సాహిత్యం న్యాయమూర్తులకి కూడా..


న్యాయవాదులకి, న్యాయమూర్తులకి చట్టం శాసనాలు తెలిస్తే సరిపోదు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలియాలి. సాహిత్యం తెలియాలి. సంస్క•తి, తత్వశాస్త్రం, చరిత్ర, సామాజిక జీవనం కూడా తెలియాలి. ఇవి అన్నీ తెలిసినప్పుడే వారు సరైన తీర్పులని వెలువరించగలరు. చట్టం, సాహిత్యం రెండు వేర్వేరు సబ్జెక్టులుగా కనిపిస్తాయి. కానీ రెండింటికి అవినావభావ సంబంధం ఉంది. చట్టం అనేది సమాజాన్ని నియంత్రించే నియమాలు నిబంధనల గురించి చెబుతుంది. సాహిత్యం అనేది సమాజం గురించి అదే విధంగా సమాజంలోని వ్యక్తులని కళాత్మకంగా వ్యక్తీకరించే ఒక రూపం.


సాహిత్యం తరుచుగా సాంస్క•తిక, సామాజిక, రాజకీయ విలువలని, నిర్దిష్ట సమయంలో ఎలా వున్నాయన్న విషయాలని మనకి చూపిస్తుంది. చరిత్రలో కనిపించని జీవన విధానం వునికి సాహిత్యంలో కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా కథల్లో, నవలల్లో, నాటికల్లో ఇవి ప్రస్ఫుటంగా కన్పిస్తాయి. విలియమ్‍ షేక్స్ఫియర్‍ రాసిన ‘ది మర్చంట్‍ ఆఫ్‍ వెన్సీస్‍’, మేజర్‍ ఫర్‍ మేజర్‍ వంటి నాటికలు అప్పటి ఇంగ్లాండ్‍లోని న్యాయవ్యవస్థని ప్రతిబింబిస్తాయి. అప్పటి న్యాయ పాలన చక్రవర్తి శక్తి, న్యాయవ్యవస్థ పాత్ర ఈ నవలలు చదివితే మనకు అర్ధమవుతుంది.


అదే విధంగా ‘‘ఫ్రైడ్‍ అండ్‍ ప్రిజుడీస్‍’’ వంటి రచనల ద్వారా 19వ శతాబ్దంలో స్త్రీలు ఎదుర్కొంటున్న చట్టపరమైన విషయాలు, సామాజిక పరిమితలు మనకు కన్పిస్తాయి. సాహిత్యం అనేది చట్టం మీద విమర్శగా కూడా ఉపయోగపడుతుంది. చట్టంలోని లోపాలను పరిమితులను సాహిత్యం ఎత్తి చూపుతుంది. న్యాయం అసమానత, అధికార దుర్వినియోగం వంటి ఇతివృత్తాల మీద ఎన్నో రచనలు వచ్చాయి. చార్మస్‍ డికెన్స్ రాసిన బ్లీక్‍ హేవుస్‍లో చాన్సరీ కోర్టులో జరిగే సుదీర్ఘమైన, ఖరీదైన చట్టపరమైన పక్రియను, ఆ కోర్టుల్లో జరుగుతున్న అవినీతిని వ్యంగ్యంగా చూపించాడు.
కోర్టుల్లో బహిరంగంగా విమర్శ చేయలేని విషయాలని సాహిత్యంలో చేయడానికి అవకాశం వుంటుంది. ఈ పనిని ఇంగ్లీషనులో సాహిత్య సృజన చేసే రచయితలే కాదు, తెలుగు వాళ్ళు కూడా చేశారు. తమ రచనల్లో కోర్టులని నిశితంగా విమర్శించారు.


‘ఎవరి కోసం’ అన్న కథలో కోర్టులు ఎవరి కోసం వున్నాయన్న విషయాన్ని రచయిత ఆ కథలోని పాత్రల ద్వారా చెప్పిస్తాడు. కథలోని విషయానికి వస్తే ఉస్మానియా ఆర్టస్ కాలేజీ ముందు ప్రవీణ్‍ అతని మిత్రులు ధర్నా చేస్తారు. పోలీసులతో మాటా మాటా పెరుగుతుంది. దానితో పోలీసులు ప్రవీణ్‍ మీద అతని స్నేహితుల మీద క్రిమినల్‍ కేసుని పెడతారు. అది పెద్ద సీరియస్‍ నేరం కాదు. బెయిల్‍ తీసుకోవడానికి అవసరమైన అన్ని చర్యలని ప్రవీణ్‍ తీసుకుంటాడు. పోలీసులు ఒక వేళ అరెస్టు చేస్తే, మెజిస్ట్రేట్‍ని బెయిల్‍ ఇవ్వమని కోరాలని అనుకుంటాడు. అతని న్యాయవాది కూడా అదే సలహా ఇస్తాడు. జామీన్‍ కాగితాలని కూడా తయారు చేసుకుంటాడు.


శుక్రవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో ప్రవీణ్‍ని అతని స్నేహితులు నలుగురిని పోలీసులు అరెస్టు చేస్తాడు. ఆ తరువాత రాత్రి పదకొండు గంటల ప్రాంతంలో మారేడ్‍పల్లలో వున్న మేజిస్ట్రేట్‍ ముందు హాజరు పరుస్తారు. రిమాండ్‍ చేసే ముందు రొటీన్‍గా అడిగే ప్రశ్నలను మేజిస్ట్రేట్‍ వాళ్ళని అడుగుతాడు. పోలీసులు కొట్టినారా? ఆ తరువాత వాళ్ళని రిమాండ్‍ చేయడానికి ఉద్యుక్తుడవుతాడు. అది గమనించి ప్రవీణ్‍ తమకు బెయిల్‍ ఇవ్వండని మేజిస్ట్రేన్‍ను కోరతాడు. ‘ఈ రాత్రి బెయిలా’ అని మేజిస్ట్రేట్‍ అతని వైపు వింతగా చూస్తాడు. ఇద్దరి మధ్య కొంత సంభాషణ జరుగుతుంది. సోమవారం రోజు కోర్టులో బెయిల్‍ దరఖాస్తు పెట్టుకోవాలని మేజిస్ట్రేట్‍ అతనితో అంటాడు. దానితో ప్రవీణ్‍కి ఆవేశం ముంచుకొస్తుంది. అతను మేజిస్ట్రేట్‍తో ఇలా అంటాడు.


‘అవును సార్‍! బెయిల్‍ అడుగుతున్నాను. సెలవు రోజుల్లో ఆర్నాబ్‍ గోస్వామికి సుప్రీంకోర్టు రిట్‍ పిటీషన్‍ విచారిస్తూ బెయిల్‍ మంజూరు చేయగా లేనిది, అదే విధంగా నారాయణ విద్యాసంస్థల యజమాని నారాయణని రాత్రిపూట మేజిస్ట్రేట్‍ బెయిల్‍ మంజూరు చేయగా లేనిది మాకు బెయిల్‍ ఇస్తే తప్పేమిటీ? మేమేమీ హత్యలాంటి ఘోరమైన నేరం చేయలేదు. ధర్నా చేసాం అంతే!’ అంటాడు.
అతని మాటలతో మేజిస్ట్రేట్‍ కొంత ఆలోచనల్లో పడతాడు. కానీ బెయిల్‍ దరఖాస్తుని అతని నుంచి స్వీకరించడు. అతని న్యాయవాది కోసం వేచి వుండడు పోలీసులు ప్రవీణ్‍ని, అతని స్నేహితులని తీసుకొని బయ•కు వెళ్తారు.


ఇక్కడితో కథ అయిపోదు. మేజిస్ట్రేట్‍ మనస్సులో ఏముందో రచయిత చెబుతాడు. మేజిస్ట్రేట్‍ మనస్సులో ఇలా అనుకుంటాడు. ‘మీరేమి ఆర్నాబ్‍ గోస్వాములు కాదు, నారాయణ కూడా కాదు.
పోలీసులు, కోర్టులు ఎవరికోసం వున్నాయో ప్రవీణ్‍కి, అతని మిత్రులకి అర్థమవుతాయి.
చట్టం అనేది సాహిత్యంలో చోటు చేసుకుంటుంది. చట్టపరమైన విషయాలు కూడా సాహిత్యంలో భాగమవుతాయి. తెలుగు కథ మామూలుగా నడుస్తుంది. కానీ న్యాయవ్యవస్థ తీరుతెన్నులని బహిర్గత పరుస్తుంది. కోర్టులు, చట్టాలు, పోలీసులు ఎవరి కోసం వున్నాయో చెబుతుంది. పలుకుబడి, అధికారం, డబ్బూ వున్న వ్యక్తుల కోసమో కోర్టులు పని చేస్తున్నాయన్న విషయాన్ని బట్టబయలు చేస్తుంది. మేజిస్ట్రేట్‍ కోర్టు దగ్గర నుంచి సుప్రీంకోర్టు దాకా కోర్టులు వాళ్ళ కోసమే పని చేస్తున్నాయన్న విషయాన్ని నాలుగు మాటల ద్వారా చెబుతుంది. అంతే కాదు, న్యాయమూర్తుల గురించి కూడా చెబుతుంది. న్యాయమూర్తుల వైఖరులని చర్చించడానికి ఇది ఉపయోగపడుతుంది.


చివరికి చెప్పేది ఏమంటే సాహిత్యానికి, చట్టానికి సంక్లిష్టమైన సంబంధం వుంది. చట్టంలోని లోపాలను పరిమితులని సాహిత్యం విమర్శిస్తుంది. వ్యాసానికి, సాహిత్యానికి భేదం వుంది. వ్యాసంలో జీవన విధానం మానసిక పరిశీలన, సంఘర్షణ కన్పించదు. కథలో నవలలో అది కన్పిస్తుంది. సాహిత్య అధ్యయనం ద్వారా సమాజ స్వభావం తెలుసు కోవడానికి వీలు చిక్కుతుంది. సాహిత్యంలో చట్టం వుండటం వల్ల ఫలప్రదమైన దృక్పథం ఏర్పడుతుంది.


న్యాయమూర్తికి చట్టం మాత్రమే తెలిస్తే సరిపోదు. సాహిత్యం తెలియాలి. మానవ భావోద్వేగాలు తెలియాలి. అవి తెలియ డానికి అతని అనుభవమే కాదు సాహిత్యం దోహద పడుతుంది. సాహిత్యం మాత్రమే కాదు చరిత్ర తెలియాలి, భావ్యం తెలియాలి. న్యాయమూర్తికే కాదు, న్యాయవాదులకి ఈ విషయాలు తెలియాలి. అపు•డే సరైన న్యాయం జరిగే అవకాశం వుంది.

-మంగారి రాజేందర్‍ (జింబో)
ఎ : 9440483001

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *