భూమిపై సంపదల సృష్టికి మేమే కారకులమంటూ పెట్టుబడిదారులు, కాదు మేమేనంటూ శ్రమజీవులైన ఉత్పత్తిదారులు నినదిస్తూ వుంటారు. ఈ ఇరువరి మధ్యన పెట్టుబడి, శ్రమ, లాభం అనే సూత్రీకరణలు వుంటాయని మహామేధావులైన మార్కస్, ఎంగెల్స్‌లు విడమర్చి చెప్పారు. పెట్టుబడి ఎంతవున్నా ఉత్పత్తికి కారణమైన శ్రమలేకుండా ఏ సంపద సృష్టించబడదు. నిజానికి పెట్టుబడిదారుడు లేకుండా శ్రమజీవులు బతకగలరు గాని, శ్రమజీవులు లేకుండా ఏ పెట్టుబడిదారుడు ఒక్కరోజు బతకలేడు. ఈ సూత్రీకరణలన్నీ మానవులకు మాత్రమే పరిమితమనే విషయాన్ని మీరు ఏనాడు గ్రహించడం లేదు.
పై సూత్రీకరణను ప్రకృతికి, జంతువులకు, మొక్కలకు అన్వయిస్తే మానవుడు కూడా ఓ జంతువులాగానే గుర్తించబడాలి. కాని, భిన్నంగా మానవుడే ఓ మహాశక్తిగా, సర్వసపందలకు సృష్టికర్తగా భ్రమపడుతూ, యావత్ భూమండలంపై ఆధిపత్యం చెలాయిస్తూ వున్నాడు. కాబట్టి, మానవుడులేని ప్రకృతి మనజాలుతుంది గాని, మొక్కలు, జంతుజాలం లేని ప్రకృతి ఒక్క రోజుకూడా మనుగడను సాగించలేదు.
కావున, శ్రమలేని పెట్టుబడి ఎలా నిరర్థకమో, మొక్కలు, పశుపక్షాదులు, కీటకాలు, జంతువులు, సూక్ష్మజీవులు, చివరికి చీడ, చెదలు, ఈగ, దోమలు లేని ప్రకృతి వ్యవస్థ కూడా అంతే నిరర్థకం! మానవుడి మేధ ఎంత తెలివైందైనా, సృజనాత్మకమైనా, క్రియాశీలమైనా వృక్ష, జంతు జీవకోటిలేని ప్రపంచం పూర్తిగా గతి తప్పుతుంది. అంటే జీవరాశికి చివరి రోజులన్నమాట! (చూడు – ఆగనున్న మానవ మహాగమనం – రాహుల్ కుమార్ – ఆంధ్రజ్యోతి, 19-7-24) ఉదాహరణకు, మొక్కలు ఒక్కరోజు కిరణజన్య సంయోగక్రియను జరపలేదను కుందాం! బహుష ఏర్పడే ఆహారపు కొరతను లెక్కించలేరు. అలాగే జీవకోటి తమతమ విధుల్ని బహిష్కరించాయనుకుందాం! అసలు సృష్టికార్యమే హఠాత్తుగా నిలిచిపోతుంది. ఇది మానవులకు అర్థం కాని విషయం కాకున్నా, మీరు ఏమాత్రం దృష్టిసారించని విషయం కాదా!
ఈ సందర్భంగా జంతుజాలంలో అతి చిన్న జీవి అయిన చీమల గూర్చి చూద్దాం!
చిరు జీవులమే – కాని, శ్రమలో తోపులం!
కీటకాలనగానే రెక్కలతో ఎగిరే జీవులని అనుకుంటారు. కాని, రెక్కలు లేకుండా భూమిపై, చెట్లకాండాలపై, కొమ్మలపై, నేల బొరియల్లో వేలాదిగా అటూ, ఇటూ హడావిడిగా పరుగెత్తే చీమలు కూడా కీటకాలే! పోతే, మీరు అప్పుడప్పుడు ఎగిరే చీమల్ని కూడా చూస్తారు. అవి మాత్రం మగ చీమలు. మా జాతిలో కూడా మగ చీమలు కేవలం సంతానోత్పత్తికి మాత్రమే జీవించి తనువు చాలిస్తాయి. కాబట్టి, మగ మహారాజులు లేని ఆడ సామ్రాజ్యం మా చీమలదే! మీ భాషలో చెప్పాలంటే పూర్తిగా మాది మాతృస్వామ్య(matriarchal) వ్యవస్థ!
మా ఆకారం చాలా చిన్నది. మీ మానవుల ఆకారంతో పోలిస్తే అసలు మీ గోరు అంత కూడా వుండము. కాని, మేము చేసే పనులు, జీవించే విధానం, సృజనాత్మకత, మా క్రమశిక్షణ కొందరి మానవుల్లో వుంటే వుండచ్చు గాని, మీరంతా స్వార్థంగా వుంటే, మేము ప్రకృతి అనుకూలంగా వుండి, పర్యావరణానికి అనేక విధాలుగా దోహదపడుతాం. అన్నీంటికి మించి మేం సోమరిపోతులంకాము. మా మధ్యన సమిష్టి పనివిధానం వుంటుంది. తగువులు అసలే వుండవు. ఈ విషయాలన్నీ మమ్మల్ని పరిశీలిస్తే తెలుస్తుంది. లేదా ఓ మూల కొంచెం బెల్లంపెట్టి చూడండి. క్షణాల్లో ఓ సైనికపటాలం ప్రత్యక్షమైతుంది. అప్పటిదాకా కనిపించని మేము, ఓ దండులా బెల్లంచుట్టూ చేరి, బెల్లాన్ని చిన్న అణువులుగా మార్చి, ఒకే దిశ వైపు మాత్రమే మోసుకెళ్ళుతూ వుంటాం. అంటే, అటువైపు మా ఆహారనిల్వ గిడ్డంగి అన్నమాట. అలా ఆహారాన్ని దాచి తిరిగి వస్తూ, ఎదురుగా వచ్చే చీమకు అభినందనలు (భలే! భలే!) తెలుపుతూ, తిరిగి బెల్లాన్ని చేరుతాం. ఏ ఒక్క చీమ కూడా సరదాకు అటు, ఇటూ తిరగదు. విధిగా ఆహారాన్ని మోసుకెళ్ళుతూ వుంటుంది. ఏ చీమకూడా ఆహారం దొరికిన చోటే తింటూ కూర్చోదు. ఈ క్రమశిక్షణకే, మీ మానవులు మమ్మల్ని శ్రమజీవులని, క్రమశిక్షణ గలవని, సంఘజీవులని సంబోధిస్తూ వుంటారు. కాని, ఈ పదాలేవి మీరు అన్వయించుకోక పోవడం విచిత్రం కాదా..!
పర్యావరణ ఇంజనీర్లం :
మీ మయబ్రహ్మ నిర్మించిన మయసభ కావచ్చు, లేదా రాజస్థాన్‌లోని కోటలు, కుతుబ్‌మినార్ లేదా దుబాయి బుర్జ్ ఖలీఫా, మలేసియా పెట్రోనాస్ టవర్ల లాంటి తదితర కట్టడాలు, కావచ్చు! ఈ నిర్మాణాలన్నీ మేము నిర్మించుకునే పుట్టల (anthills) నమూనాలే! నకళ్ళే! అంటే, మా పనితనాన్ని పరిశీలించి, మీ తెలివిని జతచేసి, చేర్పుల, మార్పులతో నిర్మించినవే! నిజానికి మీ ఇంజనీరు వ్యవస్థకు మేమే అసలు, సిసలైన హక్కుదారులం (patent)! మా గూళ్ళ నిర్మాణంలో ఒక్క గులకరాయిని వాడకుండా నిర్మిస్తాం. అది కూడా మృత్తిక లాంటి మృధువైన మట్టితో! మట్టి అణువులను మేం స్రవించే పట్టు (silky) పదార్థంతో బంధిస్తాం. ఈ మట్టిని సేకరించడానికి మా చీమల దండు ఎన్ని గంటలు, రోజులు శ్రమిస్తాయో ఆలోచించండి. ఇలా నిర్మించుకున్న మా పుట్టల్లో పాములు చేరడం మీరు కథలుగా చెప్పుకుంటూనే వుంటారు. పోతే, మా పుట్టలలోపల పరిశీలిస్తే, మీరు ఆశ్చర్యపోతారు. గాలి, వెలుతురు రావడమే కాకుండా, ఆహారాన్ని దాచుకునే గదులు, విశ్రాంతి తీసుకునే గదులు, గుడ్లను పొదిగే గదులు, గుడ్లనుంచి వచ్చే చిన్నలార్వాలను రక్షించే ప్రత్యేక ప్రదేశాలు వుంటాయి. వీలైతే ఓ పుట్టను తవ్వి (ఇది నేరం) చూడండి! ఈ నిర్మాణానికి, ఎన్ని వేల చీమలు, ఎన్ని పని గంటలు పని చేస్తాయో లెక్కకట్టి చూడండి! మా శ్రమశక్తి విలువ మీకు తెలుస్తుంది.
ప్రకృతి హితకారులం :
రైతు నేస్తమని వానపాముకు మంచి పేరుంది. కాని, వాటిని మించిన నేల సాగును మా చీమలదండు చేస్తుందనేది మీలో చాలా మందికి తెలియదు. వర్షాలకు నేల ఉపరితలం బిరుసుకపోయి వుంటుంది. దీంతో భూమి లోపలికి నీరు ఇంకక పోవడం, గాలి చొరబడక పోవడం జరుగుతుంది. ఇలాంటి నేలల్ని మేం మా శక్తిచే గుల్లచేస్తాం. పుట్టల్ని నిర్మించడం ద్వారా, గాలి చొరబాటుకు అవకాశం కలిగితే, వర్షపు నీరు నేరుగా భూమిలోకి జారుకుంటుంది. ఇలాంటి బొరియల్ని పంటచేళ్లల్లో, పొలాల్లో కూడా చేస్తాం. అందుకే వానపాముల కన్నా, రైతుకు మేమే ప్రధాన నేస్తాలం. మా చర్యలతో భూగర్భజలాలు పెరగడం, నేల సారవంతం కావడం జరుగుతుంది. వీటికి తోడు నేలపై గల జీవ సంబంధ వృక్ష, జంతు అవశేషాల్ని కుళ్ళింపజేసి భూసారాన్ని పెంచుతాం. ఇతర కీటకాల లాగానే పుష్పాలలో సంపర్కానికి దోహదపడుతాం. విత్తనాల్ని రవాణాచేసి బీజవ్యాప్తికి తోడ్పడుతాం. అంటే, మొక్కల, వృక్షాల విత్తనాల్ని నలుదిశలకు విస్తరింపజేసి, రేపటితరానికి వాటిని అందిస్తాం. పర్యావరణ పరిరక్షణ గూర్చి మీరు మాటల్లో చెపుతే, మేమంతా చేతల్లో చూపుతామన్న మాట!
సమిష్టి సంఘ జీవనం :
నాగరికత అనేది మానవుల స్వంత పదజాలంగా భావిస్తారు. కాని, మిలియన్ సంవత్సరాల క్రితమే, అంటే మీ మానవజాతి పురుడు పోసుకోక ముందునుంచే మేము అభివృద్ధి చెందిన సంఘజీవులం. రాణిచీమ సంతానాన్ని కంటే, మిగతా చీమలు వాటిని రక్షించడం, ఆహారాన్ని సేకరించడం, ఇళ్ళను నిర్మించడం చేస్తాయి. ఈ పనులు చేసే వాటిని మీరు కూలి చీమలుగా ముద్రవేసారు. కాని, మాకు ఇలాంటి భావజాలమే లేదు. అన్ని కలిసి సమిష్టిగా పని చేయాల్సిందే. సమిష్టిగా అనుభవించాల్సిందే! ఇదంతా ఓ రసాయన పక్రియ. ఇందులో మగచీమల ప్రమేయమే వుండదు. మీకు ఇదో విచిత్రంగా తోయవచ్చు!
మాపైగాని, మా ఆవాసాలపైగాని ఎవరైనా దాడిచేస్తే మేమంతా మూకుమ్మడిగా దాడిచేసి రక్షించుకుంటాం. బలవంతమైన సర్పాన్ని చంపేశక్తి వున్నా, మీ మావనశక్తికి మేమెప్పుడు బలైతూనే వుంటాం. మీ లక్ష్మణరేఖలు మమ్మల్ని నిరంతరం చంపుక తింటూనే వుంటాయి.
మాకూ ఓ భాష వుంది:
మీ మానవులు విభిన్న భాషలు మాట్లాడుతారు. కాని, మా చీమల భాష సార్వత్రికమైనది. ఏప్రాంత చీమలైనా, అవి దండుగా కదిలినప్పుడు, ముఖ్యంగా ఆహారసేకరణ సమయంలో, ఎదురు ఎదురు చీమలు ముచ్చటించుకోవడం జరుగుతుంది. మా తల భాగంలో వుండే అంటెన్నాలు దీనికి ఉపయోగిస్తాం. అలాగే, మాకు చెవులుండవు. కాని, మా కాళ్ళతో శబ్దతరంగాల్ని గ్రహించి, పరిస్థితిని అంచనా వేస్తాం. అపాయాల్ని గుర్తించి జాగ్రత్తపడుతాం.
మేం మాంసాహారులం కూడా!
నేటితరం చీమలు అత్యధికంగా శాఖాహారులే! అత్యధికంగా చక్కెరగల పదార్థాలతోపాటు, పిండిపదార్థాల్ని, మాంసకృత్తుల్ని తీసుకుంటాం. మొదటితరం జాతి మాంసాహారులేనట! తర్వాత చెట్లపైకి చేరిన తర్వాత మొక్కల ఆధారిత, అందునా చక్కెరగల పదార్థాల్ని తీసుకుంటాం. కొన్ని రకాల చీమల ఆహారనాళంలోని ఆంత్రములో (gut) బ్యాక్టీరియాను కలిగి వుండి, ఆహారాన్ని కూడా తయారు చేసుకుంటాయి. మరో విశేషమేమంటే, చెట్లరసాల్ని పీల్చే కొన్ని కీటకాలు, మాకు ఆహారాన్ని అందిస్తే, ప్రతిఫలంగా మేము వాటికోసం చెట్లను శత్రువులబారిన పడకుండా రక్షిస్తాం. దీన్ని పరస్పర సహకార చర్య (symbiotic) అని అంటారు.
మాలోని ఎర్రచీమలు తిన్న ఆహారం, మీ కళ్లకు మంచిదనే అభిప్రాయం మీరు ఎలా ఏర్పర్చుకున్నారో తెలియదు గాని, చీమలు పట్టిన ఆహారాన్ని మీరు తినడం విచిత్రం కదా! వీటిని దృష్టిలో పెట్టుకోనైనా, మమ్మల్ని విచ్ఛలవిడిగా చంపకండి. ప్రకృతికి, పర్యావరణానికి మా అవసరాన్ని గుర్తించండి. మా ప్రాధాన్యతను మీ పిల్లలకు చెప్పండి. (వచ్చే సంచికలో కొన్ని ప్రాకుడు జంతువుల గూర్చి చూద్దాం!)
- డా।। లచ్చయ్య గాండ్ల,
ఎ : 9440116162