కనకాయి జలపాత సమూహం

ఆదిలాబాద్‍ జిల్లాలో రెండు కొండల వరుసలు పశ్చిమం నుంచి తూర్పుకు సమాంతరంగా సాగుతాయి. పై కొండల వరుస (ఉత్తరపుది) పేరు సత్మల కొండలు కాగా కింది కొండల వరుస (దక్షిణపుది) పేరు నిర్మల కొండలు. రెండు వరుసల మధ్య లోయ(వ్యాలీ)లో గోదావరికి ఉపనది అయిన కడెం నది పారుతుంది. సత్మల కొండల్లో సుమారు పదివాగులు పుట్టి కడెం నదిలో కలుస్తాయి. అయితే పారేటప్పుడు కొండల మీద నుంచి దుంకుతూ వస్తాయి కాబట్టి అవన్నీ… అంటే ప్రతి ఒక్క వాగూ ఏదో ఒకచోట మనకు జలపాతమై దర్శనమిస్తుంది. అలా కడెం నది చుట్టూ పది జలపాతాలను చూడవచ్చు. అలాంటి వాటిలో రెండు జలపాతాల పేర్లు కనకాయి జలపాతం, గొలుసుల జలపాతం. ఇవి బజార్‍ హత్నూర్‍ మండలంలో ఉన్నాయి. హైదరాబాద్‍ నుంచి నిర్మల్‍, ఇచ్చోడ మీదుగా మొత్తం 250 కి.మీ.లు ప్రయాణించి బల్నాపూర్‍, గిర్నూర్‍ల మధ్య ఉన్న ఈ జలపాతాలను చేరుకోవచ్చు.


అందమైన ప్రయాణం
ఆదిలాబాద్‍ జిల్లాలో ప్రవేంశించిందే తడవుగా మన ప్రయాణం సుందర దృశ్యాల మధ్య సాగుతుంది. నిజామాబాద్‍, ఆదిలాబాద్‍ జిల్లాల సరిహద్దుగా ఉన్న గోదావరి నదిపైన కట్టిన శ్రీరామ్‍సాగర్‍ డ్యామ్‍ మనకు ఎడమ వైపున అల్లంతదూరంలో కనిపిస్తుంది. ఆ దృశ్యం తెరమరుగు కాకముందే కుడివైపున చిన్నదైనప్పటికీ చిత్రమైన సోన్‍కోట కనిపిస్తుంది. కొన్ని కిలోమీటర్లు ముందుకు సాగగానే ఇంతకుముందు నిర్మల్‍కోట గోడలు దర్శనమిచ్చేవి. ఈ మధ్య పాత జాతీయ రహదారి నంబర్‍ 7ను 4 లైన్ల రహదారి నంబర్‍ 44గా విస్తరించడంతో అవి మనకు కన్పించడం లేదు. కాని, వాటిని చూడలేదే అన్న లోటును మరి కొన్ని కిలోమీటర్లు సాగిన తర్వాత కనిపించే బాల్కొండ కోట తీరుస్తుంది.


జలపాతాల హోరు
ఇచ్చోడ నుంచి బజార్‍హత్నూర్‍ వెళ్తున్నప్పుడు మధ్యలో కడెం నది కనిపిస్తుంది. అక్కడే మన వాహనాన్ని ఆపి ఆ చిన్న నది వెంట తూర్పు వైపుకి ఒక ఫర్లాంగు దూరం నడవగానే శ్రావ్యమైన జలపాతపు సంగీతం వినిపిస్తుంది. గబ గబా ముందుకి పరుగెత్తి కిందకి చూస్తే మన కళ్లముందు ఓ అందమైన జలపాతం ఆవిష్క•తమవుతుంది. అదే కనకాయి జలపాతం. దక్షిణంగా ఉన్న గ్రామం సోనాల నుంచి వచ్చే వాగు కడెం నదిలో కలిసిన చోట ఈ జలపాతం ఏర్పడింది. సుమారు 70 అడుగుల వెడల్పుతో 40 అడుగుల ఎత్తు నుండి నురగలు కక్కుతూ దూకుతుంది. దూకి రెండు ఇరుకైన గట్లు, చెట్ల మధ్య లోయలో ప్రశాంతంగా పారుతుంది. ఆ దృశ్యం నల్లతోక (జలపాతపు కింది ప్రవాహం) ఉన్న తెల్ల గాలిపటం (నురగలు కక్కుతూ దూకుతున్న జలపాతం) లాగా కనిపిస్తుంది. స్థానిక ప్రజలు ఈ జలపాతాన్ని కనకాయి గుండంగా పిలుస్తూ పూజిస్తారనడానికి నిదర్శనంగా మనకు జలపాతపు అంచునే పూజాసామగ్రితో అలంకరించబడిన విగ్రహపు రాళ్లు కనిపిస్తాయి.
కనకాయి జలపాతానికి తూర్పువైపు మరో ఫర్లాంగు దూరం నడిచిన తరువాత మరో జలపాతం వస్తుంది. పేరు గొలుసుల జలపాతం. ఇది గొలుసు ఆకారంలోనే ఉంటుంది. దక్షిణాన సాకేరి గ్రామం నుంచి వస్తున్న వాగు కడెం కదిలో కలిసే చోట ఈ జలపాతం ఏర్పడింది. పచ్చని చెట్ల మధ్యన నల్లని రాతినేలపై నుంచి తెల్లని నురగలతో గొలుసులు గొలుసులుగా దూకే ఈ జలపాతం అందం చూపరులకు నయనానందకరం.


సాహసులకు సవాల్‍ చీకటి గుండం
ఇది ఆరంభం మాత్రమే. గొలుసుల జలపాతం తరువాత మరో అతి పెద్ద జలపాతం ఉంటుందట. పేరు చీకటిగుండం. చీకట్లో ఏమీ కనబడనట్లే ఈ జలపాతం కూడా కనబడదట. ఇందుకు రెండు కారణాలున్నాయి. ఒకటి, అది చాలా చిక్కగా, ఎత్తుగా పెరిగిన దట్టమైన అడవుల మధ్య ఉండడం. దీనివల్ల అది దూకుతున్న శబ్దం ఆ దట్టమైన అడవుల్లో రెండు మూడు దిక్కుల్లో ప్రతిధ్వనించి అసలు ఏ దిక్కునుంచి ఆ జలపాతం ప్రవహిస్తున్నదో మనం తేల్చుకోలేకపోతాం. ఇక రెండవ కారణం, మనం దానిపై నుంచి వెళ్తాం కాబట్టి మన ముందు దిశలో ఎంత దూరంలో కిందికి దూకి జలపాతంగా మారుతుందో తెలియదు. పైగా అది దట్టమైన గుట్టల మధ్య ఏర్పడిన ఒక ఇరుకైన లోతైన లోయలోకి ఆకస్మికంగా నిటారుగా దూకుతుందట. అతి కష్టం మీద ఆ స్థలానికి మనం చేరుకున్నా కూడా ఆ లోయ గురుత్వాకర్షణ శక్తికి గురై మనం అందులో పడిపోతామ•. అయినా కొందరు ఔత్సాహికులు గతంలో ఎప్పుడో నడుములకు చెట్లకు తాళ్లు కట్టుకుని, ఈ చీకటి జలపాతం వరకు చేరుకుని దాని లోతును కొలిచే ప్రయత్నం చేసి విఫలమయ్యారట. కారణం, వారు ఏడు మంచాల నులకతాడు కొసకు రాయి కట్టి ఆ లోయలో వేసినా దాని అడుగు అందలేదట.
ఈ వ్యాసకర్త కూడా ఈ జలపాతాన్ని కనుక్కునే ప్రయత్నం చేశారు. ఆయనకి కూడా ఆ దట్టమైన అడవుల్లో మూడు నాలుగు దిక్కుల్లో జలపాతాల హోరు విన్పించింది. కాని చిక్కని చెట్ల మధ్య ఎంత పరికించి చూసినా జలపాతం కన్పించలేదు. వీడియో రికార్డు చేస్తే అందులో ప్రశాంతంగా పారుతున్న ప్రవాహం జలపాతపు హోరుతో రికార్డయింది. అంటే సమీప పరిసరాల్లో ఎక్కడో అత్యంత ఎత్తు నుంచి దుముకుతున్న జలపాతమున్నట్లే కదా!
ఏమైనా, అంత అందమైన జలపాతాన్ని చూడలేకపోయామే అన్న బాధను ఆ పరిసరాల సౌందర్యం ఇట్టే తీసేస్తుంది. వంద మీటర్ల ఎత్తైన గట్లు, చెట్ల మధ్య నుంచి మనకు అకస్మాత్తుగా మడ అడవుల దృశ్యం కనిపిస్తుంది. నీళ్లలో తేలాడే మడ అడవులు సముద్ర తీర ప్రాంతాల్లోనే ఉంటాయి. అట్లాగే ఉన్న ఇక్కడి మడ అడవుల మధ్య బోటు షికారు చేయడానికి కూడా అవకాశముందంటే ఆలోచించండి మరి.


వనదేవత ఇతిహాసం
ఇక్కడి జలపాతాల సమూహానికి ‘కనకాయి గుండాలు’ అని పేరు రావడానికి కారణం ఇక్కడి వనదేవత ‘కనకాయి’ లేదా కనకదుర్గ కావడం. కనకాయి అంటే (కనక+అయి) బంగారు లోహదేవత అని అర్థం. కనకాయి జలపాతం కూడా సోనాల అనే గ్రామ పొలిమేరల నుంచి దూకుతున్నది. సోనాల అంటే కూడ బంగారు ప్రదేశం అని అర్థం. మరి ఈ ప్రాంతంలో బంగారం దొరుకుతుందా? దొరుకుతుందనే నమ్మకంతోనే ఈ రోజు వరకూ నిధుల తవ్వకాలు జరుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో బంగారు దేవత (కనకాయి) గుడిని కూడా కూలగొట్టారు. దానివల్ల ఇప్పుడు కనకాయి గుడి ప్రాంతంలో కేవలం రెండు శిల్పాలు, శిథిల దేవాలయ అరుగు తప్ప మరేమీ మిగల లేదు.
నిజానికి కనకాయి బంగారు లోహ దేవత కాదు. బంగారం కనిపెట్టబడిన తరువాత దక్షిణ భారతదేశంలో ప్రత్యేకించి తెలంగాణలో కనిపెట్టబడిన ఇనుము లోహదేవత. ఇనుము కనిపెట్టిన తరువాత వ్యవసాయం అభివృద్ధిలో పెనుమార్పులు చోటు చేసుకుని ప్రజలు ఆర్థికంగా అన్ని రకాలుగా ఎదిగారు కాబట్టి, ఇనుమును బంగారంతో సమానంగా గౌరవించేవారు. ఆ క్రమంలోనే ఇనుప లోహదేవతకు కనకాయి అని పేరు పెట్టారు. ఇదంతా మూడువేల సంవత్సరాలకు పూర్వమే జరిగింది. కనకాయి జలపాతం ప్రాంత మంతా ఆనాటి ఇనుప లోహ పరిశ్రమ ఆనవాళ్లతో అలరారుతుంది. ఈ ప్రాంతంలో ఇనుము కనిపెట్టిన తరువాతనే ఈ ప్రాంత రాజు మహిషాసురుణ్ణి మర్దించడం జరిగింది. కాబట్టి ఇనుపదేవత (కనకాయి) కాస్తా కనకదుర్గగా, మహిషాసుర మర్దినిగా రూపాంతరం చెందింది. మహిషాసురుని భారీ విగ్రహానికి సంబంధించిన శిథిల శిల్ప ముక్కలను ఈ రోజు కూడా భైంసా(మహిషా)లో చూడొచ్చు.
క్రీ.పూ.3వ శతాబ్దంలో అశోకుడు ఈ మహిష మండలానికి బౌద్ధమత ప్రచార నిమిత్తమై తన కొడుకు మహేంద్రుని పంపించాడు. ఆ మత అహింసా సిద్థాంత ప్రభావం వల్లనేమో ఇక్కడ కనకాయి దేవత శాకాహారి. ఆమెకున్న స్థానిక భక్తులందరూ శాకాహార వ్రత నియమాన్ని పాటిస్తారు. ఈ మధ్య ఈ దేవతకు మేకను బలి ఇచ్చిన కటికవాడు ఒకడు ఇక్కడి కనకాయి గుండంలో పడి చనిపోయాడట. అయితే ఆ గుండం మాత్రం లోతైన రెండు గట్ల మధ్య ప్రశాంతంగా అందంగా ఉంది.
కనకాయి ఆలయం ముందు (ఉత్తరాన) ఒక శిల్ప స్తంభ ఖండిక ఉంది. దానికి నాలుగు దిక్కులా శిల్పాలు చెక్కి ఉన్నాయి. ప్రధాన శిల్పం కృష్ణుడు కంసుని వధిస్తున్నట్లు చెక్కబడింది. ఆ తరహా పేరొందిన శిల్పాలు మహారాష్ట్రలోని పౌని-పౌనార్‍ (ప్రవరపుర)లో ఉన్నాయి. వాటిని ప్రవరపుర రాజధానిగా దక్కనును పరిపాలించిన వాకాటక రాజులు చెక్కించారు. కనకాయి ప్రాంతం వారి రాజ్యంలో భాగమే కాబట్టి ఇది కూడా ఆనాడు (క్రీ.శ.500) రాజపోషణకు నోచుకున్నదన్నమాట. అయితే ఇక్కడ వేల ఏళ్లనాటి ఇటుక ముక్కలతో పాటు 91/2*7*2 అంగుళాల కొలతలు గల ఇటుకలు కూడా కన్పిస్తున్నాయి. కాబట్టి ఈ ప్రాంతంలో కాకతీయుల కాలంలో (క్రీ.శ.13వ శతాబ్దం) కూడా కట్టడాలు నిర్మితమయ్యాయని అర్థమవుతుంది.


జలదుర్గం
కనకాయి దేవత స్థలం నుండి ప్రధానమైన కోటగోడ ప్రారంభమవుతుంది. ఆలయానికి నైరుతిలో కోటగోడ మొదటి ప్రాకారం ఉంది. ఆ ప్రాకార ప్రధాన ద్వారం ముందే కనకాయి జలపాతం ఉంది. దాని ప్రవాహం ఈ కోటగోడను కాలక్రమంలో కోసుకుంటూ వెళ్తున్నది. అయితే ద్వారం ముందు నుండి పశ్చిమ దిశగా ప్రస్తుత రోడ్‍ వైపు ఉన్న ఫర్లాంగు పొడవైన రాతి నిర్మిత రాజమార్గం మాత్రం ఈ నాటికీ చెక్కుచెదరకుండా ఉంది. ఈ రహదారి, ప్రాకారం పరిసరాలలో మనకు ఒకనాటి పట్టణపు ఇళ్ళ పునాదులు, నీటి వసతులు (గుండాలు), ఇటుక ముక్కలు, రోళ్లు తదితర ఆనవాళ్లు కనిపిస్తాయి. వీటి మధ్య నుండి కనకాయి గుండం వైపు వెళ్తున్నపుడు ఆ గుండం ఒడ్డున చారిత్రక పూర్వయుగం నాటి మానవుల ఆయుధాల పరిశ్రమ తాలూకు ఆనవాళ్లు కూడా కనిపించాయి. ఇలాంటి ఆయుధాలు ముప్పె, నలభై ఏళ్ల నాటివని వాటిని సమీపంలోని పొచ్చెర, గణపూర్‍ జలపాతాల పరిసరాల్లో సేకరించిన ప్రముఖ చరిత్రకారుడు ఠాకూర్‍ రాజారాం సింగ్‍ అభిప్రాయపడ్డారు. 2008లో ఈ సైట్‍ను సందర్శించిన వి.వి.కృష్ణశాస్త్రి, కె.జితేంద్రబాబు, కల్వకుంట్ల కవిత ప్రభృతులకు నవీన శిలాయుగపు పనిముట్లు కనిపించాయట.
ఈ ప్రాంతంలో అనాది జాతి ప్రజలైన అంధ్‍ (ఆంధ్‍) తెగవారున్నారు. ఈ వ్యాసకర్తకు తోడుగా వచ్చింది కూడా అంధ్‍ జాతి యువకుడు వాగ్మారి రాజు, అతని మిత్రులు గౌరు సందీప్‍, జడల నరేశ్‍లు. వాగ్మారి అంటే ‘పులిని చంపిన’ అని అర్థం. తొలి తెలుగు రాజులు ఆంధ్ర శాతవాహనుల పుట్టుక కథలో కూడా ‘పులి’ ప్రస్తావన వస్తుంది. అంధ్‍ సంస్క•తీ కరణమే ఆంధ్ర. కాబట్టి ఇక్కడ కనిపిస్తున్న జలదుర్గం ఆంధ్రుల మొదటి స్థావరాల్లో ఒకటై ఉంటుంది. ఇక్కడి జలదుర్గం చాలా అందంగా ఉంది. వ్యూహాత్మకంగానూ ఉంది. దాని చుట్టూ పటిష్టమైన ఎత్తైన కోటగోడ, దాని చుట్టూ కడెం నది రెండు పాయలుగా చీలి పశ్చిమం నుంచి తూర్పువైపు పారి మళ్ళీ ఒకటిగా కలిసిపోతుంది. కోట, నీటి మధ్య ఎత్తైన ప్రదేశంలో రాజస్థానం, ఆంఫి థియేటర్‍, అంతఃపురం, ప్రధానోద్యోగులు, సైనికుల స్థావరాలున్నట్లు ఆనవాళ్లు కన్పిస్తున్నాయి. అయితే ఈ ప్రాంతమంతా ఇప్పుడు అడవి ముదిరిపోయి రాజకాంతి తగ్గి ప్రకృతి శోభ పరిఢవిల్లుతోంది.
ఈ స్థలాన్ని ప్రభుత్వం అతి కొద్ది ఖర్చుతో పర్యాటకులకు అందుబాటులోకి తేవచ్చు. ఈ ప్రాంత భూములు కూడా ప్రభుత్వ ఆధీనంలోనే ఉన్నాయి కాబట్టి జలదుర్గం పరిసరాల్లో ప్రాథమిక తవ్వకాలు చేపట్టి చక్కటి పార్కులను పెంచితే పర్యాటకులకు పరమానందాన్ని పంచినట్లు అవుతుంది.
(‘తెలంగాణ కొత్త విహార స్థలాలు’ పుస్తకం నుంచి) ప్రతులకు: తెలంగాణ రిసోర్స్ సెంటర్‍, చంద్రం 490, వీధి నెం.12, హిమయత్‍నగర్‍, హైదరాబాద్‍-29. తెలంగాణ. వెల: రూ.100

  • ద్యావనపల్లి సత్యనారాయణ,
    ఎ : 94909 57078

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *