సూగూరు గ్రామం మండల కేంద్రమైన పెబ్బేరు నుండి 10 కి.మీ. దూరంలోను, సమీప పట్టణమైన జిల్లా కేంద్రం వనపర్తి నుండి 30 కి. మీ. దూరంలోనూ ఉంది. ఇపుడున్న సూగూరుకు పాతగ్రామం ఆనవాళ్ళున్న సూగూరు పాటిగడ్డ ఉంది.
సూగూరు ఒకప్పుడు సంస్థానం రాజధాని. ‘సొగ’ అంటే ధైర్యం అని అర్థముంది. సొగంఊరు = సొగూరు, రానురాను ‘సూగూరు’ అయింది పలుకుబడిలో. వనపర్తి సంస్థాన మూలపురుషుడు వీర కృష్ణారెడ్డి కడప దగ్గరి జనుంపల్లి నుంచి కృష్ణానది తీరాన ఉన్న పాతపల్లికి చేరుకుని వ్యవసాయం, వ్యాపారాలు చేసాడు. చుట్టు 6 గ్రామాలను స్వాధీనపరచుకున్నాడట వీరకృష్ణారెడ్డి. సూగూరు దేశాధిపతిగా పేరుపొందాడు. ఆర్థికంగా, సామాజికంగానే కాక రాజకీయంగా ఎదిగి పేరు, ప్రఖ్యాతులు పొందిన వీరకృష్ణారెడ్డి ఆనాటి విజయనగరాధీశుల దృష్టిలో పడ్డాడు. మెల్లగా వారి ప్రాపకం సాధించాడు. విజయనగరాధీశుల నుంచి పానుగంటి సీమలోని కొన్ని గ్రామాలకు గుత్తాధిపత్యం పొందాడు. పాలకులకు విధేయుడుగా పాలన సాగించాడు. విజయనగర సామ్రాజ్య సామంతుడిగా నంద్యాల సీమలో వీరకృష్ణారెడ్డి అధికారాలు నిర్వహించినట్టుగా ప్రముఖ చరిత్రకారుడు తూమాటి దోణప్ప అభిప్రాయం. క్రీ.శ. 1518లో తన పరిపాలనకు పాతపల్లికి సమీపగ్రామమైన సూగూరును రాజధానిగా చేసుకున్నాడు. అక్కడే బలమైన కోటనిర్మాణం చేయించాడు. క్రీ.శ.1540 వరకు సూగూరు సంస్థానం రాజుగా జనరంజకపాలకుడని పేరుపొందాడు. వనపర్తి సంస్థానానికి మూలపురుషుడు జనుంపల్లి వీర కృష్ణారెడ్డి (1510 -1540) వనపర్తి సంస్థానాధీశులను సూగూరు సంస్థానాధీశులు అని కూడా పిలుస్తారు. కృష్ణారెడ్డి వారసులు కొత్తకోట, జానంపేట, రాజధానులుగా కూడా పరిపాలన కొనసాగించారు. కుతుబ్షాహీల కాలంలో సంస్థానం ఏర్పాటయింది. 700 సంవత్సరాల చరిత్ర ఈ సంస్థానానికి ఉన్నది.
అనంతరం వీరకృష్ణారెడ్డి కొడుకు కుమారగోపాలరెడ్డి విజయనగరాధీశులకు, గోల్కొండ పాలకులకు అనుకూలంగా ఉంటూ పానుగల్లు, సూగూరు, కొత్తకోట ప్రాంతాల గ్రామాలమీద అధికారం పొందాడు. ఇతని తరువాత సోదరుడు రామకృష్ణారెడ్డి, అతనికొడుకు వెంకటరెడ్డి కందూరు మొదలైన ప్రాంతాలలో భూస్వాములకు అప్పులిచ్చి, వారి గ్రామాలమీద ఆధిపత్యం పొందాడు. కొత్తప్రాంతాలకు తన అధికారాన్ని విస్తరిస్తూ రాజకీయంగా, ఆర్థికంగా అభివ•ద్ధిని సాధించాడు. క్రీ.శ.1625లో పెద్ద వెంకటరెడ్డి కుమారుడు ఇమ్మడి వెంకటరెడ్డి సంస్థానాధిపతి అయ్యాడు. ఇతడు తన శక్తి, సామర్థ్యాలతో గోల్కొండనవాబు అబ్దుల్ కుతుబ్షా దృష్టినాకర్షించాడు. గోల్కొండ దండయాత్రలలో తన సైన్యంతో పాల్గొన్నందుకు సుల్తాన్ రాజా వెంకటరెడ్డికి కొత్తకోట ప్రాంతాలపై అధికారాన్ని ధృవపరుస్తూ సనదులిచ్చి గౌరవించాడు. ఇమ్మడి వెంకటరెడ్డి తర్వాత సూగూరు సంస్థానాన్ని అష్టభాషా గోపాలరావు 1648 నుంచి 1676 వరకు పరిపాలించాడు. కొత్తకోట, జానంపేట గాక పెబ్బేర్, శ్రీరంగాపురం నుండి కూడా పాలన చేసారు. గోపాలరావు మరణాంతరం ఆయన భార్య జానమ్మ సూగూరు సంస్థానాన్ని కొంతకాలం పాలించింది. ఆ తరవాత రాజధానిని సూగూరు నుంచి కొత్తకోటకు మార్చింది.
పూర్వ మహబూబ్ నగర్ జిల్లాలోని సంస్థానాలలో వనపర్తి సంస్థానం ఒకటి. ఈ సంస్థానం 450 చ.కి.మీ.లలో విస్తరించి వుండేది. 1901లో సంస్థానం రెవెన్యూ 1.5 లక్షలుండేది. అందులో నుంచి 76వేల 883 రూపాయలు నిజాముకు చెల్లించే కప్పంగా వుండేది. వనపర్తి సంస్థానానికి మొదటి పేరు సూగూరు సంస్థానం. తొలి రాజధానిగా సూగూరు వుండేది. ఈ సంస్థాన పరిపాలకుడు మొదటి రామకృష్ణారావు సూగూరు నుంచి రాజధానిని వనపర్తికి మార్చడం వల్ల సంస్థానం పేరు మారిపోయింది. అప్పటి నుంచి ఇది వనపర్తి సంస్థానం.
వీరకృష్ణారెడ్డికి నాలుగోతరం వారసుడు ఇమ్మడి వెంకటరెడ్డి. గొప్పవీరుడని చెపుతారు. వెంకట్ రెడ్డి కొడుకు గోపాలరావు ‘అష్టభాషి, బహిరీ’ అనే బిరుదులు పొందాడు. కర్నూలుకు వచ్చిన కందాలస్వామికి శిష్యుడై, తనను రంగాపురానికి ఆహ్వానించాడు. దస్తాపురం దగ్గర గోపాలరావు రంగాపురాన్ని, రంగసముద్రం చెరువును కట్టించాడు. శ్రీరంగనాథునికి ఆలయం కట్టించాడు. గోపాలరావు రంగనాథాలయంలో నిత్యోత్సవాది కైంకర్యాలు చేయించాడు. మొదటి రామకృష్ణారావు దత్తపుత్రుడు రాజా రామేశ్వరరావు భార్య రాణీ శంకరమ్మ (రాణీ శంకరాంబ) ఆలయాన్ని విస్తరింపచేసింది. అనేకమంది దేవతలను ప్రతిష్టింప జేసింది. దేవాలయ గోపురం నిర్మింపచేసింది. ఆ తర్వాత వనపర్తి సంస్థానాన్ని 1920 వరకు పాలించిన 2వ రామేశ్వరరావు ఆలయాన్ని విస్తరింపజేసాడు. వైష్ణవ ఆళ్వార్లకు గుడులు, రామానుజాలయం, భాష్యకార్లకు గుడులు, మనవాళ మహాముని గుడి నిర్మాణాలు చేయించాడు. ఇతని కొడుకు కృష్ణదేవరాయలు పేరిట రంగసముద్రం (చెరువు) నడుమ రాతిగట్టుపై కృష్ణవిలాస్ అనే విశ్రాంతి భవనాన్ని నిర్మింపబడ్డది. బ్రిటిష్ రెసిడెన్సీ వనపర్తి సంస్థానానికి వచ్చినపుడు ఇందులోనే విడిది చేయించేవారట. 3వ రామేశ్వరరావు కృష్ణదేవరాయలు కొడుకు. ఇతని దత్తపుత్రుడు కృష్ణదేవరావు ఆలయాన్ని అభివృద్ధి చేసాడు. దేవాలయంలోనికి ప్రవేశించే గోపురద్వారానికి కుడిపక్కన గోడమీద ఆలయానికి సంబంధించిన శాసనం వుంది. ఈ శాసనం మీద మొదట తిరునామానికి కుడివైపు చక్రం, సూర్యుడు, ఎడమవైపు శంఖం, చంద్రుడు వున్నారు. స్వస్తిశ్రీ రంగనాథాయ అని మొదలవుతుంది శాసనం. ఈ శాసనం శాలివాహన శక సం. 1804, చిత్రభాను నామ సం. మార్గశిర మాసంలో అంటే క్రీ.శ. 1882 డిసెంబర్ లో వేయబడింది. ఈ శాసనాన్ని ప్రత్యగ్రదుర్గపుర కృష్ణకవి రచించాడు. శాసనభాష సంస్కృతం. లిపి తెలుగు.
వనపర్తి సంస్థానం: పాలకుల వంశక్రమం
వీరకృష్ణారెడ్డి (1517-1540) (సూగూరు దేశాధిపతి వీరకృష్ణ)
కుమార గోపాలరెడ్డి
గోపాల్రావు (1657-1675)- రామచంద్రోదయం (శ్లేష),శృoగారమంజరి (బాణము) (అష్టభాషాక•తీ బహిరా ఖ్యాతి గోపాలరాయ భూపాల) శ్రీరంగాపురం ఆలయ(1670) నిర్మాణ కారకుడు (1662లో శ్రీరంగపట్నం చూసాడు).
దత్తపుత్రుడు
వెంకటరెడ్డి (వెంకటరెడ్డి బావి) (కుమార బహిరీ సంజ్ఞ… వెంకట భూపతి)
రెండవ గోపాలరావు (గోపాల్ పేట నిర్మాణం) (గోపాల భూపాలా… రామకృష్ణాఖ్య , రామేశ్వరేంద్ర, నిత్యోత్సవాది కైంకర్య కృత్య వర్ధయత్)
మొదటి రామకృష్ణారావు రాజబహద్దూర్ (1817లో రాజధాని సూగూరు నుంచి వనపర్తికి మార్పు)
దత్తపుత్రుడు
రాజా రామేశ్వరరావు, భార్య రాణీ శంకరమ్మ (ఆలయ నిర్మాణంలో ముఖ్యపాత్ర) (రాణీ శంకరాంబ…. నానా రఘు తనయ ముఖాదేవతాస్తాపయిత్వా…. (రాజా రామేశ్వరరావు బహిరీ బలవంత బహదూరు భార్య శంకరమ్మచే గోపుర కైంకర్యం…)
2వ రామేశ్వరావు (1920 వరకు పాలించాడు) (ఆలయ నిర్మాణ విస్తీర్ణత), వైష్ణవ ఆళ్వార్ల గుడులు, రామానుజాలయం, భాష్యకార్లు గుడులు, మనవాళ మహాముని గుడి నిర్మాణాలు…
కృష్ణదేవరాయలు, సరళాదేవి రామదేవరాయలు
(రంగసముద్రం నడుమ కృష్ణవిలాస్ నిర్మాణం)
3వ రామేశ్వరరావు
దత్తపుత్రుడు
కృష్ణదేవరావు (ఆలయాభివృద్ధి)
(రామకృష్ణ క్షితీంద్ర… సప్తసంతానలక్ష్మి… గోపురం కైంకర్యం…)
సంస్థానం ‘సూగూరు’ పట్టణంలో ఆలయాలు:
సూగూరు గ్రామానికి పడమటి దిశలో చెరుకుతోటగా పిలిచే ప్రదేశంలో ప్రతిష్టకు నోచుకోని వేణుగోపాలస్వామి ఆలయం
ఉంది. ఓటుపోయిన కుండ అన్న సామెతలెక్క ఈ గుడికూడా ప్రతిష్టాపన జరగకుండా, విడిచిపెట్టబడినదని స్థానికప్రజలు ఓటుగుడి అని పిలుస్తుంటారు. ఈ గుడి అసంపూర్ణ నిర్మాణం. గుడినిర్మాణం అష్టభాషాగోపాలరావు కాలంలో చేపట్టినట్లు తెలుస్తుంది. వారు నిర్మించిన ఆలయాలనుబట్టి సూగూరు సంస్థానాధీశులు వైష్ణవమతాన్ని ఆదరించినట్లు చెప్పవచ్చు. అందులో కిష్టారెడ్డిపేట, పెబ్బేరులలో వేణుగోపాలస్వామి ఆలయాలు, వెంకటాపురం, పెద్దగూడెంలో రామాలయాలు, కొత్తకోట, వెంకటగిరి, కొమ్మలగట్టు వెంకటేశ్వర ఆలయాలు, శ్రీరంగాపురం, సంకిరెడ్డిపల్లెలో శ్రీరంగనాథాలయాలు.. ఇలా సంస్థాన పరిధిలో అనేక వైష్ణవాలయాలు నిర్మించారు. ఈ సూగూరు వేణుగోపాలస్వామి ఆలయం నిర్మించాలని రాజావారు తలపెట్టాడట. వెంటనే దక్షిణాది నుండి శిల్పులను రప్పించి నిర్మాణం ప్రారంభించారు. దేవాలయ నిర్మాణం పూర్తై, ప్రతిష్ట సమయం వచ్చేదాక రాజావారు ఆలయ నిర్మాణాన్ని చూడకూడదు, సందర్శించ కూడదని గుడి ప్రారంభానికి ముందు రాజా వారికి శిల్పులు ఒక షరతు పెట్టారట. అదే మాటపై ఆలయనిర్మాణం కొనసాగుతున్న సందర్భంలో సర్వాంగ సుందరంగా తయారవుతున్న ఆలయాన్ని చూసిన ప్రజలు రాజుతో గుడినిర్మాణం జరుగుతున్న తీరును వివరించగా రాజావారికి ఎప్పుడెప్పుడు ఆ ఆలయాన్ని చూడాలన్న ఉబలాటంతో వచ్చిన రాజును చూసిన శిల్పులు రాజావారు నియమోల్లంఘనం చేసి, నిర్మాణాన్ని చూడ వచ్చినందుకు తాము చేస్తున్న పనిని అర్థాంతరంగా శిల్పులు వదిలి వెళ్ళినట్లు ప్రజలు చెప్పుకుంటారు. మరో కథనంలో దేవాలయంలో మూర్తి ప్రతిష్ట సమయం ఆసన్నమైతున్న సందర్భంలో ఆలయం గర్భగుడిలోకి ఒక పెద్దపిట్ట (గుడ్లగూబ) వచ్చిందట. అది అపశకునంగా భావించిన శిల్పులు పనిని అర్ధాంతరంగా వదిలివెళ్ళినట్లు చెబుతారు. మరో కథనంలో మతవిద్వేషంతో ముస్లింలు ఒక దున్నపోతును తెచ్చి ఆలయ గర్భగుడిలో బలిఇచ్చి రాజుకు శాపం పెట్టినారట. ప్రతిష్టకు ముందే ఆలయం అపవిత్రమైందని భావించిన రాజావారు ప్రతిష్టా కార్యక్రమాన్ని, ఆలయనిర్మాణాన్ని ఆక్కడితో విరమించుకున్నట్లు చెబుతారు. అలా పూజాపునస్కారాలులేని ఈ గుడిని ఓటుగుడి అంటున్నారు స్థానికులు. అలా అనడానికి గుడిలో మనం స్వరం పెంచి ఓ అంటే ఓ అని ప్రతిధ్వనిస్తుందట. అందుకే ఓటు పలుకుతుంది కనుక దీనిని ఓటుగుడిగా పిలుస్తారంట.
(ఓటి = పగిలిన, భిన్నమైన) ఓటిగుడి అనగా శిధిలమైన గుడి అని అర్ధంగా చెప్పుకోవచ్చు. వేణుగోపాలస్వామి ఆలయ మహామండపానికై రూపొందించిన శిల్పాలు అనంతరకాలంలో నిర్మించిన శ్రీరంగపురం ఆలయానికి ఉపయోగించుకున్నట్లు తెలుస్తుంది.
ఈ గ్రామంలో సూగూరేశ్వర స్వామిగా పిలిచే శివాలయం ఉంది. ప్రాచీన వీరభద్ర ఆలయం ఉండేది. దానిని నేడు నూతనంగా నిర్మించాలని తలచి ప్రస్తుతం పనులు ప్రారంభించారు. విజయనగరరాజుల కాలానికి చెందిన జనార్ధనస్వామి ఆలయం ఉంది. ఇటీవల ఆంజనేయ, శ్రీరామ, శివాలయాలు ఒకే సముదాయంలో నూతనంగా నిర్మించారు. ఒకప్పుడు ఊరు చుట్టు కోట, దాని చుట్టు బురుజులు ఉండేవి. కోటకు బయటివైపు కందకం ఉండేది. నేడది పూడిపోయింది. కోటగోడ ద్వారం తప్ప మిగతా మట్టికోటనంతా చదును చేసి, ఆ ప్రదేశంలో హైస్కూల్ నిర్మించారు. కోటలో కట్టమైసమ్మ, పోచమ్మ ఆలయాలున్నాయి. పోచమ్మ ఆలయం లో అష్టభుజ మహిషాసురమర్థిని శిల్పంతో పాటు వీరగల్లు శిల్పాలు ఉన్నాయి. ఆలయం వెలుపల అనేకమైన ప్రాచీన శిల్పాలు ఉన్నాయి. అందులో 2 శివలింగాలు, 2 పానవట్టాలు, 4 నందులు, 2 గణపతులు, 2 పార్వతిదేవి శిల్పాలే కాకుండా శైవమతానికి సంబంధించిన భక్తురాలు, భక్తులు, శూలబ్రహ్మయ్య, గుండ బ్రహ్మయవంటి ఆత్మార్పణ శిల్పాలు, రాజోచిత ఆహార్యంతో యుద్ద సన్నివేశంలోఉన్న వీరగల్లు శిల్పాలు, పదుల సంఖ్యలో నరనాగ ప్రతిమలు ఉన్నాయి. శిల్పాలశైలులనిబట్టి కాలనిర్ణయం చేస్తే 10,11వ శతాబ్దాలనాటి చాళుక్యులకాలం నుండి 18వ శతాబ్దపు సంస్థానాధీశులకాలం వరకు వివిధకాలాలలోని శిల్పాలనేకం ఉన్నాయి. ఇవేకాక ఊరికి ఈశాన్యభాగంలో ఆనాడు సంస్థానపాలకులకు విశ్వాసపాత్రమైన తమ కుక్కలకు కూడా చక్కటి సమాధులు నిర్మించారు. స్థానికులు వాటిని కుక్కలగోరీలు అంటుంటారు. ఈ సమాధులు దాటి ముందుకుపోతే కాసుపాకుతోట అనే ప్రదేశంలో రెండు మండప నిర్మాణాలతో అందంగా నిర్మించిన మెట్లబాయి ఉంది. మండపాల స్తంభాలకు రకరకాల డిజైనులు, వేణుగోపాల స్వామి, ఆంజనేయ, వీరభద్ర, భైరవ, శివలింగం పానమట్టం, అప్సరసలు, పూలు, లతలు మొదలైన అనేకశిల్పాలను మండప స్తంభాలపై చెక్కారు. మతసామరస్యానికి చిహ్నంగా ఈ గ్రామంలో దాదాపు ఐదువందల సంవత్సరాల కిందటిదిగా చెప్పే ఫక్రులుద్దీన్ ఖాద్రి దర్గ ఉంది. ప్రతి సంవత్సరం ఉర్సు జరుగుతుంది. వివిధ ప్రాంతాలనుండి హిందు, ముస్లింలు వేలాదిగా వచ్చి మొక్కులు తీర్చుకుంటారు.
సూగూరేశ్వరస్వామి:
ఒక వీరశైవ సిద్ధాంత ప్రచారకుడు తన స్వస్థలం కాశ్మీర్ ప్రాంతం నుంచి పన్నెండవ శతాబ్దంలో కాశ్మీర్ నుండి పర్యటనచేస్తూ కర్ణాటక చేరుకున్నాడు. అక్కడ సూగూరేశ్వరుణ్ణి ప్రతిష్టించాడు. ఆ సూగూరేశ్వరుణ్ణి ఇక్కడ ప్రతిష్టించడంవల్లనే ఈ సూగూరు అనే పేరొచ్చింది. సూగూరేశ్వరుడు వీరభద్రుని అవతారంగా భక్తులు భావిస్తారు. సూగూరేశ్వర ఆలయంలో వీరభద్రుని రూపంలో వెలసిన సూగూరేశ్వరుడు పూజలందుకుంటాడు.
కొసమెరుపు: సూగూరు వానచాటువు
క్రీ.శ.1910 సౌమ్యభాద్రపద బహుళ షష్ఠి పుబ్బా నక్షత్రంతో కూడిన మంగళవారంనాడు విపరీతమైన వర్షం కురిసి ఊరంతా కొట్టుకొనిపోయినట్లు ఒక చాటువు ఉంది.
‘‘శ్రీ సౌమ్యనామ సంవత్సరంబున
భాద్రపదమాసమందున బహుళ షష్ఠి,
మందవారమునాడు మహిమీద వర్షంబు
పుబ్బనక్షత్రాన బూతురేగే,
వర్షకాలంబున వసుధలోపలకొన్ని
చెరువులు తెగిపోయె ధరణిమీద,
పేట తాలూకాలో పోటుపోయెను చెర్లు
కొల్లాపురంచెర్వు కొల్లవోయే,
నాగరాల వాగు వేగమందుక వచ్చు
శ్రీరంగవారధి భారమాయె,
ఉత్తరాలు వ్రాసి ఉరికించునప్పుడు
దొరకొడ్కుజూచి యాశ్చర్యమందె,
పెబ్బేరు పురినుండి బెహరి జనుంపల్లి
రాజరామేశ్వరరావు గదలె,
గవిని దాటియు వేగ కట్ట మీదకుపోయి
కామాటికులబిల్చె ప్రేమతోడ,
నిలుచున్న మాత్రాన కలవరమాయెను
కట్టమీదికిరాళ్ళు కొట్టిపారె,
తూము ధడేల్మనిద్రుంగి పెళ్లున గూలె
వెయ్యిఫిరంగులు వేసినట్లు,
నడిమికి తునకలై పుడమిపై నీరెల్ల
ప్రళయకాలంబను పగిది నిలచె,
ఇంతమాత్రమేగాని యెంతని వర్ణింతు
చెరువెనక చెరువుల చేవబోయె,
వెంకటాపురి చెర్వు వెనుక నీళ్ల చెర్వు
తాటిపాముల చెర్వు తూటిపాయె,
సూగూరు ఊళ్లకు వేగిరంబున వచ్చే
జామురాతిరి వెళ పాము వెళ,
పేటలోపలివారు కాటికి పోయిరి
సకలమైనవారు వికలమైరి,
తాండ్రవారి ఇల్లు దాటి యావలనున్న
బింకము వారిల్లు దుంకిపారె,
పక్కీరు సాబిల్లు పంచకంతలు నాయే
ఉప్పరిగేరెల్ల తెప్పదేలె,
గాజుల అల్పూరి ఇల్లు గంటు మట్టిగా పోయె
బంటుకు గూమెడు బత్తెమిచ్చె,
కాసుపాక తోట నాశనం బాయెను
బ్రాహ్మణమాన్యాలు బండలు బడె,
మేడలు మిద్దెలు బురుజులు కోటలు గోడలు కూలిపోయె,
గొరియులు పశువులు వరదలో బోయెను
వయసువారు చతికి వనికిరపుడు,
కావలివారలు గర్వాన వినకను
ఏటి వెంబడి పోయె నీటుగాను,
పదనైదు లక్షల పాయమాలాయెను
రైతులు జెడిరెల్ల రాజ్యమందు,
హక్కు దార్లకు కూడు బుక్కెడు లేదాయె
సూగూరు పట్టణ మాగమాయె,
అహహ యిటువంటి వర్షంబు అరుదుగాను
చెప్ప చూడంగ లేదని చెప్పెజనము.’’
ప్రత్యేక ధన్యవాదాలు:
సూగూరు పట్టణ చరిత్ర రాయడానికి పూర్తిగా క్షేత్ర సమాచారం, ఫోటోలు, రచనా సహకారమందించిన బైరోజు శ్యామసుందర్ గారికి.
- శ్రీరామోజు హరగోపాల్,
ఎ : 99494 98698