అలనాడు మామంచి సర్కారీ దవాఖానాలు

మా చిన్నప్పుడు మాకు ఊఁ అంటే రోగాలు, ఆఁ అంటే రోగాలు.
మా అమ్మ మొత్తం తొమ్మిది మందిని కన్నది. పోయినోళ్లు పోంగ చివరకు మిగిలింది ఆరుగురం. మొదటి ముగ్గురు ఆడపిల్లలు. తర్వాత ముగ్గురం మొగ నలుసులం. మా అమ్మ మాటలలో మేం ముగ్గురం ‘‘పోంగ జిక్కినోళ్లం’’.
ఇంట్లో ఎప్పుడూ ఎవరికో ఒకరికి జ్వరాలు, రోగాలు. ప్రతి ఇంట్లో ఒక టి.బి.పేషంటు. మలేరియా, టైఫాయిడ్‍, పోలియో, న్యుమోనియా, కక్కుడు – కాళ్లకు పెట్టటం సర్వసాధారణం. అరవై, డెబ్బై ఏండ్ల క్రింద బడిలోని ప్రతి క్లాసులో ఎవరో ఒక పోలియో బాధిత కుంటి విద్యార్థి, మశూచి మిగిల్చిన స్పోటకం మచ్చల విద్యార్థి లేక మశూచితో ఒక కన్ను పోయిన గుడ్డి విద్యార్థో కనబడేవాడు. పోరలంతా బక్కపీనుగుల్లాగ ఉండేవారు. చాలా మంది పిల్లల కాళ్లు చేతులకు గజ్జి పుండ్లు ఉండేవి. వాటిని నశ్మీర్‍ పుండ్లు అనేవారు. టీకాల పద్దతి వచ్చినంక ఇప్పుడు బడులల్ల అటువంటి పిల్లలు కనబడటం లేదు.
ఈ రోగాల కన్నింటికీ మూల కారణం పేదరికం. సరిఐన, బలమైన పోషకాహారం లేకపోవటం. మరొకటి ఇంటా బయటా పరిసరాలు ఆ పరిశుభ్రంగా ఉండటం. ఇండ్లల్ల ఈగలు, దోమలు, నల్లులు పుష్కలంగా ఉండేవి. దానికి తోడు పట్నాలల్ల ఇరుకిరుకు ఇండ్లల్లనే పైఖానాలు. ఫ్లష్‍ టాయెలెట్లు ఇంకా రానందున మేతర్లు చీపుర్లు, చేతులతో ఎత్తి బకెట్లలో ఆ మురికిని ఎత్తుకపోయేవారు. వాళ్లు ఒక రెండు రోజులు రాకపోతే, పరిస్థితి ఘోరంగా ఉండేది. ఇల్లంతా దుర్వాసనే. ఇక వర్షాకాలమైతే మరీ అన్యాయంగా ఉండేది. ఆధునిక వాష్‍ రూంలు ఇంకా వాడుకలోకి రానందున ఇండ్లల్ల ఈగలు పుష్కలంగా తిరుగుతుండేవి. పగటిపూట ఈగలు జోపటం, రాత్రుళ్లు నల్లులను చంపటం నిత్యకృత్యంగా ఉండేది.


మరి అట్లాంటి అపరిశుభ్రపరిస్థితులలో పిల్లలకు, పెద్దలకు జ్వరాలు, రోగాలు రాకుండా ఉంటాయా? ప్రజాకవి కాళోజీ తన ఆత్మకథలో పైఖానాలలో ఊదుబత్తీలు వెలిగించుకుని కూచునేవాళ్లం అని రాసారు. బల్దియా (మున్సిపల్‍ శాఖ) ఉండేది. దాని కౌన్సిలర్లు వుండేవాళ్లు. కాని క్యా ఫాయిదా? వారి పని నామమాత్రం కావున ‘‘పాంచ్‍ సాల్‍ కా బల్దియా, ఖాయా పీయా చల్దియా’’ అన్న సామెత చెలామణీలో ఉండేది.
ఇంకా మా కాలంలో నయం. మా పెద్దల కాలంలోనైతే గత్తర, దొబ్బరోగం, ప్లేగు లాంటి రోగాలు వచ్చి జనం కుప్పలు, కుప్పలుగా చచ్చేటోళ్లు. ప్లేగు రోగంల ముందు ఎలుకలు చచ్చి తర్వాత మనుషులు పుటుక్కు, పుటుక్కు మని రాలిపోయ్యేటోళ్లు. సర్కారు వాళ్లు పుంగీలల్ల టముకు వేసి ఇండ్లు ఖాళీ చేయించి ఊరవతల మైదానాలల్ల గుడిసెలు వేయించి ప్రజలను అండ్లకు తరలించేవారు.
ఇగ మాకు జ్వరాలు రాంగనే మా అమ్మా, బాపు ఇప్పటిలాగ మొదటి రోజే డాక్టరు వద్దకు తీసుకుపోయ్యేవాళ్లు కాదు. ‘‘శతకోటి దరిద్రాలకు అనంతకోటి
ఉపాయాలన్నట్లు’’ పిల్లగాడికి ఎవరిదో దిష్టి తగిలిందని అంగలార్చుకుంట చీపురు పుల్లలకు దూది లేదా పాతబట్ట చుట్టి దాన్ని నూనెలో ముంచి, అగ్గిపుల్లతో వెలిగించి అది భగభగ మండుతుంటె, చెక్కపీట మీద చక్లముక్లం కూచున్న పిల్లవాడి తల చుట్టూ వెలుగుతున్న ఆ పుల్లల్ని తిప్పేవారు. దానితో దృష్టి దోషం తొలిగిపోతుందని ఒక మూడవిశ్వాసం.
తెల్లారి కూడా తగ్గకపోతే అమ్మ మా ఇలవేల్పు బుగులు వెంకటేశ్వరస్వామికి దండం పెట్టి ఒక పాత గుడ్డల చారానా బిళ్ల ముడుపు కట్టి పెరుమాళ్ల గూడుల ఒక మూలకు పెట్టేది. ‘‘హర్‍ దర్ద్ కా దవా జిందా తిలిస్మాత్‍’’. ఇంట్ల ఎప్పుడూ సిద్దంగా ఉండేది. నాలుగు చుక్కలు మంచి నీళ్లల్ల కలిపి త్రాగించి, నుదుటికి నాలుగు చుక్కలు రాసి మర్దన చేసి ఒక పాత గుడ్డను తలకు గట్టిగా బిగించి కట్టేవారు. తలనొప్పి తగ్గాలని. వాంతులు మొదలు కాగానే మాదిఫల రసాయనం, దగ్గు తగ్గడానికి పుక్కిట ఒక కరక్కాయను, పడిశం పోవటానికి బాగా నల్లగా కాల్చిన ఓమను గుడ్డలో బిగించి కట్టి ముక్కుతో పీల్పించటం, బాగా బేదులు జరిగి ‘‘ఆసనం’’ పచ్చిపుండుగా నొప్పి అయ్యేసరికి కాల్చిన ఇటుక రాయిపై ఒక బట్టవేసి దాని మీద కూచోబెట్టటం చేసేవారు. పిల్లలు దాని మీద కూచోడానికి లబోదిబోమని మొత్తుకునేవారు. ‘‘గోరు చుట్టు మీద రోకటి పోటు బాధ’’ అంటే అదే! పిల్లలకు మలబద్దకం ఉంటే చింతపండు వేసి బాగా మరిగించిన సోనా ముఖి ఆకు కషాయాన్ని ముక్కు మూసి, నోరు తెరిపించి బలవంతాన త్రాగించేవారు. అమ్మమ్మలు, నాయినమ్మలు అందరూ కల్సి ‘‘వంటింటి చిట్కాలన్నీ’’ పిల్లల మీద ప్రయోగించే వారు. పోలీసులు చేసే థర్డ్ డిగ్రీలాగ’’ ఆయుర్వేద వైద్యబిషక్కులు ఇచ్చే మాత్రలు ఒక్కోసారి వికటించి ‘‘నీ చేతి మాత్ర వైకుంఠ యాత్రగా’’ పరిణమించేది.


ఒక్కోసారి కొంచెం నలతగా ఉన్నా, లోజ్వరం వస్తున్నా అలియాబాద్‍ దర్వాజా దగ్గరున్న మౌల్వీసాబ్‍ దగ్గరికి తీసుకపోయేవారు. ఆయన పండు ముసలి. తెల్లటి పొడుగైన గడ్డంతో ‘‘ముల్లా నసీరుద్దీన్‍లా ఉండేవాడు. ఆయన్ని మేం ‘‘పూల తుర్కాయన’’ అనేవారం. శాలిబండా ఉతార్‍లో ఆయనకు ఒక పూల దుకాణం ఉండేది. సాయంకాలం అక్కడ కాలక్షేపానికి ఒక గంటసేపు కూచునేవాడు. అలియాబాద్‍లో ఆయన ఇంటి ముందు తడ్కలు వేసిన పందిరి క్రింద ప్రొద్దుప్రొద్దునే చాలా మంది జమ అయ్యేవారు. వారందరు రోగాలు – నొప్పులతో నవిసి నవిసి బాధపడుతున్న వారే. ఆయన ముందు ఒక పెద్ద ఇత్తడి తాంబాళం ఉండేది. అందులో సున్నం కలిపిన నీళ్లు. వచ్చిన వారి రెండు చేతుల్ని అందులో ముంచి, తన దగ్గరున్న వేప మండలతో రోగుల శరీరాలను దులిపి, లోలోపల ఏదో ఒక దువా చదివి ఎర్ర దారంతో వున్న ఒక తావీజును మెడలో కట్టేవాడు. ఒక్క పైసా కూడా వసూలు చేయకపోయేది. అదంతా ఉచిత సేవనే. ఆయన ఒక సూఫీ సాధువు అని మాకు పెద్దగయిన తర్వాత తెలిసింది. అట్లా చాలా మంది ప్లిలల మెడలలో ఆ ఎర్రదారం తాయెత్తులు వ్రేలాడుతుండేవి. ఆ తాయెత్తులు పిల్లల మెడలో ఉంటే ‘‘దుష్ట శక్తులు’’ దగ్గరికి రావని పెద్దల నమ్మకం.
ఆ రోజుల్లో కండ్లు పచ్చబడి ‘‘పస్కల రోగం’’ (జాండీస్‍) వచ్చేది. పచ్చ కామెర్ల రోగం అని కూడా అనేవారు. దానికి అలోపతీ మందుల కంటె జడీబుట్టీ మందులే బాగా పనిచేసేవి. బార్కాస్‍లో ఒక ముస్లిం కుటుంబం పొద్దున్నే రోగులకు ఆకుపచ్చ పసరు తాగించేవారు. ఇక ఆ దినమంతా ఉత్త పచ్చి పాలతోనే అన్నం తినే పత్యం. ఉప్పు, శక్కరా వేసుకోవద్దు. తెల్లారి మాంసంతో, లేదా కూరగాయలతో చేసిన బిర్యానీ తినాలి. మూడోరోజు కండ్ల పచ్చదనం పోయేది. లోపల కాలేయం పరిశుద్ద మయ్యేది. ఇది కూడా ఉచిత వైద్యమే. వారు కూడా ఒక పైసా తీసుకోరు. కాని ఆ పసరు రహస్యం చెప్పరు. పాత నగరం సైదాబాదు. జగత్‍ టాకీసు సందులో ఉండే శ్రీరాములు అనే నాయీ బ్రాహ్మణుడు, ముర్గీకా చౌక్‍లో వుండే ఒక హకీమ్‍సాబ్‍ మందులు పస్కలకు బాగా పనిచేసేవి. మా అమ్మకూడా ‘‘సొమ్మ రోగానికి’’ (ఫిట్స్) ఒక మందు తయారుచేసి ఇచ్చేది. దానితో చాలా మందికి ఆ రోగం తగ్గేది. కాని ఆ మందు రహస్యమేందో ఆమె మాకు కూడా చెప్పకుండానే కాలం చేసింది. ఎవరికైనా ఆ రహస్యం చెప్తే ఆ మందు మహాత్మ్యం పోతదట. మందు ఇక పని చేయదు. ఇప్పటికీ హైద్రాబాద్‍లో ‘‘మృగశిర’’ నాడు ఉబ్బసం జబ్బుకు ‘‘చేప మందు’’ ఇస్తారన్న సంగతి మనందరికీ తెలిసిందే కదా! ఈ దేశీయ చిట్కాలన్నీ ‘‘డాక్టర్‍ సాబ్‍ కీ దవా ఔర్‍ ఊపర్‍ వాలేకీ దువా’’ అనే విశ్వాసానికి సంబంధించినవే.
జ్వరం తగ్గనప్పుడు, రోగం వికటించినపుడు మాత్రమే అలోపతి డాక్టరు దగ్గరికి తీసుకపోయేవారు. మాకు సుస్తీ చేసినపుడు డాక్టర్‍ క్లినిక్‍ చాలా దూరం, రిక్షాల పోతే పైసల సమస్య. పైసలకు చాలా ‘‘కట్‍పిట్‍’’ అయ్యే కాలం అది. ఒకటో తారీఖు వచ్చేవకు అందరి పరిస్థితి ‘‘టన్‍టన్‍ గోపాల’’నే. మా బాపుకు సైకిలు కూడా లేదు. అమ్మా, బాపు వంతుల వారిగా మమ్మల్ని ఎత్తుకుని మోసుకుంటూ క్లినిక్‍కు తీసుకపోయేవారు. మా బాపు ఒకోసారి డాక్టరు ఫీజు కూడా ‘‘బాకీ’’ పెట్టేది. ఆనాడు మానవత్వం ఉన్న డాక్టర్లు కావున పైసల కోసం పట్టుబట్టక పోయేది. ఆఖరికి మిగిలిన, మర్చిపోయిన ఒక బాకీని నేను చాలా కాలం తర్వాత చెల్లించాను. అదొక కత.


అప్పటికింకా ప్రైవేటు దవాఖాన్‍లు హైద్రాబాద్‍ నగరంలో పుట్టనేలేదు. అన్నీ, సర్కారీ దవాఖానాలే. డాక్టర్లు రూపాయిని మాత్రమే చూడకుండా రోగిని చూసి ప్రేమా, దయతో ‘‘మరీజులకు’’ ‘‘ఇలాజ్‍’’ చేసేవారు. అంటే డాక్టర్లకు పచ్చనోట్లపై పిచ్చి ప్రేమ ఇంకా పుట్టలేదు. ఆ రోజులలో ఇంటింటికీ ‘‘క్షయ’’ (టి.బి) ఉండేది. వికారాబాదులోని అనంతగిరి కొండలలో ఒక శానిటోరియం ఉండేది. అందుకే ‘‘వికారాబాద్‍ కీ హవా ఏక్‍లాఖ్‍ కీ దవా’’ అన్న సామెత ప్రచారంలోకి వచ్చింది. అట్లనే ఎర్రగడ్డల ఉన్న టి.బి. దవఖానా కూడా చాలా మశూరు. ఈ రెండు దవాఖానాలు 1920లలోనే స్థాపించబడినాయి. ఎర్రగడ్డ మెంటల్‍ దవాఖానా 1897, జజ్గిఖానా (విక్టోరియా మెమొరియల్‍ ప్రసూతి దవాఖానా 1905), చార్మినార్‍దగ్గరి యునానీ, ఆయుర్వేదిక్‍ దవాఖానాలు 1927, ఉస్మానియా దవాఖానా 1925 అదే సంవత్సరంల గాందీ దవాఖానా, క్యాన్సర్‍ దవాఖానా, కోరంటి, నిజాం బొక్కల దవాఖాన్‍లు స్థాపించబడినాయి. ఈ బొక్కల దవాఖానా ఎన్‍.టి.ఆర్‍. టైంలో ‘‘నిమ్స్’’గా మారింది. నైజాం ఇంకా అధికారంలో ఉండంగనే చివరలో 1945ల చిన్న పిల్లల నిలోఫర్‍ ఆసుపత్రిని స్థాపించారు.
మా చిన్నతనంల చక్కర బీమారీలు, కీళ్లనొప్పులతో కుంటుకుంటూ నడిచేవారు, దిల్‍కీ బీమారీలతో హఠాత్తుగా ‘‘హరీ’’ మనే వారు ఎవరూ లేరు. ఎక్సర్‍సైజులు, ఎయిరోబిక్స్లు, ఏమీ లేవు. యోగా అనేవి సన్నాసులు ముక్కుమూసుకుని చేసుకునే ‘‘జపతపాలు’’ అనుకునేది. డైటింగ్‍ అన్న పదం ప్రజల నోళ్లల ఇంకా పుట్టలేదు. రసాయనాలు లేని కల్తీలు లేని, పురుగుల మందులు లేని ఆహారాన్ని అందరూ కడుపు నిండా మెక్కి ఒళ్లు వంచి శారీరక శ్రమ చేసేవారు. ‘‘బానిసోలె తినాలె, బంటు లాగా పని చేయాలని’’ ఆ రోజుల్లో ఒక సామెత. ఎంత దూరమైనా అందరూ ‘‘బారా నంబర్‍’’ బస్‍
ఎక్కేవాళ్లు. ‘‘కంటికి దూరమైతే కాలికి దూరమా’’ అన్న ధీమాతో బరి కాళ్లతోనే బిరబిరా నడుచుకుంటూ ఎంత దూరమైనా పోయేవారు. జర ఉన్నోళ్లైతే సైకిల్లు కొనుక్కుని ‘‘డబుల్‍ సవారీలు’’ తొక్కేవాళ్లు. రిక్షా ఎక్కటం ఒక అపురూప విలాసం. అందుకే నడిమంత్రపు కొత్తకొత్త రోగాలు అప్పటికింకా పుట్టలేదు.
ఎవైనా కాన్పులకో లేదా రోగాలతో దవాఖానాలల్ల షరీకైనారంటే మా పిల్లలందరికి పండగేపండగ. ఇన్‍పేషంట్లు ముఖం మొత్తి తినకుండా వదిలేసిన పెద్దప్దె డబుల్‍ రొట్టెలు, మోసంబీ పండ్లు, ఎర్రటి సేపులు, అప్పుడప్పుడు సీసాలల్ల పాలు – వాళ్లను చూడటానికి వెళ్లిన
పెద్దవాళ్లు సంచులల్ల వాటిని రహస్యంగా దాచి ఇంటికి తెచ్చేవారు. ఆకలి గొట్టు పిల్లలం ఆవురావురుమని, పెద్దలు ఇంట్లకు రాకముందే గద్మలల్ల వాటిమీద దాడి చేసి, పులిసిపోయిన ఆ డబుల్‍ రొట్టెలను చాయ్‍ల ముంచుకుని తినేవారం. మోసంబీ, సేపులను చాకులతో ముక్కలు చేసి అందరం సమానంగా పంచుకుని తినేవారం. ఇంట్లకు తినే పదార్థాలో, పండ్లో ఏమి వచ్చినా క్షణాలలో మా ‘‘బకాసుర కడుపుల్లోకి ’’’ మాయమయ్యేవి కాని నేటి పిల్లల్లా తర్వాత తింటాంలే అని నిర్లక్ష్యంగా ఫ్రిజ్జుల్లో పెట్టి మరచిపోయే వారం కాదు.
బాల్యంలో నేను ‘‘బక్క పీసును’’. గట్టిగా గాలివొస్తే ఎగిరిపోయే•ంత బలహీనుణ్ణి. బొక్కలన్నీ ఇవతలికే కనబడేటట్టు ఉండెటోణ్ణి. కాబట్టి ఇస్కూళ్ల ప్లిలలు నాకు ‘‘బొక్కలయ్యా’’ అని నిక్‍ నేం పెట్టినారు. వీడికి ఏమైనా టి.బి.రోగం ఉందేమోనన్న అనుమానంతో మా బాపు నన్ను చందులాల్‍ బేలా చౌరాస్తాల ఉన్న డా. వాగ్రే దగ్గరికి తీసుకపోయిండు. ఇక్కడ కొంచెం ఆ డాక్టరు గురించి చెప్పుకోవాలి. పాతనగరంలో అప్పటికే ఆయన బాగా పేరున్న డాక్టరు. ఆయన చిన్నప్పుడు కటిక పేదరికంలో ఉండి వీధి దీపాల క్రింద ఉండే అరుగులపై కూచుని చదువుకునే వాడట. మెడిసిన్‍ చదువుతున్నప్పుడు ఆ ఖరీదైన పుస్తకాలను కొనే తాహత్‍ లేక తోటి విద్యార్థులను బ్రతిమిలాడి వారిచ్చినవి చదివి మళ్లీ అన్న ప్రకారం గడువులోపల వారికి వాపస్‍ చేసేవాడట. ఆయన తన పేదరికాన్ని జీవితాంతం మరచి పోలేదు. కావున పేదలకు బీదలకు చాలా దయతో వైద్యం చేయటమే గాక అవసరమైన అతి తక్కువ మందులు రాసిచ్చేవాడు. మనిషి చాలా మెత్తన. రోగికి త్వరలో కోలు కుంటావని ధైర్యం చెప్పేవాడు.


ఈ రోజుల్లో కార్పొరేట్‍ కాలేజీలలో లక్షలు లక్షలు డొనేషన్లు కట్టి, మళ్లీ అవే కార్పొరేట్‍ హాస్పిటల్స్లో డాక్టర్లుగా పని చేస్తూ రోగిని ఒక ఏటీఎం మెషిన్‍గా చూస్తూ, చనిపోయిన వారిని ‘‘వెంటిలేటర్లపైకి ఎక్కించి’’ లక్షలు లక్షలు పిండుకునే డాక్టర్లను మనం చూస్తున్నప్పుడు డా. వాగ్రే లాంటి వారు మనకు ‘‘దేవుళ్లలాగే’’ కనబడటం సహజమే కదా!
ఆయన దయతో నన్ను పరీక్షించి ఈ పిల్లవాడికీ ఏమీ లేదు. బలమైన తిండి పెట్టాలి. పాలు, పెరుగు, నెయ్యి, రోజు ఒక గుడ్డు, గాజర్‍ గడ్డ (క్యారట్‍), రత్నపురి గడ్డ (బీట్‍రూట్‍) రసం ఇవ్వాలి. ఆకు కూరలు. మందులేమీ అక్కరలేదు అన్నాడు. ఆ తర్వాత నా ఒక్కడికే ఒక వారంపాటు రాజభోజనాలు జరిగేయి. మా ఆఖరి అక్క మా తమ్ముడు నన్ను ‘‘వర్గ శత్రువు’’గా చూడటం మొదలుపెట్టారు. ఆ వారం తర్వాత అన్నీ మళ్లీ షరా మామూలే. ఒక్క ఉడకబెట్టిన గుడ్డును నాలుగు భాగాలుగా కత్తితో కట్‍ చేసి నలుగురు పిల్లలకూ సమానంగా పెట్టే మా ఇంట్లో ఒక్కరికికే ‘‘పౌష్ఠికాహారం’’ ఇవ్వటం సాధ్యమా?
పెళ్లయిన మా పెద్దక్కకు ఒకసారి ఏదో జబ్బు చేసింది. అమ్మ ఆమెను చార్మినార్‍కు ఎదురుంగ ఉన్న ఆయుర్వేదం దవాఖానాకు తీసుకపోయింది. ఆవు వెంబడి దూడలా అమ్మ వెంబడి నేనూ వెళ్లాను. అక్కడ ‘‘మరియమ్మ’’ అనే కిరస్తానీ డాక్టరమ్మ అక్కను క్షుణంగా పరిశీలించి ఈమెను ఒక నెలరోజుల పాటు ఈ దవాఖానలో షరీకు చేసుకుంటాం సరిఐన ఆరాం, ‘‘ఖువ్వత్‍ వచ్చే ఖురాక్‍’’ (బలమైన ఆహారం) ఇవ్వాలె. మందులు సరేసరి అన్నది. ఇప్పుడే అత్తవారింటికి తోలితే పిల్ల చాకిరీతో మూలపడతదన్న భయంతో అమ్మ సరే అని ఒప్పుకుంది.
ఆ తర్వాత దయగల్ల ఆ ‘‘మేరీమాత’’ దృష్టి నా మీద పడింది. నన్ను కిందికీ మీదికి ‘‘తీక్షణంగా’’ పరిశీలించి ‘‘ఎవరీ పిల్లగాడు’’ అని అడిగింది. నా కొడుకే నమ్మా అన్నది అమ్మ ఏదో తప్పుచేసిన దానిలా. ఆమె నన్ను దగ్గరకి పిలిచి ‘‘హాలా’’తో (సెతస్కోపు) నా ఎండిపోయిన ఎదను పరీక్షించింది. క్రింది కన్రెప్పలను తెరిపించి, నాలికను బాగా చాపించి, చివరికి గోర్లనుకూడా పరిశీలించి అమ్మతో ‘‘ పిల్లగాన్కి రక్తహీనత (ఎనిమియా) జబ్బు ఉంది. ఆలస్యం చేస్తే టి.బి. అట్టాక్‍ అయితది. వీడిని కూడా ఈమెతో పాటే ఇప్పుడే షరీక్‍ చేసుకుని, అక్క పక్కలే ఇంకో మంచం ఏర్పాటు చేస్తా. చిన్న పిల్లాడే కద. జనానా ఖానాలో (స్త్రీల వార్డు) చేర్చు కోవచ్చు అన్నది.


అక్క కూడా తనకు తోడు దొరుకుతదని ఖుష్‍ అయ్యింది. కమ్మటి తిండి దొరుకుతదని అమ్మ సరే అన్నది. బడి బాధ ఉండదని నాకు కూడా ‘‘కుంటోనికి ఏనుగు ఎక్కినంత’’ సంతోషమయ్యింది.
ఇక ఆ నెలరోజులు నా రాజవైభోగం చెప్పతరం కాదు. చూసి అనుభవించితే గాని సమజ్‍ కాదు.
ఎత్తైన మంచం. దాని మీద తెల్లటి, మెత్తటి దూది పరుపు. తెల్లటి చాదర్‍. పొద్దున్నే గరం గరం చాయ్‍. ఎనిమిది గంటలకు నాస్తా. నూనె పెట్టిన మడత గోధుమ రొట్టెలల్లకు ఆలుగడ్డల కూర. ఒక గ్లాసు బర్రెపాలు. పదకొండు గంటలకు క్యారట్‍ సూపు, ఒక సేపు లేదా మోసంబీ పండు. ఒంటి గంటకు భోజనం. అన్నం, పప్పు ఉడకబెట్టిన గుడ్డు. సాయంత్రం నాల్గు గంటలకు టమాట సూపు. రాత్రి నిమిది గంటలకు గోదుమ పూల్కాలు. అంచుకు ఆకు కూరలు.
నా మంచం మీద కూర్చుని కిడ్కీ తెరిస్తే ఎదురుంగ మక్కమసీదు, కొంచెం అటుపక్క చార్మినార్‍. కన్రెప్పలు వాల్చకుండ తదేకంగా చార్మినార్‍ను పట్టిపట్టి చూస్తుంటే ఒక మహాకాయుడు తనకున్న నాలుగు చేతులు ఎత్తి అందర్నీ రారామ్మని పిలుస్తున్నట్లు చిత్తభ్రమ కలిగేది. అట్ల చార్మినార్‍తో నా ‘‘పహెలీ నజర్‍, పహెలా ప్యార్‍’’ ఖాయం ఐపోయింది.
నిజంగానే ఒక నెలరోజుల తర్వాత నేను ‘‘నిండు పున్నమి చందురుడిలా’’ ఒక వెలుగువెలిగాను.
జరుగుబాటు ఉంటే జ్వరం అంత సుఖం మరొకటి లేదు కదా!
రోజులు మారాయి. వైద్యం వ్యాపారంగ మారి శవాలమీది పేలాలు ఏరుకుని తినే పంచనక్షత్రాల కార్పొరేట్‍ ఆసుపత్రుల్నిచూస్తుంటే అలనాటి ‘‘మా మంచి సర్కారీ దవాఖానాలు’’ జ్ఞాపకం రాకుండా ఉండవు కదా!


-పరవస్తు లోకేశ్వర్‍,
ఎ: 91606 80847

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *