నాడు ఉద్యమ కరదీపిక – నేడు సాంస్కృతిక వేదిక దక్కన్‍ల్యాండ్‍…

ఈ మాసపత్రిక పేరు చెబితేనే చాలు… నాటి తెలంగాణ ఉద్యమం కళ్ల ముందు మెదలాడుతుంది. తెలంగాణ ఉద్యమం మొదలైన తొలినాళ్లలో 2012 సెప్టెంబర్‍లో దక్కన్‍ల్యాండ్‍ తొలిసంచిక వెలువడింది. మొదటి సంచిక కవర్‍ పేజ్‍ ఫోటో నాకు ఇప్పటికీ బాగా గుర్తుంది. ప్రాచీన చరిత్రకు సజీవ సాక్ష్యాలుగా పేర్కొంటూ దక్కన్‍ శిలల ఫోటో వేశారు. మొదటి సంచిక వెలువడడమే సామాజిక రాజకీయ పత్రికగా వెలువడింది. అలాంటి ట్యాగ్‍ లైన్‍తో వచ్చే పత్రికలకు భిన్నమైన కవర్‍ పేజ్‍తో రావడమే మొదటిసారిగా నన్ను ఆకట్టుకుంది. ఇక మొదటి సంచికలోనే తమది ‘ప్రత్యా మ్నాయ మీడియా’ అని వేదకుమార్‍ గారు అన్నారు. ఆ మాట కూడా నిజమే.. సంప్రదాయక మీడియాకు ప్రత్యామ్నా యంగా దక్కన్‍ల్యాండ్‍ వచ్చిందనడంలో సందేహం లేదు. తెలంగాణ ఉద్యమం సందర్భంగా… ప్రజా సమస్యలపై పోరాటానికి ముందుకు వస్తున్నట్లుగా వేదకుమార్‍ చెప్పారు. ఆ మాటను నిజం చేసి చూపెట్టారు.


దక్కన్‍ల్యాండ్‍ మాసపత్రిక సంపాదకులు మణికొండ వేదకుమార్‍ గారు నాకెంతో చిరపరి చితులు. మా కార్యక్షేత్రాలు వేరైనప్పటికీ… దాదాపుగా ఒకే విధమైన భావజాలం కలిగిన వాళ్లం. వివిధ అంశాలపై చాలా వరకు ఒకే విధంగా ఆలోచించే వాళ్లం. పర్యావరణం, ప్రాచీన కట్టడాలు, వారసత్వ కట్టడాల పరిరక్షణ, చరిత్ర, తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాలు… ఇలా ఎన్నో అంశాలపై మా అభిప్రాయాలు కాస్తంత అటూఇటూగా ఒకేలా
ఉండేవి. ఉద్యమ పత్రికగా ప్రారంభమైన దక్కన్‍ ల్యాండ్‍లో ఈ అంశాలకు సైతం పెద్ద పీట వేయడం నన్ను ఆకట్టుకుంది. పెద్ద పెద్ద మీడియా సంస్థలకే వాటి నిర్వహణ పెనుభారంగా మారిన తరుణంలో… ఎన్నో చిన్న, పెద్ద పత్రికలు మూత పడిన సమయంలో… సుమారు పన్నెండేళ్లుగా నిరాటంకంగా పత్రికను నిర్వహించడం చిన్న విషయం కాదు.


తెలంగాణ పోరాటానికి అనుకూలంగా రాసేందుకు పెద్ద పెద్ద మీడియా సంస్థలే సందేహిస్తున్న సమయంలో… ఒక వినూత్న మాసపత్రికగా ప్రజల ముందుకు వచ్చిన దక్కన్‍ల్యాండ్‍ మాత్రం నిర్భయంగా గొంతు విప్పింది. తెలంగాణ ప్రజల పక్షాన నిలిచింది. ఏదైనా ఉద్యమం ముందుకు సాగాలంటే… జరుగుతున్న అన్యాయా లపై సమగ్ర విశ్లేషణ ఉండాలి. అప్పుడు మాత్రమే వాదనలో ముందుకెళ్తూ జరుగుతున్న అన్యాయాలను చాటగలుగు తాం. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపై ఒక్కో రంగంలో ఎంతో మంది నిపుణులతో రాయించిన వ్యాసాలు తెలంగాణ పోరాటానికి వేగుచుక్కలై నిలిచాయి. ఒక్కో వ్యాసం ఒక్కో ఆణిముత్యం.
దక్కన్‍ల్యాండ్‍ మొదటి నుంచి కూడా తెలంగాణ పత్రిక అనడంలో ఎంతమాత్రం సందేహం లేదు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ పత్రిక బాధిత ప్రజల పక్షాన నిలిచింది. పీడిత వర్గాల గొంతుకగా ఉండింది.


మరీ ముఖ్యంగా తెలంగాణ రిసోర్స్ సెంటర్‍ ఆధ్వర్యంలో వారం వారం చర్చా కార్యక్రమాలు నిర్వహించడం… వాటి గురించి ప్రత్యేక కథనాలను పత్రికలో ప్రచురించడం పత్రిక గమనంలో ఒక ముఖ్యమైన మైలురాయిగా ఉంటుందనడంలో సందేహం లేదు. కొన్ని చర్చల్లో నేను కూడా పాల్గొన్నాను. వివిధ అంశాలపై నా అవగాహనను మరింత పెంచుకోగలిగాను.


తెలంగాణ రాష్ట్రం వచ్చిన తరువాత దక్కన్‍ల్యాండ్‍ నేడు మరింతగా తెలంగాణ చారిత్రక, సామాజిక, సాంస్కృతిక, కళా వేదికగా నిలిచింది.
మరే పత్రికలోనూ మన ప్రాచీన చరిత్ర గురించి ఇన్ని వ్యాసాలు వచ్చిన దాఖలాలు లేవు. ఇక బాలసాహిత్యంపై వ్యాసాలు అనేకం వచ్చాయి. పత్రిక ముఖ చిత్రాల ఎంపికలోనూ వేదకుమార్‍ది ఒక విశిష్ట శైలి. పత్రిక ప్రారంభం నుంచి నేటి వరకూ అది అలా కొనసాగుతూనే ఉంది.
నిజానికి వేదకుమార్‍ గారు ఏకకాలంలో అనేక కార్యక్రమాలను, సంస్థలను నిర్వహించగలిగే వ్యక్తి. అలాంటిది ఆయన ఎంత బిజీగా ఉన్నప్పటికీ… దక్కన్‍ల్యాండ్‍ కోసం స్వయంగా ఎంతో సమయం వెచ్చిస్తారు. స్వయంగా రచయితలకు ఫోన్‍ చేసి ఆయా అంశాలపై ప్రత్యేక వ్యాసాలు రాయాల్సిందిగా కోరడం మొదలుకొని… డమ్మీ కాపీని క్షుణ్ణంగా చదివి… ప్రింటింగ్‍ ప్రెస్‍లో పత్రిక ముద్రణను స్వయంగా పర్యవేక్షిస్తారని తెలుసుకొని ఆశ్చర్యపోయాను. ఇదే విధమైన అంకితభావాన్ని ఇక ముందు కూడా ప్రదర్శించాలని… తద్వారా తెలంగాణ సమాజానికి మరిన్ని విశేషాలను అందించాలని ఆశిస్తున్నాను. దక్కన్‍ల్యాండ్‍ మాత్రమే కాదు… వేదకుమార్‍ గారు కూడా పది కాలాల పాటు పచ్చగా ఉండాలని కోరుకుంటున్నాను.

  • బోయినపల్లి వినోద్‍ కుమార్‍
    ఎ : 98480 37689
  • దక్కన్‍ న్యూస్

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *