వయనాడ్‍ నేపథ్యంలో.. తూర్పు కనుమల్ని కాపాడుకుందాం!! తూర్పు కనుమల్ని ప్రపంచ సహజ వారసత్వ సంపదగా ప్రకటించాలి

ప్రకృతి ఎంత సుందరమైనదో, ఎంత దృఢమైనదో అంత సున్నితమైనది కూడా. ప్రకృతి సకల జీవరాశికి ఆవాస నిలయమే కాదు ఆ జీవరాశి మనుగడకు తరగని వనరుల పెన్నిధి కూడా.


సకల జీవరాశి ప్రకృతిని తమకు అవసరమైనంత వరకే ఉపయోగించుకుంటాయి. ఒక్క మనిషి మాత్రమే స్వార్థ చింతనతో, సుఖలాలసతో తనకున్న సాంకేతిక జ్ఞానంతో ప్రకృతిని విచ్చలవిడిగా ఉపయోగించుకుంటున్నాడు. దీనికి అభివృద్ధి అని పేరు పెట్టాడు. వైవిధ్యపూరితమైన సమస్త జీవరాశి (మనుషులతో కలిపి)కి హానికలిగించే ఏ అభివృద్దీ వాంఛనీయం కాదు. ఈ అభివృద్ధిని సామాజిక, పర్యావరణ శాస్త్రవేత్తలు విధ్వంసకర అభివృద్ధి అనీ విచక్షణారహిత అభివృద్ధి అనీ అంటున్నారు. దీని వలన జీవ వైవిధ్యానికి విఘాతం కలుగుతున్నది. పర్యావరణంలో అసమతుల్యత ఏర్పడుతున్నది దీని ఫలితమే ఈ ప్రకృతి విపత్తులు.


గత నెలలో పశ్చిమ కనుమలలోని కేరళలో వయనాడ్‍ బీభత్సాన్ని చూసాం. వందలాది గ్రామాలు, మనుషులు బురదలో కొట్టుకుపోవడం చూసాం. పశ్చిమ కనుమల ప్రాంతాన్ని ఎకొలాజికల్లీ సెన్సిటివ్‍ ఏరియాగా ప్రకటించాలని ప్రముఖ పర్యావరణ శాస్త్రవేత్త మేధావి మాధవగాద్గల్‍ నివేదికను పెడ చెవిన పెట్టిన ఫలితమిది.


ఈ నేపథ్యంలో తూర్పు కనుమలకూ పెను ముప్పు పొంచి ఉన్నదని ప్రముఖ పర్యావరణ వేత్తలు, ప్రకృతి ప్రేమికులు ఆందోళన పడుతున్నారు. తూర్పు కనుమలు ఒడిశా, ఆంధప్రదేశ్‍, తెలంగాణా, కర్నాటక, తమిళనాడు వరకు సుమారు 75 వేల చ.కి.మీ. వ్యాపించి ఉన్నాయి. జీవ వైవిధ్యానికి కొదవలేదు. పశ్చిమ కనుమలకంటే పురాతనమైనవి. ఈ ప్రాంతంలోనూ విధ్వంసకర చర్యలు అభివృద్ధి పేర ముమ్మరమవుతున్నాయి. గనుల తవ్వకాలు, రోడ్డు, రైలు ట్రాక్‍లు, టన్నెల్స్, నగరీకరణ, పర్యాటకం పేర కొండవాలులో హోటల్‍, రిసార్టుల నిర్మాణం వంటివి కొండ ప్రాంతాల సహజత్వాన్ని దెబ్బతీస్తున్నాయి. యంత్రాల వల్ల కలిగే ప్రకంపనలతో కొండలలో పగుళ్లు ఏర్పడి వర్షపునీరు లోపలికి చేరి డొల్లగా తయారవుతున్నాయి. వరదనీటికి కొండ చరియలు జారిపడుతున్నాయి. ఈ ప్రమాదాల నుంచి తూర్పు కనుమల్ని కాపాడుకోవాలి. ప్రకృతి సముతుల్యతకు జాగ్రత్తలు తీసుకోవాలి.


ఇప్పటికే కొత్త వలసనుంచి కిరండల్‍ మధ్య, శివపురం నుంచి బొర్రాగుహల మధ్య పలుమార్లు కొండచరియలు పడిపోవడం, అరకు బురదలో కూరుకుపోవడం చూసాం. ఈ ప్రాంతంలోని 21 ప్రాజెక్టులకు ముప్పు రాబోతుందని నిపుణులు అంటున్నారు.


నేచురల్‍ లాండ్‍ స్కేప్‍ను కాపాడుకోవాలి.
అడవుల నరికివేత, పట్టణీకరణ, పరిశ్రమల ఏర్పాటు, పర్యాటక ప్రాంతాల ఎంపిక, ఎత్తైన భవనాల నిర్మాణం, మైనింగ్‍ వంటి విషయాల్లో నిపుణుల సిఫార్స్లకు ప్రాధాన్యత యివ్వాలి. జీవవైవిధ్యానికి హాని చేసే చర్యలను నివారించాలి.
తూర్పు కనుమలను ప్రపంచ సహజ వారసత్వ సంపదగా ప్రకటించాలని కోరుతున్న పర్యావరణ శాస్త్రవేత్తలకు పర్యావరణ ప్రేమికులకు మద్ధతుగా మనమూ నిలబడదాం

(మణికొండ వేదకుమార్‍)
ఎడిటర్‍

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *