రక్షణ కవచాన్ని రక్షించుకుందాం! సెప్టెంబర్‍ 16న ఓజోన్‍ పొర పరిరక్షణ అంతర్జాతీయ దినోత్సవం

శరీరానికి తగిలిన గాయం త్వరగా మానిపోతుంది. మనసుకు తగిలిన గాయం కాస్త కష్టంగా మానుతుంది అన్నాడో కవి. ముచ్చటపడి కొనుక్కున్న చొక్కాకు చిల్లు పడితే ప్రాణం విలవిల్లాడుతుంది కదా.. మరి భూగోళంపై కవచంలా ఉంటూ సమస్త జీవకోటికి రక్షణ కల్పిస్తున్న ఓజోన్‍ పొరకు రంధ్రం పడితే బాధపడిన వారెందరు? పర్యావరణ ప్రేమికులు తప్ప ఒక్కరు కూడా ‘అయ్యో..’ అని కూడా అనుండరు! ప్రకృతికి తగిలే గాయాలు మానిపోవడం అంత ఈజీకాదని చెప్తున్నారు శాస్త్రవేత్తలు. భూమిపై కాలుష్యాల్ని తగ్గించే చర్యలెన్ని చేపడుతున్నా.. ఏదో ఒక రూపంలో అది పెరిగిపోతూ వస్తోంది. ఆఖరికి లాక్‍డౌన్‍ లాంటి చర్యలు కూడా కాలుష్యాన్ని పూర్తిస్థాయిలో నియంత్రించ లేకపోయాయి. ఈ పరిణామాలు భూమికి రక్షణ కవచంగా భావించే ఓజోన్‍ పొరను దారుణంగా దెబ్బతీస్తున్నాయి. ఓజోన్‍ పొర మానవాళికి చేసే మేలు గురించి అవగాహన ఉంటే.. దానికి కీడు తలపెట్టే విధంగా ఎవరూ ప్రవర్తించరు!! సెప్టెంబర్‍ 16న ఓజోన్‍ పరిరక్షణ దినం.


భూమికి రక్షణ కవచంగా ‘ఓజోన్‍’ను చెప్పుకుంటాం. భూమి నుంచి వెలువడే అతి శక్తివంతమైన, ప్రభావవంతమైన అతినీలలోహిత కిరణాలను శోషించుకుని సకల జీవకోటికి రక్షణగా నిలిచేది ‘ఓజోన్‍’. కాలుష్యం కారణంగా భూమిని ఆవరించి ఉన్న ఓజోన్‍ పొర క్రమంగా దెబ్బతింటోంది. ఏసీలు, ఫ్రిజ్‍లు, ప్లాస్టిక్‍, ఫోమ్‍, దోమల నాశనం కోసం వాడే కాయిల్స్, జెట్‍ బిళ్లల లాంటి వాటి వినియోగం వల్ల ఏర్పడే పొగ, డిటర్జెంట్‍ల ఉత్పత్తుల తయారీ వల్ల ఏర్పడే క్లోరోఫ్లోరో కార్బన్లు ఓజోన్‍ పొరను ధ్వంసం చేస్తున్నాయి. స్ట్రాటోస్పియర్‍లో ఉన్న ఓజోన్‍ అతినీలలోహిత కిరణాలను సంగ్రహించుకుంటోందని, క్లోరోఫ్లోరో కార్బన్ల వల్ల స్ట్రాటోస్పియర్‍లో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని 1930లోనే శాస్త్రవేత్తలు గుర్తించారు. దీనివల్ల ఏటా 20 లక్షల మందికి తగ్గకుండా చర్మ క్యాన్సర్‍ బారిన పడుతున్నారని శాస్త్రవేత్తలు విశ్లేషించారు.


ఓజోన్‍ పొరకు చిల్లు పడిందని, భవిష్యత్తులో ఇది ప్రమాదకారి కావచ్చని 1980లో పర్యావరణ శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ఓజోన్‍ అంటే ఆక్సిజన్‍కు మరో రూపమే. ఆక్సిజన్‍లో రెండు పరమాణువులు ఉంటే ఓజోన్‍లో మూడు పరమాణువులు ఉంటాయి. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఆక్సిజన్‍కు పరమాణువు కలవడం ద్వారా ఓజోన్‍ తయారవుతుంది. భూమిపైన వాతావరణం నాలుగు పొరలుగా ఉంటుంది. అవి వరుసగా ట్రోపో, స్ట్రాటో, మోజో, ఐనో ఆవరణాలు. వీటిలో ఓజోన్‍ పొర స్ట్రాటో ఆవరణంలో మాత్రమే ఉంటుంది. ఇది పది నుంచి 30 మైళ్ల మందంతో, భూమిచుట్టూ ఆవరించి ఉంటుంది. సూర్యకాంతి నుంచి వెలువడే అతినీలలోహిత కిరణాలు (అల్ట్రావయెలెట్‍ -యూవీ) భూమిపై ప్రసరించకుండా ఓజోన్‍ పొర అడ్డుకుంటుంది.


ఓజోన్‍ను దెబ్బతీస్తున్నవి ఇవే..
రిఫ్రిజిరేటర్లు, ఏసీలు, విమానాల నుంచి వెలువడే క్లోరోఫ్లోరో కార్బన్‍ కాలుష్య కారకాలు గాలిలోకి విడుదలై భూమిని ఆవరించి ఉన్న ఓజోన్‍ పొరను దెబ్బతీస్తున్నాయి. ఏసీలు, కాస్మొటిక్స్, స్ప్రేలు, ప్లాస్టిక్‍ లాంటివి మనం విచ్చలవిడిగా వాడుతున్నాం. వీటిని వినియోగించడం తగ్గిస్తేనే పర్యావరణానికి మేలు జరుగుతుంది. ఓజోన్‍ పొరకు హాని కలిగించే వస్తువుల వాడకంపై ప్రజల్లో అవగాహన కల్పించటం ద్వారా కూడా మరింత కాలుష్యం తగ్గించవచ్చు.


రసాయనాలతోనే ప్రమాదం
ఓజోన్‍ వాయువు పలుచబడటాన్ని ఈ పొరకు రంధ్రంగా పేర్కొంటారు. క్లోరిన్‍ వాయువు ఓజోన్‍ పొరను దారుణంగా దెబ్బతీస్తోంది. ఒక్కో క్లోరిన్‍ పరమాణువు ఓజోన్‍తో లక్షసార్లు చర్య జరిపి ఆక్సిజన్‍ను విడగొడు తోందని శాస్త్రవేత్తలు కనిపెట్టారు. ప్రధానంగా క్లోరోఫ్లోరో కార్బన్లు (సీఎఫ్‍సీ), క్లోరోడైఫ్లోరో మీథేన్‍, ఓలటైల్‍ ఆర్గానిక్‍ కాంపౌండ్లు ఓజోన్‍ను నాశనం చేస్తున్నాయి. 1995లో ప్రపంచ దేశాలు ‘మాంట్రియల్‍ ప్రోటోకాల్‍’(ఒప్పందం)ను రూపొందించాయి. ఈ ప్రోటాకాల్‍ మీద మొత్తం 140 దేశాలు సంతకాలు చేశాయి. ఐక్యరాజ్య సమితి పర్యావరణ పరిరక్షణ విభాగంతో కలిసి ఓజోన్‍ సంరక్షణకు కృషి చేస్తామని ప్రతినబూనాయి. 2010 నాటికి ఓజోన్‍ పొరకు నష్టం కలిగించే రసాయనాల వాడకాన్ని తగ్గించాలని ప్రపంచ దేశాలు నిర్ణయించాయి. కానీ, రసాయనాల వాడకం ప్రణాళికాబద్ధంగా తగ్గించింది అంతంత మాత్రమే. ఇందుకోసం 1994, డిసెంబర్‍ 19న 49/114 అనే తీర్మానం ద్వారా ఐక్యరాజ్య సమితి సెప్టెంబర్‍ 16వ తేదీని ప్రపంచ ఓజోన్‍ పరిరక్షణ దినంగా నిర్వహించాలని ప్రకటించింది.


ఓజోన్‍ పరిరక్షణ ఎలా?
  • ప్లాస్టిక్‍ తయారీని, వినియోగాన్ని నిషేధించాలి.
  • అసవరమైన మేరకే డియోడ్రెంట్లు, రూమ్‍ ఫ్రెషనర్‍ స్ప్రేలు వాడాలి.
  • పండ్లు, కూరగాయలు, వస్తువుల కోసం మార్కెట్‍కు వెళ్లే వాళ్లంతా పాలిథిన్‍ సంచుల స్ధానంలో వస్త్ర సంచులు వినియోగించాలి.
  • ఏసీలు పెద్దగా ఉండనవసరం లేని కార్యాలయాలు, ఇళ్లు నిర్మించే విధంగా ఇంజినీర్లు, శాస్త్రవేత్తలు కృషి చేయాలి.
  • రోడ్ల వెడల్పునకు, ఇళ్లకు, పరిశ్రమలకు అడ్డు వస్తున్నాయని చెట్లు నరకడం లాంటి దుశ్చర్యలకు శిక్షలు పడేలా చట్టాలు రూపొందించాలి.
  • దక్కన్‍న్యూస్‍, ఎ : 9030 6262 88

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *