సర్వీస్‍ కమిషన్లు – తప్పిదాలు


ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న గ్రూప్‍ 1 పరీక్షలను టీఎస్‍పీఎస్‍సీ ద్వారా జూన్‍ నెలలో నిర్వహించనున్నారు. ఈ పరీక్ష రిక్రూట్‍మెంట్‍ ఇంతకు ముందు వివాదానికి గురై, హైకోర్టు ఆదేశాల మేరకు రద్దు అయిన విషయం పాఠకులకు తెలిసిందే. గతంలో కూడా ఉమ్మడి రాష్ట్ర సర్వీస్‍ కమిషన్‍లో కూడా ఇటువంటి సంఘటనలు జరిగాయి. దీంతో వాటి కూర్పు, పనితీరుపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ అంశం మన సమాజానికి సామాజిక మూలధనాన్ని ఏర్పరిచే యువత ఆశలు, ఆకాంక్షలకు సంబంధించింది. కాబట్టి సమస్యను ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే పరిష్కరించాల్సిన అవసరం ఉంది.


యూనియన్‍, రాష్ట్ర పబ్లిక్‍ సర్వీస్‍ కమీషన్లకు మూలాలు రాజ్యాంగంలోని 315-323 ఆర్టికల్స్లో ఉన్నాయి. ప్రభుత్వం సంకల్పించిన అభివ•ద్ధి, సంక్షేమ ఎజెండాను రూపుదిద్దడానికి, అందించడానికి పారదర్శక పద్ధతిలో ప్రతిభా వంతులైన యువతను ప్రజా సేవ కోసం ఉపయోగించుకోవడం కోసం అటువంటి ఏజెన్సీని ఏర్పాటు చేయాలనుకోవడమే దీనికి కారణం. ఉద్యోగ ఆవశ్యకతలతో సరితూగే అభ్యర్థులతో వాటిని భర్తీ చేసేందుకు తగిన పరీక్షా విధానం ద్వారా పబ్లిక్‍ సర్వీసెస్‍ కోసం దరఖాస్తుదారులు ఎంపిక అవుతారు. దీని ప్రకారం పరీక్షల స్కీమ్‍ లను ప్రభుత్వం రూపొందిస్తుంది. అవి సర్వీస్‍ కమిషన్‍ ద్వారా అమలు చేయబడుతాయి. ఇటీవలి కాలంలో కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు రిక్రూట్‍మెంట్‍ చేయదల్చిన ఉద్యోగాల ప్రయోజనం లేదా అవసరాన్ని తీర్చ లేని విధంగా స్కీమ్‍ లను సవరిస్తున్నాయి. ఉదాహరణకు, తెలంగాణ రాష్ట్ర గ్రూప్‍ ×× పరీక్ష స్కీమ్‍లో దరఖాస్తు దారుల రాత సామర్థ్యాలను పరీక్షించే వివరణాత్మక ప్రశ్నలకు సంబంధించిన పరీక్ష (లు) లేదు(వు). వివిధ విభాగాలలో ఈ ఉద్యోగాలకు రిక్రూట్‍ అయ్యే వ్యక్తులు పాక్షిక-న్యాయ విధులను నిర్వర్తించాలి. కార్యనిర్వాహక ఉత్తర్వులను ఆమోదించాలి. అందుకు రాత నైపుణ్యాలు అవసరం.


అటువంటి నైపుణ్యం అభ్యర్థులకు ఉందో లేదో పరీక్షించడం లేదు. అలాంటి ఆవశ్యకతను పరీక్షించకుండానే నియామకం చేయడం భవిష్యత్‍లో పాలనాపరమైన లొసుగులకు దారి తీసే వీలు కల్పిస్తుంది. అదేవిధంగా, గ్రూప్‍ 1 పరీక్ష నోటిఫికేషన్‍ చూసినట్లుగా, పరీక్షా స్కీమ్‍లో ఇంటర్వ్యూ ఒక భాగంగా లేదు. పారదర్శకతకు పెద్ద పీట వేస్తూ గత ప్రభుత్వం ఇంటర్వ్యూలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. కొన్ని విధులను నిర్వర్తించ డానికి సభ్యులను ఎంపిక చేసి నియమించే ప్రభుత్వం వారిపై విశ్వాసం ఉంచకపోవడమే కాకుండా వారి చిత్త శుద్ధిని శంకించడం ఇక్కడ గమనార్హం! రాష్ట్ర స్థాయి పరీక్షల కోసం ఇంటర్వ్యూను రద్దు చేస్తూ ప్రభుత్వం తీసు కున్న ఈ నిర్ణయం వారి (సభ్యుల) అర్హతలు, యోగ్యతను ప్రశ్నిస్తూ రాష్ట్ర హైకోర్టులో దాఖలైన కేసు నేపథ్యంలో కూడా తీసుకున్నట్లు చెబుతున్నారు. ప్రతిభావంత యువతను ప్రజాసేవలో శ్రేష్ఠమైన విధుల కోసం నియ మించాలని ఉద్దేశించిన రాజ్యాంగ సంస్థలోని సభ్యులను యోగ్యత, అర్హత లేని సాధారణ పద్ధతిలో ఎంపిక చేస్తున్నారని అనడం ఓ రాజ్యాంగ సంస్థతో వ్యవహరించే తీరుపై విచారకరమైన వ్యాఖ్యానం.


సాధారణ అడ్మినిస్ట్రేటివ్‍ సర్వీసెస్‍కు సంబంధించిన పరీక్ష స్కీమ్‍, సిలబస్‍ విషయానికొస్తే, ఇప్పటికే ఉన్న దాన్ని నేటి కాలానికి అనుగుణంగా ఉండేలా పునఃసమీక్షించడం, పునరుద్ధరించడం అత్యవసరం. యూపీఎస్సీ సివిల్‍ సర్వీసెస్‍ పరీక్షకు సన్నద్ధత కోసం దరఖాస్తుదారుల వనరుల సద్వినియోగాన్ని గరిష్ఠం చేయడానికి, ఎంపిక అవకా శాలను పెంచే ఉద్దేశ్యంతో దీనిని యూపీఎస్సీకి బాగా అనుగుణంగా ఉండేలా చేయాలని కమి షన్‍ ఏర్పాటు చేసిన ఒక కమిటీ సిఫార్సు చేసింది. ఈ నివేదిక కూడా మిగితా అన్ని సిఫారసుల మాదిరిగానే ఏ బీరువాలోనైనా బయటకు రాకుండా భద్రంగా మూలుగుతుండవచ్చు.


రాష్ట్ర పబ్లిక్‍ సర్వీస్‍ కమిషన్‍ ను ప్రారంభం నుంచి కూడా సిబ్బంది కొరత వేధిస్తోంది. దాని సామర్థ్యం ఆశించిన స్థాయిలో లేకపోవడానికి బహుశా ఇది కూడా ఒక కారణం కావచ్చు. గ్రూప్‍ 1 పేపర్‍ లీక్‍ దురద•ష్టకర ఎపిసోడ్‍ దీని బలహీనతలను బహిర్గతం చేసింది. సిబ్బంది, పర్యవేక్షక ఉద్యోగుల పాత్రలు, బాధ్యతల గురించి ప్రశ్నలను లేవనెత్తింది. తనిఖీలు, విజిలెన్స్ అనేవి లేకుండా నమ్మకం ఆధారంగానే పనులు కొనసాగాయి.
కమిషన్‍ ఆర్థిక స్వయంప్రతిపత్తి గురించి పెద్దగా చెప్పాల్సింది ఏమీ లేదు. అది ప్రభుత్వ శాఖ హోదాకు తగ్గించబడింది. ప్రతీ చిన్న విషయానికి కమిషన్‍ ప్రభుత్వంపై ఆధారపడాల్సి వస్తోంది. చిన్న పని కావాలంటే కూడా ప్రభుత్వ యంత్రాంగంతో రకరకాలుగా సంప్రదించాల్సి వస్తోంది. అలాంటప్పుడు అంతిమ ఫలితాలు ఎలా ఉంటాయో ఎవరైనా సులభంగా ఊహించుకోవచ్చు.


చాలా కాలంగా రిక్రూట్‍మెంట్‍ క్యాలెండర్‍ కోసం ఉత్కంఠ నెలకొంది. ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఇస్తున్న హామీలు అమలు కావడం లేదు.
రాష్ట్ర అడ్మినిస్ట్రేటివ్‍ సర్వీసెస్‍ కోసం రిక్రూట్‍మెంట్‍తో పాటు, వివిధ సాంకేతిక సేవల కోసం కూడా సిబ్బందిని కమిషన్‍ నియమిస్తుంది. అయితే అటువంటి ఉద్యోగాల కోసం సిబ్బందిని నియమించుకోవడానికి ప్రత్యేక బోర్డులు, ఏజెన్సీలను ఏర్పాటు చేసే ధోరణి ఇటీవలి కాలంలో పెరుగుతోంది. చాలా కాలంగా పోలీస్‍ డిపార్ట్ మెంట్‍ సిబ్బందిని, అధికారులను నియమించడానికి తన స్వంత బోర్డుని కలిగి ఉంది.


వైద్య నిపుణుల కోసం లేదంటే కళాశాలలు, విశ్వవిద్యాలయాలలో విద్యావేత్తల కోసం కోసం వాటి సొంత నియా మక ఏర్పాట్లు ఉన్నాయి. స్పెషలైజేషన్‍, రిక్రూట్‍మెంట్‍ వేగం ఆధారంగా అటువంటి ప్రత్యేక సంస్థల ఏర్పాటు ను కొందరు సమర్థిస్తున్నాయి. అయితే, అటువంటి ప్రత్యేక ఏజెన్సీల కూర్పు కూడా పరిశీలించాల్సి ఉంటుంది. అటువంటి ఏజెన్సీల విస్తరణ రాజ్యాంగంలో పేర్కొన్న రిక్రూట్‍మెంట్‍ మూలాన్ని, లక్ష్యాన్ని తగ్గించింది. రాజ్యాంగ స్ఫూర్తికి అనుగుణంగా ఈ రాజ్యాంగ సంస్థను ఏర్పాటు చేయాలి తప్పితే ఏదో హోదా అందించాలనే ఉద్దేశంతో కాదు. ఆ విధానమే ఈ సమస్యకు మూలంగా మారింది.


మొత్తానికి ప్రభుత్వం వీటిని సవరించే వీలుంది:
  1. సాధారణ అడ్మినిస్ట్రేషన్‍ సర్వీసెస్‍కు సంబంధించి పరీక్షల స్కీమ్‍, సిలబస్‍ను యూపీఎస్సీకి అనుగుణంగా తీర్చిదిద్దడాన్ని పునఃపరిశీ లించడం.
  2. ప్రతిభ, అర్హత, సమగ్రత ఆధారంగా కమిషన్‍ (చైర్మన్‍ & సభ్యులు) ఎంపిక, నియామకాన్ని బలోపేతం చేయడం
  3. పాత్రలు, బాధ్యతలను స్పష్టంగా నిర్వచించే నిబంధనలను రూపొందించడం
  4. ఆర్థిక స్వయంప్రతిపత్తి, అవసరమైన సిబ్బంది సంఖ్యను నిర్ధారించడం.


ప్రస్తుత ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించడంతోపాటు క్యాలెండర్‍ను రూపొందించాలనే ఉద్దేశంతో ఉంటూ ప్రభుత్వ ఉద్యోగాలు కోరుకుంటున్న వారిలో ఆశలు రేకెత్తిస్తోంది. మరి ఈ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం నడుస్తుందో లేదో చూడాలి.

తడకమల్ల వివేక్‍,
టీఎస్‍ పీఎస్సీ మాజీ సభ్యుడు
ఎ : 9391099727

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *