చెల్లా చెదురుగా పడి ఉన్న శిల్పాలు దిక్కూమొక్కు లేని దేవాలయాలు

ఆ వూరు ఎల్లకొండ. చుట్టుపక్కల ఊళ్ల కంటే ఎత్తైన కొండ. ఆ కొండ సానువుల్లో రాతిని తొలచి మలచిన గుహాలయాలు. కొన్ని శివాలయాలైతే, మరికొన్ని జైనాలయాలు. రాష్ట్రకూట శైలి శివలింగాలు, గణేశ శిల్పాలు ఒకవైపు, కళ్యాణీ చాళ్యుశైలి వర్ధమాన మహావీరుడు, పార్శ్వనాథుని శిల్పాలు మరోవైపు. నిత్యార్చనలతో కళకళలాడి, మంత్రోచ్ఛారణలతో వెలుగొందిన ఆ గుహాలయాలోని విగ్రహాలకు అభిషేక జలాన్నందించిన నలు చదరపు నడబావి. అక్కడ చక్కగా తీర్చిదిద్దిన ఆలయాలుండేవని సాక్ష్యం పలుకుతున్న ద్వారశాఖలు, గోడరాళ్లు, మధ్యయుగం కంటే ముందే ఎల్లకొండ పుణ్యక్షేత్రంగా విలసిల్లింది. హైదరాబాదు నుంచి గండిపేట మీదుగా చేరుకొనే వీలున్న గ్రామం. నవాబు పేట మండలం, శంకరపల్లికి దగ్గర్లో ఉన్న ఊరు.
గ్రామంలో ఎక్కడ చూచినా జైన, శైవ శిల్పాలు, ఆలయ శకులాలే. ఒక వైపున మర్రిచెట్టు కింద ఆలయాల్లో అలంకరించిన ఏనుగు శిల్పాలు, తోరణానికి రెండు వైపులా ఉన్న పార్శ్వనాథ శిల్పాలు, నేడోరేపో కూలటానికి, నేలరాలటానికి సిద్ధంగా ఉన్న శివాలయం, ఎల్లకొండ చరిత్ర అనే పగిలిన అద్దంలో ముక్కలు ముక్కలుగా కనిపిస్తున్నాయి. వారసత్వ ప్రేమికుల కంటనీరొలికిస్తున్నాయి.


చుట్టూ ఉన్న గడ్డీ, గాదాన్ని దాటి సాహసించి శివాలయంలో ప్రవేశిస్తే, ఎడమవైపున శివుని శిల్పం ఉన్న తోరణ పై భాగం. దాని వెనుక విసిరి వేయబడిన నంది విగ్రహం, కొంచెం ముందు చెట్టు కింద బిక్కుబిక్కుమని కూర్చొన్న వినాయకుని విగ్రహం నిర్లక్ష్యానికి నిదర్శనాలు. కుడివైపున మహా మండపం, అర్ధమండపం, గర్భాలయాలతో చిక్కి శల్యమౌతున్న స్థితి, ఎవరూ ముందుకొచ్చి, బాగు చేయలేని పరిస్థితి. పడిపోగా మిగిలి ఉన్న గోడలపైన, మండప స్థంభాలు, దూలాలు, కప్పులు, ద్వారశాఖలపైన అద్భుత శిల్పాలు, గర్భాలయంలో నాన్నను పోగొట్టుకొని (అక్కడుండాల్సిన శివలింగం ఎక్కడికెళ్లిందో తెలియక) దిగాలుగా ఉన్న చిన్న వినాయక శిల్పం, చెరిగిపోతున్న వెయ్యేళ్ల నాటి చారిత్రక సాక్ష్యాలు, గుహలు. శిల్పాలకు ఇష్టం వచ్చినట్లు వేసిన రంగులు, చెల్లా చెదురుగా పడి ఉన్న శిల్పాలు, ఆకాశంలోని చుక్కల్ని సైతం అద్ధంలో చూపిన నడబావిలో ఉండాల్సిన నీళ్ల స్థానంలో ఏపుగా పెరిగిన ముళ్ల పొదలు, ఎల్లకొండ ప్రజలకు, అడపాదడపా వచ్చిపోయే సందర్శకులకు మూకుమ్మడిగా విజ్ఞప్తి చేస్తున్నాయి, మౌనరాగాలతో దీనగానాలతో కాలం గాలానికి చిక్కుకొని విలవిలలాడుతున్న ఈ శిథిలాలు పదిల పరిచే మనసున్న మహారాజు కోసం ఎదురు చూస్తున్నాయి. వీలైతే మీరు కూడా చేతనైనంత సాయం చేయండని అడగలేక అడుగుతున్నాయి.


-ఈమని శివనాగిరెడ్డి-స్థపతి,
ఎ : 9848598446

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *