అదిగదిగో… నవలోకం.. ఏ సెమీకండక్టర్స్ రంగం

ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో ఎలక్ట్రానిక్‍ గాడ్జెట్స్ లేకుండా మనం ఏ పనీ చేయలేము అనడం అతిశయోక్తి కాదేమో! కార్ల నుండి స్మార్ట్ ఫోన్ల వరకు మరియు ఎంఆర్‍ఐ స్కానర్ల నుండి పారిశ్రామిక రోబోట్ల వరకు మనం పనిచేయడానికి, ప్రయాణించడానికి, ఆరోగ్య పరిరక్షణకు, విద్యారంగ పురోగతికి.. ఇలా ప్రతిచోటా ఎలక్ట్రానిక్‍ వస్తువుల ప్రాధాన్యం విస్తరిస్తోంది. అయితే ఈ ఎలక్ట్రానిక్‍ వస్తువులు సమర్ధవంతంగా పనిచేయడానికి సెమీకండక్టర్స్ అన్న చిప్‍లు కీలకమని చెప్పవచ్చు. సెమీకండక్టర్స్ను ఎలక్ట్రానిక్‍ వస్తువుల యొక్క క్రియాత్మక ప్రమాణం (ఖీ•అ••ఱశీఅ•శ్రీ •అఱ••)గా సాంకేతిక రంగ నిపుణులు అభివర్ణిస్తారు. ఇప్పటివరకు సెమీకండక్టర్స్ దేశీయంగా తయారు చేయడంలో వెనుకబడిన, ఇండియా ప్రస్తుతం సెమీకండక్టర్స్ తయారీలో స్వయం సమృద్ధి సాధించేదిశగా వడివడిగా ముందుకు అడుగుల వేస్తోంది. ఈ నేపథ్యంలో సెమీకండక్టర్స్ రంగంలో ఇండియా యొక్క ఆదర్శనీయ ప్రగతి ప్రస్థానం గురించి మనమూ తెలుసుకుందాం…!!


సెమీ కండక్టర్స్ అంటే….

తమ గుండా సులువుగా విద్యుత్‍ను ప్రవహింపచేసే ఉపకరణాలను కండక్టర్స్ అని పిలుస్తారు. కండక్టర్స్ సహజంగా రాగి, అల్యూమినియం, వెండి, ఇనుము లాంటి లోహాల తరగతికి చెంది ఉంటాయి. తమ గుండా విద్యుత్‍ను ప్రవహింపచేయకుండా నిరోధించే పదార్థాలను ఇన్సులేటర్స్ అంటారు. ఇవి సిరామిక్‍ పదార్థాల తరగతికి చెంది ఉంటాయి. కండక్టర్స్లాగా తమగుండా విద్యుత్‍ను సులువుగా ప్రవహింపజేయకుండా మరియు ఇన్సులేటర్స్లాగా తమ గుండా విద్యుత్‍ ప్రవహించకుండా పూర్తిగా నిరోధించకుండా మధ్యస్థ లక్షణాలను కలిగి ఉండే ఉపకరణాలను సెమీకండక్టర్స్ అంటారు. అవసరానుగుణంగా సెమీకండక్టర్స్ విద్యుత్‍ను ప్రవహింపజేస్తూ మరియు నిరోధిస్తూ ఉంటాయి. సిలికాన్‍ మరియు జెర్మెనియంలను సెమీకండక్టర్స్గా ఉపయోగిస్తారు.


సెమీకండక్టర్స్ రంగంలో భారత్‍ ప్రస్థానం:
సెమీ కండక్టర్స్ రంగంలో పురోగతి అన్నది భారతదేశానికి ఎంతో కీలకమైన అంశంగా చెప్పవచ్చు. కారు, స్మార్ట్ ఫోన్స్ మరియు వైద్యరంగానికి సంబంధించిన ఉపకరణాలను విస్త•త స్థాయిలో ఉత్పత్తి చేయడానికి, ఉన్నత శ్రేణి వేతనాలను అందించే ఉపాధి అవకాశాలను భారీ స్థాయిలో సృష్టించడానికి మరియు ఎలక్ట్రానిక్‍ వస్తువులను ఉత్పత్తి చేయడానికి అవసరమైన సెమీకండక్టర్స్ చిప్‍ల దిగుమతులను విదేశాల నుండి గణనీయంగా తగ్గించే దిశలో సెమీకండక్టర్స్ రంగం మనదేశంలో వేగంగా అభివృద్ధి పథంలో పురోగమించాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా ఇండియా 70వ దశకం నుండే తగు చర్యలు చేపట్టింది.
1970 : యునైటెడ్‍ నేషన్స్ డెవలప్‍మెంట్‍ పోగ్రామ్‍ (UNDP) సంస్థ సెమీకండక్టర్‍ టెక్నాలజీ సామర్థ్యాలను అభివృద్ధి చేయడానికి భారతీయ సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకొన్నది.
1979 : సెంట్రల్‍ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్‍ రీసెర్చ్ ఇన్సిస్టిట్యూట్‍ (CEERI) పిలాని రాజస్థాన్‍లో స్థాపించబడింది.
1983 : సెమీకండక్టర్స్ లాబొరేటరీ (SCL) మొహాలి (పంజాబ్‍)లో స్థాపించబడింది.
1988 : సెమీకండక్టర్స్ రీసెర్చ్ అండ్‍ డెవలప్‍మెంట్‍ సెంటర్‍ (SRDC) బెంగళూరు (కర్నాటక)లో స్థాపించబడింది.
2007 : సెమీకండక్టర్‍ పరిశ్రమను ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వం జాతీయ సెమీకండక్టర్‍ పాలసీని ప్రకటించింది.
2017 : భారతదేశంలో ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల తయారీని ప్రోత్సహించడానికి భారతప్రభుత్వం ఎలక్ట్రానిక్స్ మ్యానుఫాక్చరింగ్‍ క్లస్టర్స్ (EMC) పథకాన్ని ప్రారంభించింది.
2021 : సెమీకండక్టర్‍ డిజైన్‍, తయారీ మరియు టెస్టింగ్‍ కోసం భారతదేశాన్ని గ్లోబల్‍ హబ్‍గా మార్చడానికి, భారత ప్రభుత్వం ఇండియా సెమీకండక్టర్‍ మిషన్‍ని ప్రారంభించింది.


దేశీయంగా చిప్‍ల తయారీ – ప్రాధాన్యత :
దేశీయంగా సెమీకండక్టర్స్ తయారీ ఊపందుకున్నట్లయితే దాని వల్ల బహుళ ప్రయోజనాలు ఒనగూరే అవకాశం ఉంది. తద్వారా ఆర్థిక వ్యవస్థలోని విభిన్న రంగాలు నూతన ఒరవడిని సృష్టిస్తాయి. నూతన సాంకేతిక ఆవిష్కరణలు మరియు జాతీయ భద్రతకు కూడా దేశీయంగా సెమీకండక్టర్స్ ఉత్పత్తి కీలకంగా మారే అవకాశం ఉంది. ఈ క్రింది కారణాల రీత్యా దేశీయంగా సెమీకండక్టర్స్ ఉత్పత్తి ఆవశ్యకమని చెప్పవచ్చు.
దిగుమతుల క్షీణత:
ప్రస్తుతం ఎలక్ట్రానిక్‍ వస్తువుల తయారీకి అవసరమయ్యే సెమీకండక్టర్‍ చిప్‍లను మనదేశం చాలా వరకు విదేశాల నుండి దిగుమతి చేసుకుంటోంది. దానివల్ల సరఫరా గొలుసుల్లో (Supply Chains ) అంతరాయాలు, ధరల విషయంలో అస్థిరతలు చోటచుసుకునే అవకాశం ఉంది. కాబట్టి దిగుమతులపై ఆదారపడడాన్ని తగ్గించడం, మరియు సెమీకండక్టర్స్ రంగంలో మనదేశం స్వావలంబన సాధించడానికి దేశీయ తయారీ ఇతోధిక సహకారం అందిస్తుంది.
ఉద్యోగాల కల్పన :
నైపుణ్యం కలిగిన సాంకేతిక నిపుణులకు పెద్ద ఎత్తున
ఉపాధి అవకాశాలు కల్పించే ఒక అత్యున్నత పరిశ్రమ సెమీకండక్టర్స్ పరిశ్రమ. దేశీయంగా సెమీకండక్టర్స్ తయారు చేయడం వల్ల భారీ స్థాయిలో ఉపాధి కల్పన జరుగుతుంది. ఇది అభివృద్ధికి మరియు ఆర్థిక వృద్ధికి దోహదం చేస్తుంది.
దేశీయంగా సెమీకండక్టర్స్ తయారు చేయడం వల్ల సెమీకండక్టర్‍ ఇండస్ట్రీ అసోసియేషన్‍ (ISA) 2021 నుండి 2026 వరకు ఏటా సగటున 1,85,000ల తాత్కాలిక ఉద్యోగాలు, 2027 నాటికి 42000 కొత్త శాశ్వత ఉద్యోగాలు సృష్టించబడతాయని అంచనావేసింది.
నూతన ఆవిష్కరణల కల్పన :
సెమీకండక్టర్స్ రంగం అనేది నిరంతరం పరిణామం చెందుతూ ఉండే పరిశ్రమ. దేశీయంగా వీటిని తయారు చేయడం ఈ రంగంలో వినూత్న ఆవిష్కరణలను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది. తద్వారా ఇది భారత ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనం చేకూర్చి కొత్త ఉత్పత్తులు మరియు నవ సాంకేతికతల కల్పనకు దారితీస్తుంది.
విదేశీ పెట్టుబడుల ఆకర్షణ:
సెమీకండక్టర్స్ ఇండస్ట్రీ, గ్లోబల్‍ ఇండస్ట్రీ. దేశీయంగా చిప్‍ల తయారీ పెద్ద మొత్తంలో విదేశీ పెట్టుబడులను ఆకర్షించే అవకాశం ఉంది. తద్వారా ఈ రంగంలో పెట్టుబడులు పెట్టే అంతర్జాతీయ కంపెనీలకు పెట్టుబడులు పెట్టడానికి మరింత సానుకూల పరిస్థితులు ఏర్పడతాయి.
వ్యూహాత్యక ప్రాధాన్యం:
రక్షణ, అంతరిక్షం మరియు కమ్యూనికేషన్ల వంటి వ్యూహాత్మక రంగాలలో సెమీకండక్టర్స్ కీలక పాత్ర పోషిస్తాయి. దేశీయంగా సెమీ కండక్టర్స్ తయారు చేయడం ద్వారా ఇండియా ఈ క్లిష్టమైన రంగాలలో స్వావలంబన సాధించే అవకాశం ఉంది.


జాతీయ భద్రత :
దేశ రక్షణ రంగానికి అవసరమైన ఆయుధాలు, యుద్ధట్యాంకులు, డ్రోన్లు, అధునాతన యుద్ధ వినామానాలు సమర్థ వంతంగా పనిచేయడంలో సెమీకండక్టర్లు కీలక పాత్ర పోషిస్తాయి. అదేవిధంగా వరదలు, సునామీలు, భూకంపాలు లాంటి విపత్తులను ముందస్తుగా గుర్తించడం, నివారించడం, సహాయక చర్యలు చేపట్టడానికి తోడ్పాటు నందించే ఉపకరణాలు పనిచేయడానికి కూడా అత్యంత అధునాతన చిప్‍లు అవసరం. దేశీయంగా సెమీకండక్టర్స్ తయారు చేయడం వల్ల వీటన్నిటి విషయంలో ఆత్మనిర్భరత సాకారమౌతుంది. రక్షణరంగం మరింత బలోపేతం కావడం జరుగుతుంది.
సవాళ్ళు:
అవస్థాపనా సౌకర్యాల అభివృద్ధి: సెమీకండక్టర్ల యూనిట్లను స్థాపించడానికి విశ్వసనీయమైన విద్యుత్‍ సరఫరా, నీటి వనరులు, రవాణా నెట్‍ వర్క్లు మరియు నైపుణ్యం కలిగిన కార్మికుల లభ్యతతో సహా ముఖ్యమైన మౌళిక సదుపాయాలు అవసరం.
మెరుగైన సరఫరా గొలుసుల నిర్వహణ:
సెమీకండక్టర్స్ తయారీకి బలమైన మరియు సమర్థవంతమైన సరఫరా గొలుసు వ్యవస్థను తయారు చేయడం ఎంతో అవసరం. ముడిపదార్థాలను సకాలంలో చేరవేయడం ద్వారా సరుకు రవాణాను సమర్థవంతంగా నిర్వహించడం, మరియు సరఫరా గొలుసుల్లో అంతరాయాలను తగ్గించాలి.
టెక్నాలజీ అఫ్‍గ్రెడేషన్‍ :
సెమీకండక్టర్స్ పరిశ్రమ వేగంగా అభివృద్ధి చెందుతోంది. కాబట్టి ఈ రంగంలో పరిశోధన మరియు అభివృద్ధి (R&D) పరంగా పెట్టుబడులు మరియు నిరంతర ఆవిష్కరణలు అవసరం. ప్రధానంగా నిధులు మరియు అత్యాధునిక సాంకేతికతల విషయంలో ప్రపంచ ప్రమాణాలకనుగుణంగా సాంకేతికతలను ఉన్నతీకరించడం సవాలుగా మారింది.
నైపుణ్యం కల్గిన వర్క్ ఫోర్స్:
సెమీకండక్టర్స్ చిప్‍ డిజైన్‍, ఫ్యాబ్రికేషన్‍, టెస్టింగ్‍ మరియు ప్యాకేజింగ్‍ రంగాలలో అత్యంత నైపుణ్యం కలిగిన వర్క్ఫోర్స్ అవసరం. నైపుణ్యం కలిగిన నిపుణుల కొరత ఈ రంగాన్ని వేధిస్తోంది. మరియు పరిశ్రమ డిమాండ్‍ కనుగణంగా శ్రామిక వర్గానికి ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి.
ఆర్థికపరమైన మద్దతు:
సెమీకండక్టర్స్ తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు గానూ మౌళిక వసతులు, సాంకేతిక పరిజ్ఞానం, ప్రతిభ కలిగిన నిపుణుల కొరకు పెద్ద మొత్తంలో సబ్సిడీలు, పన్నురాయితీలు, ఆర్థిక ఉద్దీపనలు అందించాల్సి ఉంటుంది. ఇవి ఎంటర్‍ప్రెన్యూర్స్కు సవాల్‍గా నిలిచే అవకాశం ఉంది.
అంతర్జాతీయంగా పోటీ:
సెమీకండక్టర్స్ పరిశ్రమ అంతర్జాతీయ స్థాయిలో తీవ్రమైన పోటీతత్వాన్ని కల్గి ఉంది. ఇప్పటికే ఈ రంగంలో స్థిరపడిన కంపెనీలు అంతర్జాతీయ మార్కెట్‍లో పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నాయి. సాంకేతికత, ధర, మార్కెట్‍ వాటా పరంగా దేశీయ సెమీకండక్టర్స్ తయారీ దారులకు ఇది ఒక ముఖ్యమైన సవాలుగా నిలిచే అవకాశం ఉంది.


స్వావలంబన దిశగా ప్రభుత్వం చేపట్టిన చర్యలు ఇండియా సెమీకండక్టర్‍ మిషన్‍ :
దీనిని 2021లో భారత ప్రభుత్వం రూపకల్పన చేసింది. డిజిటల్‍ ఇండియా కార్పొరేషన్‍లో ఇది ఒక ప్రత్యేకమైన మరియు స్వతంత్రమైన వ్యాపార విభాగం. సెమీకండక్టర్స్ తయారీ మరియు డిజైన్‍ పరంగా ఇండియా గ్లోబల్‍ హబ్‍గా అవతరించడానికి మరియు శక్తివంతమైన సెమీకండక్టర్స్ మరియు డిస్‍ప్లే పర్యావరణ వ్యవస్థను నిర్మించడం దీని లక్ష్యాలు. దీనికి 76000 కోట్ల నిధుల్ని కేటాయించింది. దీనిని ఎలక్ట్రానిక్స్ అండ్‍ ఇన్ఫర్‍మేషన్‍ మంత్రిత్వశాఖ నిర్వహిస్తుంది.


మౌళిక వసతుల అభివృద్ధికి భారీ పెట్టుబడులు :
స్వదేశంలో సెమీకండక్టర్స్ తయారీరంగాన్ని ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం పదివేల కోట్ల డాలర్లను కేటాయించింది. అదేవిధంగా మొహాలిలో 30 సం।।రాల కిందటి సెమీకండక్టర్‍ ల్యాబొరేటరీని ఆధునీకరించేందుకు, 1.2 బిలియన్‍ డాలర్ల పెట్టుబడులు పెట్టేందుకు యోచిస్తోంది. ఉత్పత్తి సామర్థ్యాలను పెంచడం, అంతరిక్ష మిషన్ల వంటి వ్యూహాత్మక అనువర్తనాలకు మద్ధతీయడం దీని లక్ష్యం.
రాయితీలు కల్పించడం :
ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (Production Linked Incentive-PLI) ద్వారా మన దేశంలో సెమీకండక్టర్స్ ఉత్పత్తి ప్లాంట్లను స్థాపించే సంస్థలకు 1.7 బిలియన్‍ డాలర్ల రాయితీ ప్యాకేజీని భారత ప్రభుత్వం ప్రకటించింది. అదేవిధంగా డిజైన్‍ లింక్డ్ ఇన్సెంటివ్‍ స్కీంని కూడా ప్రారంభించి సెమీకండక్టర్స్ని వినూత్నంగా డిజైన్‍ చేసే స్టార్టప్‍ కంపెనీలకు సబ్సిడీలు, రాయితీలు కల్పిస్తోంది.
సెమీకాన్‍ ఇండియా సదస్సుల నిర్వహణ :
2021లో ఇండియా సెమీ కండక్టర్స్ మిషన్‍ను ప్రకటించిన తరువాత మొదటి సెమీకాన్‍ ఇండియా సదస్సు 2022లో బెంగుళూరులో జరిగింది. 2వ సదస్సు 2023లో గుజరాత్‍లోని గాంధీ నగర్‍లో ప్రధాని మోదీ ప్రారంభించారు. ‘‘క్యాటలైజింగ్‍ ఇండియా సెమీకండక్టర్స్ ఎకోసిస్టమ్‍’’ అన్న థీమ్‍తో ఈ సదస్సు నిర్వహించబడింది. కోవిడ్‍-19 కారణంగా చైనా నుండి చిప్‍ల సరఫరా ఆగిపోవడంతో మనదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా సరఫరాగొలుసుల్లో అంతరాయం ఏర్పడి కార్ల ఉత్పత్తి, సరఫరా నిలిచిపోయింది.
ఇలాంటి అవాంతరాలను నిరోధించి ఒక విశ్వసనీయమైన సెమీకండక్టర్స్ ఉత్పత్తి మరియు సరఫరాదారుగా అవతరించేందుకు మరియు అందుకు కావాల్సిన పెట్టుబడులు ఆకర్షించేందుకు ఇండియా క్రమం తప్పకుండా ఈ సదస్సుల్ని నిర్వహిస్తోంది.
ప్రతిభ కలిగిన మానవవనరుల తయారీకి చొరవ:
సెమీకండక్టర్స్ తయారీలో గ్లోబల్‍ హబ్‍గా అవతరించేందుకు ఇండియా వేగంగా పావులు కదుపుతోంది. ఇందులో భాగంగా ఆల్‍ఇండియా కౌన్సిల్‍ ఫర్‍ టెక్నికల్‍ ఎడ్యుకేషన్‍ (AICTE) ద్వారా ఇంజనీరింగ్‍ విద్యకు సంబంధించిన పాఠ్యప్రణాళికల్లో తగు మార్పులు చేసి సెమీకండక్టర్స్ తయారీలో నైపుణ్యం కలిగిన మానవ వనరుల్ని తయారు చేసేందుకు చర్యలు చేపట్టింది.
ఇతర చొరవలు :
2014 మేకిన్‍ ఇండియాతో పాటు ఇటీవల నేషనల్‍ క్వాంటంమిషన్‍ ప్రారంభించింది. అదే విధంగా నేషనల్‍ రీసెర్చి ఫౌండేషన్‍ స్థాపించి దేశీయంగా పరిశోధనల్ని ప్రోత్సహించేందుకు రూ।। 50,000 కోట్ల నిధుల్ని కేటాయించింది.
సెమీకండక్టర్స్ – అనువర్తనాలు :
ఎలక్ట్రానిక్స్ రంగం : ఎలక్ట్రానిక్స్ రంగంలో సెమీకండక్టర్స్ కీలకమని చెప్పవచ్చు. ఇందులో భాగంగా మొబైల్‍ఫోన్స్, ల్యాప్‍టాప్స్, మైక్రోవేవ్‍ఓవెన్స్, రిఫ్రిజిరేటర్లలో సెమీకండక్టర్లను వినియోగిస్తారు.
సోలార్‍ టెక్నాలజీ : సోలార్‍ సెల్స్ లేదా ఫోటోవోల్టాయిక్‍ సెల్స్ సెమీకండక్టర్స్ను తయారు చేసే పదార్థాలైన సిలికాన్‍ లేదా గాలియం ఆర్సెనైడ్‍తో తయారవుతాయి. ఇవి సూర్యకాంతిని విద్యుత్‍శక్తిగా మారుస్తాయి.
బయోమెడికల్‍ ఇంజనీరింగ్‍ : బయోమెడికల్‍ ఇంజనీరింగ్‍లో బయో సెన్సర్స్, మైక్రోప్లూయిడిక్‍ చిప్స్, ఇంప్లా•ట బుల్‍ డివైజెస్‍లతో సెమీకండక్టర్లను వాడతారు. వైద్యపరమైన అంశాలను పర్యవేక్షించడానికి, నిర్ధారించడానికి మరియు చికిత్స చేయడానికి వీటిని వాడతారు.
ఆటోమొబైల్‍ ఇండస్ట్రీ : వాహనాలలోని మైక్రోకంట్రోలర్స్, సెన్సర్స్, పవర్‍మాడ్యూల్స్ మరియు రాడార్‍ సిస్టమ్స్ నందు సెమీకండక్టర్స్ను వాడతారు. వీటి ద్వారా వాహనాల పనితీరు, భద్రత, సామర్థ్యాలను మరింత మెరుగుపరచవచ్చు. అదేవిధంగా ఇంజన్‍ కంట్రోల్‍, యాంటిలాక్‍ బ్రేకింగ్‍ సిస్టమ్స్, ఎయిర్‍బ్యాగ్స్, నావిగేషన్‍ సిస్టమ్స్, అటానమస్‍ డ్రైవింగ్‍ సిస్టమ్స్లలో కూడా సెమీకండక్టర్స్ని వాడతారు.
ఏరోస్పేస్‍ అండ్‍ డిఫెన్స్ : ఎయిర్‍ క్రాఫ్టస్, శాటిలైట్స్, రాకెట్స్, మిసైల్స్ మరియు రాడార్‍లలో వినియోగించే మైకోప్రాసెసర్స్, మెమరీచిప్స్, రేడియో ఫ్రీక్వెన్సీ మాడ్యూల్స్ మరియు ఇన్‍ఫ్రారెడ్‍ డిటెక్టర్స్లో సెమీకండక్టర్స్ని వాడతారు.


పోటెత్తుతున్న పెట్టుబడులు :
దేశీయంగా సెమీకండక్టర్స్ తయారీ చేపట్టి, ఈ రంగంలో గ్లోబల్‍ హబ్‍గా అవతరించేందుకు భారతప్రభుత్వం పైన చేపట్టిన చర్యల ఫలితంగా ప్రపంచంలో వివిధ అగశ్రేణి కంపెనీల నుండి మన దేశంలోకి పెట్టుబడులు వరదలా ప్రవహిస్తున్నాయి.
గుజరాత్‍లోని సనంద్‍లోని సెమీకండక్టర్‍ యూనిట్‍ ఏర్పాటు చేయడానికి అమెరికాకు చెందిన మైక్రాన్‍ కంపెనీ ప్రతిపాదనను 2023 జూన్‍లో కేంద్రం ఆమోదించింది. గుజరాత్‍లోని ధొలేరాలో తైవాన్‍కు చెందిన పవర్‍చిప్‍ సెమీకండక్టర్‍ మ్యానుఫాక్చరింగ్‍ కార్ప్ (PSMC)తో కలిసి టాటా ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్‍లిమిటెడ్‍ (TEPL) సెమీకండక్టర్‍ ఫ్యాబ్‍ను నెలకొల్పుతోంది. టాటా సెమీకండక్టర్‍ అసెంబ్లీ మరియు టెస్ట్ ప్రైవేట్‍ లిమిటెడ్‍ అస్సాంలోని మోరిగావ్‍లో సెమీ కండక్టర్‍ యూనిట్‍ ఏర్పాటు చేస్తోంది.
జపాన్‍కు చెందిన రెనెసాస్‍ ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్‍, థాయ్‍లాండ్‍కు చెందిన స్టార్‍ మైక్రో ఎలక్ట్రానిక్స్ భాగస్వామ్యంతో గుజరాత్‍లోని సనంద్‍లో సెమీకండక్టర్‍ యూనిట్‍ని ఏర్పాటు చేస్తోంది. ఇజ్రాయిల్‍ సంస్థ సైతం భారత్‍లో చిప్‍లను తయారు చేయాలని లక్షిస్తోంది. వీటి ద్వారా 1,25,600 కోట్ల రూ।।ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. వీటి ద్వారా ప్రత్యక్షంగా 20వేల మందికి, పరోక్షంగా 60వేల మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
చివరిగా :
ప్రస్తుతం ప్రపంచం నాల్గవ పారిశ్రామిక విప్లవం వైపు (Industry 4.0) శరవేగంగా పురోగమిస్తోంది. సెమీకండక్టర్లు దీనికి వెన్నుముకగా నిలుస్తాయి. ఆత్మనిర్భర్‍ భారత్‍ కార్యక్రమం కింద చిప్‍ల తయారీ, కూర్పు రంగాల్లో అంతర్జాతీయ స్థాయిలో ఉన్నత శిఖరాల నధిరోహించాలని భారత్‍ కృతనిశ్చయంతో ఉంది. 2035 కల్లా లక్ష కోట్ల డాలర్ల సెమీకండక్టర్‍ మార్కెట్‍ను సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకుంది. కేంద్ర ప్రభుత్వ ఆలోచనలకనుగుణంగా దేశంలో మొట్టమొదటి సారిగా గుజరాత్‍ 2022లో ప్రత్యేక సెమీకండక్టర్‍ విధానాన్ని ఆవిష్కరించింది. తరువాత స్థానాల్లో ఉత్తరప్రదేశ్‍, ఒడిశాలు నిలిచాయి. అంతర్జాతీయ స్థాయిలో సెమీకండక్టర్స్ రంగంలో కేవలం కొన్ని దేశాల గుత్తాధిపత్యాన్ని నిరోధించి సరఫరా గొలుసుల్లో తలెత్తే అంతరాయాలను నివారించడం కోసం సెమీకండక్టర్స్ రంగంలో ఒక గ్లోబల్‍ హబ్‍గా అవతరించాలన్న ఇండియా ఆశలు నెరవేరాలని మనమూ ఆశిద్దాం.

పుట్టా పెద్ద ఓబులేసు,
స్కూల్‍ అసిస్టెంట్‍, జిల్లా పరిషత్‍ ఉన్నత పాఠశాల
రావులకొలను, సింహాద్రిపురం, కడప
ఎ : 9550290047

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *