అక్షరాస్యత కాదు విద్యాగంధం సైతం అంతంత మాత్రంగా వున్న తెలంగాణ జనపదంలో పుట్టి జానపదుల మాట, ఆట, పాటల బడిలో పెరిగి ఇంతింతై విరాణ్మూర్తిగా ఎదిగి జ్ఞానపీఠాన్ని అధిరోహించినవాడు డా. సి. నారాయణరెడ్డి. ఆయన జీవనగాథ స్ఫూర్తిదాయకమైంది. ఆయన డిచి వచ్చినదారి కవితాకర్పూర కళికలమయమైంది.
1931 జులై 29న కరీంనగర్ జిల్లా సిరిసిల్లా తాలూకా హనుమాజీ పేటలో నారాయణరెడ్డి జన్మించారు. తల్లిదండ్రులు బుచ్చమ్మ, సింగిరెడ్డి మల్లారెడ్డి.
ఖాన్గీబడిలో అక్షరాలు దిద్దుకొని, సిరిసిల్లలో మాధ్యమిక విద్య, కరీంనగర్లో ఉన్నత పాఠశాల విద్య, అనంతరం, హైదరాబాద్ చాదర్‌ఘాట్ కళాశాలలో ఇంటర్, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బి.ఎ, ఎం.ఎ, పూర్తి చేశారు. నారాయణరెడ్డి పాఠశాలలో చదువు తున్నప్పుడే నిజాం వ్యతిరేకపోరాటంలో పాల్గొన్నారు. సత్యాగ్రహం చేశారు. ‘సైనికులం మేం సైనికులం’ అని పాటలు పాడుతూ ఊరేగింపులో పాల్గొన్నారు. ‘క్విట్ స్కూల్’ ఉద్యమంలో పాఠశాల కొంతకాలం మానేశారు.
సాహిత్య వాతావరణంలేని కుటుంబ నేపథ్యంలో జన్మించినా, ఉర్దూ మాధ్యమంలో డిగ్రీవరకు విద్యాభ్యాసం చేసినా తెలుగుమూర్తిగా వికసించిన సినారె ఒక అసాధారణ ప్రతిభాశాలి. చిన్నప్పుడు పల్లెప్రజల నిసర్గసుందరమైన సంభాషణారీతి, జానపద కళారూపాలు నారాయణరెడ్డిని భాషా సాంస్క•తిక వ్యక్తిత్వాన్ని మలిచాయి. 6,7 తరగతుల్లో వున్నప్పుడే భక్తప్రహ్లాద, సీతాపహరణం, రఘుదేవ రాజకీయం వంటి నాటికలు రాసి మిత్రులతో కలిసి ప్రదర్శించేవారు. ‘ఒకనాడు ఒక నక్క ఒక అడివిలోపల’ అంటూ సీసపద్యం రాస్తే ఉపాధ్యాయుడు ధూపాటి వెంకటరమణా చార్యులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మరికొన్ని మెలకువలు చెప్పారు. ఇంటర్మీడియెట్‌లో ఉండగా జువ్వాడి గౌతమరావు ‘జనశక్తి’ పత్రికలో తొలికవిత ప్రచురితమైంది. బి.ఎ.లో ఉండగా పాములపర్తి సదాశివరావు సంపాదకత్వంలో వెలువడే కాకతీయ పత్రికలో రచనలు ప్రచురితమయ్యాయి. ఇది 1950కి ముందే జరిగింది.
21 ఏళ్ళ వసులో నారాయణరెడ్డి రేడియతో అనుబంధం ఏర్పడింది. 1952లో బి.ఎ. విద్యార్థిగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యాభ్యాసం చేస్తున్నప్పుడు హైదరాబాద్‌లో ఖైరతాబాద్‌లో వున్న దక్కన్ రేడియోలో ప్రసారమైన ‘సాగుమా ఓ నీలమేఘమా గగనవీణా మృదు రావమా’ అన్న గీతం నారాయణరెడ్డి పరిణత కవిగా ఎదిగేదశలో తొలిమెట్టుగా నిలిచింది. ‘పూలపాటలు’, ‘చిరుగజ్జెలు’ ఉపద్రేష్ట కృష్ణమూర్తి సంగీత దర్శకత్వంలో రూపొంది ప్రసారమయ్యాయి. ‘నవ్వనిపువ్వు’ గేయనాటిక ప్రసారమైంది. బుచ్చిబాబుగారు ప్రత్యేకంగా రాయించిన ‘అజంతా సుందరి’, ఆ తర్వాత ‘రామప్ప’ సంగీతరూపకం ఆకాశవాణి జాతీయ పోటీల్లో ప్రథమ బహుమతి తెచ్చి పెట్టింది. 12 భాషల్లోకి అనువాదమైంది.
ఇంటర్ రెండో సంవత్సరంలో ఉండగా రెడ్డి హాస్టల్లో జరిగిన అఖిలాంధ్ర కవి సమ్మేళనంలో విద్యార్థి కవిగా వానమామలై, దాశరథి, తల్లావఝుల, కృష్ణశాస్త్రి, జాషువా తదితర అగశ్రేణి కవుల సరసన పాల్గొన్నారు సినారె. దాశరథితో పరిచయం అదే తొలిసారి. అది మొదలు దాశరథి ప్రోత్సాహం తనను మనుముందుకు నడిపించిందని చెప్పుకున్నారు సినారె. ఆ సోదరప్రేమకు గుర్తుగా ‘జలపాతం’ కవితాసంపుటిని దాశరథికి అంకితం చేశారు.
1952లో బి.ఏ. ఫైనల్ విద్యార్థిగా వున్నప్పుడే తెలంగాణ రచయితల సంఘాన్ని స్థాపించి కార్యదర్శిగా వున్నారు. సంఘానికి తర్వాత అధ్యక్షుడయ్యారు. తెలంగాణ జిల్లాల్లో అంతటా పర్యటించి కవితా పఠనాలు, కవితాత్మక ప్రసంగాలు చేసి ఆనాడే ఈ ప్రాంతంలో కవితా చైతన్యాన్ని పెంపొందించేందుకు కృషి చేశారు సినారె.
బి.ఏ, ఎం.ఏ. పూర్తి చేసి సికింద్రాబాద్ ఆర్టస్ అండ్ సైన్స్ కళాశాలలో తెలుగు అధ్యాపకునిగా ప్రవేశించారు. తర్వాత నిజాం కళాశాలలో, ఆ తర్వాత ఆర్టస్ కళాశాలలో ఆచార్యత్వం, తనకు సాహిత్య విద్యనేర్పిన గురువులు కె. గోపాలకృష్ణారావు, దివాకర్ల వేంకటావధానితో కలిసి ఆచార్యులుగా పనిచేసిన అరుదైన ఖ్యాతి సినారెకు ఆనాడే దక్కింది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో డిగ్రీ తరగతులకు కూడా తెలుగు పాఠాలు చెప్పారు. ఈ రోజుల్లో డిగ్రీలో ఇతర అధ్యయనాంశాలు చదువుతున్న విద్యార్థులు సైతం సినారె పాఠాలు వినేందుకు గుంపులు గుంపులుగా వచ్చేవారు. ప్రాచీన, ఆధునిక సాహిత్యంలో ఏ పాఠం చెప్పినా అది విద్యార్థుల పాలిట కళాప్రదర్శనగా ఉండేది. పాఠం చెప్పడానికి అన్ని విధాలా సిద్ధమైపోవడం, సమయానికి తరగతి గదిలో ప్రవేశించడం, అనర్గళంగా గంటన్నరసేపు పాఠం చెప్పడం, తనకిచ్చిన వ్యవది పూరత్వతుండగానే గది నుంచి నిష్క్రమించడం అదంతా ఒక మరువలేని అనుభవం. ఆయన పాఠాలు విన్న మధురానుభవాన్ని ఈనాటికీ గుర్తుచేసుకొనే విద్యార్థులెందరో! ఖండవల్లి లక్ష్మీరంజనం పర్యవేక్షణలో ‘ఆధునికాంధ్ర కవిత్వము – సంప్రదాయములు – ప్రయోగములు’ అన్న అంశంపై పీ.హెచ్.డి. చేశారు.
1961లో సినీ గీతరచన ప్రారంభమైంది. హైదరాబాద్ సారథీ స్టూడియోలో ఒక సినిమా చిత్రీకరణలో వున్న నందమూరి తారకరామారావు సినారెతో ప్రస్తావన చేశారు. అప్పటికే తాన రాసిన పాటల్ని ఎన్టీఆర్‌కు వినిపించారు. తొలిచిత్రంలో అన్ని పాటలు తనవే ఉండాలన్న కోరికను వ్యక్తపరిచారు. పాటలు రాసేందుకు మద్రాసు రైల్లో వెళ్లిన సినారెను ఎన్టీఆర్ స్వయంగా స్టేషన్లఓ స్వాగతించారు. తొలుత రాసిన పాట ‘కలల అలలపై తేలెను’. కాని తొలుత రికార్డయ్యింది ‘‘నన్ను దోచుకుందువటె వన్నెల దొరసాని’, ఎన్టీఆర్, జమునలపై చిత్రీకరించారు. నాటి నుంచి ఎన్టీఆర్‌తో గీతానుబంధం, గాఢమైన స్నేహానుబంధం. ఎన్టీఆర్ చివరి దశవరకూ అవిచ్ఛిన్నంగా కొనసాగింది. 1961 నుండి 1990 వరకు డా. సి. నారాయణరెడ్డి సినీగీత రచన ఒక స్వర్ణయుగం. ప్రాచీనాధునిక కవిత్వధ్వయనానుభవం వల్ల సినారె ప్రతిపాటలో తన కవిత్వముద్రను నిలిపారు. పేర్కొనదగ్గ పాటలు ఎన్నో! మొత్తం సుమారు 3వేల పాటలు రాశారు.
నిజానికి సినీ గీతరచన సినారె బహుముఖప్రజ్ఞల్లో ఒక పార్శ్వం మాత్రమే. తను ఎదుగుతున్న నాటికే తెలుగు కవితా రంగంలో ఎందరో గొప్పగొప్ప కవులున్నారు. అప్పటికే అగ్రకవులతో పోటీపడుతూ పద్యకృతులు, గేయకృతులు వెలువరిస్తున్నా ఏదో మథనం జరిగింది. ఆయనలో ఏదో ప్రత్యేకత సాధించాలి అనుకున్నారు. అంతే ప్రౌఢతరమైన పద్కఈతికి తుల్యంగా కథాత్మక గేయకావ్యం ‘నాగార్జున సాగరం’ రాశారు. రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ వంటి విద్వన్మణుల ప్రశంసలు లభించాయి. తర్వాత ‘కర్పూర వసంత రాయలు’ రాశారు. దేశవిదేశాల్లో కావ్యగానం చేశారు. నాటి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు ప్రత్యేకంగా షామంజిల్లో ‘నాగార్జునసాగరం’ కావ్యగానం ఏర్పాటు చేసి సత్కరించారు. మద్రాసులో అక్కినేని అధ్యక్షతన జరిగిన ‘కర్పూర వసంతరాయలు’ కావ్యగాన అద్భుత స్పందన కలిగించింది.
గేయకావ్యాలలోనే మహాకవి అనిపించుకున్న సినారె అంతటితో ఆగలేదు. భావ కవిత్వం, అభ్యుదయ కవిత్వం ప్రాబల్యం సాగుతున్న కాలంతో పోటీపడాలని నిర్ణయించుకొన్నారు. సృజన పౌరుషంతో వచన కవిత రచనను ఉద్ధ•తం చేశారు. ‘మంటలూ మానవుడు’, ‘తేజస్సు నా తప్పస్సు’, ‘అక్షరాల గవాక్షాలు’, ‘మధ్యతరగతి మందహాసం’. ‘విశ్వంభర’ ఇలా కవితాయాత్ర కొనసాగింది. భారతీయ సాహిత్యంలో అత్యున్నతమైన జ్ఞానపీఠ పురస్కారం ‘విశ్వంభర’కు లభించింది. ఆదిమకాలం నుంచి ఆధునిక కాలం దాకా సాగిన మానవ విజయ మహేతిసం విశ్వంభర.
పద్యం, గేయం, వచన కావ్యాలు, నాటికలు, గజళ్ళు, ముక్తకాలు, అనువాదాలు, విమర్శ, పరిశోధన, బుర్రకథ, యాత్రాసాహిత్యం, ఇలా అనేక పక్రియల్లో 20వ శతాబ్దం నుండి 21వ శతాబ్దం దాకా విస్తరించి కాలంతోపాటే సాగుతూ వర్తమాన తరపు కవులతోనూ పోటీపడుతూ సాహితీ సృజన చేశారు సినారె. 86 ఏళ్ళ వయసు, 86 రచనల సొగసు ఆయనది.
కవితారచన ఒకవైపు, విశ్వవిద్యాలయ ఆచార్యత్వం ఒకవైపు, సినీ గీతరచన ఇంకోవైపు, సాహితీ సాంస్క•తిక సదస్సులో అద్భుత ప్రసంగ పరంపర మరోవైపు అన్నట్లుగా సాగుతున్న దశలో – 50వ పుట్టినరోజు అప్పటి ముఖ్యమంత్రి టి. అంజయ్య సినారెను అధికారభాషా సంఘానికి అధ్యక్షునిగా నియమిస్తున్నట్లు ప్రకటించారు. ఆచార్యత్వాన్ని అయిష్టంగా వదలవలసి వచ్చింది. పరిపాలనా పదవుల్లో సినారె దక్షతముద్ర ప్రారంభమైంది. ఆ తర్వాత ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. ఆంధప్రదేశ్ సార్వత్రిక విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షునిగా సినారెను గౌరవించారు. ఆ పదవీకాలం పూర్తికాగానే తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులుగా నియమించారు. తర్వాత సాంస్క•తిక మండలి అధ్యక్షులయ్యారు. భాషా సాంస్క•తిక సలహాదారులయ్యారు. కవులు, కళాకారుల తరపున రాష్ట్రపతిచేత రాజ్యసభ సభ్యులుగా నియమితులయ్యారు. కవితారచన కొనసాగిస్తూనే విద్యా సాంస్క•తిక సంస్థల పరిపాలనా పదవులనూ వెలిగించారు సినారె.
ఏడు దశాబ్దాల కవితా సృజనానుభవాన్ని పండించుకున్న మహాకవి. డా. సి.నారాయణరెడ్డి తెలంగాణ బిడ్డ కావడం గర్వకారణం. ఆంధప్రదేశ్ సాహిత్య అకాడమి, కేంద్ర సాహిత్య అకాడమి పురస్కారాలు అందుకున్నారు. మేరట్ విశ్వవిద్యాలయం, నాగార్జున, కాకతీయ, సార్వత్రిక విశ్వవిద్యాలయాలు గౌరవ డాక్టరేట్లు అందించాయి. ఆంధ్ర విశ్వవిద్యాలయం కళాప్రపూర్ణతో సత్కరించింది. సోవియెట్ల్యాండ్ నెహ్రూ అవార్డు, రాజాలక్ష్మీ అవార్డు, తెలుగు విశ్వవిద్యాలయ విశిష్టపురస్కారం, కేంద్రసాహిత్య అకాడమీ ఫెలో పురస్కారం.. వంటి ఎన్నో ప్రతిష్ఠాత్మక పురస్కారాలు, లెక్కలేనన్ని సత్కారాలు సినారెను గౌరవించాయి.
ఒక కవితలో ఆయన అన్న పంక్తులు…
‘‘అది తెలుగు కీర్తి… కదిలే కిరణమూర్తి.. సాగరాల్ దాటిపోయింరా…
నయాగరాల్ మీటవచ్చిందిరా…’’
ఈ మాటలు తెలుగు కవిత్వాకీర్తికి, తెలుగు వ్యక్తి కీర్తికి…
డా. సి.నా.రె. సాహితీ మూర్తికి, ఆయన వ్యక్తిత్వ కీర్తికీ వర్తిస్తాయి.
ఇంతటి మహోన్నత కవితామూర్తి తెలంగాణలో జన్మించడం గర్వకారణం.
(తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్క•తిక శాఖ ప్రచురించిన ‘తెలంగాణ తేజోమూర్తులు’ నుంచి)
(డా।। సి. నారాయణరెడ్డి జయంతి సందర్భంగా)
- డా।। జె. చెన్నయ్య,
ఎ : 94400 49323