ప్రకృతే సౌందర్యం! 26 ప్రకృతే ఆనందం!! వృక్షజాతి పునరుత్పత్తికి అసలైన వారసులం!

నిర్దిష్ట ప్రామాణికతతో ఏర్పడిన భూమిపై పురుడు పోసుకున్న జీవజాతుల మనుగడకు ప్రకృతి ఓవైవిధ్యభరితమైన విధానాల్ని ఏర్పర్చుకుంది. వృక్షాలుగా, జంతువులుగా ఏర్పడిన జీవుల మధ్యన జీవసంబంధ అవినాభావ బంధం జీవుల మనుగడకు, పునరుత్పత్తికి తోడ్పడం ప్రకృతి ఏర్పర్చుకున్న నిబద్దతకు తార్కాణం! మొక్కలు స్వయంపోషకాలే అయినా, వాటిని భవిష్యత్‍ తరాలకు అందించే బృహత్తర బాధ్యతను నిర్వహించేది కొంతమేర పక్షులుకాగా, అత్యధికంగా దోహదపడేది మాత్రం కీటకాలు కావడం గమనార్హం!


తాము బతుకుతూ, యావత్‍ ప్రపంచానికి తిండిపెట్టేది వ్యవసాయదారుడే అయినా, సాగుకు, రక్షణకు, నూర్పిళ్ళకే తాను పరిమితం కాగా, మొక్కల పునరుత్పత్తికి కారణమైన ఫలధీకరణ మాత్రం కీటకాల ద్వారా జరగడం ఓవైవిధ్యం. సహజంగా మొక్కల్లోని ప్రత్యుత్పత్తి భాగమైన పుష్పాలు ద్విలింగ పుష్పాలు. (కొన్ని మొక్కలు పుష్పించనివి, కొన్ని ఏకలింగ పుష్పాల్ని కలిగివుంటాయి. వీటి గూర్చి ఇక్కడ చర్చించడం లేదు) ఈ ద్విలింగ పుష్పాల్లో పరాగకోశము, అండకోశము అనే పురుష, స్త్రీ అంగాలు వుండేది తెలిసిందే! పరాగకోశములో ఏర్పడే పరాగరేణువుల్ని (పురుష కణాలు), అండకోశంలోని కీలాగ్రానికి చేర్చడమే కీటకాలు తెలియకుండా చేసే పని. ఇలా కీలాగ్రానికి చేరిన పరాగరేణువులు అండకోశనాళం ద్వారా అండాశయంలోని అండాల్ని (కణాలు) చేరి కలయిక (సంపర్కం) చెందడమే ఫలధీకరణ. తర్వాత అవి కాయలుగా, పండ్లుగా మారడం, అందులో విత్తనాలు తిరిగి పునరుత్పత్తికై ఏర్పడడం పాఠ్యాంశాల్లో చదువుకున్నదే!


కీటకాలే ఫలధీకరణకు ఎందుకు దోహదపడుతాయి…
కీటకాల ఆహారపు వేటలో, పుష్పాల్లోని మకరందానికై పుష్పాలపై వాలడం గుర్తెరిగిందే! అలా వాలిన కీటకాల కాళ్ళకు పరాగరేణువులు అంటుకోవడం లేదా, వాటికదలికకు, రాలి కీలాగ్రానికి చేరడం ఓ క్రమానుగత చర్యలు. ఇలా కీటకాల ఆహారపు వేటలో, మొక్కల పునరుత్పత్తికి, వాటికి తెలియకుండానే దోహద పడుతాయన్నమాట! (ఫలధీకరణ రకాలు, జరిగే విధానం కూడా ఇక్కడ చర్చించడం లేదు.) ప్రకృతిపరంగా జరిగే ఈ చర్యలో, పుష్పాలు మకరందాన్ని ఉత్పత్తి చేయడం, అది సువాసనను కలిగి వుండడం, కీటకాలు ఆ మకరందాన్ని ఆస్వాధించడానికి పుష్పాలపై వాలడం ఓ క్రతువులాంటిదే! ఇలా మొక్కలకు, కీటకాలకు విడదీయలేని అనుబంధం ఏర్పడి ప్రకృతి పునరుత్పత్తికి దోహదపడడమే కాక, యావత్‍ జంతుజలానికి, మానవులకు ఆహారాన్ని అందించడం జరుగుతున్నది. ఇందులో మొక్కలు గొప్పవా, కీటకాలు గొప్పవా అని తూకం వేయడం ఒకరకంగా కష్టసాధ్యమే! పోతే, మొక్కలు లేనిదే కీటకాలు లేవని, కీటకాలు లేనిదే మొక్కల మనుగడ అసాధ్యమని మాత్రం గుర్తించగలం.
అయితే ఈ పక్రియను అన్ని కీటకాలు జరుపుతాయా అంటే, అవుననే సమాధానమైనా, అత్యధికంగా జరిగేది మాత్రం కొన్ని కీటకాల ద్వారానే! అందులో ప్రధానంగా చెప్పుకునేవి రెండు కీటక జాతులే! ఒకటి సీతాకోక చిలుకలు కాగా, రెండోది తేనె టీగలు. ఇవి కాకుండా తుమ్మెదలు, చిమ్మిటలు, గొల్లబామలు, తూనీగలు, కందిరీగల లాంటి కీటకాలు కూడా ఈ పక్రియకు ప్రధానంగా దోహద పడుతాయి. పోతే కీటకాలే అయినా, ఈగ, దోమ, చీమల లాంటి చిన్నరకం కీటకాలు పుష్పాల ఫలధీకరణలో అతి తక్కువ పాత్రను పోషిస్తాయి. ఇప్పుడు కొన్ని కీటకాల జీవన విధానాన్ని చూద్దాం!


వలసలే మా జీవనవిధానం! పూర్వీకుల జన్మస్థలానికి తిరిగి చేరడం!

ప్రకృతి అందాల్లో పుష్పాలది అగ్రస్థానం కాగా, జీవులలో మా సీతాకోకచిలుకలది మరో ప్రత్యేకస్థానం. చిత్రకారుడి కుంచెకు కూడా అందని రంగుల్లో, విభిన్నమైన రంగుల కలయికతో, విభిన్న రకాల అమరికలతో (డిజైన్స్) అవురా అనిపించే సీతాకోకచిలుకల్ని చూసి అనందించని వారు వుండరనుకుంటాం. ప్రపంచ వ్యాపితంగా 17,500 రకాలకు పైగా వున్న మా సీతాకోకచిలుకల జీవిత చక్రాన్ని మీరు మీ పాఠ్యాంశాల్లో ప్రత్యేకంగా చదువుకుంటారు. కారణం, దాదాపు సృష్టిలో ఫలధీకరణ తర్వాత, నేరుగా పిల్లలు పునరుత్పత్తి కావడం జరుగుతే, మాలో ఇది కనపడదు. మా జీవితంలోని నాలుగుదశల్లో, రెండోదశ అయిన లార్వా (గొంగళి పురుగు), మూడోదశ అయిన కోశస్థదశ (ప్యూపా) వైవిధ్యాన్ని కలిగి వుంటే, నాలుగోదశ అయిన ఫ్రౌడదశ (ఇమాగో) ఈ రెండింటికి భిన్నంగా అందాలొలకబోసే సీతాకోక చిలుకలుగా రూపాంతరం చెందడం మాకు ప్రకృతి ప్రసాదించిన గొప్ప బహుమతి. మాలాగే చాలా కీటకాలు ఇలాంటి రూపాంతర దశల్ని కలిగి వున్నా, మాకున్న గొప్పతనం మాత్రం మాదే!


అయితే, మేం అనేక రకాల జాతుల్ని కలిగి వున్నా, రంగులద్దిన ఆడ సీతాకోకచిలుక (painted lady butterfly) వలస జీవితం సృష్టిలోనే విచిత్రం. దక్షిణ అమెరికా, ఆస్ట్రేలియాలోని కొన్ని ప్రాంతాల్లో తప్ప ప్రపంచ వ్యాపితంగా అగుపించే ఈజాతి జీవన విధానం బహుముఖంగా వుండడం గమనించాలి. సహజంగా సీతాకోక చిలుకలు వందలాదిగా, గుంపులుగా ఆహారపు వేటలో (మకరంద) ఒక ప్రాంతం నుంచి, మరో ప్రాంతానికి నిత్యం పయనిస్తూనే వుంటాయి. రోజంతా పయనించి, చీకట్లో ఏదో ఒక ఆధారంపై నిద్రించి, తెల్లవారగానే తిరిగి పయనించడం వాటి దినచర్య. అలా ఒక ప్రాంతానికి పరిమితం కాకుండా, పుట్టిన ప్రదేశం నుంచి వేలాది కి.మీ. ఒకేదిశలో ఇవి పోతూనే వుంటాయి. అందుకే, ఉదయం, సాయంత్రం వ్యవసాయ క్షేత్రాల్లో, పూలతోటల్లో, గడ్డిమైదానాల్లో, అడవుల్లో మందలకు మందలుగా ఎగురుతూ, పుష్పాలపై వాలుతూ ప్రకృతినే పులకరింపచేస్తూ వుంటాయి.


పూర్వీకుల జన్మస్థానికి చేరడం అంతుపట్టని ఓ రహస్యం!
రంగులద్దిన ఆడ సీతాకోకచిలుక వలసజీవితం చాలా విచిత్రంగా వుంటుంది. ఉత్తర యూరప్‍లోని ఫిన్‍లాండ్‍, స్కాండినేవియా ప్రాంతాల నుంచి ఓ తరం ఆఫ్రికాలోని గడ్డి మైదానాల దాకా, సుమారు నాలుగువేల కి.మీ. సాగి, సంతానోత్పత్తిని జరుపును. దీంతో మొదటి తరం జీవులు అంతరించిపోగా, రెండోతరం సీతాకోకచిలుకలు తమ తల్లితండ్రుల వారసత్వాన్ని కొనసాగిస్తూ, మరింత దక్షిణంగా, భూమధ్యరేఖ ప్రాంతానికి పయనించి, సంతానోత్పత్తిని జరుపును. ఇక్కడితో రెండోదశ జీవులు అంతరించిపోగా, మూడోదశ సీతాకోక చిలుకలు తిరిగి వెనక్కి పయనిస్తూ ఆఫ్రికా గడ్డిమైదానాల్ని (సవన్నాలు) చేరి, సంతానాన్నికని నశించును. ఇప్పుడు నాలుగోతరం తిరిగి ఉత్తర యూరప్‍వైపు పయనించి ముత్తమ్మల జన్మస్థలానికి చేరును. తిరిగి వీటి సంతానం ఈ వలసచక్రాన్ని కొనసాగించును. ఒక సంవత్సర కాలంలో ఇవి సుమారు 14,000 కి.మీ. దూరాల్ని 8-10 అయిదు తరాలు పూర్తిచేయడం, రంగులద్దిన సీతాకోకచిలుకలు ప్రత్యేకత! ఈ ప్రయాణంలో ఆల్పస్ పర్వతశ్రేణుల్ని, మధ్యధరా సముద్రాన్ని దాటి ఆఫ్రికాలోని సవన్నాల ద్వారా భూమధ్యరేఖ ప్రాంతానికి వచ్చి, తిరిగి వచ్చిన మార్గాన వెనక్కిమళ్ళి, ముత్తమ్మల జన్మస్థలానికి చేరుకోవడం మాప్రత్యేకత.


ఈ పయనమంతా ఏ ఒక్క తరమో కాకుండా, కొన్ని తరాలు, ఓ రిలే పరుగులా చేపడతాయి. పైగా మేం ఒంటరిగా కాకుండా, వేలాదిగా కదిలి వెళ్ళడం మీరు చూసేదే! ఓ సజీవ ఖండిక (Biomass) కదిలిపోతున్నట్లుగా మా పయనం వుంటుంది. ఇలాంటి జీవన విధానమే మోనార్క్ (monarch) సీతాకోక చిలుకలు కూడా కలిగి వున్నా, మా అంత విశిష్టత వాటికి లేదు. పోతే, మేం 14,000 వేల కి.మీ.కు పైగా ఓ వలసచక్రాన్ని పూర్తి చేస్తే, మోనార్క్ సీతాకోక చిలుకలు ఉత్తర తూర్పు అమెరికా, కెనడాల నుంచి దక్షిణ పడమర మెక్సికో చేరుకొని, తిరిగి వెళ్ళడానికి సుమారు 5,000 వేల కి.మీ. పయణించాలి. ఈ వలసచక్రాన్ని పూర్తి చేయడానికై అయిదు తరాలు సుమారు ఎనిమిది నెలల కాలాన్ని తీసుకుంటాయి.
నిజానికి సీతాకోకచిలుకలు అననుకూల (సీతాకాలంలో) పరిస్థితుల్లో స్థుప్తావస్థలోకి వెళ్ళుతాయి. కాని, మేము, మోనార్క్ సీతాకోకచిలుకలు ఈ విధానానికి భిన్నంగా జీవనయానం సాగించడం, మాప్రత్యేకత కాదా….!

సంఘజీవులం – శ్రమవీరులం – ఇంజనీర్లం
అన్నదాతలం.. (తేనెటీగలు)

పేరుకు మేం కీటకాలమే అయినా, ప్రకృతిలో మా ప్రత్యేకతనే వేరుగా ఉంటుంది. మొక్కల పునరుత్పత్తికి మేము చేసే సేవ వెలకట్టలేనిది. అదనంగా, మా ఆహారపు వేటలో మేము సేకరించిన మకరందాన్ని నిల్వవుంచడం, దీన్ని మానవులు దొంగచాటుగా దొంగిలించి అనుభవించడం తెలిసిందే! అయినా, నిరంతరం మేము మకరందాన్ని సేకరించడం, నిల్వచేయడం జరుగుతూనే వుంది. పోతే, ఈ కృషిలో మేము సమిష్టి సంఘజీవులుగా పాల్గొంటాం. మీ గిరిజన సమూహాల్లో సహకరించుకునే సహకార పద్దతి మాలో వుంటుంది. ఒక్కో కాలనీ (తుట్టె)లో సుమారు 60,000 వేలకు పై వుండే మా తేనెటీగలు ఓ సైనిక క్రమశిక్షణను కలిగి వుండడం గమనార్హం. ఈ మొత్తం వ్యవహారాన్ని రాణిఈగ చేపట్టగా, పిల్ల తేనెటీగలు తుట్టెలోపల శ్రమచేయడం, లార్వాలకు ఆహారాన్ని అందించడం (శిశురక్షణ), గదులను (comb) శుభ్రపర్చడం, చేస్తూవుంటాం. మేం పెరిగిన తర్వాత తేనెతుట్టను (hives) కాపాలకాస్తాము. ఆ తర్వాత మరింత పెరిగిన తర్వాత వేటకై బయటికి పోయి మకరందాన్ని సేకరిస్తాం. ఇలా వయస్సును బట్టి పనివిభజన, ఉత్పత్తిలో భాగస్వామ్య కావడం మా గొప్పతనం. అదే మీ మానవులు, ఆర్థిక స్థోమతను బట్టి, 30 సంవత్సరాలు వచ్చినా పిల్లలకు పని సంస్క•తి నేర్పరు.


ముఖ్యమైన విషయ మేంటంటే, మీరు చూసే తేనెటీగలన్నీ ఆడవే. అలాగే ప్రత్యుత్పత్తి జరిపి, నూతనతరాన్ని ఉత్పత్తి చేసే రాణిఈగ లోపల వుంటుంది. చుట్టూతిరిగే ఈగలన్నీ కార్మిక ఈగలైతే, లోనవుండి రాణిఈగతో సంపర్కం జరిపి తనువు చాలించేవి మాత్రం మగ ఈగలు. మగఈగల పాత్ర కేవలం పిల్లల్ని కనడానికి మాత్రమే తప్ప, శ్రమలో, తుట్టె నిర్మాణంలో, రక్షణలో, మకరందం సేకరణలో ఎలాంటి పాత్రను పోషించడపోవడం ఓ ప్రకృతివైవిధ్యం.


అన్నింటికి మించి, మా తేనెతుట్టె (hives) నిర్మాణపుగదులు (combs) ఓ నిర్థిష్టమైన షడ్బుజి (hexagon) ఆకారంలో వుండడం మా ఇంజనీరు పనితనానికి గొప్ప నిదర్శనం. ఈకళ ఇప్పటికి మీ మానవులకు అబ్బలేకపోయింది.


ఇలా పునరుత్పత్తి అనే ప్రకృతి ధర్మంలో పుష్పాల్లో సంపర్కం జరిగే ప్రధాన బాధ్యతను నిర్వరిస్తూ, అతి మధురమైన మకరందాన్ని అందిస్తున్న మా జాతి, మీ ప్రకృతి విరుద్ద చర్యలతో పెను ప్రమాదంలో వుందని గ్రహిస్తే మీకేకాదు, యావత్‍ సృష్టికే క్షేమదాయకం! లేకుంటే భూగోళపు జీవావరణ వ్యవస్థ ఎడారిగా మారిపోతుంది. చెట్లు మోడువారతాయి. ఫలధీకరణ లేక పంట చేళ్ళన్ని బోసిపోతాయి. కొత్తగా విత్తనాలు ఉత్పత్తి కావు. అందమైన పుష్పాలు కనుమరుగైతే, వీటి ఆధారంగా జీవించే కీటక, పక్షిజాతులు అంతరించి పోతాయి. ఇలా ఒకదానితో ఒకటిగల అనుబంధం దెబ్బతినడంలో ఆహారపు గొలుసు పూర్తిగా కూలిపోతుంది. జంతుజాలం ఆకలితో, అలమటిస్తే, మానవులు తోటి మానవుల్ని భక్షించే పరిస్థితి దాపురించితే, అనతి కాలంలోనే మానవజాతి అంతరించిపోతుంది.


బహుశ, ఇవన్నీ జరిగేవేనా అని అనుకుంటే, ఓసారి ఈ విపత్కరస్థితిని ఓ కలగని చూడండి. మీకే అర్థమైతుంది. సృష్టి మనుగడకు, మీకు రోగాల్ని కలిగించే దోమలు, ఈగలు నల్లులు కూడా అత్యవసరమని భావించండి. అప్పుడే భూమిపై జీవజాతి మనగలుగుతుంది.
(వచ్చే సంచికలో మరికొన్ని కీటకాల గూర్చి చూద్దాం)

డా।। లచ్చయ్య గాండ్ల,
ఎ : 9440116162

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *