గ్రీష్మరుతువు చివరలో, వర్షరుతువు ప్రారంభంలో చెట్టు చేమల్లో, పొదల్లో, గ్రామ పొలిమేరల్లో, అటవి ప్రాంతాల్లో చీకటి పడగానే విద్యుత్‍దీపాల వరుసలా వెలుగుతూ, ఆరుతూ వుండే ఓ అద్భుత దృశ్యాన్ని మీరంతా చూసే వుంటారు. ముఖ్యంగా శుక్లపక్షం రోజుల్లో ఈ వింతైన అనుభూతిని చవిచూడని వారుండరు. దీపావళి రోజుల్లో పట్టణాల్లోని భవంతులు బుల్లి బుల్లి విద్యుత్ బల్పులచే వెలుగొందినట్లుగా, ప్రకృతిలో సహజసిద్ధమైన కాంతులు విరాజిల్లడం ఓ విచిత్రం కదా! నిజంగానే మేం సహజసిద్ధంగా వెలుగునిచ్చే చిన్న కీటకాలం. మమ్మల్ని మీరు మిణుగురు పురుగులని, జుగ్నూలని, ఫైర్‍ఫ్లైస్ అని పిలుస్తూ వుంటారు. నిజానికి మేము ఈగలం కాదు. తుమ్మెదల జాతికి చెందిన ఓ చిన్నరకం కీటకాలం. యావత్ జీవకోటిలో మా ఒక్కజాతికే ఇలా సహజసిద్ధమైన వెలుగునిచ్చే అవకాశం దక్కడం గొప్ప విషయమే! మీ కృత్రిమ విద్యుత్ పర్యావరణ సమస్యలకు కారణం కాగా, మేము పర్యావరణ హితకారులం!
సౌరకుటుంబంలో సూర్యుడొక్కడే స్వయం ప్రకాశితుడు. ఇక గెలాక్సీలో నక్షత్రాలన్నీ కూడా స్వయం ప్రకాశితులే కదా! మేము కూడా స్వయం ప్రకాశితులమే అయినా మేము ప్రాణులం కావడం విశేషం! అంటే మీలా మాకు చావు పుట్టకలుంటాయి. పైగా మా జీవితచరిత్ర కూడా విచిత్రంగానే వుంటుంది. సహజంగా కీటకాల్లో వుండే నాలుగు దశల జీవితచక్రంలో, లార్వాదశ మాకు దీర్ఘకాలం కాగా, ప్రౌఢదశ అత్యల్పం కావడం గమనార్హం. తుమ్మెదల ప్రజాతి నుంచి రూపాంతరం చెందిన మేము, లార్వాదశలో అసలైన మాంసాహారులం కావడం విచిత్రం. మెత్తటి నత్తగుల్లల్ని ఓ రకం మొలస్కాల్ని (slugs), వానపాముల్ని తిని జీవిస్తాం. ప్రౌడదశలో మాత్రం తిండిమాని ఆకుల మధ్యన, భూమిలోపల దాక్కొని, సహచర పొందుకై తాపత్రయపడుతాం. బహుషా ఇదే కారణంచే, మాలోని కొన్ని రసాయనాలు మెరువడానికి కారణం కావచ్చు! వ్యూపా దశలో భూమిలోపల, నీటిలోపల నిద్రావస్థలో వుంటాం. అందుకే మాకు తేమ అంటే బాగా ఇష్టం.
చీకటే మా జాతికి రక్ష!
మేము మీలాగే, ఇతర కీటకాలలాగే రోజంతా చురుకుగా వుండి రాత్రుల్లో స్థబ్దుగా వుంటాం. కాని, మా ప్రౌఢదశ మాత్రం భిన్నంగా వుంటుంది. పైనే ప్రస్తావించినట్లు, ఈ దశ స్వల్పకాలం (2-3 నెలలు) కాబట్టి, దీన్ని పునరుత్పత్తికి ఉపయోగిస్తాం. మాకున్న కాంతి ప్రత్యేకతనే దీనికి కారణం కావచ్చు. సాధారణంగా ఆడ తుమ్మెదలు చాటుమాటుగా (మీ జనాభాలో కొన్ని జాతుల వారిలా) వుంటాయి. వీటిని ఆకర్షించడానికై మగతుమ్మెదలు కాంతిని విరజిమ్మి ఆడతుమ్మెదల్ని ఆకర్షిస్తాయి. ప్రతిస్పందనగా ఆడ తుమ్మెదలు కాంతితో సంకేతాల్ని పంపిస్తాయి. అప్పుడు మేం జతకడుతాం. ఇలా మా భావితరానికి మాకున్న ప్రత్యేక కాంతిని వినియోగించుకుంటాం. గుడ్లు పొదగబడిన తర్వాత మగతుమ్మెదల్ని ఆడతుమ్మెదలు తినడం కూడా జరుగుతుంది. దీనికి గల కారణాలు ఇప్పటికి మీ శాస్త్రజ్ఞులకు స్పష్టపడలేదు. బహుషా, సంపర్కానికి ముందు ఆకలితో వుండి, గ్రుడ్లు పెట్టిన తర్వాత ఆకలిని తట్టుకోలేక ఇలా జరగవచ్చు! ఈ విధానం ప్రకృతిలో ఏ ఇతర జీవుల్లో లేవనుకుంటా! కాని పుట్టిన కూనల్ని పులులు తింటాయని అంటూ వుంటారు. వీటికి కూడా మాలాంటి కారణమే కావచ్చు! మేము దినాచరులమే అయినా, పునరుత్పత్తికై నిశాచరులుగా మారుతాం. అందుకే మాకు చీకటంటే ఇష్టం!
మా వెలుగు ప్రేమ చిహ్నం (Light is the language of love)
ప్రకృతి ప్రసాధించిన మా శరీరంలోని వెలుగు మా ఆడమగ తుమ్మెదల ప్రేమ చిహ్నమని గుర్తిస్తారు. మాపై పరిశోధనలు చేసిన డా।। శాండీస్మిత్ మా గూర్చిన అనేక విషయాల్ని బాహ్య ప్రపంచానికి అందించాడు. ఆరుబయట, చీకటి రాత్రుల్లో, మీ మహిళలు కార్తీక దీపారాధన చేసిట్లుగా సామూహికంగా వెలుగుతూ, ఆరుతూ వుండడం ఓ ప్రకృతిపరమైన చర్యగా, రమ్యతగా మీరుభావిస్తారు. నిజమే! కానీ ఈ క్రమబద్దమైన వెలుగు మా చివరిదశ అని, సంపర్కం కోసం ఆడపురుగుల్ని ఆకర్షించే పాకులాటని, మా మగ పురుగులకు చివరిగడియలని మీలో చాలా మందికి తెలియదు. అయినా, మా వెలుగు జిలుగులకు మహదానందపడి, ‘వాఁ! ఓహా! జు…. గ్నూ…!’ అంటూ కేరింతలు కొట్టడం, ఈలలు వేయడం మేం వినకున్నా, మాకు తెలియకుండానే మీ మానవులకు ఎనలేని సంతోషాన్ని కల్గిస్తూ, ఆరోగ్యానికి తోడ్పడుతున్నామన్న సంతోషం మాత్రం మాదే! అందుకే కీటక శాస్త్రజ్ఞులు మేము మా వెలుతురుతో మాట్లాడుకుంటామని సంబోధిస్తారు!
పూర్తిగా వెలుగునిచ్చే దివ్వెలం!
కాంతి, ఉష్ణం లాంటి శక్తులగూర్చి, వీటి ఉత్పత్తికేంద్రాల గూర్చి, మీకు తెలిసిందే! ప్రతి కాంతి జనకం పూర్తిస్థాయి కాంతిని జనించలేదు. ఉదాహరణకు, మీ విద్యుత్ బల్బు పది (10%) శాతం మాత్రమే కాంతిని జనించి, మిగతా 90 శాతాన్ని ఉష్ణశక్తిగా వెలువరిస్తుంది. కాని, దీనికి భిన్నంగా మా తుమ్మెదలు వందకు వందశాతం (100%) కాంతిని విడుదల చేస్తాయి. చివరికి సూర్యుడు కూడా ఇలా చేయలేడు.
చల్లని రాజు చందమామ కాడు! మేమే చల్లని…
మీరు ఊహించుకున్నట్లు చందమామ స్వయంగా వెలుతురును ఇవ్వలేడు కదా! సూర్యకాంతిని పరావర్తనం చెందిస్తాడని మీరు చుదువుకున్నారు. అలాగే మీరు పాడుకునే పాటలాగా, ఆ వెలుగులు చల్లనివి కావు. వేడివి కావు. పోతే హాయిగా వుంటుంది. కాని, మా కాంతి నిజంగా చల్లనిది. ఎన్నిసార్లు వెలిగినా మా శరీరం వేడెక్కదు. అందుకే పార్కుల్లో, మమ్మల్ని పట్టుకొని, అరచేతుల్లో దాచుకొని, మీరు, మీ పిల్లలు ఆటలాడుతుంటారు.
ఇంత చల్లని వెలుతురుకు గల కారణం. మా పొత్తికడుపులో జరిగే బయోల్యూమినిసెన్స్ (bilouminescence) అనే రసాయనిక చర్య యొక్క ఫలితం. అంటే సజీవులలో వెలుగొందే చర్య అన్నమాట.
మా గూర్చి మీకున్న భిన్న అభిప్రాయాలు :
చాలా జీవులపట్ల మీ మానవులకున్న అభిప్రాయాల్లాగానే మా పట్ల కూడా కొన్ని దేశాలవారికి, జాతులవారికి, వ్యతిరేక అభిప్రాయాలున్నాయి. మమ్మల్ని, మా వెలుగుల్ని అశుభమని భావించేవారున్నారు. కాని, రాను, రాను ఇది తప్పు అని, మా వెలుగులు శుభసూచకమని, మా రాక వర్షరుతువుకు హేతువని అభిప్రాయపడడం మొదలైంది. అందుకే ప్రపంచ వ్యాపితంగా మా గూర్చిన పండగలు (Firefly festivals)జరుపుతున్నారు. మహారాష్ట్రంలోని ముంబాయి దగ్గర ఈ పండుగల సందర్భంగా మా వయ్యారపు వెలుగుల్ని తనివితీరా చూడవచ్చు!
పైగా మీ మానవులకు అనేక రకాలుగా ఉపయోగ పడుతామని మీ పరిశోధనలే తెలుపుతున్నాయి. ప్రధానంగా మా ఉపయోగాలు ఈ క్రింది విధంగా వున్నాయి.
- రోదసి యాత్రలో జీవక్రియల పరిశీలనకు (to know the metabolic ativities)
- ఆహార పదార్థాలలోని చెడు బ్యాక్టీరియాను గుర్తించడానికి
- క్యాన్సర్ నివారణ మందుల పరిశీలనలో
- ఫొరెనిక్స్ ప్రయోగశాలలో
- రక్తనాళాల్లో రక్తప్రసరణ సులువుగా జరగడానికి
పర్యావరణ సంబంధ ఉపయోగాలు :
వ్యక్తిగతంగానే కాకుండా, ప్రత్యక్షంగా వ్యవసాయరంగంలో, పంటల చీడపురుగులు నివారణలో ఉపయోగపడమే కాకుండా, కరువుని తట్టుకునే పంటల ప్రయోగాలకు మమ్మల్ని శాస్త్రజ్ఞులు వాడుకుంటున్నారు. ఆహారపు గొలుసులో మేము మరో కీటకజాతి అయిన సాలె పురుగులకు ఆహారంగా ఉపయోగపడుతాం. పోతే, మాలో కాంతికి కారణమైన రసాయనాలు కొంత విషపూరితంగా (toxic) వుండడంచే కొన్ని రకాల పక్షులు మమ్మల్ని తినలేవు. అయినా, మమ్మల్ని బంధించి తినే సాలెపురుగుల్ని, కప్పల్ని పక్షులు తినడం గమనార్హం!
అయినా, మా గూర్చిన వాస్తవాలు తెలియక, చాలా కాలం వరకు మమ్మల్ని మోసగాళ్ళని, విషపూరితమని, దొంగలమని ప్రచారం చేసారు. నిజానికి, ఈ అలంకారాలన్నీ మీ మానవులకు బాగా సరిపోతాయి కదా!
ప్రమాదంలో మా ఉనికి :
జంతుజాతిలోనే ఓ ప్రత్యేకత సంచరించుకున్న మా ఉనికికి మీ అభివృద్ధి నమూనాలు ప్రాణసంకటంగా మారాయి. మా పునరుత్పత్తికి చీకటి అనివార్యం. కాని, మీ విద్యుత్ వెలుగులు మాకు ఈ అవకాశం లేకుండా చేస్తున్నాయి. దీంతో మా సంతానాన్ని గతంలోలాగా అభివృద్ధి చేసుకోలేకపోతున్నాం. మా ఆవాసప్రాంతాల్ని మాకు అనుకూలంగా లేకుండా చేస్తున్నారు. గాలిలో తేమశాతం తగ్గడమే కాకుండా, తడినేలలు పొడినేలలుగా, ఎడారులుగా మారడంతో మేం నిరాశ్రయులుగా మిగిలిపోతున్నాం. అన్ని జీవరాసుల సమస్యలలాగానే, మీరు వాడే పంటల క్రిమినాశక మందులు మమ్మల్ని సమూలంగా నశింపచేస్తున్నాయి.
మా రక్షణ చర్యలు :
అన్ని జీవజాతుల రక్షణచర్యలు చేపట్టినట్టే మా జాతి రక్షణ చర్యల్ని IUCN చేపట్టింది. పైగా ప్రతీ సంవత్సరం మా పేరున పండగలు నిర్వహించాలని నిర్ణయించింది. అలాగే ఫైర్‍ప్లైస్ ఇంటర్నేషనల్ నెట్‍వర్క్ సంస్థ (FFINO) మా అభివృద్ధిని కాంక్షిస్తూ జులైలో మొదటి వారంలో ఓ రోజును కేటాయించింది. చాలా దేశాలు మా కాంతుల్ని వీక్షించడానికై చీకటి రోజుల్లో పండుగల్ని నిర్వహిస్తున్నాయి. మీరు చూడాలనుకుంటే ముంబాయి వెళ్ళండి.
మీ విద్యుత్ కాంతుల్ని తగ్గించినా, లేదా ఎర్త్ అవర్ (EARTH HOUR) రోజున కొద్దిసేపు విద్యుత్‍ను నిలపివేసినా, మా రక్షణకై మీరు దోహదపడినట్లే! లేదా మా కోసం సంవత్సరంలో ఒక్క రోజు కొన్ని గంటలు మూకుమ్మడిగా మీ లైట్లను ఆపివేసినా సంతోషమే!
మా వెలుగుల్ని చూడాలనుకుంటున్నారా…
ఒకప్పుడు అమెరికాలోని అన్ని ప్రాంతాల్లో మేము ఓ వెలుగు వెలిగాం. ఆధునాతన అభివృద్ధి, విద్యుత్తు వెలుగులు, కాలుష్యం, మా ఆవాసాల ధ్వంసం, మాకు రక్షణ లేకుండా చేసాయి. అయినా, టెక్సాస్ లాంటి రాష్ట్రాల్లో మా పండగల్ని జరుపుతున్నారు. అలాగే ముంబాయి పరిసర ప్రాంతాల్లోని భండారదార, కొత్తలిగాడ్, పురుస్‍వాడి, రాజ్‍కూబి, ఇగత్‍పురి, కర్జాత్ ప్రాంతాల్లో ఫైర్‍ఫ్లైస్ ఫెస్టివల్స్ను నిర్వహిస్తున్నారు. ప్రతి సంవత్సరం మే, జూన్ మాసాల్లో ఇవి జరుగుతాయి. ఇంకా మహదానందం పొందాలంటే, డార్జిలింగ్ హిమాలయ పర్వత శ్రేణులు ప్రారంభమయ్యే సిలిగురికి వెళ్లండి. తనివితీరా మా వెలుగుల్ని ఆస్వాదించవచ్చు. ముఖ్యంగా మీ పిల్లలకు మమ్మల్ని పరిచయం చేయండి.
భవిష్యత్ చిత్రపటం :
మా గూర్చిన చాలా విషయాలు మీ దృష్టికి తెచ్చాం! మీ మానవుల మేధ చాలా చురుకైనదని తెలుసు. మా వెలుతురు జనించే రసాయన పక్రియతో భవిష్యత్తులో మీరు కూడా విద్యుత్తును తయారు చేస్తారేమో? ఇదే జరిగితే, భూతాపం తగ్గుముఖం పట్టవచ్చు! ఇది జరగాలని ఆశిస్తూ!!
(వచ్చే సంచికలో చీమల సంఘజీవన విధానం చూద్దాం!)
- డా।। లచ్చయ్య గాండ్ల,
ఎ : 9440116162