితాలో చేర్చింది. ఈ పక్షి పూర్తిగా అంతరించే దశకు చేరుకోవడంతో ‘‘బర్డ్ లైఫ్ ఇంటర్నేషనల్ అన్న సంస్థ 2011లో గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ను ఎండేంజర్డ్ నుండి క్రిటికల్లీ ఎండేంజర్డ్ జాబితాలోనికి మార్చింది.
గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ ఎందుకు అతరించి పోతున్నాయి?
- 1969లో 1260 గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ జాతులుండగా, 2008 నాటికి 300 జాతులు మాత్రమే మిగిలాయి.
- ప్రస్తుతం దేశవ్యాప్తంగా 150 పక్షులు మాత్రమే ఉన్నట్లు అంచనా. వేటాడం వల్ల గత 15-20 సం।।రాలలో గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ (జీఐబీ)ల సంఖ్య పూర్తిగా తగ్గి పోయిండని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.
- సాపేక్షంగా తక్కువ జనాభా కలిగి ఉండడం, కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్టు అనేక ఇతర కారణాలు జీఐబీల ఉనికిని ప్రశ్నార్థకం చేస్తున్నాయి.
- వ్యవసాయం విస్తరించడం, వ్యవసాయంలో యాంత్రీకరణ పెరగడం వల్ల గ్రేట్ ఇండియన్ బస్టర్డస్ యొక్క నివాస ప్రాంతాలు పూర్తిగా కనుమరుగవుతున్నాయి. తద్వారా అవి అంతరించే దశకు చేరుకుంటున్నాయి.
2020వ సం।।లో వైల్డ్ లైఫ్ ఇన్సిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా (WII) నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం గుజరాత్‍లోని కచ్, రాజస్థాన్‍లోని థార్ ఎడారి ప్రాంతాల్లో పవర్ లైన్లకు తగిలి గ్రేట్ ఇండియన్ బస్టర్డ్లతో పాటు, మొత్తం మీద 84000 వేల విభిన్న పక్షి జాతులు మరణించాయి. మిగిలిన పక్షులతో పోలిస్తే జీఐబీల శారీరక పరిమాణం ఎక్కువగా ఉండడం, వాటికి ముందుచూపు సరిగా కనిపించకపోవడం వల్ల ఇవి సులువుగా టవర్‍లైన్లకు చిక్కిమరణిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.
గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అంతరించడం వల్ల పర్యావరణంపై ఎలాంటి ప్రభావం ఉంటుంది!!
భూమిపై నున్న ప్రతి జీవి కూడా ఆహారం కొరకు ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటాయి. తద్వారా ఇవన్నీ ఆహారపు గొలుసులో భాగంగా ఉంటాయి. ఆహారపు గొలుసులో ఒక జీవి అంతరించినా, అది మిగిలిన జీవులపై ప్రభావం చూపుతుంది. తద్వారా పర్యావరణ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుంది. గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ పక్షుల మనుగడ గడ్డి భూముల ఆవరణ వ్యవస్థ (Gross Land Ecosysyem) యొక్క సుస్థిరతను సూచిస్తుంది. గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ పక్షులను భారతీయ గడ్డి భూముల ఆవరణ వ్యవస్థలో గొడుగు జాతులు (Umbrella Species)గా పేర్కొంటారు. ఈ పక్షులను రైతు మిత్రులుగా పేర్కొంటారు. ఈ పక్షులను పరిరక్షించినట్లయితే మిగిలిన గడ్డిభూములలో నివసించే జీవుల మనుగడ కూడా సుస్థిరంగా ఉంటుంది. కీటకాలు, ఎలుకలు, సరీసృపాలను జీఐబీలు ఆహారంగా తీసుకుంటాయి.జీఐబీలు అంతరించినట్లయితే కీటకాలు, ఎలుకల జనాభా విపరీతంగ పెరుగుతుంది. తద్వారా ఆహారపు గొలుసులో ప్రతికూల ప్రభావం ఏర్పడుతుంది. దీనినే ‘‘డొమినో ఎఫెక్ట్’’ (Domino Effect) అంటారు. ఎలుకలు, కీటకాల జనాభా విపరీతంగా పెరగడం వ్ల వ్యవసాయ దిగుబడులు కూడా గణనీయంగా తగ్గిపోతాయి.
జీఐబీల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలు:
ఆవాస ప్రాంతాల పరిరక్షణ:
జీఐబీలు విరివిగా సంచరించే ప్రాంతాలను భారత ప్రభుత్వం రక్షిత ప్రాంతాలుగా ప్రకటించి, వాటి సంరక్షణకు చర్యలు చేపడుతోంది. రాజస్థాన్‍లోని డెజర్డ్ నేషనల్ పార్క్, ఆంధప్రదేశ్‍లోని రోళ్ళపాడు, మధ్యప్రదేశ్‍లోని కరేరా మరియు ఘటిగావ్ అభయారణ్యాలు ఇందుకు ఉదా।।లుగా చెప్పవచ్చు. తద్వారా ఈ అభయారణ్యాలలో జీఐబీలు వేట మరియు ఇతర రకాల ముప్పల నుండి మెరుగైన రక్షణ పొందుతున్నాయి.
క్యాప్టివ్ బ్రీడింగ్ :
భారతదేశంలోని అనేక పరిశోధనా సంస్థలు మరియు జంతుప్రదర్శనశాలల్లో క్యాప్టివ్ బ్రీడింగ్ పోగ్రామ్‍లు ప్రారంభిం• •బడ్డాయి. వీటి ద్వారా జీఐబీల యొక్క పిల్లలను ఉత్పత్తి చేసి, వాటిని అ•వీ ప్రాంతాలలో వదిలి పెట్టడం ద్వారా, వాటి జనాభా పెరుగుదలకు ఇలాంటి పోగ్రామ్‍ల తోడ్పడుతున్నాయి.
సామాజిక చేతనను పెంపొందించడం :
జీఐబీలు మనుగడ పర్యావరణానికి ఎలాంటి ప్రయోజనాలు చేకూరుస్తుందో తెలపడం మరియు ప్రస్తుతం దాని దుస్థితి గురించి ప్రజల్లో అవగాహనను పెంపొందించాలి. ఇందుకు స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకోవాలి.
చివరగా :
స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన వాతావరణంలో జీవించే మక్కు ప్రతి ఒక్కరికీ ఉంది. కానీ వనరుల దుర్వినియోగం, మార్కెట్‍శక్తుల ప్రకృతి విధ్వంసం, పెరిగిపోతున్న వినియమవాదం ప్రాణాల మీదకు తెస్తోంది. తెలిసైనా, తెలియకైనా పర్యావరణానికి హాని చేయడమంటే, మనిషి జీవించే హక్కును నిరాకరించడమేనని చెప్పవచ్చు. జీవితాలను, జీవనోపాధిని దెబ్బతీస్తున్న ఈ పరిస్థితులు మానవాళి ఉనికికే ఎదురైన సవాళ్ళు. పైపెచ్చు ధనికులతో పోలిస్తే, దారి తెన్నూ లేని బీద సాదలపైనే ఈ ప్రభావం అధికమని అందరూ అంగీకరిస్తున్నారు. మన దేశ సర్వోన్నత న్యాయస్థానం కూడా ఈ అభిప్రాయంతో ఏకీభవిస్తూ ‘‘పర్యావరణ మార్పుల దుష్ప్రభావం నుండి విముక్తిని సైతం’’ ప్రత్యేకమైన ప్రాథమిక హక్కుగా గుర్తించింది. సమానత్వపు హక్కు (ఆర్టికల్ 14), వ్యక్తిగత స్వేచ్ఛ, జీవించే హక్కు (ఆర్టికల్ 21)ల పరిధలోకే అదీ వస్తుందంటూ ఎంకె రంజిత్‍సింగ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. పర్యావరణ పరిరక్షణను గాలికొదిలేసి ప్రభుత్వాలు చేపడుతున్న అనేక విధానాలు ఇవాళ ప్రజల పాలిట శాపంగా మారుతున్నాయి. ఈ పరిస్థితుల్లో సుప్రీంకోర్టు గుర్తించిన ఈ ప్రత్యేక హక్కుతోనైనా ప్రభుత్వాలు మేల్కొంటాయని ఆశిద్దాం.
-పుట్టా పెద్ద ఓబులేసు,
స్కూల్ అసిస్టెంట్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల
రావులకొలను, సింహాద్రిపురం, కడప
ఎ : 9550290047