సాంస్క•తిక అస్తిత్వాన్ని నిలబెట్టుకున్న తెలంగాణ

2019 జూన్‍లో అమెరికా వెళ్ళినప్పుడు ఒక రోజు గ్రాండ్‍ కాన్యాన్‍ (Grand Canyan) కొలరాడో నదీ లోయ ప్రాంతాన్ని సందర్శించడానికి పోయాము. అంతకు ఒక వారం ముందు మా బిడ్డ చదువుకున్న Texas A&M University కి వెళ్ళాము. ఈ యునివర్సిటీకి నాలుగు చోట్ల కాంపస్‍లు ఉన్నాయి. మేము కామర్స్ అనే ప్రాంతంలో ఉన్న కాంపస్‍కు వెళ్ళాము. డల్లాస్‍ నుంచి ఒక గంట ప్రయాణం. సుందరమైన, విశాలమైన కాంపస్‍. ఈ కాంపస్‍లో చదువుకున్న వాళ్ళని లయన్స్ అని పిలుస్తారట. అందుకే కాంపస్‍లో సింహం కంచు విగ్రహాన్ని ఏర్పాటు చేసారు. ఇది అమెరికాలో ఒక స్థాయి కలిగిన యూనివర్సిటీ. ఇక్కడ ఏర్పాటు చేసిన సింహం బొమ్మ దగ్గర ఒక శిలాఫలకం నన్ను ఆకర్షించింది. ఈ యూనివర్సిటీ ప్రాంతం ఒకప్పుడు కాడో (caddo) అనే జాతికి చెందిన స్థానిక అమెరికన్ల (Native Americans) నివాస ప్రాంతం. వీరి నివాస ప్రాంతం నైరుతీ దిశలో ఆర్కాన్సాస్‍ వరకు, వాయవ్య దిశలో లూసియానా వరకు విస్తరించి ఉండేది. 16వ శతాబ్దానికే వీరు గ్రామాల్లో స్థిర వ్యవసాయం చేయడం ప్రారంభించారు. మక్కజొన్న, కూరగాయలు పండించేవారు. జంతువులు, చేపల వేట కూడా చేసేవారు. వేటకు విల్లు, బాణాలు ఉపయోగించేవారు. వీరికి ప్రత్యేకమైన భాషా, సంస్క•తి, పండుగలు, ఆచార వ్యవహారాలూ స్థిరపడినాయి. యూరప్‍ నుంచి వలసవాదులతో వ్యాపార లావాదేవీలు జరిపేవారు. 1889 ఇక్కడ యూనివర్సిటీ ఏర్పాటుకు నిర్ణయించడంతో వారిని ఒక్లాహామా ప్రాంతానికి తరలించి పునరావాసం కల్పించారు. అక్కడ స్వయం ప్రతిపత్తి కలిగిన ‘కాడో నేషన్‍’ కూడా ఏర్పాటు చేసారు. టెక్సాస్‍ రాష్ట్రానికి ఆ పేరు కాడో జాతి వారి భాషలో ఉన్న టేషస్‍ (Tayshas) అనే పదం నుంచి ఉత్పన్నం అయ్యింది. అంటే స్నేహితులు అని అర్థం ఆ శిలాఫలకంలో ఈ వివరాలన్నీ రాశారు.


ఇటువంటి స్వయం ప్రతిపత్తి కలిగిన స్థానిక అమెరికన్‍ నేషన్స్ అమెరికా అంతట చాలా ఉన్నాయి. యూరప్‍ వలస వాదులు అమెరికా ఖండాన్ని ఆక్రమించుకున్న తర్వాత ఇక్కడి స్థానిక అమెరికన్లతో జరిగిన ఘర్షణలు, ఆ ఘర్షణల్లో జరిగిన మానవ హననం అమెరికా ఖండ అభివ•ద్ధి చరిత్రలో మానని గాయం. ఈ వివరాలన్నీ హోవార్డ్ జిన్‍ రాసిన ‘‘అమెరికా ప్రజల చరిత్ర’’ (A Peoples History of the United States) పుస్తకంలో చదవవచ్చు. 15వ శతాబ్దంలో యూరప్‍ వలసవాదులు కొత్త భూభాగాల కోసం అన్వేషణ ప్రారంభించారు. భారత దేశానికి దారి కనుక్కునే క్రమంలో దారితప్పి కొలంబస్‍ అమెరికా ఖండానికి చేరుకున్నాడు. అదే ఇండియా అనుకున్నాడు. అక్కడి స్థానిక ప్రజలని ఇండియన్స్ అన్నాడు. వారి చర్మం రంగు ఎరుపుగా ఉండడంతో వారు ‘రెడ్‍ ఇండియన్స్’ అయ్యారు. అక్కడి నుంచి రెడ్‍ ఇండియన్స్కి యూరప్‍ వలసవాదులతో ఘర్షణల పర్వం మొదలయ్యింది. విల్లు, బాణాలతో చేసే వారి పోరాటాలు యూరోపియన్ల తుపాకుల ముందు నిలువలేకపోయినాయి. యూరోపియన్‍ వలసవాదులకు లొంగిపోయి బానిసలుగా మారినారు. దిక్కరించిన జాతులు ఊచకోతకు గురి అయినాయి. యూరోపియన్లు రాక మునుపు లక్షల సంఖ్యలో ఉండే స్థానిక జాతుల ప్రజలు వందల్లోకి తగ్గిపోయినారు. విశాలమైన భూఖండాన్ని అభివ•ద్ధి చేయడానికి వారికి మానవ శ్రమ కావలసి వచ్చింది. ఆఫ్రికా నుంచి వేటాడి తీసుకు వచ్చిన వేలాది మంది నల్లజాతి బానిసల శ్రమతో అమెరికా ఖండంలో వ్యవసాయం, గనులు, పరిశ్రమలు అభివ•ద్ధి చెందాయి. అమెరికా అభివ•ద్ధి చరిత్ర అంతా రక్తసిక్త చరిత్ర అని ఆ పుస్తకం సోదాహరణంగా వివరించింది.


ఆరిజోనా రాష్ట్రంలో ఉన్న గ్రాండ్‍ కాన్యాన్‍ (Grand Conyon) అని పిలువబడే కొలరాడో నదీ లోయ ప్రాంతంలో కూడా అమెరికా ఫెడరల్‍ ప్రభుత్వం హూలాపై (Hualapai) జాతికి చెందిన స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన హూలాపై నేషన్‍ను (Hualapai Nation)1883 లో ఏర్పాటు చేసింది. అక్కడకి చేరగానే welcome to Hualapai Nation అని ఆహ్వానం పలుకుతారు. అక్కడ మూడు జెండాలు ఎగరడం కనిపించింది. ఎత్తున అమెరికా ఫెడరల్‍ జెండా, మధ్యలో హూలాపై నేషన్‍ జెండా, చివరన కొంచెం చిన్నగా ఆరిజోనా రాష్ట్ర జెండాలు ఎగురుతున్నాయి. 2900 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన హూలాపై నేషన్‍ ప్రాంతంలో నమోదు చేసుకున్న మొత్తం జనాబా 2300. ప్రస్తుతం ఆ ప్రాంతంలో నివసిస్తున్నవారు సుమారు 1350. గ్రాండ్‍ కాన్యాన్‍ పర్వత శ్రేణులు కొలరాడో నదీ లోయలో కొన్ని లక్షల సంవత్సరాల క్రితం అధ్బుతమైన ఎర్రటి రాళ్ళతో నిర్మితమైనవి. 3 వేల అడుగుల లోతున ఈ రాతి కొండల నడుమ కొలరాడో నది ప్రవహిస్తుంది. ఇక్కడ గాజుతో నిర్మించిన ‘‘స్కై వాక్‍’’ బ్రిడ్జి మీద నుంచి పర్యాటకులు గ్రాండ్‍ కాన్యాన్‍ అందాలను వీక్షిస్తారు. ఫోటోలు దిగుతారు. ఫోటోలు అక్కడి ఉద్యోగులు మాత్రమే తీస్తారు. వారంతా హూలాపై జాతికి చెందిన వారే. పర్యాటకం నుంచి వచ్చే ఆదాయం అంతా హూలాపై నేషన్‍కు చెందుతాయి. స్కై వాక్‍ బ్రిడ్జ్ మీదకు వెళ్ళే ముందు క్యూలైన్‍ గోడలపై వాలాపై జాతి ప్రజల చరిత్ర, వారి పోరాటాలు, వారు గతంలో ఉపయోగించిన వస్తువులు తదితర సామాగ్రిని, పోస్టర్లను ప్రదర్శనకు పెట్టారు. ఆ సమాచారం అంతటిని ఫోటోలలో బందించాను. ఆసక్తితో చదివాను. గ్రాండ్‍ కాన్యాన్‍ వద్ద ఏర్పాటు చేసిన దుకాణంలో ఒక హూలాపై ఆత్మకథ పుస్తకం నా ద•ష్టిని ఆకర్షించింది. ఆ పుస్తకాన్ని కొని చదివాను. అర్థం అయినది కొంచెం. అర్థం కానిది ఎక్కువ. ఈ ఆత్మకథలో బంగారం కోసం యూరోపియన్ల దాడులపై, ఓడిపోయిన వారి పోరాట చరిత్రపై ఒక చాప్టర్‍ ఉన్నది. గ్రాండ్‍ కాన్యాన్‍ వద్ద హూలాపై జాతి ప్రజలు వదిలేసిన ఊరును ((Deserted Village) సందర్శకుల కోసం కాపాడుతున్నారు. వారి గుడిసెలు, పశువుల కొట్టాలు, వంట పాత్రలు, వ్యవసాయ పనిముట్లు తదితర సామాగ్రి అక్కడ దర్శనమిస్తాయి. పర్యాటకులు వాటి ముందు, లోపల ఫోటోలు దిగి తమ జ్ఞాపకాలను భద్రపరచుకుంటారు. స్థానిక వాద్యాలతో వారి పాటలను కొందరు వినిపిస్తూ ఉంటారు. పర్యాటకం వారికి ప్రధాన ఆదాయ వనరు. గ్రాండ్‍ కాన్యాన్‍ ప్రక•తి అందాలను, హూలాపై జాతి ప్రజల గ్రామాలను వీక్షించడానికి ప్రపంచ వ్యాప్తంగా పర్యాటకులు వస్తారు. స్థానిక అమెరికన్‍ గ్రామాలన్నీ ఇటువంటి పర్యాటక ప్రాంతాలుగా మారినాయి. 1970 వ దశకంలో హాలీవుడ్‍ బ్లాక్‍ బస్టర్‍ హిట్‍ సినిమా ‘‘మెకన్నాస్‍ గోల్డ్’’ షూటింగ్‍ ఇక్కడే జరిగిందని మిత్రుడు కొండపల్లి వేణుగోపాలరావు చెప్పాడు.


ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పవలసి వస్తున్నదంటే .. తెలంగాణ ఏర్పాటు అయిన పదేండ్ల తర్వాత ఇదంతా గుర్తు చేసుకోవడానికి పూర్వరంగం ఉన్నది. ఉద్యమ కాలంలో ప్రొ. జయశంకర్‍ గారు అనేక సభల్లో చేసిన ప్రసంగాల్లో తరచుగా భాష సాంస్క•తిక పరాయీకరణ గురించి చెప్పేవారు. ‘ఒక జాతి ఆర్థికంగా నష్టపోతే పుంజుకోవచ్చు. కానీ సాంస్క•తికంగా నష్టపోతే జాతి అస్తిత్వం కనుమరుగు అవుతుంది. తెలంగాణ ఏర్పాటు కాకపోతే మన భాష, సంస్క•తి సాంప్రదాయాలు కనుమరుగు ఆవుతాయి. మన తర్వాతి తరం వారికి ఒకప్పుడు మనుగడలో ఉన్న తెలంగాణను, మ్యూజియంలలో భద్రపరచిన మన బతుకమ్మను, మన బోనాలను, మన సాంస్క•తిక చిహ్నాలను చూపించుకోవలసిన దుస్తుతి వస్తుంది. అమెరికాలో రెడ్‍ ఇండియన్స్ లాగా. అట్లా మనం, మన సంస్క•తి మ్యూజియంలో వస్తువులుగా మారవద్దు అనుకుంటే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుందాం. ఇప్పుడు కాకపోతే మరెప్పుడూ రాదు..’ ఇట్లా సాగేది ఆ ప్రసంగాలు. అయితే ఆ దురవస్థ తెలంగాణకు పట్టకుండా తప్పిపోయింది. సమస్త తెలంగాణ సమాజం ఒక్క తాటిపై నిలబడి కలబడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నది. తెలంగాణ తన బాషా సాంస్క•తిక అస్తిత్వాన్ని సమున్నతంగా నిలబెట్టుకున్నది.


దాదాపు 15 ఏండ్ల పాటు సాగిన తెలంగాణ సాధనా పోరాటంలో సాంస్క•తికోద్యమం పోషించిన పాత్ర ఈ సందర్భంలో స్మరించుకోవలసిన అవసరం ఉన్నది. మలి దశ ఉద్యమం తెలంగాణ అంతటా ఒక సాంస్క•తిక పునరుజ్జీవనానికి ఊపిరి పోసింది. జాతీయ ఉద్యమం సందర్భంగా దేశ వ్యాప్తంగా ‘వందేమాతరం’ నినాదం ప్రజల్లో ఎటువంటి ఉత్తేజాన్ని నింపిందో ‘జై తెలంగాణ నినాదం’ కూడా అట్లనే తెలంగాణను తట్టి లేపింది.


మరుగున పడిపోయిన చరిత్రను తవ్వి తీయడానికి అనేక మంది చరిత్ర పరిశోధకులు పలుగూ పారా పట్టుకొని పురా తవ్వకాలు చేసి ఘనమైన తెలంగాణ చరిత్రను వెలికి తీసినారు. వారు తెలంగాణ చరిత్రను పునర్నిర్మించే ప్రయత్నం చేసినారు. బహుజన వీరులు సర్వాయి పాపన్న, తుర్రేబాజ్‍ ఖాన్‍, సుద్దాల హనుమంతు, బందగి, కొమురం భీమ్‍, భాగ్యరెడ్డి వర్మ, వట్టికోట ఆళ్వారు స్వామి, మగ్దూం, కాళోజీ, దాశరథి, సురవరం ప్రతాపరెడ్డి, నవాబ్‍ అలీ నవాజ్‍ జంగ్‍ బహాదూర్‍,… ఇట్లా తెలంగాణ వైతాళికులు అనేక మంది వెలుగులోకి వచ్చినారు. తెలంగాణ పై మగ్దూం చెప్పిన ‘‘ఇన్ఖిలాబ్‍ కా పైగంబర్‍ తెలంగాణ దాశరథి చెప్పిన ‘‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’’, కాళోజీ చెప్పిన ‘‘మాటొక్కటి భాషోక్కటి, భారతాన వెలసి నిలుచు తెలంగాణ’’ అన్న కవితా పాదాలు ప్రజల్లో విస్త•తంగా ప్రచారం పొందినాయి. దాశరథి కవితా పాదాలను అన్వయించి సాగునీటి ఇంజనీర్లు ‘‘మా తెలంగాణం – కోటి ఎకరాల మాగాణం’’ అన్న నినాదాన్ని రుపొందించినారు. ఈ క్రమంలో తెలంగాణ చరిత్ర, తెలంగాణ సాహిత్య చరిత్ర, నిజామాంద్ర మహాసభల చరిత్ర, హైదారాబాద్‍ విమోచనా చరిత్ర, దానిపై భిన్న ద•క్పథాలు, హైదారాబాద్‍ రాజ్యంపై పోలీస్‍ చర్య పేరుతో జరిగిన సైనిక చర్యపై ప్రత్యక్ష కథనాలు, ఆపరేషన్‍ పోలో సందర్భంగా ముస్లింలపై జరిగిన ఊచకోతపై పండిట్‍ సుందర్‍ లాల్‍ నివేదిక, 1969 ఉద్యమ చరిత్ర, ఆంధప్రదేశ్‍ ఏర్పాటు విద్రోహ చరిత్ర, భారత రాష్ట్రాల ఏర్పాటు పరిణామ చరిత్ర… ఇట్లా తెలంగాణ చరిత్రపై ప్రభావశీలమైన పుస్తకాలు వెలువడినాయి.


మల్లెపల్లి లక్ష్మీరాజం మెమోరియల్‍ ట్రస్ట్ వారు ప్రొ. జయశంకర్‍ గారి ‘‘తెలంగాణలో ఏం జరుగుతోంది’’ పుస్తకం తెలంగాణ సమాజాన్ని జాగ•తం చెయ్యడంలో అనితరసాధ్యమైన పాత్రను పోషించింది. తెలంగాణ విద్యావంతుల వేదిక ప్రచురించిన ‘‘కమ్యూనిజమా – కోస్తావాదమా’’ సిపిఎం తెలంగాణ వ్యతిరేక వైఖరిపై వ్యాసాల పుస్తకం వామపక్షాలపై తీవ్ర ప్రభావాన్ని కలుగజేసింది. ఆ పార్టీలు తెలంగాణపై తమ వైఖరిని మార్చుకోవడంలో దోహదం చేసింది. తే.వి.వే ప్రచురించిన ఆర్‍. విద్యాసాగరరావు గారి ‘‘నీళ్ళు – నిజాలు’’ పుస్తకం నీటి దోపిడి రాజకీయాలను ప్రజలకు వివరించడంలో సఫలమైంది. తలాపున గోదావరి, క•ష్ణా నదులు పారుతున్నా తెలంగాణకు న్యాయంగా అందవలసిన నీటి వాటా ఎందుకు అందటంలేదో ఆయన వ్యాసాలు, ప్రసంగాలు ప్రజలకు విప్పి చెప్పినాయి. నీళ్ళలో నిప్పులు రగిలించి ఉద్యమానికి నీళ్ళను ఒక ప్రధాన అంశంగా మార్చడంలో ఆయన క•షి విస్మరించలేనిది. 1956 లో వట్టికోట ఆళ్వారుస్వామి ప్రచురించిన ‘‘తెలంగాణం’’ రెండు సంపుటాల పునర్ముద్రణ జరిగింది. ఇందులో విలీనానికి పూర్వం హైదరాబాద్‍ రాష్ట్రం వివిధ రంగాలలో సాధించిన ప్రగతిని వివరిస్తూ నిపుణులు రాసిన వ్యాసాలు వలసవాదుల వాదనలను తిప్పికొట్టడానికి ఉపయోగ పడినాయి. బిఎన్‍ శాస్త్రి రాసిన ‘‘రెండు తెలుగు రాజ్యాలెందుకు?’’ అన్న పుస్తకం కూడా పునర్ముద్రణకు నోచుకున్నది. ఆ పుస్తకం తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను వివరించడానికి ఉద్యమకారులకు ఉపయోగపడింది. తెలంగాణ జాగ•తి వారు సురవరం ప్రతాపరెడ్డి ఆనాడు ప్రచురించిన ‘గోలకొండ కవుల సంచిక’ను పునఃప్రచురించింది. చరిత్ర పరిశోధకులు జితేంద్ర బాబు సంకలించిన ‘నిజాం రాష్ట్ర ఆంధ్ర మహాసభల చరిత్ర’ను కూడా మూడు సంపుటాలుగా ప్రచురించి తెలంగాణ ప్రజలకు అపూర్వ కానుకలను అందించింది. చిన్న రాష్ట్రాల ఆవశ్యకతను వివరిస్తూ డా. బి.ఆర్‍ అంబేద్కర్‍ రాసిన వ్యాసాలు విస్త•తంగా చర్చకు వచ్చాయి. ‘ఒక రాష్ట్రానికి ఒక భాష ఉండాలి. అయితే ఒక భాషకు ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాలు ఉంటే తప్పు లేదు’ అన్న అంబేద్కర్‍ సూత్రీకరణలు ఉద్యమ కారులకు దిశా నిర్దేశనం చేసినాయి. మహారాష్ట్రా నుంచి గుజరాత్‍ రాష్ట్రం విడిపోయినప్పుడు ముంబాయి నగరాన్ని కేంద్ర పాలిత ప్రాంతం చేయాలన్న గుజరాతీ పెట్టుబడిదారుల కుట్రలను అంబేద్కర్‍ తన పదునైన, సునిషితమైన వాదనలతో బద్దలు కొట్టిన విధానం హైదరాబాద్‍ నగరాన్ని తెలంగాణకు దక్కకుండా ఆంధ్రా పెట్టుబడిదారులు చేసిన కుట్రలను చేధించడానికి ఉపయోగపడినాయి. ప్రతీ శనివారం క్రమం తప్పకుండా తెలంగాణ రిసోర్స్ సెంటర్‍ (TRC)వారు హిమాయత్‍ నగర్‍లో ఉన్న చంద్రం బిల్డింగ్‍లో ఉద్యమ ఆకాంక్షలపై TRC – CHARCHAలకు వేదికను కల్పించారు. ఈ వేదికపై జరిగిన ఈ చర్చలు ఉద్యమ విస్తరణకు, ఉద్యమ భావజాలం మరింత పరిపుష్టం కావడానికి దోహదం చేసినాయి. ఈ చర్చల్లో చాలా మంది ఉద్యమ నాయకులు ప్రసంగాలు చేసేవారు. కొన్ని చర్చల్లో ప్యానల్‍ సభ్యుడిగా ప్రసంగం చేసే అవకాశం కూడా నాకూ కలిగింది. కొన్ని వందల వారాల పాటు కొనసాగిన ఈ వేదిక క•షి తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఒక మైలురాయి లాంటిది. ఈ చర్చలన్నిటిని ప్రత్యేక సంపుటాలుగా కూడా వేదకుమార్‍ గారు దక్కన్‍ ల్యాండ్‍ పత్రిక తరపున ప్రచురించారు. అవి ఉద్యమ చరిత్రను రాసే వారికి, పరిశోధకులకు విలువైన సోర్స్ మెటీరీయల్‍గా పనికివస్తాయి.


సీమాంధ్ర సాంస్క•తిక వలసీకరణలో అవహేళనకు, చిన్నచూపుకు గురి అవుతున్న తెలంగాణ భాషను సాహిత్య భాషగా మన కవులు, కథా రచయితలు నిలబెట్టినారు. మట్టిగొట్టుక పోయిన అద్భుత పద సంపదను, మన పలుకుబడులను, మన సామెతలను పని గట్టుకొని వెలికి తీసినారు. నలిమెల భాస్కర్‍ ‘తెలంగాణ పదకోశం’, రవ్వా శ్రీహరి గారి ‘నల్లగొండ జిల్లా మాండలిక పదకోశం’, వేముల పెరుమాళ్ళు రాసిన ‘తెలంగాణ సామెతలు’ తదితర పుస్తకాలు తెలంగాణ భాష సాహిత్య భాషగా స్థిరపడటానికి దోహదం చేసినాయి. ఉద్యమం సందర్భంగా జానపద కళారూపాలకు ప్రాణ ప్రతిష్ట జరిగింది. అపురూపమైన తెలంగాణ జానపద కళారూపాలు తిరిగి ప్రజలకు దగ్గరయినాయి. వందలాది జానపద బాణీలు తెలంగాణ ఉద్యమ పాటలకు బాణీలైనాయి. ఒగ్గు కళాకారులు చుక్కా సత్తయ్య, మిద్దె రాములు, చిందు కళాకారిణి చిందు ఎల్లమ్మలను తెలంగాణ సాంస్క•తిక ప్రతీకలుగా ఉద్యమం నిలబెట్టింది. తెలంగాణ వ్యాప్తంగా వందలాది మంది ప్రతిభావంతులైన పాట కవులను వెలికితీసింది. ఎందరో కాళాకారులు అద్భుతమైన కళా ప్రదర్శనలతో, రూపకాలతో, ఆటా పాటలతో, ధూమ్‍ ధాంలతో తెలంగాణ జనాన్ని ఉద్యమ బాటలోకి నడిపినారు. ఈ కళాకారుల ధూంధాంలు, ఆటా పాటా కార్యక్రమాలు తెలంగాణ గ్రామాలను, పట్టణాలను కదిలించి ఉద్యమ బాటన ఎక్కించినారు. ఈ క్రమంలో తెలంగాణలో వందలాది పాటల క్యాసెట్లు, సీడిలు వెలువడినాయి. వందలాది కవితా, కథా సంకలనాలు ప్రచురణ అయినాయి. ఈ సాంస్క•తిక వెల్లువలో చిత్రకారులు, కార్టూనిస్టులు, ఫోటోగ్రాఫర్లు తమవంతు క•షి చేసినారు. ఇదే కాలంలో తెలంగాణ సినిమా కూడా తన ఉనికిని చాటుకున్నది. సినిమాల్లో తెలంగాణ భాషను గూండాలకు, రౌడీలకు, సంఘ విద్రోహ శక్తులకు వాడడాన్ని ఉద్యమం తీవ్రంగా నిరసించింది. తెలంగాణ సినిమా రంగం మీదకు రావడానికి ఉద్యమ వాతావరణం ఎంతగానో దోహదం చేసింది. జై బోలో తెలంగాణ సినిమా సాధించిన అద్భుత విజయం తెలంగాణలో అనేక మంది ఔత్సాహికులను సినిమా రంగంలోనికి నడిపించింది. కొమురం భీం సినిమా 20 ఏండ్ల తర్వాత తిరిగి విడుదల అయి ప్రజల ముందుకు వచ్చింది. బతుకమ్మ, ఇంకెన్నాళ్ళు తదితర సినిమాలు తెలంగాణ కథాంశాలతో నిర్మాణం అయినాయి. అవి వ్యాపార పరంగా గొప్ప విజయం సాధించలేక పోయినా తెలంగాణ సినిమా పరిశ్రమ నిలదొక్కుకోవడానికి పునాదులు వేసినాయి.


ఈ సాంస్క•తిక వెల్లువలో భాగంగానే బతుకమ్మ పునరుజ్జీవనం పొందడం, బోనాల పండుగ , పీర్ల పండుగ, నాగోబా జాతర, సమ్మక్క సారలమ్మ జాతర, కొమురవెల్లి జాతర, ఏడుపాయల జాతర, తెలంగాణలో ఉన్న దేవాలయాలు, పర్యాటక ప్రదేశాలు, జలపాతాలు, సాంస్క•తిక విశేషాలు అన్నీ వెలుగులోకి వచ్చినాయి. టిఆర్‍ఎస్‍ పార్టీ నిజాం కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన తెలంగాణ సంబురాలు ఒక సంచలనం. ఒక అపురూప సంరంభం. అక్కడ ప్రదర్శింపబడిన కళారూపాలు ప్రజలకు కనువిందు చేసినాయి. తెలంగాణ వంటకాల రుచి ఆహా అనిపించింది. జొన్నరొట్టే, జొన్నగట్కా, పచ్చి పులుస, సకినాలు, అప్పాలు, పత్తర్‍ కా గోష్‍, మేక తలకాయ కూర ప్రజలు సగర్వంగా ఆరగించినారు. ఇక అప్పటి నుండి అన్నీ ఉద్యమ సభల సందర్భంగా భోజనాల్లో జొన్నరొట్టె, జొన్నగట్కా, పచ్చి పులుసు మెనూలో తప్పనిసరి అయినాయి.


స్థూలంగా వ్యాఖ్యానించినప్పుడు 20 ఏండ్ల ఉద్యమ కాలంలో తెలంగాణలో కనిపించిన సాంస్క•తిక పునరుజ్జీవనం లేదా సాంస్క•తిక వెల్లువ దేశంలో మరెక్కడా కానరాదు. ఇది ఉద్యమం సాధించిన అద్భుతమైన ప్రజావిజయంగా చెప్పుకోవచ్చు. అణగారిపోయిన ఒక జాతి లేచి నిలబడి తనని తాను నిలబెట్టుకున్న అపురూపమైన ఛారిత్రిక సంఘటన ఈ తెలంగాణ సాంస్క•తిక పునరుజ్జీవన ఉద్యమం.


తెలంగాణ జాతి భావన :

‘తెలంగానోల్లమ్‍ మేమంతా ఒక్కటే’ అన్న భావన ఉద్యమం సందర్భంగా ఉన్నతంగా వ్యక్తం అయ్యింది. తెలంగాణకు సంభందించిన దేనినైనా ఎత్తిపట్టడం, తెలంగాణేతరమైన దాన్నితిరస్కరించడం అతివాదంగా కనిపించినా అస్తిత్వ ఉద్యమాలకు ఉండే సహజ లక్షణంగా మాత్రమే దాన్ని చూడాలి. తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష నెరవేరింది కనుక ఇప్పుడు విచక్షణతో ఏది మంచి ఏది చెడు, మనలో తిరస్కరించవలసినది, పరిహరించు కోవలసినది ఏమిటనేది బేరీజు వేసుకోవాల్సిన సమయం. ఉద్యమ సందర్భంలో వ్యక్తమైన సామూహిక భావన, తామంతా ఒక్కటే అన్నజాతి భావనని మరింత ఉన్నతీకరించుకోవలసి ఉన్నది. కుల మతాలకు, సామాజిక హోదాలకు అతీతంగా ఉద్యమంలో వ్యక్తం అయిన సోదర భావం నిజంగా అపూర్వం. తెలంగాణలో శతాబ్దాలుగా ప్రజల ఆచరణలో ఉన్నసంబోదనలు.. అన్నా, తమ్మి, బిడ్డా, ఏమె, రావే, పోవే.. ఇటువంటివి సర్వ సాధారణమైన సంబోధనలుగా వయసుతో, సామాజిక హోదాతో నిమిత్తం లేకుండా స్థిరపడిపోయినాయి. ఇక్కడ అటువంటి కొన్ని అనుభవాలను పంచుకోవడం వాటిని కొనసాగించుకోవడానికి, ఉన్నతీకరీంచుకోవడానికి ఉపకరిస్తాయి. హైదరాబాద్‍లో ఎర్రంమంజిల్‍లో ఉన్న సాగునీటి శాఖ ప్రధాన కార్యాలయం జలసౌధ ఒక ఉద్యమ కేంద్రంగా ఉండేది. సహాయ నిరాకరణ, సకలజనుల సమ్మె సందర్భంగా జలసౌధ ఉద్యమ కార్యక్రమాలతో సందడిగా ఉండేది. ఆ సందర్భంగా తరచుగా కనబడే ద•శ్యం స్త్రీల బతుకమ్మ. చీపుర్లతో పనిచేసే కాంట్రాక్ట్ లేబర్లతో కలిసి వైట్‍ కాలర్‍ ఉద్యోగులు, మహిళా ఇంజనీర్లు బతుకమ్మ ఆడుతూ కనిపించేవారు. సాధారణ సమయంలో మనం చూడలేని అపురూప ద•శ్యం అది. అట్లనే కోదాటి శ్రీను రాసిన ‘‘అస్సాయిదులా హారతి కాళ్ళగజ్జెల గమ్మతి’’ పాటకు, గద్దర్‍ ‘‘పొడుస్తున్న పొద్దు మీద ..’’ పాటకు డ్రైవర్లు, అటెండర్లు, ఇతర నాల్గవ తరగతి ఉద్యోగులు, ఎన్‍జివోలు, ఇంజనీర్లు కలిసి ధూలా ఆడడం అతి సాధారణ ద•శ్యంగా ఉండేది. ఇటువంటి ద•శ్యాలే అన్నీ ఆఫీసుల్లో కనిపించినాయి. ఆఫీసులో సబార్డినేట్‍, కానీ ఉద్యమంలో నాయకుడు. ఎన్జివోల నాయకత్వంలో గజిటెడ్‍ ఆఫీసర్లు, క్లాస్‍ 1 ఆఫీసర్లు, ఇంజనీర్లు, డాక్టర్లు కలసి పనిచేసినారు. ఎక్కడా హోదాకు లేదా ప్రోటోకాల్‍ కు సంభందించిన అంశాలు కలసి పని చేయడానికి అడ్డంకి కాలేదు. ఉద్యమానంతరం కాలంలో కూడా ఈ సోదర భావం కొనసాగాలి. అందరం సమానమే అన్న ఈ విలువను తెలంగాణ సమాజం నిలబెట్టుకోవాలి.


అట్లనే తెలంగాణ జెఏసి ఇచ్చిన పిలుపు రోడ్లపై వంటా వార్పు కార్యక్రమం కూడా గ్రామాల్లో ప్రజలను కుల మతాలకు అతీతంగా ఐక్యం చేసింది. బడుల్లో పిల్లలకు పగటిపూట భోజనం దళిత మహిళలు వండితే తిరస్కరించిన సందర్భాలు తెలంగాణలో ఎన్నో ఉన్నాయి. అయితే వంటా వార్పు కార్యక్రమంలో ఈ బేధ భావాలు మర్చిపోయి ప్రజలందరూ కలసి వండుకున్నారు, కలసి సహపంక్తి భోజనాలు చేసినారు. తెలంగాణ పబ్లిక్‍ సర్వీస్‍ కమీషన్‍ మాజీ చైర్మన్‍ ప్రొ. ఘంటా చక్రపాణి గారు నాతో పంచుకున్నతన అనుభవాన్ని ఇక్కడ ప్రస్తావించదలచాను. షామీర్‍ పేట వద్ద రహదారి మీద గ్రామస్తులు అందరూ కలసి వంటా – వార్పు కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కొందరు కూరగాయలు తరుగుతున్నారు. కొందరు అన్నం వండుతున్నారు. అన్నం వండుతున్న వ్యక్తిని ‘‘మీరేమిటోల్లే ?’’ అని చక్రపాణి గారు అడిగితే ‘‘మేము హరిజనులం సార్‍’’ అని చెప్పిండట. ‘‘మీరు వండితే రెడ్డోల్లు, కాపోల్లు తింటరానే’’ అని సార్‍ మరో ప్రశ్న. ‘‘ఉత్తప్పుడు తినరు గాని ఇప్పుడు తింటరు సార్‍’’ అని ఆయన జవాబు. ఉద్యమంలో ఇటువంటి ద•శ్యాలు సాధారణమైనవే. మనుషులు వాళ్ళే. కానీ సందర్భం వేరు అయినప్పుడు వారి వ్యవహారంలో మార్పు ఎందుకు చోటు చేసుకుంటుంది?
ఉద్యమం మనిషిని డి క్లాసిఫై చేస్తుంది. ఉద్యమానంతరం కూడా ఈ విలువను తెలంగాణ సమాజం నిలుపుకోవాలి. అప్పుడు మాత్రమే
ఉద్యమానికి నిజమైన సాఫల్యత. తెలంగాణలో సామాజిక న్యాయానికి గట్టి పునాది పడుతుంది. ఇది అనుకున్నంత సులువైనదేమి కాదు. ఒక్క రోజుతో సాధించేది కాదు. నిరంతరంగా ఈ భావన, ఈ ఉద్యమ స్పూర్తి ప్రవాహంలాగా కొనసాగాలి. ఉద్యమ శ్రేణులు ఆ విలువను కొనసాగించడానికి క•షి చెయ్యవలసి ఉన్నది. పదేళ్ళ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమం సాధించిన విలువలు, జాతి భావన ఇంకా కొనసాగుతున్నాయా? అన్న అంశాన్ని తెలంగాణ బుద్దిజీవులు మధింపు వేయాల్సిన సందర్భం ఇది. (తెలంగాణ రాష్ట్రం సిద్దించి పదేండ్లు గడచిన సందర్భంగా..)

  • శ్రీధర్‍రావ్‍ దేశ్‍పాండే,
    ఎ : 94910 60585

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *