పిల్లల బాధ్యత మనందరిదీ…

సెలవులు ముగిసాయి. బడులు తెరిచారు. పిల్లలతో బడులన్నీ కళకళ లాడుతున్నాయి. ఈ కళకళల వెనుక ఎన్నో నీలి నీడలు దాగున్నాయి. ఈ కళకళలకు దూరంగా ఎంతమంది పిల్లలున్నారు? నిరుడు బడికి వచ్చిన పిల్లలందరూ ఈ ఏడుకూడా వచ్చారా? బడిలో కొత్తగా చేరాల్సిన పిల్లల్లో చాలామంది ఎందుకు రాలేకపోతున్నారు? అందరికీ సమానంగా అందవలసిన విద్య ఎందుకు అందడం లేదు? పిల్లలంతా ఒక్కటేనా? కాదు… కాదు అని వాస్తవాలు చెబుతున్నాయి. దీనికి కారణాలు, పరిష్కారాల గురించి ఆలోచించడం సమాజపు బాధ్యత.


ప్రతి ఏడాదీ డ్రాపవుట్స్ పెరుగుతున్నాయి. తల్లిదండ్రులు పేదవారు కావడమూ, వారు పనికి వెళ్తే మిగతా చిన్న పిల్లల్ని చూసుకోవాల్సి రావడమూ, కుటుంబ పోషణ కోసం తాము కూడా పనికి వెళ్లాల్సి రావడమూ వలన పిల్లలు డ్రాపవుట్స్గా మిగిలిపోతున్నారు.


ఇన్ని అవరోధాల మధ్య కూడా పిల్లలను బడికి పంపుతున్న కుటుంబాలు అనేకం ఉన్నాయి. బడికి వస్తున్న పిల్లలు అనేక అసమానతలు కలిగిన సామాజిక, ఆర్థిక, సాంస్క•తిక, స్థితులు నేపథ్యంగా కలిగిన వారు. ఈ నేపధ్యాల ప్రభావం వారి మానసిక స్థితిగతుల్ని నిర్ణయిస్తుంది. అంటే పిల్లలు వివిధ రకాల మానసికస్థితి కలిగి వుంటారు. బడికి వచ్చే పిల్లలు తమ తల్లిదండ్రులతోను, కుటుంబంతోను గడిపే సమయం కంటే బడిలోనూ, ఉపాధ్యాయులతోనూ గడిపే సమయం ఎక్కువ. ఈ వివిధ మనఃప్రవృత్తులు కలిగిన పిల్లలను మెయింటేన్‍ చేయవలసిన బాధ్యతబడిదీ, ఉపాధ్యాయులదీ. బడి అంటే కేవలం పాఠ్యగ్రంథాలు బోధించేస్థలం మాత్రమే కాదు. బడి అంటే పిల్లల వ్యక్తిత్వ నిర్మాణ కర్మాగారం కూడా. ఈ పిల్లలే రేపటి సమాజాన్ని నడిపించవలసిన నిర్మాణాత్మక శక్తులని గుర్తించాలి. వారిని సోషల్‍ ఇంజనీర్లుగా తీర్చిదిద్దాలి. ప్రజాస్వామిక విలువలగురించీ, వాటిని కాపాడుకోవాల్సిన అవసరం గురించీ అవగాహన కల్పించాలి. పిల్లలు సంచరించే అన్ని చోట్లా అంటే కుటుంబాలలోనూ, బడుల్లోనూ, స్నేహాలూ, బంధుత్వాలూ, ఇరుగుపొరుగు అన్ని చోట్లా మానవీయ వాతావరణం ఉండాలి. పిల్లల్లో తమతోటి పిల్లల పట్ల ప్రేమ, దయ, క్షమ, స్నేహభావం, తారతమ్యాలు లేని కలివిడితనం తమంతా ఒకటే అనే భావన పెంపొందించాలి. ఎలాంటి తారతమ్యాలు లేని ఆత్మీయ వాతావరణం కల్పించాలి. పిల్లల మానసిక నిపుణుల చేత కౌన్సిలింగ్‍ యిప్పించే పక్రియ నిరంతరం కొనసాగించాలి. సమాజంలో వస్తున్న మార్పులకణుగుణంగా పిల్లలతో మసలు కోవాల్సిన నైపుణ్యాన్నిచ్చే శిక్షణా తరగతులను ఉపాధ్యాయులకు నిర్వహించాలి.


పిల్లల సుస్థిర భవితకు బడులు, ఉపాధ్యాయులు విశ్వాసనీయమైన భరోసాని యివ్వాలి.

(మణికొండ వేదకుమార్‍)
ఎడిటర్‍

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *