వజ్రం, వైఢూర్యాలు, మణిమాణిక్యాల వర్ణనలు మన సాహిత్యంలో తరచూ కనిపిస్తాయి. బంగారురంగులో మెరిసే వాటిని వైఢూర్యంతో పోలుస్తారు. నవరత్నాలలో ఒకటిగా ఈ వైఢూర్యం మన సంస్కృ తికి వేదకాలంనాటి నుండి చిరపరిచితం.
వైఢూర్యానికి మరిన్ని పేర్లు :
- విధుర / విధుర పత్రం
- మహేశ్వర
- హిరణ్యాభ
- హరితాశ్మ
- శ్యామరత్న
- కాంతాకుసుమ
- కేతు రత్న
- బిడాలాక్ష
- మార్జాలాక్ష మొదలైనవి.
వైఢూర్యం అంటే విష్ణుదేవునికి చెందినది అనే అర్థం ఉంది. మొత్తం మీద ఈ పేర్లు అన్ని దాని భౌతిక లక్షణాలు, అది దొరికే భౌగోళికప్రాంతాల పేర్లు, దానికి ఆపాదించిన దైవలక్షణాలు మరియూ జ్యోతిష్యలక్షణాల ఆధారంగా వచ్చినవే. వైఢూర్య శబ్దం రత్నపరంగానే కాకుండా ఇతర వ్యుత్పత్తి అర్థాలతో వాడబడింది. వైఢూర్యకాంతి అనే పేరుగల ఖడ్గం కథా సరిత్సాగరంలో ఉల్లేఖించబడింది. జ్యోతిషశాస్త్రంలో వైఢూర్యద్వీపం యొక్క ప్రసక్తి ఉంది. వైఢూర్యగర్భ అనే పేరు బౌద్ధంలో ఉంది. సమరాంగణ సూత్రధార అనే వాస్తుశాస్తగ్రంథం ప్రకారం వైఢూర్యం ఒక రకమైన ప్రాసాదం పేరు. వైఢూర్య పర్వతం యొక్క ప్రసక్తి మహాభారతంలో ఉంది!
చరిత్రలో వైఢూర్యం:
వేదకాలంలో వైఢూర్యం అద్భుతబ్రాహ్మణంలో మొదటిసారి ప్రస్తావించబడింది. గరుడపురాణంలో వైఢూర్యం గొప్పతనం గురించి ఇలా ఉంది.
‘‘వైడూర్యం చ మహారత్నం హేమాభం వైడూర్యం మహత్
సర్వగుణోపేతం దేవం పుష్యమి రత్న సంయుతం.’’
(బంగారం వలె ధగ ధగ మెరిసే పుష్య రత్నం వంటి సర్వగుణోపేతమైన వైడూర్యం దివ్య లక్షణాలు కలిగినది.)
విష్ణుదేవునితో ఈ రత్నం ప్రత్యేక అనుబంధం కలిగి ఉంది.
విష్ణు పురాణంలో వైఢూర్యం ప్రసక్తి ఇలా ఉంది,
‘వైఢూర్యం మణి శరీరస్త విష్ణోర్హదయ సంస్థితం’ (అంటే వైఢూర్యం విష్ణుహహృదయంలో ఉంది అని)
‘‘వైఢూర్యం మణి రక్తాంగ, విష్ణుప్రియ, మణిశుభం’’ అని గరుడపురాణంలో ఉంది. ఎరుపు, నీలం ఛాయల వైఢూర్యం విష్ణువునకు ప్రియమైనది మరియు శుభప్రదం అని దీని అర్థం.
‘‘ఖచిత కనక ముక్త రక్త వైఢూర్య వాసం… అరుణ విధు సంకాశం కోటి సూర్య ప్రకాశం ఘటిత శిఖి సువీతం నౌమి విష్ణో కిరీటం’’ అంటూ వైఢూర్యాలు పొదిగిన బంగారు విష్ణు కిరీటం గురించి వైష్ణవ వాఙ్మయంలో ఉంది.
వైడూర్యపర్వతం ప్రసక్తి మహాభారతంలో ఉంది. శూర్పారక దేశంలో గోకర్ణతీర్థం దగ్గర అగస్త్యుడు వైఢూర్యపర్వతం మీద ఆశ్రమం నిర్మించుకొన్నాడు. నర్మదానదిలో స్నానంచేసి ఈ వైడూర్యపర్వత దర్శనం చేసుకుంటే మోక్షం లభిస్తుందని భక్తుల విశ్వాసం. రామాయణంలో, భాగవతం కూడా దీని ప్రస్తావనలు ఉన్నాయి.
వరాహమిహిరుడు బృహత్సం హితలో పేర్కొన్న 22 రత్నాలలో వైఢూర్యం కూడా ఒకటి. ప్రాచీన గ్రంథాలైన రత్నపరీక్ష, మణిమాల, మణిదర్పణాలలో కూడా దీని ప్రస్తావన ఉంది. ఆయుర్వేదగ్రంథాలైన రాజనిఘంటువులో కూడా దీని ప్రస్తావన ఉంది.
వైఢూర్యానికి ఆ పేరెలా వచ్చింది?
వైఢూర్యం అనే పేరు అది దొరికిన ప్రదేశం నుండి వచ్చింది. అయితే స్థలానికి సంబంధించి నిపుణుల మధ్య ఏకాభిప్రాయం లేదు. సుదూర ప్రాంతం నుంచి తెచ్చిన రత్నం కాబట్టి ఆ పేరు పెట్టారని చాలా మంది భావిస్తారు (విదూర అంటే చాలాదూరం). దీనిని తమిళనాడులోని వెల్లూరు నుండి తీసుకువచ్చినట్లు కొందరు భావిస్తారు. ప్రత్యామ్నాయంగా కొంతమంది విదురపర్వతం మేరుపర్వతానికి పశ్చిమాన ఉందని భావిస్తారు. ‘‘విదూర’’ పదం బర్మాను సూచిస్తుందని మరొక అభిప్రాయం. ఆ రత్నం విదురుడి రాజ్యానికి చెందినదని కొద్ది మంది అంటారు.
ఈ పేరు ఎలా వచ్చినప్పటికీ అది దొరికే భౌగోళికప్రాంతాన్ని సూచిస్తుంది కాని ఖనిజపరమైనది కాదు. అదే ప్రాంతంలో ఉన్న ఇతర రత్నప్రజాతులను కూడా అదే పేరుతో వ్యవహరించేవారు. ప్రాచీన రత్నశాస్త్రంలో ఉన్న ఈ పరిమితి ఒక్కోసారి అస్పష్టతకు దారితీస్తుంది.
వైఢూర్యం ఖనిజ సమాచారం:
ఇది క్రైసోబెరిల్ కుటుంబంలోని ఖనిజం.
దీని రసాయనిక కూర్పు: BeAl2O4 (Beryllium Aluminium Oxide)
స్పటిక వ్యవస్థ: ఆర్దొరాంబిక్
కఠినత్వం: 8.5 మోహస్ స్కేల్ పై
మెరుపు: గాజు వంటి
రంగు: ఆకుపచ్చ, పసుపు పచ్చ గోధుమ రంగు లలో వివిధ ఛాయలు. వర్ణరహితంగా కూడా లభిస్తాయి.
చీలిక (Cleavage): ఒక దిశలో పేలవమైన చీలిక.
ఆప్టికల్ లక్షణాలు: వక్రీభవన సూచిక 1.745బి1.755
Pleochroism:బలహీనమైన లేదా ఒక మోస్తరుగా.
పెగ్మాటైట్స్, ఒండ్రు నిక్షేపాలు మరియు రూపాంతర శిలలలో క్రిసోబెరిల్స్ కనిపిస్తాయి.
ఎక్కడ దొరుకుతాయి:
శ్రీలంక, మయాన్మార్, బ్రెజిల్, రష్యా మరియు అమెరికాలోని కనెక్టికట్ మరియు ఉత్తర కరోలినా, ఇంకా కొన్ని ఆఫ్రికా దేశాలలో.
తెలుగు రాష్ట్రాలలో క్రైసోబెరిల్స్:
భారతదేశంలో క్రైసోబెరిల్స్ ఆంధప్రదేశ్ మరియు ఒరిస్సాలో లభిస్తాయి. కేరళలో కూడా లభిస్తాయి. నర్సీపట్నం వైఢూర్యం (క్యాట్స్ఐ)/అలెగ్జాండ్రైట్ చాలా ప్రసిద్ధి చెందింది. అధికారికంగా ఇప్పుడు ఇక్కడ ఏమి దొరకటం లేదు కానీ మార్కెట్లో అప్పుడప్పుడు కొన్ని అనధికారికంగా వస్తూనే ఉన్నాయి.
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం తూర్పుగోదావరి జిల్లాలోని పదమూడు మండలాల్లో వైఢూర్యాలు దొరుకుతున్నాయని కాశీపతి 1996లో తెలిపారు. అవి గోలుగొండ, పాడేరు, అరకు, చోడవరం, జి.మాడుగుల, సాలూరు, అడ్డతీగల మరియు రంపచోడవరం మొదలైనవి. ఈ మండలాలలోని 26 గ్రామాలలో వైఢూర్యాలు దొరికే అవకాశం ఉందని తెలుస్తోంది.
క్రైసోబెరిల్ ఖనిజం తూర్పు కనుమలలో ఉన్న ఖొండలైట్ శిలలోని పెగ్మటైట్ అంతర్గమాలలో దొరుకుతుంది. ముఖ్యంగా ఈ పెగ్మటైట్ సిరలు మాఫిక్/అల్ట్రా మాఫిక్ అంతర్గమాలను దాటుకుని వెళ్లినప్పుడు వైఢూర్యం దొరికే అవకాశం ఎక్కువగా ఉందని ఆయన తెలిపారు.
ఇలాంటి ఖనిజపు పాకెట్‍లు పెగ్మటైట్ సిరల దాపులో ఉన్న బాగా శైధిల్యం చెందిన కొండవాలులో ఉన్న రాళ్ళలో ఉంటాయి. ఇక్కడ దొరికే క్రైసోబెరిల్ ఖనిజం పలకలుగాను, నిలువుగాను, చిన్న చిన్న ప్రిజమ్ వంటి స్పటిక రూపంలో ఉంటాయి. ఈ స్పటికాలపై స్పష్టమైన నిలువుగీతలు ఉంటాయి. స్పటికాల పరిమాణం 5 నుండి 30 మిల్లిమీటర్ల పొడవు మరియు 2 నుండి 35 మిల్లిమీటర్ల వెడల్పు ఉంటుంది.
ఖనిజంలో చీలిక (cleavage) ఒక దిశలో స్పష్టంగా మరి రెండు దిశలలో బలహీనంగా ఉంది. ఖనిజ ఛేదాలను (thin section) సూక్ష్మదర్శినిలో పరిశీలిస్తే వర్ణరహిత, లేతపసుపు, పసుపు ఛాయల ఆకుపచ్చ రంగుల్లో ఉంటాయి. ప్లియోక్రాఇజమ్ (రంగు మారటం) కూడా ఉంటుంది.
రత్నశాస్త్రంలో వైఢూర్యం:
ప్రాచీన రత్నశాస్త్రం ప్రకారం ఉత్తమ వైఢూర్యం బరువుగా, నిర్మలంగా, సమంగా ఉండి బూడిదరంగుతో మెరుస్తూ ఉండి, మధ్యలో మూడు తెల్లని యజ్ఞోపవీతం వంటి చారలు కలిగి ఉంటుంది.
వైఢూర్యం ముతకగా, బరువు తక్కువగా చదునుగా వుండి ‘‘శ్యామతోయం’’ (నల్లని నీరు)వంటి రంగులో ఉండి, దాని మధ్యలో ఉత్తరీయం వంటి ఆకారం ఉంటే అది దోషపూరితమైనదని భావిస్తారు.
వైఢూర్యం వర్ణన మన ప్రాచీన రత్నశాస్త్రం ప్రకారం చూస్తే కొంత సందిగ్ధతకు ఆస్కారం ఉంది. ఖనిజపరంగా ఇది ఆకు పచ్చని బెరిల్‍కు కూడా వర్తిస్తుంది. కొన్నిసార్లు దీనిని నీలంపరంగా ఇంకా ఒక్కసారి లాపిస్ లాజురికి కూడా ఉపయోగించారు. ఇప్పుడు నవరత్నాలలో ఒకటిగా నవగ్రహాలలో కేతువుకు ప్రతీకగా ప్రసిద్ధిచెందిన వైఢూర్యం క్రైసోబెరిల్ గానే ప్రాచుర్యంలో ఉంది.
వైఢూర్యం (క్రైసోబెరిల్) రకాలు:
క్రైసోబెరిల్‍లో సైమోఫేన్, అలెగ్జాండ్రైట్, క్రైసోబెరిల్ పిల్లికన్ను (cats eye) మొదలైనవి ఉన్నాయి.
అలెగ్జాండ్రైట్: ఇది ఒక రకమైన క్రైసోబెరిల్. దాని రంగు మార్పు లక్షణాలకు ప్రసిద్ధి చెందింది. పగటివెలుగులో ఇది నీలం ఆకుపచ్చ నుండి ఆకుపచ్చరంగులో కనిపిస్తుంది మరియు ప్రకాశించే దీపకాంతిలో ఇది ఎరుపు నుండి ఊదాఎరుపు రంగులో (Red to purplish red)కనిపిస్తుంది. రంగుమారడం ఎంత ఎక్కువగా ఉంటే ఈ రత్నం అంత విలువ పొందుతుంది. జాలకప్రదేశంలో ఇనుము మరియు క్రోమియం ఉండటం రంగు మార్పుకు కారణం.
ఇది మొదట రష్యా నుండి 1834లో కనుగొనబడింది. ఇప్పుడు శ్రీలంక, మయన్మార్, బ్రెజిల్, మడగాస్కర్ మరియు భారతదేశంలో కూడా దొరుకుతున్నాయి.
జార్ చక్రవర్తి రెండవ అలెగ్జాండర్ పేరుమీద ఈ క్రైసోబెరిల్ అలెగ్జాండ్రైట్ అని వ్యవహారించబడింది.
అన్ని రంగుమార్పు క్రైసోబెరిల్స్ అలెగ్జాండ్రైట్స్ కాదు, ఆకుపచ్చ నుండి గులాబీరంగుకు ( purplish red ) పూర్తిగా స్పష్టంగా మారే క్రిసోబెరిల్ మాత్రమే అలెగ్జాండ్రైట్ గా గుర్తించబడతాయి. ఇనుము మరియు క్రోమియం ఉండటం తప్పనిసరి.
రష్యాలోని ఉరల్ పర్వతాలో లభించే అలెగ్జాండ్రైట్ మార్కెట్లో అధిక ప్రీమియంను కలిగి ఉంటాయి. కొందరు దీనిని మాత్రమే అలెగ్జాండ్రైట్‍గా గుర్తిస్తారు. రంగు మారే క్రైసోబెరిల్ లోని రంగు మార్పు అలెగ్జాండ్రైట్ కు దగ్గరగా ఉంటే ‘‘అలెగ్జాండ్రైట్ వంటి క్రైసోబెరిల్’’ అని అంటారు. ఇతరత్రా రంగుమారే క్రైసోబెరిల్ ను ‘‘రంగు మారే క్రైసోబెరిల్’’గా మాత్రమే వ్యవహరిస్తారు. సింథటిక్ అలెగ్జాండ్రైట్ మార్కెట్లో దొరుకుతుంది దీని పట్ల కొనుగోలుదారులు అవగాహన కలిగి ఉండాలి.
పైన చెప్పిన రంగుమార్పు లేని, క్యాట్స్ఐ లేకుండా ఆకుపచ్చ, పసుపు, గోధుమరంగు మరియు బూడిద రంగుల వివిధ ఛాయలలో లేదా ఏ రంగు లేకుండా ఉన్న సాధారణ క్రైసోబెరిల్/వైఢూర్యాలు కూడా ఉన్నాయి. క్రైసోబెరిల్ అనే పదం గ్రీకుభాష నుండి వచ్చింది. (క్రైసోస్‍ంబెరిల్ బంగారు రంగులో ఉన్న బెరిల్).
చరిత్ర ప్రసిద్ధి చెందిన వైఢూర్యాలు:
రష్యా రాజభాండాగారం లో ఉన్న 19వ శతాబ్దంనాటి 16 అలెగ్జాండ్రైట్ రత్నాలతో చేసిన హారం.
రష్యా రాజకుటుంబానికే చెందిన మరో 19.5 క్యారెట్ల అలెగ్జాండ్రైట్.
జార్ చక్రవర్తి రెండవ అలెగ్జాండర్ కు చెందిన క్యారెట్ల12 బ్రూష్.
డచెస్ ఆఫ్ మార్ల్బరో కు చెందిన 7క్యారెట్ల హారం.
రష్యా రాజకుటుంభానికి చెందిన 5 క్యారెట్ల ఉంగరం.
స్మిత్సోనియన్ అలెగ్జాండ్రైట్ :
ఇది ఒక రష్యన్ వలసదారు స్మిత్‍సోనియన్ సంస్థకు విరాళంగా ఇచ్చిన 3.5 క్యారెట్ రత్నం. చాలావరకు అలెగ్జాండ్రైట్‍లు జార్స్ ఖజానా నుండి వచ్చినవే.
రష్యా రాజకుటుంబానికి చెందిన ఓర్లోవ్ పిల్లికన్నురత్నం 189.62 క్యారెట్‍లు ఉండేది.
మొగల్ పిల్లికన్ను రత్నం (The Moghal Cat’s eye) 23.5 క్యారెట్ బరువు కలది.
19వ శతాబ్దం నాటి గ్రీకుఖజానాలో ఉన్న స్టౌరైడ్స్ క్యాట్స్ ఐ 16.2 క్యారెట్ బరువు కలది.
20 క్యారెట్ బరువుగల కాటారగామా క్యాట్స్ఐ శ్రీలంకలో ఉంది.
షహజహాన్ క్యాట్స్ఐ 15.5 20 క్యారెట్ బరువు కలది.
చైనా ఖజానాలో ఉన్న చైనాచక్రవర్తికి చెందిన 18వ శతాబ్దము సైమోఫేన్ చరిత్ర ప్రసిద్ధి చెందింది.
నిజాం ఆభరణాలలో అలెగ్జాండ్రైట్స్:
నిజాంలు రత్నాలు మరియు ఆభరణాల సేకరణకు ప్రసిద్ధి చెందారు. వాటిలో కొన్ని:
100 క్యారెట్ల ఏడు వరుసలు కల 21 అలెగ్జాండ్రైట్ లు కలిగిన హారం.
ఒక తలపాగా చుట్టూ వజ్రాలు ఉన్న 10 క్యారెట్ అలెగ్జాండ్రైట్.
5 క్యారెట్ల అలెగ్జాండ్రైట్‍తో కూడిన ఒక ఉంగరం.
క్రైసోబెరిల్ యొక్క ఉపయోగాలు:
ఒక రత్నంగా ఇది చాలా ప్రజాదరణ పొందింది. ఆభరణాలు మరియు అలంకారాలలో
ఉపయోగపడుతుంది
దీనికి పారిశ్రామిక ఉపయోగం కూడా ఉంది. ఉష్ణసహన (Refractive) పదార్థంగా, గగనతలపరిశ్రమ, అణుపరిశ్రమ, శాస్త్రీయ పరిశోధన, లేజర్ అప్లికేషన్లలో ఉపయోగిస్తారు. జియోలాజికల్ స్టడీలో రిఫరెన్స్ మినరల్‍గా పనికి వస్తాయి.
బెరీలియం మూలకానికి మూలంగా ఉపయోగిస్తారు.
పూజా విధానంలో, జ్యోతిష్య ఉపయోగంలో పనికి వస్తాయి. ఇంకా ఇతర మెటాఫిజికల్ ఉపయోగాలు కూడా ఉన్నాయి.
ఆయుర్వేద ఔషధంగా వైఢూర్యం:
రక్త పిత్త దోషాల నివారణ కోసం ఉపయోగిస్తారు. జీర్ణశక్తి పెరుగుట కొరకు, మలబద్ధకం నివారణకు, జ్ఞానవృద్ధికీ కూడా పనిచేస్తుంది.
–చకిలం వేణుగోపాలరావు
డిప్యూటి డైరెక్టర్ జనరల్ జిఎస్సై(రి)
ఎ: 9866449348
శ్రీరామోజు హరగోపాల్,
ఎ : 99494 98698