సాగర అన్వేషణకు సరికొత్తగా…!! ఏ సముద్రయాన్‍

మానవాళి యొక్క నేటి అత్యున్నత ప్రగతి ప్రస్థానం వెనుక సముద్రాలు వెలకట్టలేని పాత్ర పోషిస్తున్నాయి. మొత్తం మావన జనాభాలో మూడింట ఒక వంతు (సుమారు 2.4 బిలియన్ల జనాభా) సముద్ర తీరాలకు 100 కి.మీ.ల లోపే నివసిస్తున్నారు. సముద్రాల ద్వారా సృష్టించబడే వార్షిక సంపద విలువ 2.5 ట్రిలియన్‍ డాలర్లు. ఇది ప్రపంచంలో 7వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థకు సమానం. ప్రపంచ ప్రజలకు కావలసిన పోషకాహారం, ఔషధాలు, ఖనిజాలు, సాంప్రదాయేతర ఇంధన వనరులను కూడా సముద్రాలు సమకూరుస్తున్నాయి. విభిన్న దేశాల మధ్య సరుకు రవాణాతో పాటు ఆదేశాల ప్రజల మధ్య సుహృద్భావ సంబంధాలను పెంపొందిస్తూ, వాటి ఆర్థిక వ్యవస్థలను అనుసంధానించడంలో సముద్రాలు ‘‘సూపర్‍ హైవే’’గా తోడ్పడు తున్నాయి. అందుకే 2021-2030 మధ్య కాలాన్ని యూఎన్‍ఓ సముద్ర విజ్ఞాన దశాబ్దం (Decade of ocean science)గా ప్రకటించింది. ఈ నేపథ్యంలో మనదేశం కూడా సముద్రగర్భాన్ని అమూలాగ్రం శోధించడానికి సముద్రయాన్‍ (డీప్‍ ఓషన్‍ మిషన్‍) పేరుతో ఓ సరికొత్త ప్రాజెక్ట్ను ప్రారంభించింది. ఆ వివరాలేంటో తెలుసుకుందాం.


సముద్రయాన్‍ (డీప్‍ ఓషన్‍ మిషన్‍) అంటే…

సముద్రగర్భంలో మానవుడు ఇది వరకు చేరని ప్రాంతాలలో నిక్షప్తమై ఉన్న ఖనిజాలు, విలువైన రాళ్ళు, జీవ మరియు నిర్జీవ అనుఘటకాలను అన్వేషించడానికి భారత ప్రభుత్వం నిర్వహించనున్న ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ను సముద్రయాన్‍ లేదా డీప్‍ ఓషన్‍ మిషన్‍ అంటారు. ఈ ప్రాజెక్ట్కు కేంద్రం 2021లో గ్రీన్‍ సిగ్నల్‍ ఇచ్చింది. 2021-2026 వరకు మొత్తం 5సం।।రాలకు గానూ ఈ ప్రాజెక్ట్కు ప్రభుత్వం 4077 కోట్లు కేటాయించింది. 2021-22 సం।।రాలకు 150 కోట్లు, 2022-23 సం।।రాలకు 650 కోట్లు. ఇప్పటి వరకు ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మిషన్‍లో భాగంగా ముగ్గురు అక్వానాట్స్ (జలాంతర్గత పరిశోధకులు) దేశీయంగా నిర్మించిన ‘‘మత్స్య’’ అన్న జలాంతర్గామి ద్వారా 6000 మీ।। లోతు వరకు ప్రయాణిస్తారు. మినిస్ట్రీ ఆఫ్‍ అర్త్ సైన్సెస్‍ మరియు భారత అంతరిక్ష పరిశోధనాసంస్థలు ఈ ప్రాజెక్ట్లో భాగస్వాములుగా ఉన్నాయి.


సముద్రయాన్‍ లక్ష్యాలు:
  • సముద్రయాన్‍ మిషన్‍కు 6 లక్ష్యాలు ఉన్నాయి.
  • సముద్రంలోని లోతైన ప్రాంతాలలో ఖనిజాల త్రవ్వకానికి అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి పరచడం మరియు మధ్య హిందూ మహాసముద్రంలోని పాలీ మెటాలిక్‍ నోడ్యూల్స్ అన్న ఖనిజాల త్రవ్వకం కొరకు సైంటిఫిక్‍ సెన్సార్‍లు, విభిన్న రకాలైన పరికరాలతో కూడిన ముగ్గురు జలాంతర్గత పరిశోధకులను సముద్రగర్భంలో 6000మీ।। లోతువరకు తీసుకెళ్ళడానికి ఒక మానవసహిత జలాంతర్గామిని అభివృద్ధి పరచడం
  • సముద్రాన్ని పలుమార్లు పరిశీలించడం, నమూనాలు రూపొందించుకోవడం ద్వారా భవిష్యత్‍లో సముద్ర వాతావరణ స్థితిగతులను అర్థం చేసుకోవడం, తద్వారా సముద్ర వాతావరణ సేవలను అభివృద్ధి పరచడం.
  • లోతైన సముద్రగర్భంలోని జీవవైవిధ్యాన్ని అన్వేషించడం మరియు పరిరక్షించడం కొరకు మెరుగైన, వినూత్న సాంకేతిక ఉపకరణాలను ఆవిష్కరించడం
  • మధ్య హిందూ మహాసముద్రంలోని సముద్రపు పాయల వెంబడి బహుళ లోహ హైడ్రో ధర్మల్‍ సల్ఫైడ్స్ వంటి ఖనిజాలు కలిగిన ప్రాంతాలను అన్వేషించడం మరియు గుర్తించడం
  • సముద్రం నుండి శక్తి మరియు స్వచ్ఛమైన నీటిని గణనీయంగా వినియోగించుకోవడం.
  • ఓషన్‍ బయాలజీ (Ocean Biology),బ్లూ బయోటెక్నాలజీ (Blue Biotechnology) నందు ప్రతిభను ప్రోత్సహించడం మరియు సరికొత్త అవకాశాలను అన్వేషించేందుకు ఒక అధునాతన మెరైన్‍ స్టేషన్‍ను స్థాపించడం

మత్స్య-6000అంటే ఏమిటి:
  • సముద్రయాన్‍ (డీప్‍ ఓషన్‍ మిషన్‍) అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానం యొక్క మేళవింపుతో కూడిన ఒక అధునాతన ప్రాజెక్ట్. ఇందులో వినియోగించే మత్స్య-6000 అన్న జలాంతర్గామే అందుకు నిదర్శనం.
  • మత్స్య-6000 అనేది సముద్రయాన్‍ ప్రాజెక్ట్లో భాగంగా సముద్రగర్భంలో 6000 మీ।। లోతుకు వెళ్ళేందుకు వీలుగా తయారుచేయబడిన ఒక స్వదేశీ నిర్మిత జలాంతర్గామి. ఇది ముగ్గురు భారత జలాంతర్గత పరిశోధకులను (అక్వానాట్స్) ను 6000 మీ।।లోతుకు తీసుకువెళ్తుంది. నేషనల్‍ ఇన్సిస్టిట్యూట్‍ ఆఫ్‍ ఓషన్‍ టెక్నాలజీ (ఎన్‍ఐఓటీ), ఇండియన్‍ స్పేస్‍ రీసెర్చ్ ఆర్గనైజేషన్‍ (ఇస్రో) ల సంయుక్త భాగస్వామ్యంతో మత్స్య-6000 నిర్మించబడింది.
  • సముద్రగర్భంలోని విభిన్న ప్రదేశాలను పరిశీలించేందుకు, నమూనాలు సేకరించేందుకు, అక్కడి ప్రదేశాలను వీడియో మరియు ఆడియో రూపంలో రికార్డు చేసేందుకు, ప్రయోగాలు నిర్వహించేందుకు అవసరమైన అధునాతన సైంటిఫిక్‍ ఉపకరణాలు మత్స్య-6000లో అమర్చబడి ఉంటాయి.


మత్స్య -6000 2.1 మీ।। వ్యాసంతో, గోళాకృతిలో ఉంటుంది. ఈ ప్రత్యేకమైన గోళంలో ముందే చెప్పుకున్నట్లు ముగ్గురు భారత జలాంతర్గత పరిశోధకులు ప్రయాణించేందుకు వీలుగా వసతిసౌకర్యాలు ఉంటాయి. ఈ ప్రత్యేకగోళం సుమారు 28 టన్నుల బరువు ఉంటుంది. ఈ గోళంలోకి ఆక్సిజన్‍ సరఫరా చేయబడి, అందులోని కార్బన్‍డై ఆక్సైడ్‍ వెలుపలికి పంపించే ఏర్పాట్లు ఉంటాయి. టైటానియం లోహ మిశ్రమంతో ఈ ప్రత్యేక గోళం 6000 బార్ల వరకు నీటిలోపలి ఒత్తిడిని తట్టుకోగలుగుతుంది. ఆరుదిశలలో కదలికలను ప్రదర్శించేందుకు వీలుగా ప్రొపెల్లర్‍లను కలిగి ఉంటుంది. ఈ గోళం యొక్క పరిసరాలను అందులోని సిబ్బంది రియల్‍టైమ్‍లో పరిశీలించేందుకుగాను 3 వీక్షణ ద్వారాలను కలిగి ఉంటుంది. ఇందులో 12 కెమెరాలు, 16 లైట్లు ఉంటాయి. లిథియం పాలిమర్‍ బ్యాటరీల ద్వారా వీటికి కావలసిన శక్తి అందించబడుతుంది. ఈ బ్యాటరీల సామర్థ్యం 1 ••ష్ట్ర ఉంటుంది. ధ్వని ఆధారిత ఫోన్‍ మరియు మోడెమ్‍ ఇందులో ఉండడం వల్ల సమాచార ప్రసారం ధ్వని ఆధారంగానే జరుగుతుంది. అత్యాధునిక నావిగేషన్‍ పరికరాలు ఇందులో ఉంటాయి. దీని పొడవు 9 మీ।।, వెడల్పు 3 మీ।।, ఎత్తు 5 మీ।। ఉంటుంది. నీటి అడుగున థ్రస్టర్‍లను ఉపయోగించి గంటకు 5.5 కి.మీ. వేగంతో కదులుతుంది. ప్రారంభదశలో అనగా రాబోయే సం।।లో మత్స్య-6000 ద్వారా 500 మీ।। లోతులో ప్రయోగాలు, పరీక్షలు నిర్వహిస్తారు. తదుపరి రాబోయే రెండు, మూడు సం।।రాలలో పూర్తిస్థాయిలో అనగా 6000 మీ।।లోతులో ప్రయోగాలు నిర్వహించడం జరుగుతుంది. మత్స్య 6000 ఏకధాటిగా 12 గం।।ల పాటు నీటి అడుగున విధులు నిర్వర్తించగలదు. అత్యవసర పరిస్థితుల్లో ఇది 96 గం।।లకు కూడా పొడిగించబడుతుంది. లోతైన సముద్రజలాల్లో ఇలాంటి మిషన్‍లను నిర్వహించే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇప్పటికే యుఎస్‍ఏ, రష్యా, చైనా, ఫ్రాన్స్ మరియు జపాన్‍ సొంతం చేసుకోగా ఆత్మ నిర్భర్‍ భారత్‍ దార్శనికతకు అనుగుణంగా ఇండియా కూడా ఈ సాంకేతికతను అభివృద్ధి చేసి ఆయాదేశాల సరసన చేరేందుకు సిద్ధంగా ఉంది.


వరాహ అంటే ఏమిటి?
సముద్రయాన్‍ ప్రాజెక్టులో భాగంగా మనదేశం సొంతంగా అభివృద్ధి చేసిన స్వీయ చోదక, ట్రాకింగ్‍ ఆధారంగా సముద్రం అడుగున మైనింగ్‍ చేయు వ్యవస్థను ‘వరాహ’ అని పిలుస్తారు. ఇది ఫ్లెక్సిబుల్‍ రైజర్‍ టెక్నిక్‍ (Flexible riser technique) ద్వారా నిర్వహించ బడుతుంది. హై స్ట్రెంత్‍ ఫ్లెక్సిబుల్‍ కోర్డ్ సిస్టమ్‍ ((High strenght flexible cord system) ను ఉపయోగించి ఈ మైనింగ్‍ వాహనం సముద్ర పైభాగాన ఉన్న నౌక నుండి, సముద్ర అడుగుభాగానికి పంపబడుతుంది. సముద్ర అడుగు భాగానికి మైనింగ్‍ వాహనం చేరిన తరువాత, సముద్ర పైభాగంలో నౌక కదలికలకు అనుగణంగా ఇది కూడా కదులుతుంది. ముందే సర్వే చేసిన ఖనిజాలు అధికంగా ఉండే ప్రాంతంలో వరాహను నిలపడం జరుగుతుంది. సముద్ర అడుగుభాగంలో, విలువైన పాలీ మెటాలిక్‍ నోడ్యూల్స్ ఖనిజాలను వెలికితీసేందుకుగానూ వరాహ అధికశక్తి పీడన పంపు వ్యవస్థ(High power pressure pump system)ను వినియోగిస్తుంది. తద్వారా ఈ విలువైన నిజాలు సముద్ర అడుగుభాగం నుండి ఉపరితల నౌకకు పంప్‍ చేయబడతాయి.


గత సం।।రం మధ్య హిందూ మహాసముద్రంలో నేషనల్‍ ఇన్సిస్టిట్యూట్‍ ఆఫ్‍ ఓషన్‍ టెక్నాలజీ (NIOT) 5270 మీ।।లోతులో వరాహ యొక్క లోతైన సముద్ర లోకో మోషన్‍ పరీక్షలను విజయ వంతంగా నిర్వహించింది. 2.5 గం।।ల వ్యవధిలో ఉపరితల నౌక, వరాహతో కలిసి 120 మీ।। దూరం ప్రయాణించింది. ఇది ఖనిజాల కోసం సముద్ర అడుగు భాగాన్ని అన్వేషించే మైనింగ్‍ మిషన్ల విన్యాసాలలో ప్రపంచంలోనే అత్యంత లోతైన విన్యాసంగా గుర్తింపు పొందింది.


వరాహ తన పనితీరును పరీక్షించే సమయంలో అది విజయవంతంగా పాలీమెటాలిక్‍ నోడ్యూల్స్ సముద్ర అడుగుభాగం నుండి సేకరించింది. ఇలా సేకరించే సమయంలో పర్యావరణంపై పడే ప్రభావాన్ని మదింపు చేసి ఆ నివేదిక అంతర్జాతీయ పరిశీలకులకు సమర్పించడం జరిగింది. తద్వారా మొదటిదశను విజయవంతంగా పూర్తి చేసింది. ఖనిజాల వెలికితీతలో భాగంగా రెండవ దశలో వరాహ ఇంకా ఎక్కువ పనిచేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా మన మైనింగ్‍ సిస్టమ్‍ అయిన వరాహ ఒక శక్తివంతమైన క్రషర్‍ని ఉపయోగించి సముద్ర అడుగుభాగంలో సముద్రపు నీటిలో పాలీ మెటాలిక్‍ నోడ్యూల్స్ కలపడం ద్వారా ఒక చిక్కటి ద్రవాన్ని (slurry) తయారు చేయాలి. అప్పుడు ఆ చిక్కటి ఖనిజ ద్రవం ఒక రైజర్‍ (riser) ద్వారా (5000-6000మీ।।ల) పై భాగంలో ఉండే సముద్ర ఉపరితలానికి పంప్‍ చేయబడుతుంది. ఈ పనులన్నింటినీ చేయడానికి వరాహకు గంటకు 1 మెగావాట్‍ విద్యుత్‍, ఉపరితల నౌక నుండి సరఫరా చేయబడుతుంది. పంపింగ్‍ చాలా శక్తి వంతంగా ఉండాలి. ఖనిజాలను వెలికితీయడానికి స్లర్రీ (slurry)ని సముద్ర పైభాగానికి రవాణా చేయాలి. ఈ విధంగా వరాహ విషయంలో భారత శాస్త్రజ్ఞులు సమగ్రంగా, నిశితంగా, పనిచేస్తున్నారు. పురోగతి ఆశాజనకంగా
ఉంది. ఇప్పటికే ఇంటర్నేషనల్‍ సీబెడ్‍ ఆధారిటీ (ISA) చైనా, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్‍, రష్యా, దక్షిణకొరియాలతో పాటు ఇండియాకు కూడా డీప్‍ ఓషన్‍ మైనింగ్‍ కొరకు అనుమతినిచ్చింది.


సముద్రయాన్‍ ప్రాధాన్యత:

భూగోళాన్ని 70% సముద్రాలు ఆవరించి ఉన్నాయి. ఈ సముద్రాలలో అనేకరకాలైన వనరులు పుష్కలంగా ఉన్నాయని శాస్త్ర వేత్తల అంచనా. అయితే ఈ సముద్రాలు ఆవరించి ఉన్న జలభాగంలో 95 శాతం వరకు వనరుల కోసం ఎలాంటి అన్వేషణా జరగలేదు. ఈ లోటును పూరించేందుకు భారత ప్రభుత్వం బ్లూ ఎకనామిక్‍ ఇనిషి యేటివ్‍ను తీసుకొచ్చింది. సముద్రయాన్‍ ప్రాజెక్ట్ వల్ల బ్లూ ఎకనామిక్‍ ఇనిషియేటివ్‍కు పూర్తిస్థాయి ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంది.


లోతైన సముద్ర అడుగుభాగాలలో వనరుల అన్వేషణ కొరకు తగు నియమానిబంధనలు రూపొందించడానికి ఐక్యరాజ్యసమితి తన నేతృత్వంలో ఇంటర్నేషనల్‍ సీబెడ్‍ అథారిటీ (ISA) అన్న సంస్థను ఏర్పాటు చేసింది. ఈ సంస్థ ఆయా దేశాలకు సముద్ర అడుగు భాగాల్లో వనరుల అన్వేషణకు గాను లైసెన్స్లు మంజూరు చేస్తుంది. భారతదేశానికి ఈ సంస్థ 75 వేల చ।। కి।।ల విస్తీర్ణంలో హిందూ మహా సముద్రంలో 15 సం।।రాల పాటు మైనింగ్‍ చేసేందుకు వీలుగా లైసెన్స్ మంజూరు చేయడంతో పాటు ఒక ఒప్పందం కూడా కుదుర్చుకొంది. ఈ ఒప్పందం కింద హిందూ మహా సముద్రం యొక్క లోతైన ప్రాంతాల్లోని పాలీమోటాలిక్‍ నోడ్యూల్స్ను వెలికి తీసే అవకాశం ఇండియాకు లభిస్తుంది. మధ్యహిందూ మహాసముద్రం యొక్క పరీవాహక ప్రాంతంలో 380 మిలియన్‍ మెట్రిక్‍ టన్నుల మాంగనీస్‍, కోబాల్ట్, ఐరన్‍, లెడ్‍, జింక్‍ మరియు కాపర్‍లతో కూడి పాలీ మెటాలిన్‍ నోడ్యూల్స్ ఉన్నాయని ఒక ప్రాథమిక అంచనా. వీటి విలువ సుమారు 110 బిలియన్‍ డాలర్లు. సముద్రయాన్‍ ప్రాజెక్ట్ ద్వారా వీటిని వెలికి తీయగలిగితే భారత ఆర్థిక వ్యవస్థకు గొప్ప ఊతం లభిస్తుంది.


సముద్రయాన్‍ ప్రాజెక్ట్ వల్ల కలిగే ప్రయోజనాలు

భారతదేశం అధిక జనాభా కలిగిన అభివృద్ధి చెందుతూ ఉన్న దేశం. ఈ నేపథ్యంలో పెరుగుతున్న జనాభా అవసరాలు తీర్చడానికి వేగవంతమైన ఆర్థికాభివృద్ధిని సాధించాల్సి ఉంటుంది. సముద్రయాన్‍ ప్రాజెక్ట్ వేగవంతమైన ఆర్థికాభివృద్ధికి తగుతోడ్పాటు అందించే అవకాశం ఉంది.


అరుదైన భూగర్భ లోహాల వెలికితీత:
సుముద్రయాన్‍ ప్రాజెక్ట్ ద్వారా బ్యాటరీలు, సోలార్‍ ప్యానెల్స్, స్మార్ట్ఫోన్స్ మరియు ఎలక్ట్రానిక్స్ రంగాల్లో వినియోగించే కాపర్‍, కోబాల్ట్, లిథియం, నికెల్‍ లాంటి అరుదైన లోహాలను వెలికి తీసే అవకాశం ఉంది. తద్వారా భారతదేశం ఎలక్ట్రానిక్‍ తయారీ రంగంలో గ్లోబల్‍ హబ్‍గా ఎదిగే అవకాశం ఉంటుంది.


టైడల్‍ ఎనర్జీని వినియోగించుకోవడం :
  • సముద్రయాన్‍ ప్రాజెక్ట్ ద్వారా అలలశక్తిని వినియోగించుకొని వనరుల అన్వేషణ చేపట్టవచ్చు. ఈ పక్రియ సుస్థిరాభివృద్ధి లక్ష్యాలకు అనుగుణంగా ఇంధన వనరులను వినియోగించు కోవడానికి దోహదం చేస్తుంది.
  • భూకంపం మరియు సునామీ ముందస్తు హెచ్చరికల వ్యవస్థను అభివృద్ధి పరచడం.
  • సముద్రయాన్‍ మిషన్‍ ద్వారా జరిగే సాగర మధనం వల్ల భూకంపాలు మరియు సునామీలను ముందస్తుగా అంచనావేసే పరిజ్ఞానం మరింత మెరుగవుతుంది. తద్వారా ముందస్తు హెచ్చరిక వ్యవస్థల సంసిద్ధతను మరింత కట్టుదిట్టం చేయవచ్చు.


కొత్త వనరులను కనుగొనడం:
వైద్యరంగానికి సంబంధించిన సరికొత్త ఔషధాలు, ఆహారం మరియు ఇతర విలువైన ఉత్పత్తులకు సంబంధించిన కొత్త వనరులను ఈ మిషన్‍ ద్వారా కనుగొనవచ్చు. ఇది మనదేశంలోని వనరుల యొక్క ఆధార సామర్థ్యాన్ని విస్తరిస్తుంది.


ప్రభావంతమైన పరిశోధన మరియు శ్రామిక శక్తి అభివృద్ధి:
  • ఈ మిషన్‍ ద్వారా ఖనిజ వనరులను గుర్తించడంతో పాటు, వాటిని వెలికితీయడం కోసం మెరుగైన సాంకేతికత అభివృద్ధి చేయబడుతుంది. తద్వారా గనుల రంగంలో ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు లభించి శ్రామిక శక్తి అభివృద్ధి చెందుతుంది. మరియు అత్యున్నత స్థాయి పరిశోధన సౌకర్యాలు అందు బాటులోకి వస్తాయి.
  • మనదేశం యొక్క సముద్ర పరిశోధనా స్థాయిని బలోపేతం చేయడం
  • సముద్రయాన్‍మిషన్‍ సముద్ర పరిశోధనలో భారతదేశ స్థాయిని మెరుగుపరుస్తుంది. దాని సామర్థ్యాలను మరియు నైపుణ్యాలను మరింత పెంచుతుంది.

సముద్రయాన్‍ వల్ల పర్యావరణంపై పడే ప్రభావం:
  • తక్కువ ఆక్సిజన్‍, తక్కువ సూర్యరశ్మి, అధిక పీడనం మరియు శీతల ఉష్ణోగ్రతలతో కఠినమైన వాతావరణంలో జీవించడానికి పరిణామం చెందిన ప్రత్యేకమైన జీవజాలం లోతైన సముద్రంలో కనిపిస్తాయి. తగుజాగ్రత్తలు తీసుకోకుండా సముద్రపులోతైన ప్రాంతాలలో మైనింగ్‍ నిర్వహించినట్లయితే ఈ జీవుల యొక్క సమతాస్థితి దెబ్బతినవచ్చు. లేదా వీటి ఉనికికే ప్రమాదం ఏర్పడవచ్చు.
  • సముద్రం యొక్క లోతైన అడుగుభాగంలో వివిధ రకాల జంతుజాలం సహజ వాతావరణంలో నివసిస్తూ ఉంటుంది. ఈ ప్రాంతంలో నౌకల సంచారం పెరగడం, వాటి నుండి వెలువడే రసాయానాలు, లీకైన పెట్రోలియం తెట్టు మరియు నీరు, ధ్వని మరియు కాంతి కాలుష్యం వల్ల అవి సహజంగా జీవించే సామర్థ్యానికి హాని కలుగుతుంది.
  • లోతైన సముద్ర ప్రాంతంలోని జీవవైవిధ్యం గురించి తక్కువ అన్వేషణ జరిగింది. మానవాళికి దీని గురించి పరిమిత స్థాయిలో మాత్రమే అవగాహన ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో పర్యావరణ ప్రభావ మదింపును నిర్వహించడంలోనూ, దానికి తగు మార్గదర్శకాలు రూపొందించడంలోనూ సవాళ్ళు ఎదురుకావచ్చు.
  • సముద్రంలో లోతైన ప్రాంతాలకు పరిమితమైన హానికర మూలకాలు సముద్ర ఉపరితలానికి చేరవచ్చు. తద్వారా అత్యున్నత నీటి పొరలలోని వడపోత సామర్థ్యానికి హాని కలిగించవచ్చు. అంతేకాకుండా అవి ఉత్పత్తి చేసే అవక్షేప ధూళి వల్ల నీటి కాలుష్యం జరుగుతుందేమోనన్న ఆందోళనలు ఉన్నాయి.

సవాళ్ళు :
  • సముద్ర అగాధాల్లో అత్యధిక పీడనం ఉంటుంది. ఈ పీడనాన్ని తట్టుకొని మనగలిగే విధంగా ఉపకరణాలు తయారు చేయడం కష్టసాధ్యమైనది.
  • బురదతో కూడిన మెత్తగా ఉన్న సముద్ర అడుగు భాగంలో వాహక నౌకలను నిలపడం (ల్యాండ్‍ చేయిండం) సంక్లిష్టమైన విషయం.
  • లోతైన ప్రాంతాల్లోని ఖనిజ వనరులను వెలికి తీయడానికి ఎలాంటి అవాంతరాలు లేని విద్యుత్‍ శక్తి మరియు ఇంధన వనరులు సమకూర్చడం కత్తిమీద సామేనని కొంతమంది నిపుణులు వ్యాఖ్యా నిస్తున్నారు.
  • సహజ కాంతితో దృశ్య తీక్షణత తక్కువగా ఉండడం వల్ల సముద్రం అడుగు భాగానికి కొన్ని మీ।।ల లోతు వరకే వెళ్ళగలం.
  • సముద్ర అడుగు భాగానికి వెళ్ళే కొద్దీ ఉష్ణోగ్రతల్లో వ్యత్యాసాలు, తుప్పుపట్టడం కారణంగా లోహక్షయం పెరగడం, అధిక గాఢతతో కూడిన లవణీయత లాంటి సవాళ్ళు మరింత ఉధృతమవుతాయి. వాటిని ఎలా పరిష్కరిస్తారన్న విషయంపైన స్పష్టత లేదు.


చివరిగా:
ఎలక్ట్రానిక్స్ రంగంలో విరివిగా వినియోగించే లిథియం, కోబాల్ట్, నికెల్‍ వంటి లోహాల తవ్వకం, శుద్ధి, ఎగుమతుల్లో చైనాదే అగ్రస్థానం. డ్రాగన్‍ గుత్తాధిపత్యాన్ని ఎదుర్కోవడానికి సముద్రయాన్‍ ప్రాజెక్ట్ భారత్‍కు ఎంతో ప్రయోజనకారి అవుతుంది. సముద్రగర్భ అన్వేషణకు ప్రభుత్వ సంస్థలతో పాటు, ప్రైవేటు కంపెనీలకు కూడా ఆహ్వానం పలకాలి. ఇదే సమయంలో సముద్రగర్భ అన్వేషణ వల్ల జరిగే పర్యావరణ నష్టాలను జాగ్రత్తగా మదింపు చేసి, సముద్ర జీవజాలానికి ఎలాంటి నష్టం వాటిల్లకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినట్లయితే సముద్రయాన్‍ ప్రాజెక్ట్ భారత ఆర్థిక వ్యవస్థకు ఒక చోదక శక్తి కాగలదనడంలో ఎలాంటి సందేహం లేదు.

-పుట్టా పెద్ద ఓబులేసు,
స్కూల్‍ అసిస్టెంట్‍, జిల్లా పరిషత్‍ ఉన్నత పాఠశాల
రావులకొలను, సింహాద్రిపురం, కడప
ఎ : 9550290047

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *