రాచిప్ప అంటే రాతి చిప్ప అని అర్థం. ముప్పై వేల సంవత్సరాలకు పూర్వం పాతరాతి యుగం దాటి కొత్త రాతి యుగంలకు ఆదిమ మానవుడు ప్రవేశిస్తున్నప్పుడు రాళ్లను చెక్కి, సానపట్టి పదునుగా నూరిన వాటిని కత్తులుగా, వేటాడే ఆయుధాలుగా, గుంటలుగా మారిన మిగిలిన రాళ్లను వేట మాంసాన్ని దాచుకునే పాత్రలుగా వాడుకునే వాడు. అవే రాచిప్పలుగా ఉనికిలోకి వచ్చాయి. అప్పటికింకా పశుపోషణ, వ్యవసాయం ప్రారంభం కాలేదు. రాచిప్పలు అట్లా వాడుకలోకి వచ్చి, మా చిన్నతనంల అంటే 75 సంవత్సరాల క్రింద మా వంటింట కూడా కొనసాగాయి. ముప్పై వేల సంవత్సరాల క్రిందటి కాలానికి సాక్ష్యాలుగా, ఆనవాళ్లుగా!
ఆ కాలాన, అయ్యవార్ల ఇండ్లల్ల రకరకాల సైజులలో రాచిప్పలు, మడత మానులు, భూమిల పాతిన రాతి రోళ్లు, రోకళ్లు (అప్పటికింకా మిక్సిలు, గ్రైండర్లు అన్న పదాలు డిక్షనీర్లల్ల రాలేదు) రాతితో చేసిన గుండ్రని ‘‘ఇసుర్రాళ్లు’’ కూడా ఉండేవి. ఆ ఇసుర్రరాళ్ల లయబద్ద సంగీతం మా చిన్న చెవులకు వినసొంపుగా ఉండేది. ఆయుర్వేదం మందులు మెత్తగా నూరటానికి ‘‘రాతి కల్వాలు’’, గంధం తీయటానికి ‘‘సాన పీటలు’’ కూడా ఉండేవి. 1950 చివరి దశకం వరకూ అల్యూమీనియం గిన్నెలు (ఆ ఇంగ్లీషు పదం పలుకరాక సీమెండి గిన్నెలు అనేవారు) ఇత్తడి సామానులు ఉండేవి. ఇత్తడి బిందెలు, గంగాళాలు, కొప్పెరలే కాక రాగి బఫ్కలు (బొగ్గులతో కాచుకునే వేడినీళ్ల సాధనం) 1960 తర్వాత స్టీలు సామానులు వాడుకలోకి వచ్చి మోత బరువుగా
ఉండే ఇత్తడి సామానులు వెనుకబడి పోయాయి. నవాబుల కాలం కనుమరుగు కాగానే ఇత్తడి ‘పోక కత్తెరలు’, పాన్ దాన్‍లు ఒగల్‍దాన్‍లు కూడా మూలబడ్డాయి. ‘‘జమానే కే సాత్ సభ్ కుచ్ బదల్ గయా.’’
రాచిప్పల ముచ్చట్ల కంటె ముందు వాటిని అమ్మే ‘‘జుమ్మేరాత్ బజార్’’ గురించి చెప్పాలె. చెట్టు మీది ఉసిరికాయకు సముద్రంల ఉప్పుకు దగ్గరి సంబంధం ఉన్నట్లు!
ఏడవ నిజాం కాలంల సుమారు 1940ల జుమ్మేరాత్ బజార్ శురూ అయ్యింది. జుమ్మేరాత్ బజార్ అంటే గురువారపు సంత లేదా అంగడి అని అర్థం. బజార్ అన్న పదం ఉర్దూ కూడా కాకపోవచ్చు. చాలా ఉర్దూ పదాలు ఫార్సీ నుండి, అరబ్బీ లేదా తుర్కీ భాష నుండి దిగుమతి అయినవే, తెలుగులోకి సంస్క•త పదాలు వచ్చినట్లు. మధ్య ఆసియా దేశాలలో ఇప్పటికీ ఈ బజార్ అన్న పదం వాడుకలో ఉంది.
ఎనభై సంవత్సరాల క్రింద ప్రారంభమైన ఈ బజార్ ఇప్పటికీ నడుస్తుంది. ఇప్పుడు ఈ విశ్వనగరంలో ఎన్నెన్ని షాపింగ్ మాల్స్ వచ్చినా దీని అందం దీనిదే. అన్ని పాత సామానులు ఇక్కడ ‘‘బలే మంచి చౌక బేరము’’ అన్నట్లు అమ్ముతారు. ఇటు ముస్లిం జంగ్ (అసలు పేరు ముసల్లం జంగ్) పూల్ అటు పురానాపూల్ ఈ రెండింట మధ్య ఒక పెద్ద మైదాన్‍ల ధూల్‍పేట బస్తీకి దగ్గరగ ఈ బజార్ ఉంది. సస్తామాల్‍కు ఆలవాలం ఈ జుమ్మేరాత్ బజార్.
చిన్నప్పుడు మా ఇంటికి ఏ చుట్టమొచ్చినా షాపింగుల కోసం పోయే ఒకే ఒక్క జాగా ఈ జుమ్మేరాత్ బజార్. ఇల్లందు నుండి కన్నయ్య మామ వచ్చినా, మాన్కోట నుండి అప్పయ్య మామ వచ్చినా పొద్దుపొద్దున్నే లేచి ఇత్తడి గిలాసులల్ల కాలుతున్న గరం గరం చాయను ‘‘ఉఫ్ ఉఫ్’’మని ఊదుకుంట తాగి, సైకిళ్ల మీద ఈ •జార్‍కు పోయేవాళ్లు. అగ్గువ సగ్గువకు బేరాలాడి చాలా సామానులు సైకిలు ఎన్క క్యారేజీకి మూట కట్టుకుని విజయగర్వంతో పగటి యాళ్ల మా ఇంటికి వచ్చేవారు. మొదటిసారి కన్నయ్యమామ నా చిన్న చిన్న పాదాలకు చెమ్కీల చెప్పులు కొన్నది ఈ బజారులనే!
ఇక మా అమ్మ సంగతి సరేసరి. రెండు, మూడు నెల్లకోసారి చేతిల కొన్ని పైసలు పడంగనే ఖాళీ సంచులతో బయలుదేరేది. ఒక రోజు ముందే ఆ సంగతి నాకు తెలిసిపోయేది. ఇక నా పోరు పడలేక అమ్మ సరే అనేది. ఆ తెల్లారి నాకు ప్రతిరోజు కన్నా పొద్దున్నే తొందరగ మేల్కవచ్చేది. ఆదరబాదరగ వంటబొగ్గు కసపిసా నమిలి, ఆ నల్లబొగ్గుతో పండ్లు తెల్లగ తోమి, కుడి చేతి బొటనవ్రేలితో నాలుకను ‘ఒయిక్, ఒయిక్’మని గీసిగీసి కడిగి, ఉడుకుడుకు చాయల క్రిందటి రాత్రి చద్దిరొట్టెను ముంచుకుని తిని, తాగి ‘ఆవు వెంబడి దూడలా’ బరికాళ్లతో జుమ్మేరాత్ బజారుకు బయలుదేరే వాడిని. అబ్బో ఇగ ఆ ప్రయాణం గురించి చెప్పతరం గాదు.
మేమిద్దరం మా రూప్‍లాల్ బజారు నుండి ‘‘గ్యారా నంబర్’’ బస్సు మీద బయలుదేరే వాళ్లం (కాలి నడక). ఖాజీపూరా చేరే సరికి పెద్ద తాటి తోపుల వనం వచ్చేది. తర్వాత 1962ల అక్కడ ‘‘ఆషాటాకీస్’’ కట్టారు. అదిప్పుడు కాలగర్భంలో కనుమరుగయ్యింది. సందుగొందులు, గల్లీలు దాటి ఒక మూల మలుపు తిరిగే సరికి నిజాం నవాబులు కట్టించిన ‘‘చౌమహల్లా ప్యాలెస్’’ జగజ్జేయమానంగా దర్శనమిచ్చేది. అప్పుడు నా పసికండ్లు సంభ్రమార్చార్యాలతో పొద్దు తిరుగు పువ్వుల్లా విచ్చుకునేవి. దాని మీదున్న గంటల గడియారం (క్లాక్ టవర్) రాజసం ఉట్టిపడుతూ శీర్షమాణ్యింలా ప్రకాశించేది. ఆ ఎత్తైన కోటగోడలు, దాని సింహద్వారాలు నన్ను అబ్బుర పరిచేవి. ఆ రాచ వీధిని దాటే సరికి ‘ముర్గీ కా చౌక్’ వచ్చేది. అది ఆరవ నిజాం కట్టించిన వ్యాపార భవనం. అక్కడ పం•రాలలో బంధింపబడిన రంగు, రంగుల రామచిలకలు, తెల్లపావురాలు, నల్లటి కాకులు, గుడ్లగూబలు, ఊరపిచ్చుకలే గాక అమ్మకానికి ఉడుతలు, కుందేళ్లు, తాబేళ్లు కూడా ఉండేవి. నా కండ్లకు ఆ ప్రాంతం ఒక జంతుప్రదర్శన శాలగా కనిపించేది. ఆ చౌక్‍లో ఖుతుబ్‍షాహీలు కట్టించిన ఒక మసీదు చాలా ఎత్తుగా తంతెల మీద కనిపించేది. ఇటీవల ఆ ముర్గీ కా చౌక్ భవనాన్ని సర్కారు వారు నూతన భవన నిర్మాణం కోసం నేలమట్టం చేసారు. ఆ నాలుగు దారుల కూడలిలో పురాతన గ్రంథాలు విక్రయించే దుఖాణాలు కూడా ఉండేవి. అక్కడ విలువైన అరబ్బీ, ఫారసీ, ఉర్దూ, హిందీ పుస్తకాలు పరిశోధనా విద్యార్థులకు దొరికేయి. వాటన్నింటిని వీక్షిస్తూ ‘‘కసార్ హట్టా’’లోకి ప్రవేశించేవాళ్లం. కసార్ అంటే నల్లలోహ విగ్రహాలను తయారు చేసే కళాకారులు. ‘‘హట్టా’’ అంటే స్థలం లేక ప్రాంతం. ఆ వీధి దాటి మరో వీధిలకు వచ్చేసరికి ఒక పెద్ద హనుమాన్‍మందిర్. అందులో ఊడలు విస్తరించిన రావి చెట్టు. 1908ల మూసీ నదికి వరదలు వచ్చి పురానాపూల్ (పాత వాలాద్రి) తెగి సగం పట్నం వరదలల్ల కొట్టుక పోయినపుడు ఆ మందిర్‍లో వున్న భక్తులు ఆ చెట్టు కొమ్మల మీదికెక్కి బతికి బట్టకట్టిండ్రని అమ్మ కథలాగ చెప్పింది. ఆ కథ వింటూ ‘‘మెహబూబ్ కీ మెహందీ’లోకి ప్రవేశించాం. నాకు వయసు వచ్చిన తర్వాత దాని ముచ్చట్లు తెలిసాయి. ప్రియురాలి లేలేత తమల పాకుల్లాంటి అరచేతులకు, పసుపు పచ్చని పాదాలకు పెట్టుకునే గోరింటాకు పేరే ఈ ‘మహబూబ్ కీ మెహందీ’. నవాబుల కాలంలో అదొక ఖరీదైన వసంత సేనల వేశ్యా వాటిక. దీపాలు వెలిగే పరదాలు తొలిగె అన్నట్లు ‘‘షమ్మా’’ల చుట్టూ దీవానాలు, పర్వానాలు షలభాల్లా ప్రదక్షిణలు చేసేవారు. సారంగీ, తబలా, డోలక్‍లతో పాటు కాలి అందియల మువ్వల సవ్వడులు రసికులను మరిపించి మురిపించేవి.
‘‘కంటికి దూరమైతే కాలికి దూరమా’’ అన్నట్లు నడిచి నడిచి సిటీ కాలేజికి చేరుకునే వారం. ఆ కాలంలో అది హైద్రాబాద్ పట్నానికి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ లాంటిది. ఒకప్పుడు అక్కడ మగ్దూం మొహియుద్దీన్ ఇంగ్లీష్ లెక్చరర్‍గ పనిచేసేవాడు. కేశవరావ్ జాదవ్, హరగోపాల్ సార్ కూడా అక్కడి విద్యార్థులే.
సిటీ కాలేజీకి ఎదురుగా ‘పేట్లాబురుజు’ మైదానం ఉండేది. ఆ ఉదయాన అక్కడ వందలాది మంది పోలీసులు చెమటలు కారుతూ జట్లు జట్లుగా పరేడ్ చేసేవారు. చేతులు, కాళ్లు లయబద్దంగా కదిలిస్తూ ఖాకీ డ్రస్సులో వారు మార్చింగ్ చేస్తుంటే నాకు చూడముచ్చటగా అనిపించి పెద్దగైన తర్వాత నేను కూడా పోలీస్ జవాన్ ఉద్యోగం చేయాలని అనుకునే వాడిని.
ఆ ‘‘దునియా కా మేలా’’ అట్లా అట్లా తిలకిస్తూ, ఆనందిస్తూ చివరికి ముసల్లం జంగ్ పూల్ ఎక్కేవాళ్లం. క్రింద ముచికుందా నది మురికి లేకుండా జోరుజోరుగ స్వచ్ఛంగ ప్రవహిస్తుండేది. వంతెన దాటి ఎడమవైపు తిరిగే సరికి కొంచెం దూరంల జుమ్మేరాత్ బజార్ దర్శనమిచ్చేది. అది పీర్ల పండుగ నాటి జాతరలా నాకు కనబడేది. ముందు అమ్మ ఆ బజార్ నాలుగు మూలలు కలియతిరిగి తనకు పనికి వచ్చే పాత సామానులు ఎక్కడెక్కడ ఉన్నాయో తనిఖీ చేసేది. ధరవరలు కూడా తెలుసుకునేది.
పుకట్ కా మాల్ ఆమె కందుకు గాని గీసిగీసి బేరమాడి సస్తామాల్ కొనాలని ఆమె ఆలోచన.
ఇగ నా చూపులకేమో ఆ పాత సామానులు ఆనకపోయేది. ‘‘ఊరందరిది ఒక దారి ఉలిపి కట్టెది మరో దారి’’ అన్నట్లు అక్కడి రంగుల ప్రపంచం నన్ను ఆకర్షించేది. ‘‘బొంబై కా తమాషా దేఖో, ఏ చార్ దిన్ కా తమాషా దేఖో’’ అంటూ పాడుతున్న రంగుల బొమ్మల డబ్బా నన్ను వెంటాడేది. నాలుగడుగులు వేయగానే ఐస్‍ఫ్రూట్ బండి, దానిలోపల బరఫ్‍ల పెట్టిన రంగు రంగుల పుల్ల ఐస్‍క్రీంలు నన్ను రారామ్మని సైగ చేసేవి. లాయిలప్పలు, రాగమాలలు, మేండక్‍లు, గుండ్రని అట్టలతో చేసిన ఎర్రని కండ్లద్దాలు, కీ ఇస్తే కదిలే నల్లముండ్ల మణికట్టు గడియారాలు, తోపుడు బండిమీద రంగురంగుల నిమ్లెట్ సీసాలు (చవక రకం కూల్ డ్రింక్సు) నన్ను నేల మీద నిలవకుండా చేసేవి. కనీసం ‘‘చౌదాల్’’ (సేవ్‍దాల్) అయినా కొనమని అమ్మవైపు దీనంగా మూగచూపులు చూసేవాణ్ణి. ‘‘ముందు సామాన్ కొందాం నానీ, పైసలేమన్నా మిగిలితే అప్పుడు చూద్దాంలే’’ అని అమ్మ సముదాయించేది. అప్పటికే సూర్యుడు నడినెత్తి మీదికి వచ్చేవాడు. ఆకలితో పేగులు గుర్రుగుర్రు మనేవి. తిరిగి తిరిగి సన్నటి పుల్లలాంటి కాళ్లు గుంజబట్టేవి. ఎర్రటి లేత ముఖం ఎండకు మాడిపోయి చెమటలు కారబట్టేవి.
ఆఖరికి పెరుమాండ్ల దయవలన అమ్మకు రాచిప్పలు అమ్ముతున్న వడ్డెర ఆడోళ్లు కనబడ్డారు. చిన్నాపెద్దా అనేక రకాల సైజుల రాచిప్పలు వాళ్ల ముందు కొలువై ఉన్నాయి. ఎండకు చెమటలు కారిన వారి నల్లటి శరీరాలు నూనె రాసినట్లు మిలమిలా మెరుస్తున్నాయి. అమ్మ తన వాక్చాత్తుర్యమంతా ఉపయోగించి తన దగ్గరున్న తక్కువ పైసలతో రెండు రాచిప్పలను కొన్న తర్వాత ఇంకా ఒక ఏకానా మిగిలింది. రూపాయికి పదహారణాల కాలం అది. ఏకానా, దొవ్వానా, చారానా, ఆఠానా, దస్సానా, బారానా, చౌదానాల సత్య కాలం అది. ఆ ఒక్క ఏకానాతో ముందు నాకు చల్లటి నిమ్‍లేట్ తాగించింది. ఎండిపోయిన కుతికకు ప్రాణం లేచి వచ్చింది. ఇంకా మిగిలిన చిల్లర బుడ్డపైసలతో ఎర్రటి అట్ట కండ్లద్దాలు, బెల్లం పానకంతో చేసిన మురమరాల లడ్డూ కూడా కొనిచ్చింది. తను మాత్రం ఏమీ తినలేదు, తాగలేదు మైలా, మడి పాటించే అమ్మగారు కదా!
మళ్లీ తిరుగు ప్రయాణం. రాచిప్పలను కొన్నందుకు అమ్మకు కొండంత సంతోషం. హనుమంతుడు సంజీవని పర్వతాన్ని భుజాలపై మోసినట్లు అమ్మ కుడి భుజంపై రాచిప్పల బరువుతో నడక. ఇంతల చౌమహల్లా ప్యాలెస్ వచ్చింది. ప్యాలెస్ ముందు ఏకాంతంగా, విశాలంగా నిలుచున్న మైదానం. మధ్యన ఊడలు విస్తరించిన ఒక పెద్ద మర్రిచెట్టు. అప్పుడు నగరంలో ఇంత ఆబాదీ లేదు. ఇప్పటి మాదిరిగ సడక్ మీద నడిస్తే టక్కర్ (ఆక్సిడెంట్) అయితదన్న భయం లేదు. ఆ మిట్ట మధ్యాహ్నపు ఎండకు ఎక్కడా ఒక నరమానవుడు కనబడుతలేడు. అమ్మ అలసట తీర్చుకునేందుకు ఆ మర్రిచెట్టు నీడన చేరి రాలిన ఆకుల మీద కూచుంది. భుజం మీది రాచిప్పల బరువును భూదేవికి అప్పగించింది. దాహార్తితో ఆమె అటు ఇటు చూసింది. కొద్ది దూరంల ఆకుపచ్చగ మెరుస్తున్న ఒక సూఫీ సాధువు దర్గా. అక్కడ ఒక సర్కారీ నల్లా. అమ్మ కండ్లకు అదొక చల్లని చలివేంద్రంలా కనిపించింది ఆ రోజులలో సర్కారీ నల్లా బారా గంటా ఖుల్లా. ఎప్పుడంటే అప్పుడు గంగమ్మ తల్లి పిలిస్తే పలికేది. అమ్మకు హుషారొచ్చింది. బిరబిర నడిచి నల్లాఖట్కా తిప్పి కాళ్లు, చేతులు, ముఖం శుభ్రంగా కడుక్కుంది. కడుపునిండా చల్లటి నీళ్లు తాగింది. రవ్వంత సేపు సేద తీరిన తర్వాత మళ్లీ రాచిప్పల బరువుతో గ్యారానంబర్ బస్ శురూ!
ఆ తెల్లారి మా అమ్మ మనసాలకు ఎదురుంగ ఉన్న చేదబావి ముందు కూచుని ఆ రెండు రాచిప్పలను రాసిరాసి, గీసిగీసి శుభ్రంగా కడిగింది. వాటి మురికంతా మాయమై అవి కృష్ణ వర్ణంలో కళకళలాడాయి. అందులో ఒకటి చింతకాయ ‘తొహి’కి (తొహి తమిళపదం. తొక్కు తెలంగాణా పదం) రెండో రాచిప్ప పాత చింతపండుతో చేసే పచ్చిపులుసు కోసం. పాత చింత పండుకు ఔషదగుణాలు ఎక్కువని, ఆరోగ్యానికి మంచిదని ఆయుర్వేదం చెపుతుంది. స్వర్గీయ దాశరథి రంగాచార్యగారు తమ ఆత్మకథ ‘‘జీవన యానం’’లో వారి అమ్మగారు చేసే పచ్చి పులుసు గురించి వైన వైనాలుగా వర్ణించారు. ఇంటికి వచ్చిన అతిధులు ఏ అధరువులు లేకుండా ఉత్త పచ్చిపులుసుతోనే అన్నమంతా తిని బ్రేవ్ మని త్రేన్చేవారట. ఆమె చేతి మహత్యమో లేక ఆ పచ్చిపులుసు మహత్యమో అట్లా ఉండేదట.
మాచిన్నతనంల పచ్చడి పెట్టటమంటే ఒక చిన్న సైజు యజ్ఞం చేసినట్లే. నియమ, నిష్ఠలతో పెట్టిన పచ్చడి చెడిపోకుండా, బూజు పట్టకుండా, కలకాలం నిల్వ ఉంటదని నమ్మేవాళ్లు. ముందు మీరాలం మండికి పోయి, ఇటు కాయ అటు పండు కాక మధ్యరకం చింతకాయను బేరం చేసేవారు. అవి బాగా పొడుగ్గా కండపట్టి ఉండేవి. వాటిని ఇంటికి తెచ్చి శుభ్రమైన పొడి గుడ్డతో జాగ్రత్తగా తూడ్చి గాలికి ఒక రోజు ఆరబెట్టి తెల్లారి దాని మీదున్న పొట్టు, నారా వేరు చేసేవారు. వాటిని రోట్లోవేసి రోకలిబండతో ‘‘కచ్చాపచ్చా’’ దంచి బయట పడిన గింజల్ని పక్కన పెట్టి మళ్లీ మరోసారి దంచి సరిపడా లవణాన్ని (ఉప్పు) మిలాయించి కొత్త రాచిప్పల ఆ ముద్దను వేసి ఆ రాచిప్పకు ఒక శుభ్రమైన గుడ్డను బిగించి మూత కట్టేవారు (వాసెన కట్టటం) ఆ తర్వాత అవసరం పడ్డప్పుడు ఒక గంటె లేదా రెండు గంటెల ముద్ద ఇవతలికి తీసి చిన్న కడాయిలో పోపు పెట్టేవారు (తిరగమోత) పోపుపెట్టట మంటే అల్లాటప్పా, ఆషామాషీ వ్యవహారం కాదు. అదొక ‘పాకశాస్త్రం’ కళ. శ్రేష్టమైన గానుగ నూనెను మండుతున్న కడాయిలో కొంచెం మరిగించి పొగలు రాగానే పోపు గింజలు, పొట్టు తీసిన ఎల్లిపాయలు, తాజా కరివేపాకు ఆకులు, ఇంగువా, కొంచెం మినప్పప్పు (పంటికిందికి కరకరలాడటానికి) ఆ నూనెలో వేసి, కలిపి పక్కన పెట్టుకున్న చింతకాయ ముద్దను ఆ పోపులో వేయగానే ‘‘చుఁయ్’’మని పెద్ద శబ్దంతో, పొగలతో ఇల్లంతా గుమగుమలాడి గుభాళించి పోయేది. కడుపులో ‘జఠరాగ్ని’ రెట్టింపు అయ్యేది. మంచి ఎండాకాలం ఉదయం పూట (ఒంటిపూట బళ్ల రోజులలో) తరవాణిలో ఈ చింతకాయ ‘తొహి’ నంచుకుంటే ఆత్మారాముడు పరమానందభరితుడౌతాడు. తరవాణి అంటే రాత్రి మిగిలిన అన్నాన్ని బాగా పిసికి మట్టి కుండలో వేసి అందులో మజ్జిగ,
ఉల్లిపాయ ముక్కలు, పచ్చి మిరపకాయ ముక్కలు వేసి రాత్రంతా పులియపెడితే ఉదయానికి తయారయ్యే బ్రేక్‍ఫాస్ట్ అన్నమాట.
ఇక రెండవ రాచిప్ప సంగతి. అండ్ల ఒకటి రెండు రోజుల కోసం పచ్చిపులుసు లేదా మజ్జిగ పులుసు పోసేవారు. తెలంగాణా ప్రజలకు పచ్చిపులుసు చల్లని తల్లిలాంటిది. అది అందరికీ ఆరో ప్రాణం. పులుసును తమిళంలో ‘పుళి’ అంటారు. పుళిహోర, పచ్చిపుళి, తణ్ణి (నీరు) మెళుగు (మసాలా) తిరుక్కోవణ్ణం (పాయసం) లాంటి తమిళ పదాలు, మా ఇంట్ల చిన్నప్పుడు సాధారణ వాడుక పదాలు. ఇప్పుడు ఆ పదాలన్నీ గ్లోబలైజేషన్‍లో గల్లంతయినాయి.
ఇన్‍స్టంట్ కాఫీలాగా ఇన్‍స్టాంట్ పచ్చిపులుసు చేయటం చాలా ఈజీ. పాతబడి నల్లగా మారిన చింతపండును బాగా నానబెట్టి, బాగా పిసికి, గుజ్జును తీసివేసి వచ్చిన పచ్చి పులుసుతో మరికొన్ని నీళ్లు కలిపి పలుచగా చేసి, దానికి సరిపడ గల్లా ఉప్పును కలగలిపి, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయల్ని సన్నగా తురిమి ఆ రసంలో వేసి మరికొంచెం పిసికి చివరికి కొత్త బెల్లం పొడి దానికి జోడించి పోపు గింజలతో తిరగమోత పెట్టి ఆపైన సన్నగా తరిగిన కొత్తిమీరను చల్లితే అద్భుతమైన ‘పచ్చిపుళి’ తయ్యార్. దానిని ఆ రాచిప్పల పోసి కొద్దిసేపు ఓపిక పడితే ఫ్రిజ్‍లో పెట్టినట్లు చల్లగా అవుతుంది. అది ఆ రాతి మహిమ. ఉష్ణ శరీర గుణం కల్గిన వారికి పచ్చిపులుసు చలువ చేస్తుంది. ఆహారం సులభంగా జీర్ణం కావటమే గాక నోరు ‘‘సాఫ్’’ అయ్యి నాలికకు రుచుల పసిగట్టె గుణం పెరుగుతుంది.
చాలా కాలం తర్వాత నాకు యాభై సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఒక దినం చౌమహల్లా ఫ్యాలెస్ ముందున్న విశాలమైదానం, దాని మధ్యల మర్రిచెట్టు యాదికొచ్చింది. ఆ వటవృక్షం చల్లని నీడలో కూచుని అమ్మను జ్ఞాపకం చేసుకుందామని ఆశతో బయలుదేరాను. మూసీ నది దాటి పాత నగరంలోకి ప్రవేశించటమంటే చల్లని అమ్మ ఒడిల కూచుని పరవశించినట్లే కదా!
తీరా నేను అక్కడికి చేరకునే సరికి ఒకప్పుడు అక్కడ ఉండిన విశాలమైన మైదానమూ లేదు, మర్రి చెట్టూ లేదు. ఆ చెట్టును ఎవరో కొట్టేసారు. ఆ స్థలంలో ఒక ప్లాను, పద్దతి లేకుండా వంకరటింకరగా గల్లీలు ఉన్నాయి. ఇష్టం వచ్చినట్లు కట్టుకున్న ఇండ్లు. ప్రతి ఇంటి ముందు ప్రవహిస్తున్న మురికి నీళ్ల కాలువలు, హడావుడిగా అటుఇటు తిరుగుతున్న కుక్కలు, పిల్లులు దర్శనమిచ్చాయి.
సూఫీ సాధువు దర్గామాత్రం అట్లనే ఉంది. సర్కారీ నల్లా కూడా అట్లనే అక్కడే ఉంది. గతించిన కాలానికి ప్రధమ సాక్షిగ! అమ్మ జ్ఞాపకం వచ్చింది. ఆమెను తలుచుకుంటూ నల్లా దగ్గరికి వెళ్లి కాళ్లూ, చేతులూ ముఖం శుభ్రంగా కడుక్కుని కడుపునిండా నీళ్లు తాగిన. అమ్మ నా పక్కన వున్నట్లే అనిపించింది. ఇంతల ‘‘ఉమ్రావ్ జాన్’’ సీన్మాల రేఖ పాడిన పాట యాది కొచ్చింది.
‘‘ఏ క్యా జగే హై దోస్తోఁ
ఏ కౌన్ సా దయార్ హై
హద్-ఎ-నిగా జహాఁతక్
గుబార్ హి గుబార్ హై’’
ఇది ఏ ప్రాంతం మిత్రులారా
ఇది ఏ ప్రాంగణం స్నేహితులారా
కనుచూపు సరిహద్దు మేరా
దుమ్ము, ధూళి, విధ్వంసమే, విధ్వంసము.
–పరవస్తు లోకేశ్వర్,
ఎ: 91606 80847