హైద్రాబాదుకు అచ్చిరాని సెప్టెంబరు నెల

1970 సెప్టెంబరు నెల ఆఖరి రోజులు.
అర్ధరాత్రి దాటింది. వర్షం… వర్షం. మిన్నూ మన్నూ ఏకం చేసే కుండపోత వర్షం. గాలి వాన, ఉరుములు… మెరుపులు. నడినెత్తిన పడుతున్నట్లు, నిప్పులు కురుస్తున్నట్లు, పిడుగులు పడుతున్న చప్పుడు. అమ్మ ‘అర్జునా ఫల్గుణా’ అని భయంతో చెవులు మూసుకుని మంత్రం జపిస్తుంది. స్వామి ఇల్లు సగం పెంకుటిల్లు సగం రేకుల ఇల్లు. కాళ్లకు ఇనుప గజ్జెలు కట్టుకొని నాట్యం చేస్తున్నట్లు రేకులపై వాన గుర్రం కాళ్ల గజ్జెల చప్పుడు. కుంభ వృష్టికి పెంకుటిల్లు కురుస్తుంది. నేల మీద పరుచుకున్న పక్క బట్టలు తడుస్తున్నాయి. అందరూ మేల్కొన్నారు. తపుకులు, తాంబాళాలు, గిన్నెలు, చెంబులు కురుస్తున్న వానధారల క్రింద పెడుతున్నారు. వీటిల్లో చినుకుల చిటుకు చిటుకు చప్పుళ్లు. వింత వింత ధ్వనులు. పైనా క్రిందా భీభత్సకర సంగీతనాదాలు. వీస్తున్న గాలికి ఇంటిమీది వేపచెట్టు జుట్టు విరబోసుకున్న దయ్యంలా ఊగుతుంది. వేపచెట్టు కొమ్మలు సిగమూగి, ఊగి పెళ పెళ ధ్వనులతో ఇంటి మీదికి విరిగిపడ్డాయి. ఆ చప్పుళ్లకు ఇల్లు కూలి పోతుం దేమోనని అందరూ భయ పడ్డారు. కాని ఏమీ కాలేదు. పెంకులు మాత్రం పగిలిపోయాయి. వానధారలతో ఇల్లంతా తడుస్తుంది. చేసేదేమీ లేక అందరూ ప్రాణాల్ని అరచేతుల్లో బిగించి పట్టుకుని గోడలకు ఆనుకుని కూచున్నారు. పేదవాళ్ల ఇళ్లల్లో వర్షం ఎప్పుడూ హర్షం కాదు.


‘‘ఈ సెప్టెంబరు నెల వానలు హైద్రాబాదుకు అచ్చిరావు’’ అన్నాడు బాపు విచారంగా పాన్‍దాన్‍ తెరిచి పాన్‍ తయారు చేసుకుంట.
‘‘ఔనౌను, నిజమే. నేను నెలల పిల్లగ ఉండంగ ఈ నెలలనే పెద్దగ వానలు కురిసి సగం పట్నం కొట్టుకపోయిందట. ముచికుందానదికి (మూసీ) కోపమొచ్చి పట్నానికి ముప్పు దాపురించింది. రైన్‍బజార్‍ల మా ఇల్లు సగం నీళ్లల్ల మునిగిపోయిందట. మా నాయిన మా అన్నను భుజాల మీదికి ఎక్కించుకుని ప్రాణాలతో బయట పడిండట. వేల మంది ప్రజలు నీళ్లల్ల కొట్టుకుని చచ్చి పోయిండ్రట. అప్పటి రాజు మహబూబ్‍ అలీ పాషా అందర్నీ ఆదుకున్నడట.’’ అమ్మ తన చిన్నప్పటి జ్ఞాపకాల పెట్టె తెరిచింది. అందరి ముచ్చట్లు వానా వానా వల్లప్పా అన్నట్లు వానచుట్టే తిరుగుతున్నాయి. నిద్రరాని వాన రాత్రి. నిద్రలేని వానరాత్రి. ముట్టుకుంటే పట్టుకునే ముచ్చట్లు నడుస్తున్నాయి. వాటన్నంటినీ స్వామి జాగ్రత్తగా వింటున్నాడు.
‘‘సెప్టెంబరు నెల వానలు హైద్రాబాద్‍కు ఎందుకు అచ్చిరావు బాపు’’ అడిగింది చిన్నక్క.


పాన్‍ పని ముగించిన బాపు తిరిగి చెప్పటం ప్రారంభించాడు. తారీఖులు, నెలలు, సంవత్సరాలతో సహా బాపు ఏమి చెప్పినా, ఏది వివరించినా ఉపన్యాస ధోరణిలోనే ఉంటుంది. అది
ఉపాధ్యాయ వృత్తి వలన అబ్బిన అలవాటేమో!
‘‘మన హైద్రాబాద్‍ నగరంల కురిసిన జడివానల వల్ల 1954 సెప్టెంబరు 29 తారీఖున మద్రాసుకు వెళ్లే రైలు జనగామ తాలుకా రఘునాథపల్లి దగ్గర యశ్వంతాపురం వాగు మీద వంతెన కూలి కొట్టుక పోయింది. ఇంజనుతో సహా ఐదారు డబ్బాలు నీళ్లల్ల పూర్తిగ మునిగి చాలా దూరం కొట్టుకపోయినై. ఆ రోజు సోమ వారం. నిండు అమవాస్య రాత్రి. ప్రయాణికులందరు మంచి సుఖనిద్రల ఉన్నరు. రెప్పపాటుల జరిగిన ఘోర ప్రమాదంల కొన్ని వొందల మంది చచ్చిపోయిండ్రు.
ఒకప్పుడు 1908ల ఈ పట్నం కొట్టుకపోయింది ఇదే సెప్టెంబరు నెలల సోమవారం రోజే. మళ్లీ రఘునాధపల్లి రైలు ప్రమాదం కూడా అదే నెల అదే రోజు జరిగింది. అందుకే సెప్టెంబరు మాసం మన పట్నానికి అచ్చిరాదని పెద్దలు అంటుంటరు.
సికింద్రాబాద్‍ల ప్యారడైజ్‍ సీన్మా టాకీస్‍ యజమాని ఒక గౌండ్లాయన ఉండె ఆయనపేరు అంజయ్య.
ఆయన కొత్త తెలుగు సీన్మా రీళ్ల డబ్బను మద్రాసు నుండి హైద్రాబాద్‍కు తీసుకరావాలన్న ఆలోచనతో మద్రాసుకు ప్రయాణమయిండు. తీరా లష్కర్‍ (సికింద్రాబాద్‍) స్టేషన్‍కు పోయేసరికి రైలు కదులుతుంది. ప్లాట్‍ఫాం మీద
ఉరికి రైలును పట్టుకోవటం ఆయనకు చాత కాలేదు. హడావుడిగ తన సొంత కారుల బోనగిరి వరకు ఆ రైలును వెంబడించి అక్కడ ఆ స్టేషన్‍ల దానిని అందుకున్నడు. అనుకున్న పనిని సాధించిన అని ఖుష్‍ అయిపోయిండు కాని ఒక గంటలోపల్నే ప్రమాదం జరిగి పరలోకానికి ప్రయాణమయ్యిండు. ఆయన గాచారం బాగలేక ఉరికురికి చావును కావలించుకున్నట్లయ్యింది.’’
రఘునాధపల్లి రైలు ప్రమాదాన్ని వర్ణించుకుంట బడి పిల్లలకు తెలుగు వాచకంల ఒక పాఠం కూడ పెట్టిండ్రు. దాని మీద అనేక పాటలు, బుర్ర కథలు వచ్చినై. ఆడవాండ్లు దానిని బతుకమ్మ పాటగ కట్టి ఇప్పటికి పాడుకుంటున్నరు. ఆ రోజులల్ల రైలు ప్రమాదాలు ఎప్పుడొ ఒకటి చాలా అరుదుగ జరిగేటివి.
‘‘ఔనౌను’’ అంటూ అమ్మ బాపు మాటలకు అడ్డం పడింది.


‘‘రైలు పడిపోయిందన్న వార్త వినంగనే ఈ దొర ఆగమాగమై తనొక్కడే జనగామకు పోయి పడిపోయిన రైలు డబ్బలను, దిక్కు లేక క్రింద పండబెట్టిన శవాలను చూసి వచ్చిండు. పై నుండి ఇసుక పోస్తే కిందికి రాలనంత మంది అక్కడికి వొచ్చిండ్రట. ‘‘ఆ గడ్‍బడ్‍లల్ల ఈయన చెత్రీ (గొడుగు) కూడ ఎవరో కొట్టేసిండ్రు’’ అని సందు దొరికిందని దెప్పి పొడించింది అమ్మ.
‘‘అబ్బ ఎప్పుడో పోయిన పాత చెత్రీ గురించి ఎన్నిసార్లు జ్ఞాపకం చేస్తవ్‍’’ అని కసురుకున్నడు బాపు.
వాన దబ్బ దబ్బ కురుస్తూనే• ఉంది. ఏనుగులు తొండాలతో నీళ్లను కుమ్మరిస్తున్నట్లు కురిసిన సుదీర్ఘ వానరాత్రికి భళ్లున తెల్లారక తప్పలేదు. వాన తగ్గినా ముసురు కురుస్తూనే ఉంది. దిగులు, చికాకు కలిగించే ముసురు తుంపర. బాపు ఇంటిమీది కెక్కి విరిగిపడిన వేపచెట్టు కొమ్మల్ని తొలిగిస్తున్నాడు. ఇంతల శంకర్‍ మామ తను కట్టుకున్న పంచె కొంగును స్త్రీల మాదిరిగా తల మీద కప్పుకుని ‘అక్కా అక్కా’ అంటూ ఇంట్లొకి పరిగెత్తుకొచ్చాడు.
‘‘ఏంటిది శంకరయ్యా’’ అంది అమ్మ ఛాయ్‍ గ్లాసును ఆయనకు అందిస్తూ.
‘‘అయ్యో నీకింకా తెల్వలేదా అక్కా రాత్రి వానకు గౌలిగూడ అంత కొట్టుక పోయిందట’’ అన్నాడు వొగుర్చుకుంటూ, దమ్ములు తీసుకుంటూ.
‘‘ఆ’’ అని అమ్మ నోరెళ్లబెట్టింది.
ఆ మాటలు విన్న బాపు గోడ మీద నుండి దబుక్కున క్రిందికి దుంకి ‘‘ఏమయ్యిందీ శంకరయ్యా’’ అని అడిగాడు.
‘‘నీళ్ల దెబ్బకు గౌలిగూడ కొట్టుకపోయిందన్నా’’ అన్నాడు శంకర్‍మామ కండ్లనిండ నీళ్లు నింపుకుని.
‘‘అరెరె’’ అనుకుంటనే బాపు అంగీలాగు వేసుకున్నాడు.
పాతచెత్రీ చంకలో పెట్టుకుని ‘నడువ్‍ శంకరయ్యా’ అని బయలుదేరాడు. స్వామి కూడా బాపును అనుసరించాడు. శాలీబండా చెట్టు దగ్గరికి వచ్చేసరికి ప్రజలు తండోపతండాలుగా చార్మినార్‍ వైపు వడివడిగా నడుస్తున్నారు. అందరి నోటా ఒకటె మాట ‘‘గౌలీగూడ కొట్టుకపోయిందట’’.
గౌలీగూడా బస్సు డిపో వెనుక ఉండే తన ప్రియమిత్రుడు యాదగిరి జ్ఞాపకం వచ్చి స్వామి పరేషాన్‍ఐనాడు.


× × ×


పెద్ద భూకంపం వచ్చి భూమి బ్రద్దలయినట్లు అక్కడో పెద్ద గుంత. నిన్నటిదాకా అక్కడ గౌలీగూడా బస్‍డిపో ఉండేది. దాని చుట్టుపక్కల దుకాణాలు ఉండేవి. కళ కళలాడే జన జాతర ఉండేది. ఇప్పుడక్కడ ఏమీ లేదు. తాడిచెట్టు లోతంత ఒక పెద్ద గుంత తప్ప.
భూకంపం వచ్చి భూమాత ఎద బ్రద్దలయినట్లు బస్‍ డిపో నుండి దాని ఎదురుగా ఉన్న మూసినది వరకు నేల ముక్కచెక్కలయి కొట్టుకపోయింది. చూస్తుంటే ఒళ్లు జలదరించే దృశ్యం. జనం, జనం. తండోపతండాలుగా జనం. వొచ్చిన జనం జల ఫిరంగి చేసిన జల విధ్వంసాన్ని చూస్తున్నారు. వీరిని ఆపటం పోలీసులకు చాతకావటం లేదు. ఆ తొడతొక్కిడి జనం మధ్య స్వామి బాపు, శంకర్‍ మామ నుండి విడిపోయాడు. గల్లీలల్ల నుండి నడుచుకుంటూ గౌలీగూడా రాంమందిర్‍ చేరుకున్నాడు. అక్కడ చాలా ఇళ్లు కూలిపోయాయి. నీళ్ల మట్టం ఇంటి దర్వాజాల పై వరకూ వచ్చిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. నీళ్ల వరదకు సామాన్లన్నీ కొట్టుకపోయి వీధుల్లోకి చేరాయి. ఈ వరద నీరు ఎక్కడ్నుంచి వచ్చిందో, నేల ఎందుకు కొట్టుకపోయిందో ఎవరికీ అర్థం కావటం లేదు, గందరగోళ పరిస్థితి. చిన్న పిల్లల ఆకలి కేకలు. గీ-గా ఏడుపులు. ముసురు తుంపర. నీళ్ల్ల బురద. మనసు లోపలా బయటా చికాకు, దిగులు.
స్వామి బురదలో జారిపడకుండా జాగ్రత్తగా నడుస్తూ గురుద్వారా వద్దకు వచ్చాడు. కొన్నివందల మంది రాత్రి అందులో తలదాచుకుని ప్రాణాలను కాపాడుకున్నారట. రాంమందిరం మరి కొంత మందిని కాపాడిందట. మేడలు, మిద్దెల మీద జనం రాత్రంతా వర్షంలో తడుస్తూ అట్లనే నిలుచున్నారట. గురుద్వారా ఎదుట ఫైర్‍స్ట్టేషన్‍లోని ఫైర్‍ ఇంజన్లన్నీ నీళ్ల దెబ్బకు అతులాకుతలమై బొక్కబోర్లా పడ్డాయి. కొన్ని పక్కకు ఒరిగాయి. అవి కాలు జారి వెల్లకిల్లా క్రిందపడ్డ ఏనుగుల్లా కనిపిస్తున్నాయి. ఫైర్‍స్టేషన్‍ పక్కనున్న మురికి కాలువ పూర్తిగా కొట్టుకపోయింది. దాని పై కప్పుమీద కట్టుకున్న ఇండ్లన్నీ కూలిపోయాయి. గౌలీగూడ చమన్‍ చౌరాస్తా నుండి స్వామి బస్‍ డిపో వెనుక భాగంలో ఉండే యాదగిరి ఇంటివైపు అడుగులేస్తున్నాడు. ఆ బస్తీలోకి నీళ్లు వచ్చాయి కాని విధ్వంసం మాత్రం జరగలేదు. స్వామికి కొంచెం ధైర్యం వచ్చింది. యాదగిరి ఇంటికి చేరుకున్నాడు. వాళ్ల ఇంటి ముందు నిశానీగా నిలుచుండే ‘‘సర్కారీ నల్లా చౌబీస్‍ గంటా ఖుల్లా’’ పూర్తిగా నీళ్లల్లో మునిగి కనబడటం లేదు. పాపం అది కూడా నీళ్ల దెబ్బకు బలిఐనట్టుంది. ఇంట్లోకి వెళ్లేసరికి యాదగిరి బల్లపీట మీద కూచుని ఏదో రాసుకుంటున్నాడు. అనుకోకుండా వచ్చిన స్వామిని చూసేసరికి సంతోషం పట్టలేక ఎదురొచ్చి కావలించుకున్నాడు.
‘‘అందరూ ఇంత పరేషాన్ల ఉంటే నువ్వేందో పురుసత్‍గ రాసుకుంట కూర్చున్నవేంది?’’ అన్నాడు స్వామి.
‘‘నేనేం పురుసత్‍గ లేను. ఆరాంగ లేను. పొద్దుట్నించీ ఇప్పటి దాకా తిప్పకాయవోలె తిరిగి తిరిగి నీళ్ల దెబ్బ తగిలిన అన్ని బస్తీలు చూసిన, అందరితో మాట్లాడిన. ఇగో ఇప్పుడే ఇంటి కొచ్చి ఆ చూసిందీ, విన్నదీ మళ్లీ మరిచి పోతనేమోనని ఈ పేపరు మీదికి ఎక్కిస్తున్న’’ అన్నాడు యాదగిరి.
‘సరే యాద్గిరీ ఇంత విధ్వంసం ఎట్ల జరిగింది?’
యాదగిరి స్వామిని బల్లపీట మీద కూచోబెట్టి ఓపికగా తను సేకరించిన సమాచారాన్నంతా వివరించసాగాడు.
‘‘ఈ సెప్టెంబర్‍ నెలల వాన చాలా సార్ల్లు కురిసింది. పట్నంల ఉన్న కుంటలు, చెరువులు అన్నీ పూర్తిగ నిండిపోయినై. వాటి ఔట్‍లెట్‍కు సరైన దారే లేదు. ఇంతల మళ్లీ నిన్న రాత్రి కుంభవృష్టి కురిసింది. రెండు, మూడు గంటలు ఆగకుండ పడింది. ఆసిఫ్‍నగర్‍ల సీతారాంబాగ్‍ దేవాలయం తెలుసుకదా! ఆ ప్రాంతంల కోమటికుంట అని ఒక చెరువు ఉంది. నిన్నటి వానకు అది ఓవర్‍ ఫ్లో అయ్యింది. ఆ చెరువు పక్క నుండే ఒక డ్రైనేజీ మురికి కాలువ వెళ్లుతుంది. అది చాలా పెద్ద కాలువ. అది అక్కడ్నంచి బయలు దేరి మంగళ్‍హాట్‍, ఆగాపురా, గోషామహల్‍, ఉస్మాన్‍ గంజ్‍ నుండి గౌలీగూడాకు వచ్చి, ఇక్కడ బస్‍ డిపో భూమి లోపల నుండి వెళ్లి మూసీ నదిల కలుస్తుంది. వాన నీటి వొత్తిడికి కోమటికుంట చెరువు కట్ట తెగి ఆ వరదనీళ్లన్నీ ఈ మురికి కాలువలకు తోసుకొచ్చినై. గోషామహల్‍ వరకు డ్రైనేజీ లైన్‍క్లియర్‍గ ఉన్నందున ఆ వరదనీళ్లు ఎటువంటి ఆటంకం లేకుండా వచ్చినై. కాని ఉస్మాన్‍గంజ్‍, గౌలీగూడాల ముందుకెళ్లటం కష్టమైంది. దానికి కారణం బస్సు డిపో ముందు మూసీనది ఒడ్డంతా దురాక్రమణలకు గురైంది. మురికి నీళ్లుపోయే మార్గమంతా మూసేసి, పశువులకు అవసరమైన పచ్చగడ్డి కోసం పైర్లను వేసిండ్రు. ఆ చెత్తచెదారంతోటి మూసీల కలువాల్సిన ఆ మురికి కాలువ పూర్తిగ మూసుకపోయింది. మున్సిపాలిటీ వాళ్లు కూడా ఆ ప్రమాదాన్ని గమనించలేదు. నీటి ప్రవాహం వొత్తిడికి ఉస్మాన్‍గంజ్‍ నుండి గౌలీగూడా వరకూ అనేక చోట్ల వరదనీళ్లు ఇండ్లలోకి ఐదు, ఆరు అడుగుల వరకు వచ్చినై. ఆ తర్వాత ఈ గౌలీగూడాల మూసీనది ముఖద్వారం పూడుకపోయి, నీళ్ల్లు ఆగేసరికి నీటి అంతర్గత వత్తిడి ఎక్కువయ్యి భూమి బ్రద్దలయ్యింది. పైనున్న బస్సు డిపో డైనమెట్‍తోటి పేల్చినట్టు ఒక్కసారే పైకి ఎగిరి ఆ అగాధంలోకి కూరుకపోయింది. ఇది జలఫిరంగి చేసిన విధ్వంసం.’’
మరి జననష్టం? అడిగాడు స్వామి.
‘జననష్టం, ఆస్తినష్టం వివరాలు ఇంకా సరిగ్గా తెల్వదు కని ఇక్కడికి కొద్ది దూరంల మిషిన్ల శంకరయ్య బిల్డింగ్‍ పూర్తిగ కుప్పకూలి అండ్ల పన్నెండు మంది చనిపోయినట్లు ఖచ్చితమైన సమాచారం ఉంది’ అని ముగించాడు.
యాదగిరి స్వామిని గౌలీగూడా శంకర్‍ షేర్‍ హోటల్‍కి తీసుకెళ్లి మాల్‍పూరీ తినిపించి, మలాయ్‍ చాయ్‍ తాగించాడు.


× × ×


అప్పటికి వరదలలో గౌలీగూడా కొట్టుకపోయి ఇంకా వారం రోజులు కూడా కాలేదు.
లాల్‍ దర్వాజా నుండి అప్సరా టాకీస్‍ దాటి అలియాబాద్‍కు వెళ్లే దారిలో వెంకటేశ్వరస్వామి గుడిదగ్గర పూల్‍బాగ్‍ చమన్‍. సాయంకాలం సంజెచీకట్లు కమ్ముకునే గోధూళి సమయం. ఆకుపచ్చని చల్లటిగడ్డి మీద స్వామి మిత్రబృదం విశాలంగా గుండ్రంగా కూచున్నారు. ప్రతి సాయంత్రం వారు అక్కడ కా కలుసుకుని మాట్లాడుకుంటారు.
ఆ సాయంత్రం చర్చ మంచి రసపట్టులో ఉన్నప్పుడు బయట కలకలం వినిపించింది. అందరూ ఇహలోక ప్రపంచంలోకి వచ్చారు. ఏమైందేమైందని లేచి నిలబడి రోడ్డు వైపు చూశారు. జనమంతా రోడ్డు మీద ఉరుకుతున్నారు. అంతా గడ్‍బడ్‍, గడ్‍బడ్‍గా ఉంది. ఏమీ అర్థం కాలేదు. మిత్రులంతా చమన్‍ గేటు దాటుకుని రోడ్డుమీదికి వచ్చారు.
‘‘పానీ ఆయా భాగో భాగో
పానీ ఆయా భాగో భాగో’’
గగ్గోలు.. గందరగోళం. ఆడమగా.. పిల్లాజెల్లా అందరి నెత్తుల మీద మూటలు. ముల్లెలు, సామానులు, సందూకులు, రిక్షలల్ల, సైకిళ్లమీద, కాలినడకన తిత్తర బిత్తరగ, తీన్‍తేరాగ దమ్ములు పోసుకుంటూ ఉరుకులు పరుగులు. ఏమైందేమైందని ఎవర్ని అడిగినా అందరి నోట ఒకటే మాట. ‘‘పానీ ఆయా భాగో భాగో’’. మృత్యు దేవత తరుముకొస్తున్నట్లు యమభటులు వెంటబడుతున్నట్లు అందరి ముఖాలల్ల అందరి కండ్లల్ల చావు భయం. చెమటలు కారుతున్న ముఖాలు, గజగజా వొణికిపోతున్న శరీరాలు. పిల్లాజెల్లా గీగా అరుపులు. ఆడవాళ్ల ఏడుపులు క్యాహువా? క్యాహువా? ఎవర్నడిగినా ఏమి లాభం? అందరి నోటా ఒక్కటే జవాబు ‘‘పానీ ఆయా భాగో భాగో’’ ‘‘నడువుండ్రా ఫల్కనామ గుట్ట మీదికి ఎక్కుండ్రి. ఉరుకుండ్రి, ఉరుకుండ్రి దబ్బదబ్బ నడువవే నీయమ్మ పెండ్లి నడుకలు నడుస్తవ్‍. నీళ్లల్ల మునిగి చస్తవా ఏంది? అరేయ్‍ పొల్లగా ఈ మూట జర నెత్తి మీద్కి పెట్టుకుని ఉరుకు.
ఉరుకు బిడ్డా ఉరుకు. అయ్యో దేవుడా! అరే అల్లా క్యా పరేశానీ? క్యా పరేశానీ? దేవుడా ఏడుకొండల వెంకటరమణా, యాదగిరి గుట్ట లక్ష్మీనర్సింహస్వామి రక్షించు, రక్షించు.
ఏమైంది నాయినా? ఒక ముసలోడ్ని అడిగిండు స్వామి.
‘‘తెలువదా బిడ్డా, గండిపేట చెరువు కట్ట తెగిపోయిందంట. నీళ్లు పట్నంలకు వచ్చినయంట. చార్మినార్‍ సుత సగం నీళ్లల్ల మునిగి పోయిందట. నడువుండ్రి నడువుండ్రి ఫల్కనామ గుట్ట మీదికి ఎక్కుండ్రి, ప్రాణాలు దక్కించుకోండ్రి. జాన్‍ బచాలేవ్‍. జాన్‍ బచాలేవ్‍. పానీ ఆయా భాగో భాగో జనం జనం. ముంచుకొస్తున్న వరదలాగా రోడ్లమీద జనం. మిత్రులు ఉరుకులు పరుగులతో చమన్‍ దాటిండ్రు. వెంకటేశ్వరస్వామి గుడిలో అంతవరకూ భజనలు చేస్తున్న భక్త జనసందోహమంతా ఒక్క నిముషంలో అక్కడ్నుండి మాయం. దేవుడి మానాన దేవుడ్ని వొదిలి తమ ప్రాణరక్షణ కోసం రోడ్డు మీదకు వచ్చి ఏమైందేమైందని అడిగి, ముంచుకొస్తున్న ప్రమాద వార్త విని ‘‘ప్రాణముల్‍ ఠావుల్‍ దప్పెను’’ అంటూ ఇంటిదారిన ఉరుకుతున్నరు. స్వామి కల్లు కాంపౌండు దాటి, అప్సరా టాకీసు దాటి లాల్‍దర్వాజా మేయిన్‍ రోడ్డు మీదికి వచ్చాడు. అక్కడ మరింత గందరగోళం. రోడ్డంతా జామ్‍, జామ్‍. ట్రాఫిక్‍ చిక్కుపడిన దారం ఉండలా ఉంది. రిక్షాలు, సైకిళ్లు, పాదాచారులు. పుట్ట పగిలి ఇవతల పడి ఇటు అటు ప్రాకుతున్న చీమల్లా ప్రజలు. ప్రాణం ఎంత విలువైందో ఆ నిమిషాన వారందర్నీ చూస్తుంటే తెలుస్తుంది. ‘‘ఊపిరి ఉంటే ఉప్పు అమ్ముకునైనా బ్రతకొచ్చు’’ అనుకుంటూ దుకాణాలను, వ్యాపారాలను, గల్లాపెట్టెలను వదిలి పరుగో పరుగులు. కట్టుబట్టలతో ఇండ్లు వదిలి ఎటు పరిగెత్తుతున్నామో తెలియనంతగా ఇండ్లు వదిలి గల్లీలల్లకు, గల్లీలల్ల నుండి రోడ్లమీదికి భాగంభాగ్‍ దౌడ్‍లు. క్యాహువా? క్యా హువా ప్రశ్నలు. పానీ పానీ హైబత్‍ హైబత్‍. బి.పి. భయం భయం గుండెదడ. మిత్ర బృందమంతా ఆ పరేషాన్ల కాట్‍ అయిపోయారు. స్వామికి తమాషాగా ఉంది. ఎందుకో భయం కలుగలేదు. మళ్లీ ఈ ‘మోఖ’’ (అవకాశం) రాదన్నట్టు జనంలోని చావు భయాన్ని దగ్గర్నుండి చూస్తూ సందు చేసుకొని, రోడ్ల పక్కనుండి నెమ్మదిగా నెమ్మదిగా నడుస్తూ శాలీబండాకు వచ్చాడు. నీరు పల్ల మెరుగు జనం ఎగువనెరుగు అన్నట్లు చార్మినార్‍ నుండి జనం శాలీబండా చడావ్‍ ఎక్కుతున్నారు.‘‘ఏంభై, చార్మినార్‍ కాడ నీళ్లున్నయా’’ అని ఒక సైకిలిస్టుని అడిగితే ‘‘నైనై పానీ మదీనా తక్‍ ఆయా’’ అంటూ వాడు సైకిల్‍ ఆపకుండానే పరుగులు. ‘‘మదీనా మే పానీ ఆయా క్యా?’’ అని మరొకర్ని అడిగితే ‘‘నైనై నయాపూల్‍ తక్‍ ఆయా’’ అని ఆ ఆగంతకుడి సమాధానం. శాలీబండా దర్గా రావిచెట్టు దగ్గరి బోన్‍సెట్టింగ్‍ సెంటర్‍ మలుపు తిరిగి అక్కడి నుండి ఇంటికి చేరుకున్నాడు.


ఇంట్ల బాపుతో సహా అందరూ రేడియో మీదికి తలలు వొంచి చెవులు అప్పగించి వార్తలు శ్రద్దగా వింటున్నారు.
‘‘ఎందిరో ఎక్కడ్నుంచి వస్తున్నవ్‍?’’ తన పాదాల వొంక అనుమానంగా చూస్తూ సుశక్క ప్రశ్నించింది. గండిపేట తెగిన నీళ్లళ్ల అతని పాదాలు ఏమైనా తడిచినవేమొనని ఆమె అనుమానం.
‘‘ఆఁ ఆఁ నీళ్లు మన రూప్‍లాల్‍బజార్‍ దాకా వొచ్చినయ్‍. సుశీల ఎక్కడుంటదని బస్తీల అందర్నీ అడుగుతున్నై’’అన్నాడు వచ్చే నవ్వును బలవంతాన పెదాల మీద బిగపట్టుకుని.
‘‘ఏందిరా, నన్నే పరాశికం చేస్తున్నవ్‍ లే?’’ అని ఒంటికాలిమీద లేచి కొట్టేతందుకు ముందు కొచ్చింది సుశక్క.
వార్తలు అయిపోయినయ్‍. పుకార్లు ఉత్త పుకార్లు.
నిన్నమొన్నటిదాకా గౌలిగూడ నీళ్ల భయంతో దస్కుతిన్న మనుసుల మీద ఈ పుకారు బాగానే పని చేసింది. వాటర్‍ ఫోబియాతో ఉన్న ప్రజల మీద ఈ పుకారు బాగానే షికారు చేసింది.
‘‘ఛీల్‍ ఉడీ అంటే భైఁస్‍ ఉడీ అనే రకాలు మన వాళ్లు’’ బాపు జడ్జిమెంట్‍ పాస్‍ చేశాడు. పాన్‍ నములుకుంట.
‘‘చస్తే అందరూ ఒక్కసారే చావాలి. ఒకరుండి ఇంకొకరు పోవద్దు’’ అమ్మ తన స్వంత మెట్ట వేదాంతం ప్రకటించింది.
ఆ మరునాడు పేపర్లో ప్రధాన శీర్షిక. ‘‘పానీ ఆయా భాగో భాగో.’’ నగరం మీద ఎవరో వేసిన ప్రాక్టికల్‍ జోకు, ఆటపట్టించిన తమాషా. ఎవరు ఎందుకు ఎక్కడ ఏ ఉద్దేశ్యంతో ఆ పుకారును ప్రచారం చేశారో ఎవరూ తెలుసుకోలేక పోయారు. ఒక పాత నగరమే కాదు. జంటనగరాలు ఆ పుకారుకు బేజారైనాయి. అసలు సిసలైన మానవ సహజసిద్ద స్వభావం ఆ క్షణంలో బయట పడింది. చాలా మంది నౌబత్‍పహాడ్‍ లాంటి ఎత్తు ప్రాంతాలకు చేరుకున్నారు. ముసలితల్లితండ్రుల్ని వదిలి పడుచు భార్యలను స్కూటర్‍ వెనక ఎక్కించుకొని నౌబత్‍పహాడ్‍ మీదికి ఎక్కిన వారెందరో? వారు ఏం ముఖం పెట్టుకుని ఇండ్లల్లకు తిరిగి వెళ్లారో? కాని అంత గడ్‍బడ్‍లల్ల ఎక్కడా లూఠీలు, దోపిడీలు జరుగలేదు. ఘనత వహించిన పోలీసు ఇంటలిజెన్స్ శాఖ వారు కూడా నగరాన్ని గడ గడ లాడించిన ఆ పుకారు ఎందుకు లేచిందో తర్వాత కాలంలో కూడా కనుక్కోలేక పోయారు. ఏదేమైతేనేం నగరానికి సంబంధించిన అదో పెద్ద ప్రాక్టికల్‍ జోకు.
‘‘హైద్రాబాద్‍ కే హవా మే
పుకార్‍ షికార్‍ కర్తేఁహై’’ (లోకేశ్వర్‍ రచన : కల్లోల కలల కాలం నవల నుండి…)


పరవస్తు లోకేశ్వర్‍, ఎ: 91606 80847

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *