2012లో ప్రారంభించబడ్డ మాసపత్రిక ‘‘దక్కన్‍ల్యాండ్’’ పత్రిక గత 13 ఏండ్లుగా అప్రతిహాతంగా నడుపబడుతున్న అగశ్రేణి పత్రిక. వేదకుమార్‍గారు సబ్బండవర్గాల-మతాల ప్రజల సమగ్రాభివృద్ధిని కాంక్షిస్తు నిత్య శ్రామికునిగా సమన్యాయ నిఘంటువుగా మారి విద్యాధికుడై, ఈ సమాజ పోకడల మంచీ -చెడూ, కష్ట-నష్ట, ఉచితానుచితాల నెరుగుతూ, సందర్భోచితంగా సమయపాలనను పాటిస్తూ తన హృదయాన్ని మలినంలేని ‘‘శ్వేత పత్రంగా’’ మార్చుకొని జీవిస్తున్న సజీవసాక్షపు సంఘసంస్కర్తల మాటా, బాటైన ‘‘వారసోత్తమునిగా’’ పత్రిక సంపాదకునిగా నిలదొక్కుకున్నటి దిట్ట మణికొండ వేదకుమార్.
వేదకుమార్ గత 15 సంవత్సరాలుగా నాకు పరిచయం. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పడాలన్న అకుంటిత కార్యదీక్ష వారిది. ఉద్యమకాలంలో టీఆర్‍సీ (తెలంగాణ రిసోర్స్ సెంటర్) పేరుతో ప్రతి మాసం హిమయత్‍నగర్‍లోని చంద్రం బిల్డింగ్‍లో చర్చా వేదికను నిర్వహించేవారు. అనేక రంగాలకు సంబంధించిన నిపుణులను ఆహ్వానించి ఆ చర్చా వేదికలో వారి అభిప్రాయాలను విశ్లేషించేలా చేసేవారు. వాటిని దక్కన్ ల్యాండ్ పత్రికలో అక్షర రూపంలో ప్రచురించి పాఠకులకు అందించేవారు. మేధావులను, సాహితీ వేత్తలను వందలాదిమంది ఉద్యమ కారులను, సైంటిస్ట్లను, ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ రాష్ట్రస్థాయి ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు, సబ్బండ వర్గాల కులసంఘాల అధ్యక్ష, కార్యదర్శి పలుకుబడిగల ఎందరెందరో సామాజిక – రాజకీయ, సాంస్కృతిక విప్లవోద్యమ నాయకులను, ఐఏఎస్, ఐపీఎస్, ప్రభుత్వ ఉద్యోగుల నెందరినో ప్రభావితం చేస్తు, ‘‘తెలంగాణ రాష్ట్రం సిద్ధించాలని’’ ప్రతి నెల రెండో శనివారం 10 సంవత్సరాల పాటు, తన సొంత ‘‘దక్కన్ టివి ఛానెల్’’ ద్వారా మాట్లాడిస్తూ, ప్రసంగాలు చేయిస్తూ, తెలంగాణ భౌగోళిక పరిస్థితులు, సంపద, గతకాల ఉద్యమాల చరిత్రల నన్నింటిని అనుభవం గల ఒక్కొక్కరితో మాట్లాడిస్తూ ‘‘ప్రత్యేక తెలంగాణ ముద్దుబిడ్డ’’గా తన విద్యుక్త ధర్మాన్ని నెరవెర్చిన స్థిత ప్రజ్ఞుడు వేదకుమార్. ఇలా ఉద్యమంలో దక్కన్‍ల్యాండ్ పత్రిక కీలక భూమిని పోషించింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.
సబ్బండవర్గ కళాకారులను, సాహితీవేత్తలను ఎంతగానో అభిమానించే వేదకుమార్ వారికి ఆర్థిక సహాయం చేసి తెలంగాణ సంస్కృతిని, సాహిత్యాన్ని, చరిత్రను, కళలను కాపాడడంతో తనవంతు పాత్ర పోషించారు. పత్రిక ద్వారా దక్కన్ పీఠభూమిలోని వారసత్వ సంపదను, పర్యావరణాన్ని, చెరువులను కాపాడుకోవడానికి తీసుకోవాల్సిన చర్యలను, సలహాలను పత్రిక ద్వారా వ్యాసాల రూపంలో తెలియజేస్తున్నారు.
145 నెలలుగా క్రమం తప్పకుండా ప్రతిమాసం వెలువడుతున్న మాసపత్రిక మన దక్కన్‍ల్యాండ్. కరోనా కాలంలో (లాక్‍డౌన్ సమయం) ఎంతో మంది నిపుణులను ఇంటర్వ్యూలు చేసి పాఠకులకు, ప్రజలకు ఆ సమయంలో ఎంతో ధైర్యాన్ని అందించిన పత్రిక మన దక్కన్‍ల్యాండ్. ఈ పత్రిక ఇలానే దిన దిన ప్రవర్తమానం చెందాలంటే మనవంతుగా సంవత్సరం ‘చందా’ చేసి, మన తోటి వారితోనూ చేయించి పత్రిక ఆర్థిక అభివృద్ధికి చేయూత నందించగలరని పాఠకులకు నా పిలుపు.
- సంగీతపు రాజలింగం
(సంఘ సంస్కరణల పురస్కార గ్రహీత)
ఎ : 7569588897, 630987472