ఉద్యోగరీత్యా, ఇతరత్రా రాజధాని నగరం ఢిల్లీలో స్థిరపడిన మాకు ఇక్కడ ఎండలు భరించడం అలవాటయిపోయింది. కానీ ఏప్రిల్ మాసం నుండే ఎండలు తమ తీవ్ర రూపాన్ని ప్రదర్శించగా, జూన్‍లో ఏదైనా హిల్ స్టేషన్‍లో గడపాలన్న కోరిక నాకు, మా వారికి కలిగింది. అదివరకు ఎన్నోసార్లు చూసిన షిమ్లా, ముస్సోరి, నైనిటాల్‍కి కాకుండా ఇంతవరకు చూడని క్రొత్త ప్రదేశానికి వెడదామన్న ఆలోచన కూడా వచ్చింది. కొంత పరిశోధన తర్వాత హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో, చంబా జిల్లాలో ఉన్న డల్హౌసీ వెడదామన్న నిర్ణయానికొచ్చాం!
ముందుగా మేం పాత ఢిల్లీలో ఉన్న సరైరోహిల్లా స్టేషన్‍లో రాత్రి సుమారు పదిన్నరకి ఢిల్లీ – ఉదయ్‍పూర్ ఎక్స్ప్రెస్ ఎక్కాం. రాత్రంతా రైల్లో ప్రయాణించి జూన్ 13 ఉదయం ఆరింటికి పంజాబ్ రాష్ట్రంలోని పఠాన్‍కోట్ కంటోన్మెంట్ స్టేషన్ చేరుకున్నాం. అక్కడ నుండి డల్హౌసీ వెళ్ళడానికి, ఆ తర్వాత మాతోనే ఉండి చూడదగ్గ ప్రదేశాలు చూపడానికి వీలుగా ఒక టాక్సీని మాట్లాడుకున్నాం. మా టాక్సీ డ్రైవర్ పేరు బిట్టూ.
డల్హౌసీ యాత్రా విశేషాలు వివరించే ముందుగా డల్హౌసీని కొంతలో కొంత పరిచయం చేస్తాను. ఇది సముద్ర తీరానికి సుమారు 2,000 మీటర్ల ఎత్తులో ఉంది. హిమాలయాలకు చెందిన ధౌలధార్ పర్వతశ్రేణికి పశ్చిమ దిశగా ఉన్న ఈ ప్రదేశాన్ని గవర్నర్ జనరల్ అయిన లార్డ్ డల్హౌసీ 1854లో వేసవి విడిదిగా ఏర్పరచినట్లు తెలుస్తుంది. ఆయన పేరుతో పిలవబడే ఈ డల్హౌసీ బ్రిటీషు సైనికులకు, ఆఫీసర్లకు ఎంతో ఇష్టమైన స్థలంగా ప్రసిద్ధి చెందింది. డల్హౌసీ చుట్టూతా మంచుతో కప్పబడిన పర్వతశ్రేణి మనకు కనబడి కన్నులవిందు చేస్తుంది. ఐదు కొండల మీద విస్తరించిన ఈ డల్హౌసీని దర్శించడానికి అనువైన సమయం మే నుంచి సెప్టెంబర్ వరకని చెప్తారు.
పఠాన్‍కోట్‍కి 83 కిలోమీటర్ల దూరంలో ఉన్న డల్హౌసీకి రెండున్నర గంటల్లో చేర్చాడు బిట్టూ. ఢిల్లీ ఎండల నుండి విముక్తి కోసం వచ్చిన మాకు డల్హౌసీలోని శీతల వాతావరణం ఆహ్లాద పరచింది. చుట్టూతా ఉన్న కొండల మీద పరచుకున్న పచ్చదనం, దూరంగా ఆకర్షించే మంచు పర్వతాలు మమ్మల్ని మైమరపించాయి. అన్నిచోట్ల కనబడే దేవదారు వ•క్షాలు, ఓక్ చెట్లు డల్హౌసీకి ఎంతో అందానిచ్చాయి. మాకు నచ్చిన మరో అంశం అక్కడ దారిలో కనబడిన స్కూళ్ళు, కన్నులకింపైన భవనాలతో, రంగురంగుల పూలచెట్లతో, శుచిగా, శుభ్రంగా ఉన్న పిల్లలతో మమ్మల్ని ఆకట్టుకున్నాయి.
మా టాక్సీ డ్రైవర్ పంజాబీ యువకుడు. వయస్సు సుమారు 25 సంవత్సరాలుంటుంది. తల్లిదండ్రులతో చండీఘర్‍లో ఉంటాడు. స్కూలుకి వెళ్ళే చెల్లెలు కూడా ఉంది. అతను మెట్రిక్ పాసయ్యాడు. ఆపైన చదవడంలో ఆసక్తి లేక మానేసాడు. తండ్రి ఏదో చిన్న వ్యాపారం చేస్తున్నాడు. తండ్రికి సాయంగా ఉండటానికి టాక్సీ నడుపుతున్నాడట! దారంతా ఎంతో ఉత్సాహంగా కబుర్లు చెప్పాడు. అతని వివరాలన్నీ మాటల సందర్భంలో ఆసక్తిగా తెలుసుకున్నాను. డల్హౌసీ తనకి ఎంతో పరిచయమున్న ఊరని, చూడవల్సిన ప్రదేశాలు చక్కగా చూపిస్తానని చెప్పాడు. వేసవి కాలంలో మిగతా హిల్‍స్టేషన్ల లాగే డల్హౌసీ టూరిస్టులతోనూ, వాహనాలతోనూ కిక్కిరిసిపోయి ఉంటుందన్నాడు.
డల్హౌసీలోని హోటల్ చేరేసరికి 8:30 అయింది. మా హోటల్ మరీ అంత పెద్దది కాదు. కానీ శుభ్రంగా ఉంది. వెయిటర్లు చురుకుగానూ, స్నేహ పూర్వకంగానూ ఉన్నారు. హోటల్ వాళ్ళు గదులు ఖాళీగా లేవు కొంచెం సేపు ఆగాలని చెప్పారు. మేం రిసెప్షన్‍లో కూర్చున్నాం. అక్కడే కాలక•త్యాలు తీర్చుకుని, క్యాంటినికి వెళ్ళి నాస్తా చేసి వచ్చాం. చివరికి చేరిన మూడు గంటల తర్వాత 125 నంబర్ గది ఇచ్చారు. గదికి వెళ్ళి కొంచెం సేపు విశ్రాంతి తీసుకున్నాం. తర్వాత స్నానాలు చేసి ఒంటిగంట కల్లా తయారై హోటల్ క్రిందికి వచ్చాం.
బిట్టూ మమ్మల్ని ముందుగా డల్హౌసీలో పేరుగాంచిన సుభాష్ చౌక్ తీసుకెళ్ళాడు. అక్కడ చౌక్‍కి ఒకప్రక్క నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహం ఉంది. విగ్రహం జీవకళ ఉట్టిపడుతూ ఎంతో ఆకర్షణీయంగా ఉంది. విగ్రహం ముందు నిలబడి ఫోటోలు తీసుకోవాలన్న కోర్కెను ముందుగా తీర్చుకున్నాం. ఆ చౌక్‍లోనే సెంట్ ఫ్రాన్సిస్ చర్చి కూడా ఉంది. అది 1894లో అక్కడి ప్రజల ద్వారా, ఆర్మీ ఆఫీసర్ల ద్వారా కట్టబడింది. రాతితో కట్టబడిన ఈ చర్చ్ విక్టోరియన్ వాస్తు శాస్త్రాన్ని గుర్తుకు తెస్తుంది. ఎంతో చక్కటి చెక్క కప్పు, రంగురంగుల బెల్జియం గ్లాసు, అందమైన విగ్రహములు ఈ చర్చ్లో చెప్పుకోదగ్గ విశేషాలు.
అక్కడ నుండి గాంధీచౌక్‍కి వెళ్లాం. ఒక పక్కగా గాంధీగారి విగ్రహం కనబడింది. అక్కడ కూడా విగ్రహం ప్రక్కన నిలబడి ఫోటోలు తీసుకున్నాం. ఆ చౌక్‍లోనే సెంట్ జాన్ చర్చ్ ఉంది. ఇది డల్హౌసీలో ఉన్న అతి పురాతనమైన చర్చ్. దీనిని 1863లో ప్రొటెస్టెంట్ మిషనరీలు కట్టించారు. ఇది సెంట్ జాన్‍కి అంకితమివ్వబడింది. చర్చ్ లోపల సెంట్ జాన్, సెంట్ పీటర్ల యొక్క గ్లాసు చిత్రాలున్నాయి. చర్చ్ చూసిన తర్వాత గాంధీచౌక్‍లో ఉన్న డల్హౌసీ కెఫేలో లంచ్ చెయ్యడానికి వెళ్లాం.
లంచ్ చేసి గాంధీచౌక్‍ని, సుభాష్ చౌక్‍ని కలిపే గరమ్ సడక్‍లో చాలా దూరం నడిచాం. దారిలో గోడల మీద వెయ్యబడిన టిబెటన్ రాక్ పెయింటింగ్స్ చూశాం. చైనా 1959లో టిబెట్‍ని ఆక్రమించుకున్నప్పుడు దలైలామా ధర్మశాల దగ్గరలోనున్న మెక్లియాడ్ గంజ్ వచ్చేశారు. ఆ సమయంలోనే చాలా మంది టిబెటన్ కాందిశీకులు డల్హౌసీ వచ్చారు. తర్వాత వాళ్ళు అక్కడ నుండి వెళ్లిపోయారు. కానీ వాళ్ళ సంస్క•తికి సంబంధించిన గుర్తులు మనకక్కడ కనబడతాయి. గాంధీచౌక్‍లో ఉన్న టిబెటన్ మార్కెట్‍కి కూడా వెళ్లాం. టిబెటన్లు తయారు చేసిన వస్తువులు మనకక్కడ దొరుకుతాయి.
ఆ మార్కెట్‍లో కొంచెంసేపు తిరిగి, ఒకటి, రెండు వస్తువులు కొన్నాం. తర్వాత బిట్టుని ఇంకెక్కడికైనా తీసుకెళ్ళమన్నాం. రాత్రంతా నిద్దరలేదని హోటల్‍కి వెడదాం అన్నాడు బిట్టూ. ఇంకా రెండు రోజులు డల్హౌసీలోనే ఉంటాం కాబట్టి అన్నీ చక్కగా చూపిస్తానని చెప్పాడు. సరేనని హోటల్‍కి వచ్చాం. కొంచెంసేపు విశ్రాంతి తీసుకుని, హోటల్ బయటికి వచ్చి కొంత దూరం నడిచి చంబా వెళ్ళే బస్సులు ఆగే స్టాండ్ కెదురుగా రాతి మీద కూర్చున్నాం. మనుష్యులనీ, వాహనాలనూ చూస్తూ గడిపాం. వేసవి కాలంలో డల్హౌసీ టూరిస్టులతోనూ, వాహనాలతోనూ నిండిపోతుందున్న బిట్టూ మాట నిజమేననిపించింది! ఇంకో విశేషం ఏమిటంటే పెద్ద పట్టణాలకి భిన్నంగా చిన్న చిన్న ఊర్లలో కనపడే సరళత్వం, మనుష్యుల్లో ఇంకా మిగిలి ఉన్న ఆప్యాయత, స్నేహభావం మాకక్కడ గోచరించాయి. తర్వాత హోటల్‍కి వెళ్లి కొంచెంసేపు టి.వి. చూశాం. పెందలాడే భోంచేసి పడుకున్నాం.
మరుసటి రోజు ఉదయం 9:45 కల్లా క్రిందికి వచ్చాం. ఈ రోజు ఖజ్జియార్ అనే ప్రదేశానికి తీసుకెడతానన్నాడు బిట్టూ. దానిని మినీ స్విట్జర్లాండ్ అంటారని కూడా చెప్పాడు. ఖజ్జియార్ డల్హౌసీకి 24 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. 11 గంటల కల్లా అక్కడకి చేరుకున్నాం. మొదటి చూపులో కొంచెం నిరుత్సాహపడ్డాం. మినీ స్విట్జర్లాండ్ లాగా లేదే అని అనుకున్నాం. కానీ కొంచెం సేపు అలవాటయిన తర్వాత ఫర్వాలేదనిపించింది. అక్కడ అతి చిన్నదైన ఖజ్జియార్ సరస్సుంది. ఆ సరస్సుకి కొద్ది దూరంలో అన్నివైపులా ఉన్న దేవ్‍దార్ వ•క్షాల వలన ఆ ప్రదేశానికి అందం వచ్చింది. అక్కడికి వచ్చిన అసంఖ్యాకులైన టూరిస్టులను బట్టి ఖజ్జియార్ చూడాల్సిన ప్రదేశాల లిస్టులో ప్రముఖమైనదని చెప్పవచ్చు.
సరస్సుకి దగ్గరలోనే ఖజ్జినాగ్ మందిరముంది. ఈ గుడి మొదట్లో చెక్కతో కట్టబడిందని, అది క్రీ.శ. 12వ శతాబ్దం ముందు నుంచే ఉందని గుడిలో రాసిన రాతలను బట్టి తెలిసింది. ఇంకా గుడిలో చెక్కతో చెయ్యబడిన పాండవుల విగ్రహాలున్నాయి. వీటిని క్రీ.శ. 16వ శతాబ్దంలో బలభద్ర బర్‍మన్ అనే రాజు చేయించి పెట్టినట్లు తెలుస్తుంది. గుడిలోని నాగదేవతకు నిత్యం పూజ జరుగు తున్నది. గుడి నుండి బయటికి వచ్చి దగ్గరలోనే ఉన్న రెస్టారెంట్‍లో లంచ్ చేసి వెలుపలికి వచ్చేసరికి ఒంటి గంటయింది. బిట్టూ వచ్చిన తర్వాత బయలుదేరాం.
అక్కడనుండి బిట్టు మమ్మల్ని ‘డాయన్‍కుండ్’ తీసుకెళ్ళాడు. అది డౌల్హౌసీలో ఎత్తైన పర్వతం. సముద్ర తీరానికి సుమారు 2,755 మీటర్ల ఎత్తులో ఉందని అంచనా వేయబడింది. ప్రక•తి ప్రేమికులకు ఈ ప్రదేశం బాగా నచ్చుతుంది. డాయన్ అనగా మంత్రగత్తె, కుండ్ అనగా సరస్సు అని అర్ధం. ప్రచారంలో ఉన్న ఒక కథ ప్రకారం డాయన్‍కుండ్‍లో ఒకప్పుడు మంత్రగత్తె ఉండేదని, కాళికాదేవి అవతారమైన పులానీదేవి దానిని చంపేసిందని అంటారు. కొండపైకి వెళ్ళడానికి మాకు గంట పైన పట్టింది. పైన చిన్న శివుడి గుడి, కొద్ది దూరంలో పూలానీదేవి గుడి ఉన్నాయి. త్రిశూలం పట్టుకుని నిల్చున్న కాళికాదేవి విగ్రహం ఆరుబయట ఉంది. కానీ సరస్సు మాత్రం ఎక్కడా కనబడలేదు. చుట్టూతా ఉన్న లోయలు ఆ కొండకు అందాన్ని తీసుకొచ్చాయి. ఇండియా వాయుసేనవారి బేస్ కూడా అక్కడుంది.
క్రిందికి వచ్చేసరికి సాయంత్రం నాలుగయింది. అక్కడ నుండి ‘కాలాటాప్’ అనే వైల్ట్ లైఫే సాన్‍క్చురికీ (వన్యప్రాణుల అభయారణ్యం) వెళ్లాం. కారు లోపలికి వెళ్ళడానికి టికెట్ తీసుకొచ్చాడు బిట్టూ. లోపల రెండు కిలోమీటర్ల వరకు కారు వెళ్లింది. ఒకచోట దిగి గేటు లోపలికి వెళ్ళాం. లోపల కొంతదూరం నడిచినాక తిరిగి వచ్చే వాళ్ళందరు లోపల ఏమి లేదని, జంతువులు ఏవి కనబడలేదని చెప్పారు. ఒకాయన మాత్రం ఇంకా దూరం వెడితే రకరకాల పక్షులు కనబడతాయని చెప్పాడు. మేము కొంచెం దూరం నడిచి దగ్గరలోనున్న క్యాంటిన్ టెర్రస్ మీదకు వెళ్ళి ఫోటోలు తీసుకున్నాం. మొత్తానికి కాలాటాప్ మమ్మల్ని కొంత నిరుత్సాహ పరచిందని చెప్పవచ్చు! ఆ నిరుత్సాహం పోవడానికి తిరుగు ప్రయాణంలో మంచుతో కప్పబడిన పర్వతశ్రేణుల ఫోటోలు తీసుకుని త•ప్తిపడ్డాం. అంతేకాకుండా అన్నిచోట్లా పరచుకుని అలరించే ప్రక•తి సౌందర్యం మాలోని నిరాశని దూరం చేసింది.
మరుసటి రోజు పదింటికల్లా బయలుదేరి పంచ్‍పుల్లా అనే ప్రదేశానికి వెళ్లాం. అక్కడ స్వాతంత్ర సమరయోధుడైన సర్దార్ అజీత్‍సింగ్ విగ్రహం ఉంది. ఆయన ఫిబ్రవరి 23, 1881లో జలందర్ దగ్గరలోనున్న గ్రామంలో జన్మించారు. ఆయన ప్రఖ్యాత క్రాంతికారుడు భగత్‍సింగ్‍కి మామ అవుతాడు. ఆయన రైతు ఉద్యమాల్లోనూ, రాజకీయ, సాంఘిక ఉద్యమాల్లోనూ పాల్గొన్నారు. తన జీవితంలోని చివరి దశలో డల్హౌసీ వచ్చారు. 14 ఆగస్టు 1947 సాయం కాలం భారతదేశానికి స్వాతంత్య్రం వస్తుందన్న వార్త విని చాలా సంతోషించారు. కానీ పంజాబ్ విభజన ఆయన్ని విషాదంలో ముంచింది. 15 ఆగస్టు ఉదయాన్నే ఆయన మరణించారు. ఆయన దహనం జరిగిన చోటనే విగ్రహాన్ని ప్రతిష్టించారు.
ఆ విగ్రహాన్ని దర్శించుకుని దగ్గరలోనే ఉన్న పంచ్‍పుల్లా చూడ టానికి వెళ్లాం. పైకి వెళ్ళే మెట్లు సరిగ్గా లేకపోవడాన జాగ్రత్తగా ఎక్కవలసి వచ్చింది. పైన చిన్న కొండకాలువ, ఐదు వంతెనలు ఉన్నాయి. అందువలనే ఈ స్థలానికి పంచ్‍పుల్లా అని పేరు వచ్చి ఉండొచ్చు! అక్కడ కొన్ని ఫొటోలు తీసుకుని క్రిందకు వచ్చాం. ఆ తర్వాత బిట్టూ మమ్మల్ని సుభాష్ బవోలీ తీసుకెళ్లాడు.
సుభాష్ బవోలీ చక్కటి అందమైన ప్రదేశంలో ఉంది. 1937లో సుభాష్‍చంద్ర బోస్ టి.బి.తో బాధపడేవారని, అందుకే ఆయన్ను జైలు నుండి విడుదల చేశారని అంటారు. ఆయన డాక్టర్ సలహా మీద డల్హౌసీ వచ్చారని, పంచ్‍పుల్లా రోడ్డులో మిత్రుడు డాక్టర్ ధర్మవీర్ ఇంట్లో ఉండేవారని చెబుతారు. ఆ రోడ్డులో ఆయన రోజూ నడిచేవారని, నడక తర్వాత అదే రోడ్డులో ఉన్న ఒక ఊట దగ్గర నీరు త్రాగేవారని, అలా ఆయన మే నెల నుండి అక్టోబరు వరకు ఐదు నెలలు త్రాగారని, ఆ తర్వాత ఆయన జబ్బు నయమయిందని చెప్తారు. ఆయన గుర్తుగా బవోలీ దగ్గర ఆయన ఫోటో పెట్టి వివరాలు వ్రాశారు. అక్కడ నేను, మావారు, ఇంకా ఇద్దరు ముగ్గురు టూరిస్టులు తప్ప ఎవరూ లేరు. అదే సినిమా యాక్టర్ వచ్చాడని తెలిస్తే జనం క్రిక్కిరసి పోయేవారని అనిపించింది!
బవోలీ చూసి బయటికి వచ్చేసరికి మధ్యాహ్నం 12:30 అయింది. వెంటనే హోటల్‍కి వెళ్ళాలని అనిపించలేదు. బిట్టూ ఒక సూచన చేశాడు. డల్హౌసీకి 25 కిలోమీటర్ల దూరంలో చమేర సరోవరం ఉందని, అది ఎంతో అందంగా ఉంటుందని, అక్కడ నుండి చంబాకు కూడా వెళ్ళవచ్చని చెప్పాడు. ఆ సూచన మాకెంతో నచ్చగా, సరే అన్నాం. చంబా జిల్లాలో రావి నది మీద ఆనకట్ట కట్టి క•త్రిమ సరోవరాన్ని ఏర్పాటు చేశారు. పైనుంచి దిగేటప్పుడు దూరం నుంచే చమేర సరోవరం, ఆనకట్ట కనబడ్డాయి. సరోవరంలో నౌకావిహారం చెయ్యడానికి వీలుగా ఏర్పాట్లు చేశారు. ముందుగా భోజనం చేసి బోటింగ్ చెయ్యడానికి వెళ్లాం. సమయం ఆహ్లాదకరంగా గడిచింది.
ఆ తర్వాత చంబాకి బయలుదేరాం. చంబా అక్కడ నుండి 20 కిలోమీటర్లే ఉంటుందన్నాడు బిట్టూ. కానీ మాకు చాలాసేపు ప్రయాణం చేసినట్లు అనిపించింది. కొద్దిగా అలసట అనిపించింది. ఒక చిన్న దుకాణంలో టీ త్రాగి, బిస్కెట్లు తిన్నాం. తర్వాత అక్కడ ప్రఖ్యాతిగాంచిన లక్ష్మీనారాయణుని గుడికి వెళ్ళాం. గుడి నుండి బయటికి వచ్చి కొంచెంసేపు దగ్గరలో షాపింగ్ చేశాం. అందరూ ప్రశంశించే చంబా చెప్పులు కొన్నానక్కడ!
ఇక బయలుదేరి సాయంత్రానికల్లా డల్హౌసీ చేరుకున్నాం. ఒక అర్ధగంటలో సామాను సర్దుకుని పఠాన్‍కోట్ బయలు దేరి 8:30 కల్లా స్టేషన్ చేరుకున్నాం. సామాన్లు దించుకుని, మా యాత్ర సఫలం కావడానికి దోహదం చేసిన బిట్టూని మెచ్చుకుంటూ, మాకు తోచిన టిప్‍ని అతనికి ఇచ్చాం. ఆనందంతో బిట్టూ ముఖం వికసించింది. కరచాలన చేసి బై చెప్పి సెలవు తీసుకున్నాడు. మేం ఎక్కవలసిన ఉదయ్‍పూర్ – ఢిల్లీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ చివరికి బయలుదేరే సరికి రాత్రి 9:30 అయింది. మరుసటి రోజు పాత ఢిల్లీలోని సరైరోహిల్లా స్టేషన్‍కి ఇంకా చీకటిగా ఉన్నప్పుడే చేరుకున్నాం.
2017లో జూన్ 12-16 తేదీల మధ్య జరిగిన మా డల్హౌసీ ప్రయాణం గుర్తిండిపోయే యాత్రగా మా మనస్సుల్లో ముద్ర వేసింది. పేరుగాంచిన మిగతా హిల్ స్టేషన్‍కి అనేకసార్లు ప్రయాణం చెయ్యడం వలన డల్హౌసీ యాత్ర కొత్తదనంతో నిండి విభిన్నమైన అనుభూతిని కలిగించింది. శీతల వాతావరణంలో చురుకుగా, సంతోషంగా గడిపి వచ్చిన మాకు ఢిల్లీ ఎండలు కొంత చికాకు కలిగించినా, కొన్ని రోజులైనా వాటి నుంచి తప్పించుకుని డల్హౌసీ యాత్రను అసాంతం ఆస్వాదించామనుకుని సంత•ప్తి పడ్డాం!
- శాంతిశ్రీ బెనర్జీ
ఎ: 9871989360