ప్రకృతి సాయం

పిల్లలకు అత్యంత ఆనందానిచ్చేది ఆట బొమ్మలు.,కథల పుస్తకాలే. పాఠ్య పుస్తకాలు అందించే జ్ఞానానికి సమాంతరంగా మరెంతో లోకజ్ఞానాన్ని అందించేది బాల సాహిత్యమే. భాషకు సంబంధించిన ప్రాధమిక పరిజ్ఞానాన్ని అందించేవి కథలే. కొత్త కొత్త పదాలను పరిచయం చేసేది కథల పుస్తకాలే. పుస్తకాలు పిల్లల ఆలోచనా నైపుణ్యాలను పెంచుతాయి. వారి ఊహలకు ప్రాణం పోస్తాయి. వారిలో సృజనాత్మకతను పెంచుతాయి.
పిల్లలలో నైతికతను, సక్రమమైన ప్రవర్తనను, మంచి చెడుల అవగాహనను పెంచే బాధ్యతను ఉమ్మడి కుటుంబాల్లో నాయనమ్మలు, అమ్మమ్మలు చెప్పే కథలు నెరవేర్చేవి. మారిన పరిస్థితులలో ఆ బాధ్యతను బాల సాహిత్యమే నెరవేర్చగలదు.
ఈ మే నెలలో బాలచెలిమి పర్యావరణ కథల పోటీలు - 2023 నిర్వహించింది. తక్కువ సమయంలోనే, వేసవి సెలవులు అయినప్పటికీ విద్యార్థుల నుంచి మంచి స్పందన లభించింది. మొత్తం 51 కథలు వచ్చాయి. కథలన్నీ చాలా బావున్నాయి. బాల సాహిత్య నిపుణులు ఈ కథలను చదివి, చర్చించి ప్రచురణకు 24 కథలు ఎంపిక చేశారు. ఈ కథల పోటీలు నిర్వహించి మరియు పుస్తక రూపాన్నిచ్చింది బాలచెలిమి. - వేదకుమార్‍ మణికొండ

కట్రావుపల్లి అనే గ్రామంలో చిన్న పెంకుటిల్లు. అందులో మాధవి అనే బాలిక తన తల్లితో పాటు నివసిస్తున్నది. అక్కడి ప్రాథమిక పాఠశాలలో 5వ తరగతి వరకు చదువుకుంది. కాని పై తరగతికి వెళ్ళాలంటే ప్రక్క గ్రామానికే పోవాలి. అమ్మ ఒక్కతే కూలి చేసి సంపాదించేది. కాబట్టి ఆటో ఖర్చులు భరించలేదు. చిన్న చెల్లె 2వ తరగతి చదువుతోంది. ఇంట్లోనే మాధవి శ్రద్ధగా నేర్పించేది. బాగా చదువుకొనేది. మాధవి తరగతిలో ఫస్టు వచ్చేది. ఆ నిరుపేద బాలికది విశాలమైన హృదయం. ఊరిలో వాళ్ళకు అప్పుడప్పుడూ పనుల్లో సాయం చేసేది.


ఆ చిన్న ఇంట్లో చిన్న పెరడు ఉండేది కానీ, వాళ్ళ నాన్న చిన్నతనంలోనే చనిపోవడంతో ఒంటరి వారయ్యారు. ఆయన పెట్టిన చెట్లు, సాకిన పశువులు ఇప్పుడు రాబడికి మార్గా లయ్యాయి. వాటికి పండ్లు, పూలు, కాయలు బాగా అయ్యేవి. రకరకాల పక్షులు వచ్చి వాటిపై వాలేవి. వాటికి మంచి ఆహారం ఆ పెరట్లో లభించేది. వాటిని మాధవి మంచిగా మచ్చిక చేసుకొంది.


పెరడును శుభ్రం చేయడం, కొట్టుకొచ్చిన కవర్లు, చెత్తను ఏరి వేయడం, ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసి, ఎరువులు వేసి, సేంద్రియ రకాలు పండిస్తూ తల్లి సహాయంతో అమ్మి డబ్బులు కూడబెట్టు కొనేవాళ్ళు. ఒక సంవత్సర కాలం గడిచిపోయింది. తన తోటి పిల్లలు బడికి వెళ్ళసాగారు. చిన్న బడిలోని గ్రంథాలయ పుస్తకాలు చదువుకొని విషయాలు గ్రహించసాగింది.


తన మిత్రులు మరో ఏడాదికి 7వ తరగతిలోకి ప్రవేశించి, బడికి వెళ్ళే సమయం కావడంతో ఆమెలో దిగులు మొదలయ్యింది. కుటుంబ పోషణ చేయాలా? చదువు కోవాలా? ఎలా… అని చింతించసాగింది. ఉదయమే పెరట్లో నీళ్ళు పోస్తూ… ఆలోచిస్తూ… కళ్ళనిండా నీళ్ళతో… ‘‘ప్రకృతి అమ్మా! నాకెలాగైనా దారి చూపించు, చదువుకోవాలని ఎంతో ఆశగా ఉంది.. పర్యావరణ సంరక్షణ చేసి, సమాజాన్ని బాగుపరిచే, సేవ చేసే ఉద్యోగం సంపాదించుకుంటా!’’ అని సంకల్పం చేసింది.


తెల్లవారి ఎప్పటిలా తను చెట్లకు నీళ్ళు పడుతూ, పక్షులకు గింజలు వేస్తూ ఉండగా… ఎక్కడి నుంచో ఏమో… ఆశ్చర్యంగా… పక్షులు జంతువులు తన ముందు పుస్తకాలు పెన్నులు పడవేసాయి, చెట్ల తీగలు పూలవాన కురిపించాయి. తను చూపించిన ప్రేమ ఇలా సాయపడిందని నమ్మిన మాధవి ఆనందంతో ‘తన చెల్లికి తల్లికి’ ముద్దులు పెట్టి పుస్తకాల సంచితో హుషారుగా పక్క ఊరిలోని ‘‘బందనకల్‍ బడికి’’ బయలు దేరింది. అదృష్టవశాత్తూ… కొన్ని రోజులలోనే పయనించడానికి బడి నుంచి సైకిల్‍ కూడా అందింది. వరమిచ్చిన చల్లని తల్లి… సేద తీర్చిన చదువుల తల్లి ఒడిలో ఉన్నత చదువు. నేర్చుకొని కాలేజీ చదువు మెట్లెక్కింది మాధవి. డిగ్రీ పూర్తయిన తరువాత మాధవికి అటవీ సంరక్షణ అధికారి ఉద్యోగం లభించింది.

  • ఎ. శరణ్య, 8వ తరగతి (ఇంగ్లీష్‍ మీడియం)
    జెడ్పీహెచ్‍ఎస్‍ బందనకల్‍, ముస్తాబాద్

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *