మణి‘ప్రవాళ’శైలి

పగడాల దీవులు, రెక్కలగుర్రాలు మొదలయినవాటి గురించి జానపద కథలలో వింటుంటాం. అందమయిన వాటినీ పగడాలలా ఉన్నాయని అంటుంటాము. ఇవి ఇంతగా జనాదరణ పొందటానికి వీటి సులభ లభ్యత, అందుబాటు ధరతో పాటు భారతదేశానికి పెద్ద తీరప్రాంతం ఉండటం కూడా ఒక కారణం కావచ్చు. తెలుగు ఆడపడుచులకు మంగళసూత్రంలో భాగమై, నవరత్నాలలో ఒకటిగా, అంగారకగ్రహానికి ప్రతీకగా మనకు సుపరిచితమైన ఈ పగడాలు ఖనిజప్రపంచంలోనివి కావు, ముత్యాలలాగే ఇవికూడా జీవసంబంధ పదార్ధాలు. సిలెంట్రాట వర్గానికి చెందిన సముద్రజీవులు, కొన్ని సముహలుగాను, వంటరిగాను జీవిస్తాయి. వీటిని కోరల్‍ అంటారు. వీటి బాహ్య కవచం కాల్షియం కార్బోనేట్‍ మరియూ ప్రోటీన్‍ల వల్ల ఏర్పడుతుంది. ఈ కవచం కొన్నిరకాల పగడాలలో మంచి రంగు మెరుపు కలిగి ఉండి రత్నంగా ఉపయోగపడుతుంది. ఉపరత్నంగా పరిగణించబడుతున్న పగడానికి ఉన్న ఇతర పేర్లు విద్రుమ, ప్రవాళ, అంగారకమణి, అంబోధివల్లభ, భౌమరత్న, రక్తాంగలతామణి, అంభోధిపల్లవ, రక్తాంగ, రక్తాంకుర, జంతువాలక మొదలయినవి.


పగడం అంటే:
ప్రవాళ అనే సంస్క•త శబ్దం యొక్క దేశీరూపం పగడం. ప్రవాళం అంటే కొత్తచిగురు, మొలక అని అర్ధం. ఆకారంలో మొక్కలు, తీగలకు దీనికి ఉన్న పోలిక వల్ల ఆ పేరు వచ్చింది. ప్రవాళ శబ్దం పొడవాటి మరియు అందమైన జుట్టుకు కూడా ఉపయోగిస్తారు. ప్రస్తుతానికి ఈ పదం వివిధ ఉత్పన్న అర్థాలలో కూడ ఉపయో గించబడింది.


పగడం చరిత్ర:
పగడం పురాతనకాలం నుండి భారతీయులకు ఔషధం మరియు ఆభరణాలుగ పరిచయం. వేదాలలో హరతల (arsenic trysulphide) మరియు మనశిలా (Arsenic disulfide)వంటి ఇతరలోహాలు మరియు ఖనిజాలతో ప్రస్తావించబడింది. మనుస్మ•తిలో కూడా దీని ప్రస్తావన ఉంది. విష్ణుపురాణం ప్రకారం కుశద్వీపంలో ఏడు పర్వతాలు ఉన్నట్టు అందులో ఒక్కటి ‘‘విద్రుమ’’ గా పేర్కొనబడింది. గరుడ పురాణం, మహాభారతం మరియు భగవద్గీతలలో కూడా ప్రవాళం ప్రస్తావనలు ఉన్నాయి. చరకసంహిత, రసహ•దయతంత్ర వంటి ఆయుర్వేద గ్రంథాలలో ప్రవాళం ప్రస్తావనలు ఉన్నాయి.
వరాహమిహిరుడు ప్రస్తావించిన 22 రత్నాలలో ప్రవాళం కూడా ఉన్నది. పూర్వకాలంలో అనేక ప్రాంతాలలో పగడాలు దొరుకుతున్నట్టు ఠాకూర్‍ పేరు తన ‘‘రత్నపరీక్ష సప్త గ్రంధ సంగ్రహం’’లో పేర్కొన్నాడు అందులో చైనా, మహాచీనా, పార్సీక, సింహాళ, కావేరి మధ్యధరాసముద్రం, ఎర్రసముద్రం ప్రాంతలతో పాటు నేపాల్‍, కాశ్మీర్ల ప్రస్తావన కూడా ఉన్నది. వ్యాపారకేంద్రాలను ఉత్పత్తి స్థానాలను కలిపి పేర్కొనడం దీనికి కారణం.
గ్రీకు పురాణాల ప్రకారం బహుతలల రాక్షసుడు ‘మెడుసా పెర్సియస్‍’ చేత చంపబడ్డాడు. పెర్సియస్‍ అతని రక్తంచేయి సముద్రంలో కడుగుతారు, గోర్గాన్‍ రక్తం చుక్కలు (ఇది మానవులను శిలగా చేసే శక్తిని కలిగి ఉంటుంది) సముద్రంలో చిందరవందరగా పడి, పగడాలుగా అయింది.
స్విట్జర్లాండ్‍లోని నియోలిథిక్‍ సమాధులలో (8000BC) పగడాలను అలంకరణగా ఉపయోగించారు. 3000 BC లో సుమేరియన్‍ మరియు ఈజిప్షియన్‍ ఆభరణాలుగా ఉపయోగించారు. అన్ని ఆసియా సంస్క•తులలో పగడపు ఆభరణాలు అత్యంత విలువైనవి. చైనీస్‍ వీటిని మొక్కలు అని పొరపాటుగా భావించారు. ప్లిని దీని జంతువు మరియు మొక్కల లక్షణం కారణంగా దీనికి జూఫైట్‍ అని పేరు పెట్టారు.


గ్రాహ్య ప్రవాళలక్షణాలు:
పురాతన రత్నశాస్త్రం ప్రకారం స్నిగ్ధ (జిడ్డుగా), స్థూల, పక్వబింబిఫలాభ (పండిన బింబిఫలం వంటి ఎరుపు), వ•త్త, దీర్ఘ, నిర్బ్రణ (పగుళ్లు లేకుండా), అదే సమయంలో నాతిదీర్ఘ (చాలా పొడవుగా లేని), అతిరక్త (ముదురు ఎరుపు), అవక్రా (సుష్ట), అవరానా (ఎటువంటి చీలిక లేకుండా), అయత (నిలువుగా విస్తరించబడింది), పిండ (స్థూపాకార) రంగగాత్రం (రంగు సమానంగా విస్తరించి ఉండటం), విధుతి (మెరిసే), కోమల (మ•దువైన), శిశిరవిహీన (పోరస్‍ నిర్మాణం లేకుండా), గురు (భారీ), చీర్ధుయతి (దీర్ఘకాల మెరుపును కలిగి ఉంటుంది), ద•ఢ (కఠినమైన), ధార్య (ధరించదగినది) మరియు ఎటువంటి దోషంలేని పగడము ఆభరణాలు మరియు ఆయుర్వేద ఔషధం కోసం ఉన్నతమైనదిగా పరిగణించబడుతుంది.


అగ్రాహ్య ప్రవాళలక్షణాలు:
శారదధామం (అత్యంత తెలుపు) సూక్ష్మ (చిన్నది), వక్రం (అసమానం), రూక్ష (ఎండిపోయిన), విద్ధా (విరిగిన), క•ష్ణ (నలుపు), లఘు (చిన్న/తేలిక), గౌరాంగ (తెలుపు) జలక్రాంతం (మసక) కోటరం (పోరస్‍) మొదలైన లక్షణాలు కలిగిన వాటిని పనికిరానివిగా భావిస్తారు.
జీవసంబంధ సమాచారం:
ఫైలం : సినిడారియా
సబ్‍ ఫైలం, మరియు తరగతి: ఆంథోజోవా
ఆర్డర్‍ : ఆల్సియోనేసియే
కుటుంబం : కోరల్లిడే
జాతి : కోరల్లియం
జాతి : కోరలియం రుబ్రం ((C.japanicum C.elatius ఇతర రత్నప్రజాతులు)

పసిఫిక్‍, హిందూ మరియు అట్లాంటిక్‍ మహాసముద్రాల తీర ప్రాంతాల్లో పగడపు దిబ్బలు కనిపిస్తాయి. భారతదేశం 8129 కి.మీ తీరప్రాంతాన్ని కలిగి ఉంది. పగడపు రీఫ్‍ నిర్మాణాలు గల్ఫ్ ఆఫ్‍ కచ్‍, గల్ఫ్ ఆఫ్‍ మున్నార్‍, లక్షద్వీప్‍ మరియు అండమాన్‍ మరియు నికోబార్‍ దీవులకు పరిమితమై ఉంది. ఈ పగడపు దిబ్బలు త•తీయ (2.4 కోట్ల సంవత్సరాల క్రితం) మరియు క్వాటర్నరీ (18 లక్షల సంవత్సరాల క్రితం) యుగాలలో ఏర్పడినవి. ఇవి ఏడు ప్రాంతాలలో కనిపిస్తాయి.


పగడపు దిబ్బలు:
గోవాతీరం, కేరళతీరం, పాక్‍ జలసంధి, గల్ఫ్ ఆఫ్‍ కచ్‍, గల్ఫ్ ఆఫ్‍ మన్నార్‍, (అంచుగల దిబ్బలు fringing Reefs) మరియు అండమాన్‍ మరియు నికోబార్‍ దీవులు, లక్షద్వీప్‍లో Atoll రకం పగడపు దీవులు ఉన్నాయి. Coralliidae family లో 30 జాతుల దాకా ఉన్నాయిC.rubram, C.japanicum C.elatius అనే 3 జాతులు మాత్రమే విలువైన పగడం జాతులు. నైడేరియా వర్గంలో 10,000 దాకా ప్రజాతులు ఉన్నాయి.


పగడాల స్థూల (మాక్రోస్కోపిక్‍) లక్షణాలు:
ఇది చిన్న పొదలాగ కనిపించే, సన్నని ఎరుపు రంగు స్థూపాకార శాఖలుగా ఉంటుంది. ఇది అనేక చిన్న భాగాలుగా రూపొందించబడింది, ప్రతి భాగం సూక్ష్మంగా మరియు నిలువుగా అసమానంగా ఉంటుంది. ఇది సువాసన సుగంధాన్ని పోలి ఉంటుంది. ఇది పెళుసుగా ఉంటుంది. ముడిస్థితిలో కాండం మరియు శాఖలు కార్టికల్‍ పదార్ధంతో కప్పబడి ఉంటాయి. ఇది చిన్న పాలిప్స్ యొక్క నివాసం.
పగడాల సూక్ష్మ లక్షణాలు:
పైనుండి కేంద్రీక•త వలయాలతో రూపొందించబడిన వ•త్తాకార డొమైన్‍తో చుట్టుముట్టబడిన మెడుల్లారీ జోన్‍ను చూడవచ్చు. గ్రోత్‍ రింగ్‍లు వేవ్‍లెట్‍లను ప్రదర్శిస్తాయి. వేవ్‍లెట్‍ల అంతర్గత నిర్మాణంలో వలయాకారపు ఇంటర్‍ఫేస్‍లలోని పొరల దొంతరలు ఉంటాయి.
పగడం భౌతిక లక్షణాలు:
రంగు: లేతగులాబీ, లోతైన గులాబీ ఎరుపు, సాల్మన్‍ గులాబీ, ఎరుపు నుండి గాఢ రక్తపు ఎరుపు, తెలుపు, నారింజ నలుపు మరియు బూడిద రంగు.
కాఠిన్యం : 3.5 to 4.0 (మోహస్‍ పట్టికలో)
సాంద్రత : 2.6 నుండి 2.7
వక్రీభవన సూచిక : 1.486 నుండి 1.658

నిర్దిష్ట గురుత్వాకర్షణ : 2.65 నుండి 2.7
పారదర్శకత : అర్ధపారదర్శక నుండి అపారదర్శక
క్రిస్టల్‍ వ్యవస్థ : Amorphous
మెరుపు : విట్రియస్‍


చీలిక : ఏదీ లేదు
రసాయన సూత్రం : CaCo3 కాల్షియం కార్బోనేట్‍-7 to 8%, మెగ్నీషియం కార్బోనేట్‍- 3%, ఇసుక (సిలికా)-2%, ట్రేస్‍లలో ఐరన్‍ మరియు మెగ్నీషియం, సేంద్రీయ పదార్థం మరియు నీరు-16%, పగడం నుండి తీసిన కాల్షియంలో 24% కాల్షియం మరియు 12% మెగ్నీషియం మరియు 70% కంటే ఎక్కువ ఖనిజాలతో ఉండటం వల్ల ఆయుర్వేదంలో ఉత్తమమైనది గా పరిగణించబడుతుంది.


పగడాలముద్ద (ప్రవాళమూలం) మరియు సన్నని (ప్రవాళ శాఖ) అనే రెండురకాలు ఉపయోగంలో ఉన్నాయి.
రత్నప్రజాతిపగడాలను వాటి ప్రత్యేక స్వరూపం మరియు విలక్షణమైన నిర్మాణం వల్ల గుర్తించటం వీలుపడుతుంది. నిజమైన రత్నపు పగడం మైనపు/నూనె మెరుపును కలిగి అర్థపారదర్శకంగా/అపారదర్శకంగా ఉంటుంది మరియు సమానపు పగులు కూడా ఉంటుంది మరియు రంగు విస్తరణ అసమానంగా ఉంటుంది. క్రాస్‍ సెక్షన్‍లో (అడ్డు కోత) వలయాల వంటి నిర్మాణాలు కనిపిస్తాయి. నిలువు కోతలో ‘సమాంతర చారలు/పొడవైన కమ్మీలు’ కనిపిస్తాయి. గుంటలు, పోక్‍మార్క్లు కూడా ఉండొచ్చు. యాసిడ్‍ వేసినప్పుడు పొక్కులు వస్తాయి. పగడపు ‘సూక్ష్మనిర్మాణం’ పగడం కాని వాటిలో
ఉండదు. ఐసిస్‍ హిప్పురిస్‍ (బంబూ కోరల్‍) అనే తెలుపురంగు కోరల్‍ రత్నప్రజాతులు కోరల్‍ ను పోలి ఉంటుంది. ఈ కారణంగా దీనిని రంగువేసి రత్న ప్రజాతి పగడంగా చెలామణి చేస్తారు. జిల్సన్‍ కోరల్‍ (అనుకరణ పగడము) దీనిలో రంగు యొక్క అసమాన విస్తరణ భేదం ఉండదు. ఫైన్‍-గ్రెయిన్డ్ టెక్స్చర్‍ ఉంటుంది. అపారదర్శకంగా ఉంటుంది. రంగువేసిన ఎముక కూడా జెమ్‍ గ్రేడ్‍ కోరల్‍గా చలామణి చెయ్యబడుతోంది. దీని స్ప్లిగంటరీ ఫ్రాక్చర్‍ మరియు గుండ్రని రంధ్రం, అపారదర్శకంగా ఉండటం వంటి లక్షణాలతో దీనిని గుర్తించవచ్చు. రంగు అద్దిన పాలరాయి కూడా పగడంగా చలామణి చెయ్యబడుతోంది. ఐతే ఇందులో ఫైన్‍ గ్రైన్‍ టెక్సచర్‍, అసమానపగులు ఉంటుంది. అపారదర్శకంగా ఉంటుంది. ఎరుపురంగు ప్లాస్టిక్‍ పూసలను వేడిసూది కుచ్చటం ద్వారా గుర్తించవచ్చు. దీనిలో ‘‘చేరికలు’’ (inclusions) కూడా ఉంటాయి. ఎరుపురంగు గాజుపూసలను (Redcolored glass beads) కంకోయిడల్‍ ఫ్రాక్చర్‍ ద్వారా గుర్తించవచ్చు. పైగా బుడగలు చేరికలుగా ఉంటాయి. రంగు వేసిన పగడం ఎసిటొన్‍ టెస్ట్ ద్వారా గుర్తించవచ్చు. శంఖం ముత్యం (Conch pearl)ను ‘‘ఫ్లేమ్‍ స్ట్రక్చర్‍ ‘‘ద్వారా గుర్తించవచ్చు.


వాణిజ్య ప్రవాళం:
పగడాలకు పూర్వం ఇటలీ అతిపెద్ద మార్కెట్‍గా ఉండేది. స•జనాత్మకమైన డ్రమ్‍ వంటి పగడపుపూస ఇటలీలో మొదట రూపొందించబడింది. ఇవి పట్టుమార్గంలో (silk route)టిబెట్‍ మరియు జపాన్లకు వ్యాపించాయి. ఈ ఇటాలియన్‍ ట్రేడ్‍మార్క్ అనేక శతాబ్దాలపాటు విజయవంతంగా కొనసాగింది. 1847లో రక్తం వంటి ఎరుపు పగడంను మార్కెట్‍లోకి జపాన్‍ ప్రవేశపెట్టింది. అది తక్షణమే ప్రజాదరణ పొందింది. తైవాన్‍ 1964లో పగడపు మార్కెట్‍లోకి ప్రవేశించి 80% మార్కెట్‍షేర్‍ను చేజిక్కించుకుంది. 1984నాటికి తైవాన్‍ పగడాలు 90% జపాన్‍ మరియు ఇటలీకి ఎగుమతి చేయబడ్డాయి. ఇటలీలోని పగడాలు తక్కువ లోతు సముద్రం నుండి వస్తాయి. పగడాలు చిన్నవి, 10 cm కంటే తక్కువ వ్యాసం కలిగి ఉంటాయి కాబట్టి సేకరణ సులభతరం. ఇటలీ పగడాలు సున్నితమైనవి వాటితో తయారు చేసిన ఆభరణాలు నాణ్యమైనవి. తైవాన్‍ పగడం 200 మీటర్ల లోతులో, కొన్ని మీటర్ల పరిమాణం వరకు పెరుగుతుంది అందువల్ల ఇది శిల్పం, అలంకరణ వస్తువుల చెక్కడాలకు అనువుగా ఉంటుంది.


పగడాల ఉపయోగాలు :
విలువైన పగడం నగలు, అలంకార, శిల్పం చెక్కడం, వివిధ రకాల కళా వస్తువుల తయారీకి, స్నఫ్‍ బాక్సుల తయారీ మొదలైన వాటిలో పయోగించబడుతుంది. ఇది ఆలయ ఆచారాలలో కూడా పయోగించబడుతుంది. ఔషధంగా పగడాన్ని ఆయుర్వేదం, సిద్ధ మరియు యునానిలో విస్త•తంగా ఉపయోగిస్తారు.
ఇది సేంద్రీయ కాల్షియం యొక్క చాలా మంచి మూలం. పోషక పదార్ధాలుగా ఉపయోగిస్తారు. ఎముకల చికిత్సలో, అనోరెక్సియా, డయాబెటిక్‍, అల్సర్‍, చర్మవ్యాధి, కంటి వ్యాధి, రక్తహీనత మరియు కామెర్లు వంటి వ్యాధుల చికిత్సకు పనికివస్తుంది. దీనిని పిష్ట (పౌడర్‍), భస్మంగా (Ash) ఔషధాలలో ఉపయోగిస్తారు.


పగడాల ఉనికి:
పగడపు దిబ్బలు ఉష్ణమండల మరియు ఉపఉష్ణమండల సముద్రాలలో కనిపిస్తాయి. ఇవి నెమ్మదిగా పెరుగుతాయి మరియు పర్యావరణపరంగా చాలా సున్నితమైనవి. వాటిని భూమిపై ఉండే వర్షపు అడవులతో పోల్చవచ్చు. ఇవి జీవవైవిధ్యానికి అనుకూలంగా ఉంటాయి. పగడాలు సాగు చేయటం సాధ్యం కాదు. కేవలం సముద్రం నుండి సేకరించాలి. అంతకంతకూ పెరుగుతున్న వాణిజ్య సేకరణ విలువైన వనరులపై ఒత్తిడి తెస్తోంది. చైనా కొన్ని పగడపు జాతులను అంతరించిపోతున్నట్లు ప్రకటించింది మరియు వాటిని రక్షించడానికి చర్యలు చేపట్టింది. భారతదేశంలో పగడపు దిబ్బల కాలుష్యం జరుగుతోంది. ఇప్పుడు మేల్కొనకపోతే నష్టం వాటిల్లుతుంది. భారతదేశంలో చనిపోయిన పగడపు దిబ్బలను పునరుద్ధరించడానికి పరిరక్షణ ప్రయత్నాలు జూలాజికల్‍ సర్వే ఆఫ్‍ ఇండియా(GSI) ద్వారా కొనసాగుతున్నాయి. వివిధ వాతావరణం మరియు మానవకారణాలవల్ల గల్ఫ్ ఆఫ్‍ కచ్‍ పగడపు దిబ్బలు నాశనమయ్యాయి.


జూలాజికల్‍ సర్వే(GSI) శాస్త్రవేత్తలు నశించిన పగడాలు 10000 సంవత్సరాల నాటివని కనుగొన్నారు. అక్కడి పర్యావరణ పారామితులు మరియు పగడాల యొక్క జీవ పారామితులను జాగ్రత్తగా అధ్యయనం చేసిన తర్వాత అదే పగడాలు గల్ఫ్ మున్నార్‍ వద్ద మనుగడలో ఉన్నట్లు తెలుసుకొని వాటినుండి ‘‘అంటుకట్టే పద్ధతి’’ ద్వారా గల్ఫ్ ఆఫ్‍ కచ్‍ లోని కోరల్స్ను విజయవంతంగా బతికించారు.


మధుర మీనాక్షి సుందరేశ్వరుడు మందిరములో ఉన్న ప్రసిద్ధ నెక్లెస్‍ ‘‘పవాల తడవ మాలై’’ పాలిష్‍చేసిన పగడపుశాఖ ప్రత్యేక సందర్భాలలో ఇది పూర్తి లాకెట్టుగా దేవతకు అలంకరించ బడుతుంది.
పెటోస్కీరాయి (Petosky Stone) ఒక శిలాజ పగడపు సున్నపురాయి. ఇది 350 మిలియన్‍ సంవత్సరాల నాటిది ఇది మొదట పెటోస్కీ ప్రాంతంలో సావనీర్‍లుగా విక్రయించ బడింది కాబట్టి అ పేరు వచ్చింది. లేక్‍ మిచిగాన్‍ ప్రాంతంలో డెవోనియన్‍ కాలం శిలలలో ఇవి విరివిగా దొరుకుతాయి. సుమారు రెండు మిలియన్‍ సంవత్సరాల క్రితం జరిగిన హిమానీనదం వలన ఈ రాళ్లు మిచిగాన్‍ సరస్సు పరిసరాల్లో విస్తరించి ఉంటాయి. ఈ రాళ్ళు తరచుగా పెటోస్కీకి దూరంగా కూడా బీచ్‍లలో కనిపిస్తాయి. పాలిష్‍ చేసిన ఈ రాళ్ళు అలంకరణ వస్తువులుగా పనికి వస్తాయి.


నీటిపైన తేలియాడే రాళ్లు :
వీటి గురించి మనం సోషల్‍ మీడియాలో వింటుంటాం, వీటిపైన రకరకాల అపోహలు ఉన్నాయి. ఇవి కోరల్‍ (పగడపు) రాళ్లు కోరల్‍ నిర్మాణంలొ ఖాళీ స్థలం కలిగి ఉండటం వల్ల ఇవి నీటి పైన తేలుతాయి. అంతే తప్ప వేరే ఎలాంటి ‘మహిమలు’ ఉండవు.


-చకిలం వేణుగోపాలరావు
డిప్యూటి డైరెక్టర్‍ జనరల్‍ జిఎస్సై(రి)
ఎ: 9866449348

  • శ్రీరామోజు హరగోపాల్‍,
    ఎ : 99494 98698

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *