గద్దర్ ఫౌండేషన్‍కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.3 కోట్లు మంజూరు
రవీంద్రభారతిలో జరిగిన గద్దర్ ప్రథమ వర్ధంతి వేడుకలో ప్రభుత్వ ప్రకటన
హాజరైన వివిధ ప్రజా ప్రతినిధులు, మేధావులు, కవులు, కళాకారులు, ప్రజలు
ఆగస్టు 6న రవీంద్రభారతిలో గద్దర్ ప్రథమ వర్ధంతి వేడుకలను ‘గద్దర్ ఫౌండేషన్’ ఘనంగా నిర్వహించింది.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మేధావులు, కవులు, కళాకారులు, వివిధ సంఘాలు, ప్రజలు పాల్గొన్నారు.
గద్దర్‍తో వారికున్న అనుభవాలను వ్యక్తపరిచారు. అందులో కొందరి అభిప్రాయాలు.
భట్టి విక్రమార్క (ఉప ముఖ్యమంత్రి) :
గద్దర్ స్మారకార్థం హైదరాబాద్‍లోని నెక్లెస్ రోడ్డులో గద్దర్ మెమోరియల్ గార్డెన్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఒక ఎకరం స్థలాన్ని కేటాయిస్తోంది. అదనంగా రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ ఫౌండేషన్‍కు రూ.3 కోట్లు మంజూరు చేస్తోంది. ఈ ఫండ్ గద్దర్ ఆలోచనలపై పరిశోధనలకు తోడ్పడుతుంది మరియు రాష్ట్రవ్యాప్తంగా ఆయన పేరిట కార్యక్రమాలను నిర్వహిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో గద్దర్ ఆలోచనలు ప్రతిబింబిస్తున్నాయి.
బి. నర్సింగరావు (సినీ నిర్మాత) :
మొట్టమొదటిసారి నేను ఆయన్ని కల్సింది 1971. దాదాపు 50 సం।।రాలు. మేము పది, పదిహేను సం।।రాలు కల్సి పనిచేశాం. ప్రజాకళాకారుడిగా ఎదిగి, ప్రజలకు సేవ చేస్తున్న క్రమంలో తన కళతో ప్రజల్ని ఎంతగా ఆకట్టుకున్నాడో మనకు తెల్సిందే. కె.వి. రమణారెడ్డిగారు ఒక ముందు మాటలో గద్దర్ ఇజ్ లెజండ్ అన్నారు. అంతకుమించిన బిరుదు ప్రపంచంలో ఎవరికి అక్కరలేదు. ఈ జీవిత క్రమంలో దాదాపు 50 సం।।ల కాలంలో అనేకానేక విషయాల మీద మాకు చర్చలు జరిగేవి. నా జీవితంలో నేను చేయలేని ఎన్నో కార్యాలు గద్దర్ చేశాడు. నేను ప్రారంభించిన సంస్థని, ఉద్యమాన్ని తన భుజాల మీద ఎత్తుకున్నాడు. 50 ఏండ్లు నడిపించాడు. ఆయన జీవితంలో దేనికి భయపడినవాణ్ని చూడలేదు. ఈ సమాజానికి కాపలదారు. ఒక కళాకారుడు ఇన్ని పనులు చేయక్కర్లేదు. నాజర్ మహాకళాకారుడు వారు కళకే పరిమితమవుతారు. కళద్వారా ప్రజలకు సేవచేసారు. ఇతను కళ, సామాజికము, రాజకీయం, సాంస్కృతికం ఇంకా ఏయే రంగాలున్న అన్నింట్లో నేనున్నాను అనేవాడు. ఒక్కదాన్ని వదిలిపెట్టి వెళ్లడు. నవ్వుతూ జీవితం గడిచిపోయింది. ఒక వ్యక్తి ప్రపంచాన్ని కల గన్నాడు. అందులో కులాలు, మతాలు ఇవి ఏమీ ఉండవు. ఎవరూ బాధపడని ప్రపంచాన్ని సృష్టించాలి, దాని కోసం మనం పనిచేయాలి.
అల్లం నారాయణ (జర్నలిస్టు) :
ఒక శక్తివంతమైన ప్రభావంతుడైన ప్రత్యామ్నాయ రాజకీయాలను తలకిందులుగా చేసిన ఒక గొప్ప కళకారుడు, సాహితీవేత్త, తాత్వికుడు, విప్లవకారుడు, గాయకుడు, వాగ్గేయ కారుడు గద్దర్. ఆయన ఎన్నడూ మార్క్సిజం మూల సూత్రాలకు వ్యతిరేకంగా ఆలోచించలేదు. భారతీయ కుల సమాజాన్ని అర్థం చేసుకుని పూలే, అంబేద్కర్ తాత్విక ధోరణి మార్క్సిజం, లెనినిజం, మావోయిజం సూత్రాలకు అన్వయించాలని సూచన చేశాడు. భారతదేశంలోనే ఇంత గుణాత్మకమైన మార్పు కోసం ప్రయత్నించిన మరొక సాహితీవేత్త లేడు. మొత్తం ప్రజా కళారంగాన్ని విప్లవీకరించాడు. ఇది గద్దర్ తెచ్చిన తెలంగాణ.
ప్రొఫెసర్ శాంతా సిన్హా (గద్దర్ ఫౌండేషన్)
గద్దర్ ఫౌండేషన్‍లో ఎన్నో కార్యక్రమాలు చేయాలను కుంటున్నాము. అందుకు ముఖ్యంగా కళాకారులు కలిసి ప్రతి గ్రామానికి గద్దర్ వాక్కు ప్రజల వాక్కు చేయాలని మీ పాట ద్వారా తీసుకుపోవాలని గద్దర్ ఫౌండేషన్ ఆశిస్తుంది. దాంతో పాటు అట్టడుగు వర్గాల వారికి మీ సలహాలతో ఈ పౌండేషన్ సహాయం చేస్తుంది. మీరు సలహాలు, సూచనలు చేయాలి.
ప్రొ।। హరగోపాల్ (విద్యావేత్త)
గద్దర్‍ను అంచనా వేయడం అనేది అంతా సులభమైన పనికాదు. సామాజిక శాస్త్రాలలో చర్చ నడుస్తు ఉంటుంది. అద్భుతమైన వ్యక్తులను సమాజం సృష్టిస్తుందా లేదా సమాజంను అద్భుతవ్యక్తులు ప్రభావితం చేస్తారా? గద్దర్ తెలంగాణ చైతన్యం నుండి పుట్టాడు. ఆ చైతన్యాన్ని ప్రభావితం చేసాడు. మనిషి జీవించడమంటే భౌతికంగా జీవించడం కాదు మనిషి ఒక జ్ఞాపకాలు, భావాలు మనస్సులో కదులుతుంటారు. వావిరాల గోపాలకృష్ణయ్యగారు చివరిదశలో నాతో ఇలా అన్నారు. తన జీవితంలో ఇద్దరే పవర్‍పుల్ కామ్రేడ్స్ సమాజాన్ని ప్రభావితం చేసేటటువంటి వాళ్ళు ఒకరు గాంధీ, రెండవది గద్దర్. గద్దర్ పాటలు మనిషి హృదయాన్ని కదిలించడం, మేధస్సును కదలించడం, పాట మనస్సును కదిలిస్తుంది. కాని గద్దర్ మాట హృదయాన్నే కాదు మేధస్సును ఆలోచింపచేస్తుంది కూడా. తెలంగాణ చైతన్యాన్ని గద్దర్ ఒక మలుపు తిప్పాడు. గద్దర్ సాహిత్య చరిత్రలో, కళారంగ చరిత్రలో, ఉద్యమాల చరిత్రలో భవిష్యత్ తరాలు గుర్తుండే వ్యక్తి.
పాశం యాదగిరి (జర్నలిస్టు)
విప్లవకారులకు సమాజమే ప్రాథమిక చైతన్యం, కుటుంబం ద్వితీయ చైతన్యంగా పోతుంది. గద్దర్ దేశకోసం, ప్రజలకోసం తిరుగిండు గద్దర్ అంతర్జాతీయవాది. కార్మికుల హహకారాల నుంచి తెలంగాణ ఉద్యమం పుట్టింది వాళ్ళ హహకారాలకు గొంతిచ్చి పాటగా మలిచిండు గద్దర్.
ప్రొఫెసర్ కోదండరాం
గద్దర్ పోవటమంటే తెలంగాణ ఒక దిక్సూచిని కోల్పోవటమే. తెలంగాణ పోరాటాలకు నిలువెత్తు సాక్ష్యం. వాటికి చైతన్యం నింపి మార్గనిర్దేశం చేసిన వ్యక్తి. ఉద్యమాల పట్ల, విలువలు పట్ల నిబద్దతో పనిచేశారు. ప్రాథమిక హక్కుల గురించి ప్రచారం చేయాలి, వాటిని ప్రభుత్వాలచే అమలు చేయాలని నిర్దేశించుకున్న వ్కక్తి. ఈరోజు ఆయన లేకుండా వారి పాట, మాట, ఆశయాలను మనందరం ముందుకు తీసుకెళ్లడం మన కర్తవ్యం.
విమలక్క (అరుణోదయ సాంస్క•తిక సమాఖ్య)
గద్దరన్నకు నివాళి అంటే ప్రజాసాంస్కృతిక ఉద్యమాన్ని ఐక్యంగా ముందుకు తీసుకెళ్లడమే సరైన నివాళి. అరుణోదయ సాంస్కృతిక సమాక్య ద్వారా చెప్పే మాట ఇది. ఈ విషయాన్ని అందరూ ఆలోచించి అడుగులు వేస్తారని ఆశిస్తున్నాను.
బిఎస్ రాములు (మాజీ బీసీ కమీషన్ చైర్మన్)
గద్దర్ చెప్పడానికి చాలా ఉన్నాయి. ఆయన జీవితమే సందేశం. ఆయన చివరిగా భారత రాజ్యాంగ విశిష్టతను బౌద్దుని యొక్క, అంబేద్కర్ యొక్క కృషిని గౌరవించారు. సాయుధ పోరాటంలో ముందుకు వచ్చిన గద్దర్ శాంతియుత పరివర్తన తీసుకుంటున్నాడు. అది రాజ్యాంగం ద్వారా తీసుకోవాలని అనుకుంటున్నాడు వన్‍మ్యాన్. గద్దర్ ప్రజాకళల యూనివర్సిటిని, సామాజిక తాత్విక విశ్వవిద్యాలయంలను ప్రభుత్వం ఆమోదిచాలని కోరుకుంటున్నాను.
గోరటి వెంకన్న (ఎమ్మెల్సీ)
గద్దర్ గారు బేసికల్‍గా కవి. మార్క్సిజాన్ని తన దృక్పతంగా స్వీకరించాడు. తెలంగాణ సాహత్యాన్ని ప్రపంచ వ్యాప్తం చేశారు. నాజర్ వారసత్వాన్ని కొనసాగించారు. అలంకార శాస్త్రాన్ని చదవకున్నా అలంకార ప్రాయాన్ని రాసినవాడు గద్దర్.
మణికొండ వేదకుమార్ (దక్కన్ ల్యాండ్)
1969లో తెలంగాణ ఉద్యమంలో విద్యార్థిగా గజ్వేల్ నుంచి నాయకత్వం వహించాను. నాకు తెల్సినంతవరకు జననాట్య మండలిలో తనకు గొంగడి, గోచి, గజ్జే, రుమాల్ కట్టినప్పుడు తన గెటప్ మారినప్పటి నుండి చూస్తున్నా. వారి పిల్లలు సూర్యం, చంద్రం ఇద్దరు ఆక్స్ఫర్డ్ గ్రామర్ స్కూల్ విద్యార్థులు. హాస్టల్‍లో ఉంటూ చదువుకున్నారు. నర్సింగరావుగారు అన్నయ్య ‘మాభూమి’ సినిమా తీసినప్పుడు సినిమాలో మొదటిసారి బండెనక బండికట్టి పాట పాడి నటించాడు. ఎక్స్క్లూజ్‍గా నడుస్తున్న ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో కలిసిన క్రమంలో ప్రజాఫ్రంట్ ఏర్పడింది. అప్పుడు నేను కూడా భాగస్వామ్యం అయ్యాను. అక్కడి నుండి ఐదారు వందల వేదికలు, లక్ష కిలోమీటర్లకు పైగా భూపాల్ పల్లి నుండి మక్తల్ వరకు కార్నర్ టు కార్నర్ లక్ష కిలోమీటర్లు కలిసి ప్రయాణించినం. చాలా దగ్గరగా ఏడు సంవత్సరాలు ట్రావెల్ చేశాను. ఎంతో ప్రేమించేవాడు, మంచి మనిషి, సమాజ మనిషిగా గుర్తించాము, గౌరవించాము. నన్ను చాలా విషయాల్లో ప్రేమ చేసేవాడు. గద్దర్ అన్న ఫౌండేషన్ చక్కటి వ్యక్తులతో చక్కగా నిర్ణయాలు తీసుకొని కొనసాగాలి. ఇందులో అందరం భాగస్వామ్యం అవుదాం.
ఎన్ వేణుగోపాల్ (వీక్షణం)
గద్దర్ జీవితం, ఆచరణ, కృషి ఒక తెరిచిన పుస్తకం. అది అందరికీ తెలిసిందే. కొత్తగా చెప్పనవసరం లేదు. 1973లో వరంగల్, హన్మకొండ గ్రౌండ్‍లో పాట పాడుతుండే మొదటి సారి విన్నాను. 2023 దాకా రెగ్యులర్‍గా కలుస్తూనే వున్నాను. 1985-89 కాలంలో ఉమ్మడి ఆంధప్రదేశ్‍లో అమలైన ఆట – పాట – మాట బంద్ అమలయిన కాలంలో వారు నిర్బంధంలోకి వెళ్లవల్సి వచ్చింది. ఆ సమయంలో వారు రాసిన ఐదారు వందల పేజీలు నాకు చేరినాయి. వాటిని ఆంధ్రజ్యోతిలో సీరియల్‍గా వేసి, ఆ తరువాత వాటిని పుస్తకాలుగా తెచ్చాము.
అందెశ్రీ (వాగ్గేయకారుడు)
యావత్ భారతదేశ గుండెల్లో తూర్పు కనుమలన్ని చీల్చుకొని వచ్చి ప్రపంచానికి కాంతిని పంచే తొలి పొద్దు, పాటల తొలి పొద్దు పొడుపు.
నందిని సిద్ధారెడ్డి (కవి, మాజీ అధ్యక్షులు సాహితీ అకాడమీ)
ఒక మనిషి ప్రజలకోసం ఎట్లా జీవించాలో అట్లా జీవించినవాడు గద్దర్. ఒక కళాకారుడు ప్రజలకోసం ఎట్లా పాటగాడుగా మారాలో ఎన్ని పాటలు రాయాలో ఎన్ని ప్రదర్శనలు ఇవ్వాలో అన్ని ప్రదర్శనలు ఇచ్చి అందరి హృదయాల్లో నిలిచినవంటివాడు. ఆయన ఎన్నడూ ప్రయాణం ఆపలేదు. అట్లా ఒక జీవ నది ప్రయాణించినట్లు ప్రయాణించి నవాడు. తను పాటను, ప్రయాణాన్ని, ప్రజలను విడిపెట్టలేదు.
పరుచూరి బ్రదర్స్ (సినీ రచయిత)
గద్దర్ అంటే విప్లవాన్ని ఉరుకులు పరిగెత్తించే మహానుభావులు. గద్దర్ పాట పాడితే ప్రజల యొక్క అట్టడుగు వర్గాల భావజాలం ప్రపంచానికి అందింది. గద్దర్ మా రచయితల సంఘంలో వారు సభ్యుడు. చిత్రపురి కాలనీలో వారి కుటుంబానికి ఇళ్లు ఇవ్వడానికి సొసైటీ నిర్ణయించింది.
ప్రొ।। లక్ష్మణ్ (పౌర హక్కులసంఘం అధ్యక్షులు)
గద్దర్ విశ్వమానవుడు. సూర్యం చెప్పినట్లు ఒడిదుకుడులతో గద్దర్‍తో పౌర హక్కుల సంఘానికి విడదీయరాని అనుబంధముంది. అట్టడుగు ప్రజల విముక్తి కోరుకున్నడో అన్ని పోరాటాలకు నాయకత్వం వహించాడు. బూటకపు ఎన్‍కౌంటర్లు, జరుగుతున్నప్పుడు బూటకపు ఎన్‍కౌంటర్ల వ్యతిరేక పోరాట కమిటి ఏర్పాటు చేసి నాయకత్వం వహించాడు. వర్గీకరణ కమిటీకి నాయకత్వం వహించాడు. శవాల స్వాధీన కమిటీకి నాయకత్వం వహించాడు. నర్సాపూర్ సంఘటనలో ముగ్గురు శవాలను నిప్పు పెట్టే సమయంలో గద్దర్ అన్న సింహంలా లేచి చితిలోని శవాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం చేసి నీళ్ళలో పడి చనిపోయారని పోలీసులు చెప్పిన పోస్టుమార్టం బూటకమని పోలీసులే కాల్చి చంపారని నిరూపించాడు. నయీం ముఠా తెలంగాణలో హత్యకాండ కొనసాగిన సమయంలో ఇద్దరం నిల్చున్నాం. పోరాట సంఘం ఘనంగా నివాళులు అర్పిస్తుంది.
వెంకట్‍రెడ్డి (ఎం.వి.ఫౌండేషన్)
అన్న లేని లోటును తీర్చాలి అంటే మనందరం ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకెళ్ళాల్సిఉంది. అన్న ఒక పెద్ద ప్రజాస్వామ్యవాది నేను చాలా దగ్గరగా చూసాను. దుఃఖం లేని సమాజాన్ని, దోపిడి, పీడలులేని సమాజాన్ని నిర్మించుకోవాల్సి ఉంది. మనందరం మరోక సారి ప్రతిన పూనాల్సి ఉంది. గద్దర్ అన్న కేవలం తెలంగాణ ఉద్యమ లీడర్ మాత్రమే కాదు భారతదేశ లీడర్‍రే కాదు ప్రపంచ పీడిత వర్గాలకు చెందిన నాయకుడు.
చిక్కుడు ప్రభాకర్
ఒక సాంస్క•తిక ఉద్యమాన్ని భాగస్వామ్యమై దానికి నాయకత్వం వహించి దాన్ని నిర్మాణంలో కొనసాగి ఎన్నో ఒడిదుకుడులు ఉన్న కూడా ఒక పద్ధతి ద్వారా కొట్లాడి ఆ తరువాత తను ఏ మేరకు ఉండ్లాన్నో ఆమేరుకు ఉండటానికి కూడా ఆయనకు ప్రతి ప్రజాస్వామిక ఉద్యమంలో గద్దర్ యొక్క ఆట, పాట, బాట ఉన్నది. ప్రజల కొరకు ఈ దేశ ప్రజల విముక్తి కొరకు తన వంతు కర్తవ్యాన్ని కొనసాగాంచాలని దశాబ్దాల తరబడి ఉద్యమంలో కొనసాగిన వ్యక్తి. ఈ విషయాన్ని ప్రపంచానికి చాటి చెప్పే క్రమంలో మనం ఎవరం సరిపోము.
శ్రీనివాస్‍రావు (టిజె కేంద్ర కమిటీ అధ్యక్షులు)
ఆయన ఒక విద్యార్థి నాయకుడు, ఉద్యమనాయకుడు, ఉద్యోగి, ఆదర్శప్రాయుడు ఇలా అనేక పార్శ్వాలని ఒక నిఘంటువుగా, తన కలం, గళం ద్వారా దిశ నిర్దేశిగా ఎంతోమంది మేధావులని, సహచరులని పొందిన వారికి నివాళులు.
సూర్యం (గద్దర్ కుమారుడు):
ఈ ప్రథమ వర్ధంతి సభకు వచ్చేసిన గద్దర్ వారసులందరికీ అభివందనాలు. గద్దర్ ఫౌండేషన్ ఏర్పాటు చేయడానికి అనేక ముఖ్య ఉద్దేశ్యాలు ప్రధానంగా చదువుతో పాటు నాన్న కలిసి పని చేసిన గత 70 సంవత్సరాలు కలిసి పనిచేసిన వారందరినీ కలపడం, వారి జీవన పోరాటంలో యావత్ భారతదేశానికి చేసిన నాన్నకు ఒక వేదిక కావాలి. దాంట్లో భాగంగా ఈ గద్దర్ ఫౌండేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా గద్దర్ ఫౌండేషన్ ఏర్పాటు చేయాలని ఆంజనేయరెడ్డి (మాజీ డీజీపీ, ఆంధప్రదేశ్), వెంకట్‍రెడ్డి, శాంతి సిన్హాగారు ముఖ్యులుగా వుండి దీనికి దిశా నిర్దేశం చేస్తున్నారు. ప్రతి పోరాటంలో నాన్న పాట వుంది, జ్ఞానం వుంది, త్యాగం వుంది. తన జీవితం మొత్తం భారతదేశం కోసం, భారతదేశంలో వున్న పీడిత ప్రజల కోసం ప్రపంచంలో వున్న పీడిత ప్రజల కోసం తను ఎప్పుడూ తపిస్తూ వుంటాడు. అనేక మలుపు తిరుగుతూ తన జీవితం ఈ రోజు భారత రాజ్యాంగం దగ్గర నిలబడి అటు వైపు చూపిస్తున్నాడు.
- ఎసికె. శ్రీహరి,
ఎ : 9849930145