కృష్ణాష్టమిని భారతదేశమంతా భక్తి శ్రద్ధలతో ఘనంగా ప్రతి ఏటా జరుపుకుంటూనే ఉంటుంది. కృష్ణుడి పట్ల భక్త్యారాధనల విషయంలో భారతీయులు తత్పరత గొప్పదని చాటుకుంటూ ఉంటాం. కృష్ణుడు బృందావనంలో గోపికలతో క్రీడించిన విషయాన్ని అనేక రకాలుగా అభివర్ణించుకుని మురిసిపోతూ ఉంటాం. బృందావన విహారి గూర్చి పలు అంశాలు ఎప్పుడూ ప్రసక్తమవు తూనే ఉంటాయి. బృందావనంలో కృష్ణుడు ఆలమందను తన మురళీ గానంతో ఆనందింప జేశాడని పదేపదే తనివితీరా చెప్పుకుంటూ ఉంటాం. బృందా వనం ఫల, పుష్పతరుశాఖలతో పచ్చపచ్చగా కళకళ లాడుతూ ఉందని భక్తుడి స్వచ్ఛమైన పవిత్రమూ అయిన మనసులాగా నిర్మలంగా ఉందని కూడా శ్రీమద్భాగవతం చెబుతుంది. బృందావనం ఒక పుణ్య క్షేత్రం. ప్రతి ఒక్కరూ కృష్ణుడిని పూజిస్తారు. ఆరాధిస్తారు. ప్రతి యింటా కృష్ణుడు ఉంటాడు. ప్రతి మూలనా కృష్ణమంది రాలుంటాయి. ప్రతి ఏటా లక్షలాదిమంది యాత్రికులు బృందా వనాన్ని సందర్శిస్తూ ఉంటారు. వారు కేవలం కృష్ణ దర్శనం కోసమే వస్తుంటారా? కృష్ణుడు నడయాడిన నేలను చూడటం అక్కడి గాలిని పీల్చటం, అక్కడ ప్రశాంత చిత్తంతో ఏదో ఒక నిర్మల, అలౌకికానందాన్ని పొందటం సాధారణంగా జరుగుతూ ఉంటుంది. కృష్ణుడు స్నానమాడిన యమునను చూడటం ఒక్కటే కాదు. అందులో తాము మునకలేస్తాడు భక్తితో, బాల్యంలో శ్రీకృష్ణుడు ఎత్తిపట్టిన గోవర్ధన గిరిని భక్తి పారవశ్యంతో చూస్తారు. బృందావనం చేరుకోగానే భక్తులు నేలమీద సాష్టాంగపడి పొర్లుదండాలు పెడతారు. తమ నుదుటిపై పసుపుపచ్చని తిలకం దిద్దుకుంటారు. కృష్ణుడు నడిచిన నేల కనుక, ఆ అడుగు జాడల నుండి తీసిన మట్టిని తిలకంగా పెట్టుకుంటారు. కృష్ణుడు స్నానమాడిన కేశి ఘాట్‍ను దర్శించి అందులో తామూ పుణ్య సాన్నానలు చేస్తారు. ఆ పవిత్ర నదిలో తమ పూర్వ కర్మల పాపాలను తొలగించుకుంటామని నమ్ముతారు. ఆ తరువాత గుడుల సందర్శన, ప్రదక్షిణలు, ప్రసాద స్వీరణలు ఎలాగూ ఉంటాయి. కృష్ణనామ జపం చేస్తూ భక్తులు చేసే ప్రదక్షిణలు అవి. అయితే ఒకప్పటిలా బృందావనం ఇప్పుడు లేదనేది కూడా వాస్తవమే. ఒకప్పుడు అక్కడున్న వృక్ష సంపద ప్రదక్షిణ మార్గాన్ని చల్లటి నీడతో కప్పి వేసి ఉండేది ఇప్పుడు ఆ నీడలు లేవు. అక్కడ ఇసుక నేల కొంచెం పొద్దెకితే చాలు పాదరక్షలు లేని పాదాలకు వేడివల్ల బొబ్బలు వచ్చేంతగా మారింది. స్థానికులు కొందరు తమ కార్ల కోసం ఆ మార్గాన్ని మెత్తటి దారిని గట్టి గ్రావెల్‍తో నింపారట. చెట్లు తగ్గి పోయాయి. నీడలు మాయం అయ్యాయి. గత నాలుగైదు దశాబ్దాలుగా అక్కడి పర్యా వరణం నానాటికీ దిగజారుతూ ఉన్నదని. దేశం మొత్తం పర్యావరణ పరంగా మారి నప్పటికీ కృష్ణుడి గృహమైన బృందావనమైనా ఇంకొంత మెరుగ్గా
ఉండకూడదా.
యమునా నది పరిస్థితి మరీ దారుణం. బృందావనానికి పైనెక్కడో ఎనభై మైళ్ల దూరంలో ఢిల్లీ నగరం ఉంది. ఆ నగరం నుండి వదిలిపెడుతున్న వ్యర్థాలు వచ్చి యమునను కలుషితం చేస్తున్నాయి. పరిశ్రమలు విడిచే వ్యర్థాలు కూడా యమునలో కలుస్తున్నాయి. ఢిల్లీ నుండి ఆగ్రా దాకా మధ్యలో బృందావనంతో సహా యమున నది పవిత్రజలం త్రాగటానికి, పవిత్ర స్నానానికి పనికి రానిదిగా ప్రకటించ బడింది. ఒకప్పుడు బృందా వనంలోని దేవతా విగ్రహాలను శుద్ధిచేయడానికి వాడిన నీరు ఇప్పుడు పనికి రాకుండా పోవటం విషాదకరం. బృందావనం అంటే బృంద అనే వనమే కదా! అదిప్పుడు లేదు. కదంబ, రావి, తమాల, వట, ఉసిరి లాంటి వృక్షాలు అంతరించాయి. లేదా కృష్ణుడి జీవన ఘట్టాలలో ముడివడి ఉన్న పవిత్ర వృక్షాలుగా భావించబడినవి ముప్పును ఎదుర్కొంటున్నాయి. ఇదంతా అభివృద్ధి పేరిట జరిగిన జరుగుతూ ఉన్న విధ్వంసమే.
కృష్ణ భక్తులకు ఆరాధ్యనీయమైన శ్రీమద్భాగవతం బృందావనాన్ని ఎంతగానో వర్ణించి చెపుతుంది. కృష్ణుడు తన సోదరుడైన బలరాముడితో ఆవులను తోలుకుని వనంలోకి ప్రవేశించాడు. ఏం చూశాడక్కడ అనేక రకాల వృక్షాలు ఫలపుష్పాలతో వికసితమై అతడు చరణారవిందాలను తాకుతూ స్వాగతిస్తున్నాయి. వృక్షాలు అలా ఫల, పుష్పాలతో స్వాగతించిన తీరుకు చిరునవ్వు నవ్వాడు. బల రాముడితో ప్రియ సోదరా! నువ్వు మా అందరికంటే అధికుడవు వీక్షించు ఆ వృక్షాలను అవెలా తమ ఫలపుష్పాదులతో నీ పాదాలను తాకుతూ నిన్ను కొలుస్తున్నాయో ఆ మయూరాలు ఎలా నాట్యమాడుతూ ఉన్నాయో నీ ముందు. ఆ జింకలు అంతే ప్రేమాస్పదంగా నీకు స్వాగతం పలుకుతూ
ఉన్నాయి. నీ రాకను కోకిలలో సంతోషంగా ఆలపిస్తున్నాయి. వాటి గృహ ప్రాంగణాన నీవు అడుగు పెట్టావని ఆనందిస్తున్నాయి. అవి వృక్షాలు, జంతువులే కావచ్చు కాక. కానీ బృందావనంలో వాటి ఆవాసం అవి నిన్ను కీర్తిస్తున్నాయి అని. ఒక గొప్ప సమృద్ధ ప్రకృతి సంపద మనకుందని మద్భాగవత పురాణం చెపుతున్నది. అది వట్టి కవుల కాల్పనిక వర్ణనే అని మనం కొట్టి పడేయవచ్చుగాక కాని, ఒక సమృద్ధిని మనం కలిగి ఉన్నామనేది వాస్తవం.
చెట్లూ, చీకులూ లేని బృందావనం పిల్లలు లేని తల్లిలా ఉందంటాడు. ‘హిందూయిజం అండ్ ఎకాలజీ’ అనే పుస్తకం రాసిన రాంకర్ ప్రెమ్. కృష్ణుడిని వెన్నంటి ఉన్న నెమళ్లు అదృశ్యం అయ్యాయి. ఎందుకంటే అవి వాటి ఆవాసాలను కోల్పోయాయి కనుక.
ఇక బృందావనం 1970ల దాకా మానవ వ్యర్థాలను తొలగించడానికి సంప్రదాయ పద్ధతులను అనుసరించింది. శౌచాలయాలు పొడిగా ఉండేవి. వ్యర్థాలను ఎప్పటికప్పుడు రోజువారీ పద్ధతిలో తొలగించటం ఉండేది. 1970లలోనే బృందావనానికి ఆధునిక వ్యర్థాల తొలగింపు అవసరమనే ఆలోచన ప్రభుత్వంలోని ఎవరికో వచ్చింది. అందుకు తగ్గట్లుగానే కాలువలు, డ్రైనేజీలు తవ్వబడ్డాయి. యమునకు దిగువన ఎక్కడో ఈ వ్యర్థాలు కలిసేట్లు నిర్ధారణ వ్యవస్థలు రూపు దిద్దుకున్నాయి. ఒక ఏడాది తిరిగాక భూమిలోపల అడ్డంకులు ఏర్పడ్డాయి. అప్పటి నుంచి దాని అతీగతీ పట్టించుకున్నట్లు లేదు. పెరుగుతున్న జనాభా, యాత్రికులు సంఖ్యాధికంగా పెరగటం లాంటివి పరిగణనలో లేక పోవటం వల్ల సమస్య మరింత జటిలమైంది. ఎక్కడ ఏ చిన్న ఆటంకం ఏర్పడినా ఫలితం బృందావనం కలుషిత నీరు, దుర్వాసన నిండిపోతుంది. సంప్రదాయ వ్యవస్థల స్థానంలో ఆధునిక మైనవి ఏర్పాటు జరిగినప్పుడు నిర్వహణ సామర్థ్యాలను లెక్కించకపోవటం వల్ల ఏర్పడిన ఇబ్బందులకు పరిష్కారం అంత తేలికగా దొరకకపోవడం విచారణీయం.
హిందువులు జలాన్ని అత్యంత శక్తిమంతమైందిగా చూస్తారు. అన్నిటినీ శుద్ధి పరిచేదిగా భావిస్తారు. అన్ని రకాల పవిత్ర కర్మ కాండాది కార్యక్రమాలలో నీటిని ఉపయోగిస్తారు. నీటి స్వచ్ఛతను, పవిత్రతను కాపాడాలని అనుకుంటారు. మరి అట్లాంటప్పుడు బృందావనం వైపుల నుండి కలుషితమైన నీటితో నిండిపోయింది. ఒక వైపు యమున సీవేజ్‍తో అపరిశుభ్రమైంది. బృందావనం తన పవిత్రతను కోల్పోయిందా మనం మన స్వచ్ఛతను కోల్పోయి బృందావనానికి ఈ స్థితిని కల్పించామా నిజానికి కృష్ణ భక్తులు వృక్షాలను, నదులను, జలాలను జంతువులను అమితంగా శ్రద్ధాభక్తులతో చూస్తారు. మరి ఇట్లా ఎందుకు జరుగుతున్నది. ఒక కారణం నిర్లక్ష్యం. బృందావనంను సందర్శించే యాత్రికులు, బృందావన వాసులు, స్థానిక ప్రభుత్వాలు కారణం. ఇంకా ఇతర కారణాలూ ఉండి ఉండవచ్చు. బృందావనం యిలా కావడానికి పారిశ్రామికీకరణ ఎంత కారణమో, పాశ్చాత్య జీవన విధానాలు, పోకడలు కూడా అంతే కారణం.
ఈ కృష్ణాష్టమికి తన నాలుగవ అంతస్థులో ఉన్న ఇంటిలోకి లిఫ్టు దగ్గర నుండి చిన్న కృష్ణుడి పాద ముద్రికలను చిత్రిస్తూ ముగ్గులు పెట్టుకుంటున్నది ఓ ఇల్లాలు. బాలకృష్ణుడు తన చిన చిన్న అడుగులతో ఆ ఇంటిని బృందావనమంత పావనస్థలం చేస్తాడని ఆ ఇల్లాలు ఆశపడుతోంది. కానీ, తడి చెత్తనుంచి పొడి చెత్తను వేరు చేయలేక అవస్థలు పడుతోంది. ఇంటి చెత్తనంతా వీధుల్లోకి విసురుతోంది. పుణ్యక్షేత్రాలు, పవిత్ర స్థలాలు, పండుగలు జరుపుకోవటం సరే. ఆ కోల్పోయిన బృందావన పావనత్వాన్ని కృష్ణతత్వాన్ని పర్యావరణ హితైషులుగా మారి పాడుకుందాం. ప్రతి హృదయం బృందావనమే అని చాటుదాం.
- డా।। ఆర్. సీతారామారావు
ఎ : 9866563519