తీర్పుల్లో పాండిత్యం..?

‘ది ట్రాజెడీ ఆఫ్‍ హమ్లెట్‍’లో షేక్స్పియర్‍ క్లుప్తత గురించి ఇలా అంటాడు. ‘‘తెలివిగల వారి ఆత్మ క్లుప్తత.’ ఈ విషయం సాహిత్యానికే కాదు, చాలా విషయాలకి వర్తిస్తుంది. జీవితాలకి కూడా వర్తిస్తుంది. తీర్పులకి కూడా వర్తిస్తుంది.
చాలా తీర్పులు పేజీలకు పేజీలు వుంటాయి. చాలా మంది న్యాయమూర్తులు ఈ క్లుప్తత అంశాన్ని మర్చిపోయారు. ఒకే విషయం మీద ఒక ప్రముఖమైన తీర్పుని ఉదహరించాల్సిన సమయంలో అలాంటి పది పదిహేను తీర్పులని ఉదహరిస్తారు. మరి కొంతమంది న్యాయమూర్తులు అవసరం లేని తీర్పులని తమ తీర్పుల్లో ఉదహరిస్తూ పోతారు. కొన్ని సార్లు అవి అసంబద్దంగా కూడా వుంటాయి. ఈ తీర్పులని విరివిగా ఉదహరించడం వల్ల తీర్పు పరిధి పెరిగిపోతుంది. పి.హెచ్‍డి థీసిస్‍ కోసం రాసినట్టుగా రాస్తూ పోతున్నారు.


దేశంలోని హైకోర్టులు సుప్రీంకోర్టులు దిగువ కోర్టులు అనుసరించాల్సిన పూర్వాపరాలను అందించాలి. తమ తీర్పుల్లో తెలియచేయాలి. మార్గదర్శకత్వం వహించాలి. అంతేకాదు ఆ పూర్వపరాలు రాజ్యాంగబద్దంగా, శాసనబద్దంగా వుండాలి. అతేకానీ మతపరంగా వుండకూడదు.
తమ తీర్పుల్లో ఉర్దూ కవిత్వాన్ని, సాహిత్యాన్ని ఉదహరించడాన్ని కూడా కొంతమంది తప్పుపడుతున్నారు. ఆ కవిత్వాల సారాంశం కక్షిదారులకి అర్థమవుతుందానన్నది వారి వాదన. నా దృష్టికి వచ్చిన మేరకు తీర్పుల్లో పూర్తిగా ఉర్దూ కవిత్వాన్నో, సాహిత్యాన్నో
ఉదహరించిన తీర్పులు తక్కువ. ఒక విషయాన్ని బలంగా చెప్పడం కోసం మాత్రమే కవిత్వ చరణాలను ఉదహరిస్తున్నారు. వాటిని విమర్శించడం అంత సమంజసంగా అన్పించడం లేదు.


పాకిస్తాన్‍ జైలులో బందీ అయిన ఓ ఖైదీకి సంబంధించిన తీర్పుని ప్రకాశిస్తూ సుప్రీంకోర్టు న్యాయమూర్తి మార్కండేయ ఖర్జూ ఇలా ఫైజ్‍ అహమ్మద్‍ ఫైజ్‍ కవితని ఉదహరించారు.
‘జైలు విషాదంగా వుంది
మిత్రులారా!
గాలికి ఏదైనా చెప్పండి’
పోలీసుల అతిక్రమణల గురించిన ఓ అప్పీలుని విచారిస్తూ న్యాయమూర్తి ఖర్జూ ఇలా ఫైజ్‍ కవితని ఉదరిస్తారు.
‘వాది
అదే విధంగా మద్యవర్తి
ఇద్దరూ తిండి పోతులే
ఎవరి నుండి సలహా తీసుకోవాలి
న్యాయం కోసం ఎక్కడ వెతకాలి’
ఈ విధంగా కవిత్వ చరణాలని తీర్పుల్లో ఉదహరించడాన్ని కూడా కొంతమంది తప్పుపడుతున్నారు. కోర్టు వీటిని ఉదహరించడం వల్ల ఏమి సాధిస్తున్నారని కూడా ప్రశ్నిస్తున్నారు. లిటిగెంట్లకి ఈ కవిత్వ చరణాల సారం తెలుస్తుదా అని సంశయం వ్యక్తపరుస్తున్నారు. ఈ కవితా చరణాలని ఉదహరిస్తూ వాటి శారాన్ని కూడా ఇంగ్లీషులో చెబుతున్నారు. దాని వల్ల జరిగే నష్టం ఏమిటో అర్థం కావడం లేదు. అవి ఏవీ అసంబద్దంగా వుండడం లేదు. పేజీలకు పేజీలు వుండటం లేదు. ఒక విషయాన్ని బలంగా చ్పెటం కోసం ఉదహరిస్తున్నారు. ఈ విమర్శలో న్యాయబద్దత కన్పించడం లేదు.
అయితే తీర్పులు సులభశైలిలో వుండాలి. తీర్పులు వెలువరించడం అంటే మన భాషా పాండిత్యాన్ని ప్రశసించుకోవడం కాదు. ఆ తీర్పుని వెలువరించడానికి, అలాంటి నిర్ణయాన్ని ప్రకటించడానికి గల కారణాలని లిటిగెంట్లకి తెలియ చెప్పే పత్రి తీర్పు. అలాంటి తీర్పులు సరళంగా, సులభంగా వుండాలి. సంక్లిష్టమైన భాష తీర్పుల్లో వుండకూడదు. గొట్టు పదాలు వుండకూదు. లిటిగెంట్లని గందరగోళానికి గురి చేయకూడదు. తీర్పులో ఏముందో తెలుసుకోవడానికి విశ్వప్రయత్నం చేసినట్టుగా వుండకూదు. హిమాచల్‍ ప్రదేశ్‍ హైకోర్టు తీర్పుని ప్రకాశిస్తూ భారత ప్రధాన న్యాయమూర్తి ఇలాంటి అభిప్రాయాన్ని ఆ మధ్య వెలువరించారు. తీర్పు సులభంగా అర్థం కాకపోతే లిటిగెంట్లు అప్పీలుకి వెళతారు. దాని వల్ల కేసుల సంఖ్య పెరిగిపోతుంది. అధిక భారంతో వున్న న్యాయవ్యవస్థ మీద మరింత భారం పడుతుంది.


కొంతమంది న్యాయమూర్తులు తమ తాత్వికతను భాషా పాండిత్యాన్ని తీర్పులో వెలువరిస్తూ వుంటారు. వారు చాలా మంచి తీర్పులు చెప్పినప్పటికి ఈ భాషా పాండిత్యం వల్ల లిటిగెంట్లకే కాదు, న్యాయవాదులకి ఇబ్బందులు ఎదురైనాయి. ఇందుకు ఉదాహరణ సుప్రీంకోర్టు న్యాయమూర్తి క్రిష్ణయ్యర్‍ని ఉదహరించవచ్చు. భారతదేశ న్యాయవ్యవస్థ జ్యురిస్‍కి ఆయన చేసిన సేవ అపురూప మైనది. అయితే ఇంగ్లీషు భాష మీద ఆయనకి వున్న మక్కువ వల్ల ఆ సేవ ఎంతగా గుర్తించబడాలో అంతగా గుర్తించబడలేదు.
తీర్పులలో సరళత వుండాలి. అవి అర్థవంతంగా వుండాలి. అప్పుడే న్యాయస్థాన సామర్థ్యంపై విశ్వసనీయత ద్విగుణీకృతం అవుతుంది. తీర్పులలో సరళత ఎంత అవసరమో, సత్వర పరిష్కారం అంతకన్నా అవసరం.


మంగారి రాజేందర్‍ (జింబో)
ఎ : 9440483001

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *