పట్టణాలలో తీవ్రమవుతున్న నీటి సంక్షోభం – పరిష్కార మార్గం

ఈ భూగోళం 71% నీటితో నిండి ఉంది. కానీ దానిలో 96.5% సముద్రాలలోనే ఉంది. అది త్రాగుటకు పనికిరాదు. 3.5% మాత్రమే మంచి నీరు ఉంది. ఇది కూడా చాలా మటుకు మంచు పర్వతాల రూపంలో (గ్లెసియర్స్) ఉంది. మనము త్రాగుటకు పనికి వచ్చే నీరు కేవలం 1.2% మాత్రమే ఉన్నది.
ప్రపంచ జనాభా పెరిగిపోవడం, పట్టణీకరణ, పరిశ్రమల విస్తరణ వల్ల నేడు ప్రపంచం అతి తీవ్రమైన నీటి ఎద్దడిని ఎదుర్కుంటోంది. కొన్ని నగరాలని ఇప్పటికే నీరు ఏమాత్రం లేని నగరాలుగా ప్రకటించారు. మనదేశంలో కూడా బెంగళూరు, పుణె, చెన్నై మొదలగు నగరాలలో వేసవిలో తీవ్రమైన నీటి ఎద్దడి ఏర్పడుతోంది.


విచిత్రమైన విషయమేమిటంటే ఇవే నగరాలు వర్షాకాలంలో నీటి ముంపుకు గురవుతున్నాయి. దీనికి కారణాలు అనేకం ఉన్నాయి. చెరువులను, లోతట్టు ప్రాంతాలను, పట్టణీకరణంలో భాగంగా ఆక్రమించుకోవడం, వర్షపు నీటిని తగిన విధంగా సంరక్షణ చేయకపోవడం, నీరు వృధా చేయడం ఇలా ఎన్నో కారణాల వల్ల నేడు మనం నీటి ఎద్దడిని ఎదుర్కుంటున్నాము.


ఎంత పెద్ద సమస్యకైనా పరిష్కారం క్రింది స్థాయినుంచే సాధ్యమవుతుంది. పట్టణాలలో నేడు ప్రజలు ఎదుర్కుంటున్న నీటి సంక్షోభానికి కూడా పరిష్కారం చాలా చిన్న స్థాయి అంటే ఒక కొలనీ స్థాయి నుండే ప్రారంభం అవ్వాలి.


జల సంరక్షణ విధానంలో మనం క్రింది స్థాయి నుండి దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకు వెళ్తే ఈ సమస్య జాతీయ స్థాయిలో పరిష్కారమవుతుంది.
ఆంధ్ర ప్రదేశ్‍లో ఉన్న విశాఖపట్నం నగరంలో ఒక చిన్న కొలనీ నుండి మేము ఈ ప్రయత్నాన్ని 2010 సంవత్సరం నుండి ప్రారంభించాము. జె ఆర్‍ నగర్‍ అనే ఈ కొలనీలో సుమారు 20 అపార్ట్మెంట్లు, 30 ఇళ్ళు ఉన్నాయి. సుమారు 1500 మంది జనాభా ఉంటారు.


ఇంకుడుగుంతల నిర్మాణం:
ముందుగా ప్రతీ అపార్ట్మెంట్‍లోనూ, ఇంటిలోనూ, కొలనీ పార్క్లలోనూ, ఖాళీ స్థలములలోనూ నీటి పల్లమును బట్టి సరైన స్థలము ఎంచుకొని ఇంకుడుగుంతలు ఏర్పాటు చేశాము. ఇంకుడుగుంత అంటే సుమారు 6 అడుగుల లోతు, 3 అడుగుల వ్యాసం కల ఒక వృత్తాకారపు గొయ్యి. దీనిలో క్రింది నుండి పైకి మూడు లేదా నాలుగు వరుసలలో వివిధ ఆకృతులతో రాళ్లని నింపుతాము. పైన ఇసుక వేస్తాము. దీనిచుట్టు పైన ఒక సిమెంట్‍ ఓర వేస్తాము. పైన కాంక్రీటుతో మూత కూడా పెట్టుకోవచ్చు. చుట్టూ ఒక ప్రహరీ కూడా కట్టుకోవచ్చు. వర్షపు నీరు ఇంకుడు గుంతకు అమర్చిన గొట్టాల ద్వారా భూమి లోనికి వెళ్తుంది.


ఈ విధంగా మేము జె ఆర్‍ నగర్‍ కొలనీలో సుమారు 15 ఇంకుడుగుంతలు ఏర్పాటు చేశాము. ఇదికాక ప్రతీ అపార్ట్మెంట్‍లో ఇంకుడుగుంతలు ఏర్పాటుచేశాము. ఈ మొత్తం ప్రణాళిక ద్వారా మేము సుమారు ఏడాదికి 7,45,000 లీటర్ల నీటిని ఆదా చేయగలిగాము.


ఇంకుడుగుంతల ప్రాజెక్టును విశాఖపట్నం నగరానికి విస్తరణ

జె ఆర్‍ నగర్‍లో మేము పొందిన స్ఫూర్తితో విశాఖ నగరంలో మరి కొన్ని కొలనీలు ఈ పక్రియ ద్వారా వారి వారి కొలనీలలో ఇంకుడుగుంతలు ఏర్పాటు చేసుకోవడం మొదలు పెట్టారు. ఆంధ్ర ప్రదేశ్‍ కొలనీ సంక్షేమ సంఘాల సమాఖ్య (ఎపిఫెర్వాస్‍), విశాఖపట్నం ఈ విషయంలో చొరవ తీసుకొని తన ఆధ్వర్యంలో ఉన్న సుమారు 150 కొలనీలలోనూ ఈ విధంగా ఇంకుడుగుంతలు ఏర్పాటుకు నడుం బిగించింది. తొలివిడతగా ఈ ఏడాది మే నెల నుండి కొన్ని కొలనీలలో సుమారు 60 ఇంకుడుగుంతలు ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చింది. వీటికయ్యే ఖర్చు కొంతమంది దాతల ద్వారా సేకరించిన విరాళంతో భరించడం జరిగింది. ఈ ప్రాజెక్టు జూలై నెలాఖరుకు పూర్తి అయ్యింది.


నీటి పొదుపుపై అవగాహన సదస్సులు, ర్యాలీలు, కరపత్రాల పంపిణీ

జలసంరక్షణలో అతి ముఖ్య విషయం ప్రజలకు నీటి పొదుపుపై అవగాహన. మన దైనందిన జీవితంలో నీటిని ఎంతో వృధా చేస్తున్నాము. చిన్న చిన్న మార్గాల ద్వారా మనం నీటిని సంరక్షించుకోవచ్చు. ఎపిఫెర్వాస్‍ ద్వారా మేము ఎన్నో సభలు సమావేశాలు, ర్యాలీలు నిర్వహించి నగరంలో నీటి పొదుపుపై ఎంతో అవగాహన కల్పించాము. కొన్ని సులభ పద్ధతులద్వారా నీటిని ఎలా పొదుపు చేసుకోవచ్చో కరపత్రాల ద్వారా ప్రజలకి తెలియచేసాము.


ముగింపు
జల సంరక్షణ ఒక మహాయజ్ఞం. నిరంతర కృషితో క్షేత్ర స్థాయి నుండి జాతీయ స్థాయి వరకు ఈ కార్యక్రమాన్ని ఆచరిస్తే రాబోయే సంవత్సరాలలో మన నగరాలు జల సంక్షోభం నుండి బయట పడతాయని ఆశిస్తున్నాను.

డాక్టర్‍ కె ఎస్‍ ఆర్‍ మూర్తి
విశ్రాంత శాస్త్రజ్నుడు,
ఎపిఫెర్వస్‍ సహాయ అధ్యక్షుడు,
కొర్వా సెక్రెటరీ జనరల్‍
ఎ : 9848190440

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *