సుస్థిర ప్రగతికి ఊతం… బంగరు భవితకు మార్గం…!! @ రెన్యువబుల్‍ ఎనర్జీ

నింగినేల ఏకమైందా అన్న రీతిలో కుండపోత వానలూ, వరదలూ ఇటీవలి కాలంలో బాగా పెరుగుతున్నాయి. మండుతున్న ఎండలూ, ఉప్పెనలా విరుచుకుపడుతున్న వడగాలుల ధాటికి జీవరాశి చిగురుటాకులా వణుకుతోంది. ఓవైపు ధ్రువ ప్రాంతాలలో మంచుగడ్డలు తరిగిపోతోంటే మరోవైపు సముద్రమట్టాలు పెరగడమే కాదు, సాగరజలాలు వేడెక్కిపోతున్నాయి. ఇలా, విశ్వ మానవాళిపై మూకుమ్మడిగా దాడిచేస్తున్న ప్రకృతి విపత్తులకు ప్రధానకారణం శిలాజ ఇంధనాల వినియోగమేనన్నది నిష్ఠుర సత్యం. బొగ్గు, పెట్రోలియం లాంటి శిలాజ ఇంధనాల వినియోగం ఎంత పెరిగితే కర్బన ఉద్గారాలు అంతగా వాతా వరణంలోకి వచ్చి చేరుతున్నాయి. అవి భూతాపానికి కోరలు తొడుగుతూ ప్రమాదకర పర్యావరణ మార్పులకు ఆజ్యం పోస్తున్నాయి. మనదేశం కూడా పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగాన్ని పెంచడంలో గణనీయ ప్రగతిని సాధించింది. గత సెప్టెంబర్‍ 16న గుజరాత్‍లోని గాంధీనగర్‍లో దేశీయంగా పునరుత్పాదక ఇంధనరంగ విస్తరణ, పెట్టుబడుల సమీకరణ కోసం ‘‘గ్లోబల్‍ ఆర్‍ఈ-ఇన్వెస్ట్’’ సదస్సును కేందప్రభుత్వం నిర్వహించింది. ఈ నేపథ్యంలో పునరుత్పాదక ఇంధన వనరుల (రెన్యువబుల్‍ ఎనర్జీ) ప్రాధాన్యాన్ని మనం కూడా తెలుసుకుందాం.
పునరుత్పాదక ఇంధన శక్తి (రెన్యువబుల్‍ ఎనర్జీ) అంటే: ఎన్నిసార్లు, ఎంతమొత్తంలో వినియోగించినప్పటికీ ప్రకృతిలో లభించే విభిన్న వనరుల నుండి సహజ పక్రియల ద్వారా ఉత్పత్తి అవుతూ, నిరంతరాయంగా పురుద్ధరించబడే ఇంధన శక్తిని పునరుత్పాదక ఇంధనశక్తి అంటారు. పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగం వల్ల కాలుష్యం గణనీయంగా తగ్గుతుంది. ఇంధన ధరల్లో అస్థిరతలు తొలగి ఆయాదేశాలు ఇంధన రంగంలో భద్రతను, స్వావలంబనను సాధించేందుకు వీలవుతుంది.


పునరుత్పాదక ఇంధన వనరులు – రకాలు: పునరుత్పాదక ఇంధన వనరులను ఎన్నటికీ క్షీణించని శక్తి వనరులుగా పేర్కొనవచ్చు. అందువల్ల వీటికి అధిక ప్రాధాన్యత ఉంది. చమురు, సహజవాయువు, బొగ్గు లాంటి శిలాజ ఇంధనాలతో పోల్చితే వీటి పనితీరు భిన్నంగా ఉంటుంది. పురుత్పాదక ఇంధన వనరులను ఈ క్రింది విధంగా వర్గీకరించవచ్చు. అవి: 1. సౌరశక్తి 2. పవనశక్తి 3. జలవిద్యుత్‍ శక్తి 4. జియో ధర్మల్‍ ఎనర్జీ 5. హైడ్రోజన్‍ శక్తి 6. సముద్ర అలలశక్తి 7. అణుశక్తి 8. జీవ ఇంధనాలు.
i. సౌరశక్తి: సూర్యుని నుండి వెలువడే కాంతి, ఉష్ణశక్తి రూపంలో కొంత భాగము భూమిని చేరడాన్ని ‘‘సౌరపుటం’’ (insolation) అంటారు. ఈ సౌరశక్తిని మానవాళి వినియోగించేందుకు గానూ 2 రకాలుగా ఉత్పత్తి చేస్తారు. అవి: సోలార్‍ ఫోటో ఓల్టాయిక్‍ పద్ధతి 2. సోలార్‍ ధర్మల్‍ పద్ధతి

1.సోలార్‍ ఫోటో వోల్టాయిక్‍ పద్ధతి: సిలికాన్‍చే నిర్మించబడిన సౌరఫలకాలపై సూర్య కాంతిపడినట్లయితే, ఎలక్ట్రాన్లు ఉద్భవించి, చివరకి విద్యుత్‍శక్తి ఉత్పత్తి అవుతుంది. ఉదా: సోలార్‍ లాంతర్లు, సోలార్‍ కాలిక్యులేటర్లు, సోలార్‍ వీధిలైట్లు, సోలార్‍ రిఫ్రిజిరేటర్లు మొదగునవి.
భారత పునరుత్పాదక ఇంధన వనరుల మంత్రిత్వశాఖ నివేదిక ననుసరించి ఆగస్ట్ 31, 2024 నాటికి సోలార్‍ ఎనర్జీ ఉత్పత్తిలో కర్నాటక (1284.73మె.వా.), హిమాచల్‍ప్రదేశ్‍ (993.71 మె.వా.), మహారాష్ట్ర (384.28 మె.వా.)లు తొలి 3 స్థానంల్లో ఉన్నాయి.

2.సోలార్‍ ధర్మల్‍ పద్ధతి: ఈ పద్ధతిలో ఒకే ప్రదేశం వద్ద కాంతిపుంజాన్ని కేంద్రీకరించి, ఉష్ణశక్తిని ఉత్పత్తి చేసి వివిధ కార్యకాలపాలకు వాడతారు. ఉదా: సోలార్‍ బాయిలర్స్, సోలార్‍ వాటర్‍ హీటర్స్ మరియు సోలార్‍ గీజర్స్.
ii. పవన శక్తి: గాలి నుండి ఉద్భవించే శక్తిని పవనశక్తి అంటారు. ఈ పవన శక్తిని వినియోగించి ఎత్తైన గాలిటర్బైన్లద్వారా విద్యుత్‍ శక్తి ఉత్పత్తి కావడానికి గాలివేగం 18KM/H ఉండాలి. కేందప్రభుత్వం ‘‘National wind energy mission’’ను 2014లో ఏర్పాటు చేసింది. 2022 నాటికి 60వేల మెగావాట్లు లేదా 60 గిగావాట్ల పవన విద్యుత్‍ శక్తిని ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. భారత పునరుత్పాదక ఇంధన వనరుల మంత్రిత్వశాఖ నివేదిక ప్రకారం ఆగస్ట్ 31, 2021 నాటికి గుజరాత్‍ (12163.28 మె.వా), తమిళనాడు (10930.24మె.వా), కర్నాటక (6553.97మె.వా)లు పవన విద్యుత్‍శక్తి ఉత్పత్తిలో తొలి 3 స్థానాల్లో ఉన్నాయి.


iii. జలవిద్యుత్‍ శక్తి:
ప్రవహించే నీటిపై ఆనకట్టలు మరియు రిజర్వాయర్లు నిర్మించడం ద్వారా జలవిద్యుత్‍ శక్తిని ఉత్పత్తి చేస్తారు. ప్రవహించే నీటికి గతిశక్తి ఉంటుంది. ఈ నీటిని వేగంగా విద్యుత్‍ టర్బైన్ల పైకి పంపి వాటిని తిరిగేలా చేయడం ద్వారా జలవిద్యుత్‍ను ఉత్పత్తి చేస్తారు. ప్రపంచ ఇంధన వనరులలో 16.6% మరియు మొత్తం పునరుత్పాదక విద్యుత్‍లో 70% వాటాను జలవిద్యుత్‍ శక్తి కలిగి ఉంది.
మనదేశంలో జలవిద్యుత్‍ ఉత్పత్తిలో హిమాచల్‍ప్రదేశ్‍, ఉత్తరాఖండ్‍, కర్నాటక తొలి 3 స్థానాలలో ఉన్నాయి. (ఆగస్ట్31, 2024 నాటికి)
iv. జియోధర్మల్‍ ఎనర్జీ: వేడి నీటి బుగ్గలు గల ప్రదేశంలో 1000 నుండి 2000 సెంటీగ్రేడ్‍ ఉష్ణోగ్రత ఉండును. ఈ పొరలలోకి ట్యూబ్‍ను పంపి, ఉష్ణోగ్రతను నీటి ఆవిరి రూపంలోకి మార్చి, దానితో టర్బైన్లను తిప్పి విద్యుత్‍శక్తిని ఉత్పత్తి చేస్తారు. ప్రపంచంలో ఈ శక్తిని అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న ప్రాంతం కాలిఫోర్నియా (40%), మనదేశంలో పూగా లోయ (లడఖ్‍), సూరజ్‍కుంద్‍ (జార్ఖండ్‍), అలకనంద, తపోవన్‍ (ఉత్తరాఖండ్‍), మణికరన్‍, పార్వతీలోయ (హిమాచల్‍ప్రదేశ్‍)లలో జియోధర్మల్‍ ఎనర్జీద్వారా విద్యుత్‍శక్తిని ఉత్పత్తి చేస్తున్నారు.
v. హైడ్రోజన్‍ ఎనర్జీ: దీనినే 21వ శతాబ్ది ఇంధనంగా పరిగణిస్తారు. నీరు జలవిశ్లేషణ చెందినపుడు విడుదలయ్యే హైడ్రోజన్‍ అయాన్ల నుండి విద్యుత్‍ శక్తిని ఉత్పత్తి చేయవచ్చని శాస్త్రవేత్తల అభిప్రాయం. స్వాతంత్య్రం వచ్చి 75 సం।।రాలు పూర్తైన సందర్భంగా హైడ్రోజన్‍ ఎనర్జీ ఉత్పత్తిని గణనీయంగా మెరుగుపరచాలన్న ఉద్దేశ్యంతో, ప్రధానిమోదీ, నేషనల్‍ హైడ్రోజన్‍ మిషన్‍ను ప్రారంభించారు. అదేవిధంగా స్వచ్ఛమైన హైడ్రోజన్‍ కోసం మిషన్‍ ఇన్నోవేషన్‍ ఛాలెంజ్‍లో ఇండియా పాల్గొంటోంది. 2050 నాటికి భారతదేశ పునరుత్పాదక ఇంధన వనరుల విభాగంలో 3 వంతుల హైడ్రోజన్‍ శక్తిని ఉత్పత్తి చేయాలని ఇండియా లక్ష్యంగా నిర్దేశించుకుంది.
vi. సముద్ర అలలు శక్తి: సముద్ర అలలు ఎగసిపడే ప్రాంతాలలో విద్యుత్‍ టర్బైన్లు అమర్చి, వాటిని తిరిగేలా చేయడం ద్వారా విద్యుత్‍ను ఉత్పత్తి చేస్తారు. ఈ విధానం ద్వారా మనదేశంలో విద్యుత్‍శక్తిని ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉన్న ప్రాంతాలు 1. ట్యుటికోరిన్‍ (తమిళనాడు), 2.విజింజం (కేరళ), 3. అండమాన్‍ మరియు నికోబార్‍దీవులు 4. లక్షద్వీప్‍ 5. సుందర్‍బన్స్ (పశ్చిమబెంగాల్‍)
vii. అణుశక్తి: ఈ విధానంలో ధోరియం, యురేనియం లాంటి ఖనిజాలతో కేంద్రక విచ్ఛిత్తి పక్రియద్వారా అణురియాక్టర్లతో విద్యుత్‍శక్తిని ఉత్పత్తి చేస్తారు. మనదేశంలో ప్రస్తుతం 22 అణురియాక్టర్లు పనిచేస్తున్నాయి. ప్రస్తుతం మనదేశంలో ఉత్పత్తి అవుతున్న అణువిద్యుత్‍ సామర్థ్యం 6780 మె.వా. ఇది మొత్తం శక్తి ఉత్పత్తిలో 2.1%గా ఉంది.
viii. జీవ ఇంధనాలు: జీవుల చేత తయారయ్యే ఇంధనాలను జీవ ఇంధనాలు అంటారు. అవి 1. బయోడీజిల్‍ 2. బయో ఇథనాల్‍ 3. బయోగ్యాస్‍ 4. బయోమాస్‍. మనదేశంలో మొదటి జీవ ఇంధన విధానం 2008లో ప్రకటించగా, తిరిగి 2018లో కొత్త జీవ ఇంధన విధానాన్ని ప్రకటించారు. దీనిని తిరిగి 2022లో సవరించారు. ప్రతి ఏటా ప్రపంచ జీవ ఇంధన దినోత్సవాన్ని ఆగస్ట్ 10న నిర్వహిస్తారు.


పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధికి ప్రభుత్వం చేపట్టిన చర్యలు:
పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధికి ప్రభుత్వం కింది చర్యలు చేపట్టింది.

1.పీఎల్‍ఐ స్కీమ్‍: దీనినే ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక విధానం (ప్రొడక్షన్‍ లింక్డ్ ఇన్సెంటివ్‍ స్కీమ్‍) అంటారు. మనదేశంలో తయారీరంగ పనితీరును మెరుగుపరచడానికి ప్రభుత్వం తీసుకువచ్చిన మెరుగైన పథకంగా దీనిని చెప్పవచ్చు. తయారీరంగంలో పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించడానికి, తగిన ఆర్థిక ప్రోత్సాహకాన్ని అందించడానికి ఈ పథకం సహాయ సహకారాలు అందిస్తుంది.

2.పీఎమ్‍- కుసుమ్‍ (PM-KUSUM): దీనినే ప్రధానమంత్రి -కిసాన్‍ ఊర్జా సురక్షాఏవం ఉత్థాన్‍ మహాభియాన్‍గా పిలుస్తారు. ఈ పథకం ద్వారా 2022 నాటికి 25,750 మెగావాట్ల సౌరశక్తిని అందుబాటులోకి తీసుకురావడం ద్వారా రైతుల యొక్క నీటి పంపులను సోలారైజేషన్‍ చేసి రైతులకు ఆర్థిక మరియు నీటి భద్రతను అందించాలని ప్రభుత్వం లక్ష్య నిర్దేశం చేసుకున్నది.

3.IRIX: మనదేశానికి చెందిన మినిస్ట్రీ ఆఫ్‍ న్యూ అండ్‍ రెన్యువబుల్‍ ఎనర్జీ తన వెబ్‍సైట్‍ ద్వారా అక్షయ్‍ ఊర్జాపోర్టల్‍, మరియు ఇండియా రెన్యువబుల్‍ ఐడియా ఎక్సేంజ్‍ (IRIX) పోర్టల్‍లను నిర్వహిస్తోంది. IRIX అనేది ఇండియా మరియు గ్లోబల్‍ కమ్యూనిటి మధ్య ఆలోచనల మార్పిడిని ప్రోత్సహించడానికి, ఇంధన సహకారాన్ని పెంపొందించడానికి తోడ్పడుతుంది.

4.నేషనల్‍ సోలార్‍ మిషన్‍: ఇది 2010లో ప్రారంభించబడింది. ఇది గ్రిడ్‍ కనెక్ట్ మరియు ఆఫ్‍ గ్రిడ్‍ సోలార్‍ పవర్‍ ప్రాజెక్ట్లతో కలిపి సోలార్‍ పవర్‍ ప్రాజెక్ట్లను స్థాపించడం ద్వారా సోలార్‍ ఎనర్జీ ఉత్పత్తిని మెరుగు పరిచేలా లక్ష్య నిర్దేశం చేసుకుంది.

5.గ్రీన్‍ ఎనర్జీ కారిడార్లు: గ్రీన్‍ ఎనర్జీ కారిడార్‍ ప్రాజెక్టు జాతీయ గ్రీడ్‍లో పునరుత్పాదక ఇంధనాన్ని ఏకీకృతం చేయడానికి, ట్రాన్స్మిషన్‍ ఇన్‍ ఫాస్ట్రక్చర్‍ను మెరుగు పరచడంపై దృష్టి పెడుతుంది.

6.నేషనల్‍ విండ్‍ ఎనర్జీ మిషన్‍: భారతదేశంలో పవనశక్తి అభివృద్ధి మరియు విస్తరణపై దృష్టి సారిస్తుంది. 2030 నాటికి పవనశక్తి సామర్థ్యం 140 గిగావాట్లకు చేరాలని లక్ష్య నిర్దేశం చేసుకోవడం జరిగింది.

7.నేషనల్‍ క్లీన్‍ ఎనర్జీ ఫండ్‍: గ్రీన్‍హౌస్‍ వాయు ఉద్గారాలను తగ్గించడంలో సహాయపడే క్లీన్‍ ఎనర్జీ టెక్నాలజీలు మరియు ప్రాజెక్ట్లలో పరిశోధన మరియు ఆవిష్కరణలకు మద్దతు ఇవ్వడానికి దీనిని ప్రవేశపెట్టారు.

8.రెన్యువబుల్‍ పర్చేజ్‍ ఆబ్లిగేషన్‍ (RPO): ఈ విధానం ద్వారా విద్యుత్‍ పంపిణీ సంస్థలు మరియు పెద్ద విద్యుత్‍ వినియోగదారులు తమ శక్తిలో కొంత శాతాన్ని పునరుత్పాదక ఇంధన వనరుల నుండి స్వీకరించాల్సి ఉంటుంది. తద్వారా ఈ పథకం పునరుత్పాదక ఇంధన రంగంలో డిమాండ్‍ను ప్రోత్సహిస్తుంది.

9.ఇంటర్నేషనల్‍ సోలార్‍ అలయన్స్ (ISA): సౌరశక్తి వినియోగాన్ని ప్రోత్సహించడం ద్వారా తమ ఇంధన అవసరాలు తీర్చుకోవడానికి, సౌర వనరులు అధికంగా ఉన్న దేశాల కూటమి అయిన ఇంటర్నేషనల్‍ సోలార్‍ అలయెన్స్ను స్థాపించడంలో భారతదేశం కీలక పాత్ర పోషించింది.


పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధికి రాబోయే 5 సం।।రాలకు ఇండియా నిర్దేశించుకున్న లక్ష్యాలు:
1.ట్విన్‍ ఛాలెంజ్‍: ప్రస్తుతం మనదేశ అవసరాలకు లభిస్తున్న ఇంధనం కన్నా అధికంగా ఇంధన వనరులను సమకూర్చడంతో పాటు, స్వచ్ఛమైన ఇంధనాన్ని సమకూర్చడం అన్న అంశాలు మనదేశానికి జంట సవాళ్ళుగా మారాయి. నిరుద్యోగ నిర్మూలనతో పాటు, మనదేశంలోని గృహ సముదాయాలకు వికేంద్రీకృత ఇంధనాన్ని సమకూర్చేందుకు గాను మనదేశం ఆత్మ నిర్భర్‍ భారత్‍ కింద సోలార్‍ ప్యానెల్స్ తయారీపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. తయారీ రంగ పురోగతినే కాకుండా మొత్తం సరఫరా గొలుసుల వ్యవస్థను కూడా సంస్కరించాల్సిన అవసరం ఉంది.

2.మిథనాల్‍ అండ్‍ బయోమాస్‍: శిలాజ ఇంధనాల వాడకం నుండి ఇంధన రంగాన్ని బయోమాస్‍ వంటి జీవ ఇంధనాల వైపు పరివర్తన చెందించేదిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. తద్వారా మన నగరాలు కాలుష్య రహితంగా మారడంతో పాటు, ఇంధన రంగంలో స్వావలంబన సాధించవచ్చు. జీవ ఇంధనాలనేవి అధిక కెలోరిఫిక్‍ విలువను కలిగిఉండి శిలాజ ఇంధనాలతో పోల్చితే అధిక స్వచ్ఛతను కలిగి ఉంటాయి. 2025-26 నాటికి పెట్రోల్‍లో 20% ఇధనాల్‍ కలపాలని బయోప్యూయల్‍ పాలసీ-2018 లక్ష్య నిర్దేశంగా ఉంది. అదేవిధంగా మిధనాల్‍ను కూడా భవిష్యత్‍ ఇంధనంగా వినియోగించాలని ఇండియా సంకల్పిస్తోంది. 2030 నాటికి 10% క్రూడ్‍ ఆయిల్‍ దిగుమతులను మిథనాల్‍తో భర్తీ చేయాలని నీతి ఆయోగ్‍ రోడ్‍మ్యాప్‍ రూపొందించింది.

3.హైడ్రోజన్‍ ఆధారిత ప్యూయల్‍ సెల్స్ వెహికల్స్: హైడ్రోజన్‍ ఆధారిత ఇంధనాల సృష్టి అనేది పురుత్పాదక ఇంధన వనరుల ముఖ చిత్రాన్నే సమూలంగా మార్చే అవకాశం ఉంది. ఇందులో భాగంగా హైడ్రోజన్‍ ఆధారిత బ్యాటరీలు తయారు చేసి వాటిని వాహనాలలో వినియోగించే దిశగా పరిశోధనలు జరుగుతున్నాయి.


గ్రిడ్‍ ఇంటిగ్రేషన్‍:

దీనిని గ్రిడ్‍కు విభిన్న రకాల పునరుత్పాదక ఇంధన వనరులను అందించడానికి అవసరమైన సమర్థవంతమైన మార్గాలను అభివృద్ధి చేసే పద్ధతిగా చెప్పవచ్చు.
పునరుత్పాదక ఇంధన వనరులు-ప్రయోజనాలు:
i. తక్కువ నిర్వహణ ఖర్చు: పవనశక్తి, జీవశక్తి లేదా సౌరశక్తి వంటి పునరుత్పాదక ఇంధన వనరుల నిర్వహణ ఖర్చు దాదాపు శూన్యమని చెప్పవచ్చు. తద్వారా పనిగంటలు పెంచుకొని కార్మిక వ్యయాన్ని తగ్గించుకోవచ్చు.
ii సుస్థిరం మరియు పర్యావరణ అనుకూలం: ఈ రకమైన ఇంధనాలు పీఎం 2.5 లేదా పీఎం 10 లాంటి కార్బన్‍ ఆధారిత హానికర ఉద్గారాలను మరియు కార్బన్‍డైఆక్సైడ్‍, నైట్రోజన్‍ ఆక్సైడ్‍ లాంటి గ్రీన్‍హౌస్‍ వాయువులను వెలువరించవు. అందువల్ల ఇవి పర్యావరణానికి ఎలాంటి హాని కలిగించవు. తద్వారా సుస్థిరాభి వృద్ధికి తోడ్పడతాయి.
iii. బహుళ లక్ష్యాలను చేరుకునే అవకాశం: పునరుత్పాక ఇంధన వనరులు ఉద్యోగసృష్టికి తోడ్పడడంతోపాటు పంచామృత లక్ష్యాలు, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు, మేక్‍ ఇన్‍ ఇండియా పారిస్‍ ఒప్పందం వంటి జాతీయ, అంతర్జాతీయ లక్ష్యాల కనుగుణంగా మెరుగైన పనితీరును ప్రదర్శించేందుకు ప్రభుత్వానికి తోడ్పాటునందిస్తాయి.
iv. వికేంద్రీకరణ: ఇంధన డిమాండ్‍ ఎక్కడ ఎక్కువగా ఉంటుందో, అక్కడే పునరుత్పాదక ఇంధన వనరుల ప్లాంట్లను స్థాపించవచ్చు. ఉదా।। కేంద్రపాలిత ప్రాంతమైన డామన్‍ తన ఇంధన అవసరాల న్నింటిని ఆ నగరంలోని సోలార్‍ ఎనర్జీ ప్లాంట్ల ద్వారా తీర్చుకుంటూ, నేషనల్‍ గ్రిడ్‍పై ఆధారపడడాన్ని వీలైనంత తగ్గిస్తోంది.
v. ప్రైవేటు రంగానికి ప్రోత్సాకం: 2030 నాటికి పునరుత్పాదన ఇంధన వనరుల ద్వారా 500 గిగావాట్ల విద్యుత్‍ ఉత్పత్తిని సాధించాలని లక్షిస్తోంది. ఇది కేవలం ప్రభుత్వం ద్వారానే సాధ్యం కాదు. డిజైన్‍ మరియు తయారీలో ప్రైవేటు రంగానికి ఇది విస్త•తమైన అవకాశాలను కల్పించడంతో పాటు పెద్ద ఎత్తున లాభాలను కూడా అందిస్తుంది.


సవాళ్ళు:
i. అధిక ప్రారంభ సంస్థాపన వ్యయం: బొగ్గు ఆధారిత విద్యుత్‍ ప్లాంట్లతో పోలిస్తే గాలి ఆధారిత విద్యుత్‍ ప్లాంట్లకు అధిక ప్రారంభ పెట్టుబడులు అవసరమవుతాయి. 25% సామర్థ్య వినియోగంతో 1 మెగావాట్‍ ఇంధన ఉత్పత్తికి రమారమి 6కోట్లు ఖర్చువుతుందని అంచనా.
ii. స్టోరేజీ ఇన్‍ఫాస్ట్రక్చర్‍: పునరుత్పాదక ఇంధన వనరుల సరఫరాలో అంతరాయాన్ని అధిగమించడానికి సరసమైన, అధిక సామర్థ్యం గల బ్యాటరీల ఉత్పత్తికి పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉంది.
iii. సామాజిక వినియోగంలో పరిమితులు: సోలార్‍ వాటర్‍ హీటర్లు, లైటింగ్‍ సిస్టమ్స్ లాంటి పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం భారీగా సబ్సిడీలు ఇస్తున్నప్పటికీ, మనదేశ సామాజిక వ్యవస్థ పునరుత్పాదక ఇంధన వనరుల వినియోగానికి ఇంకా అలవాటు పడలేదు.
iv. బలహీనమైన దేశీయ తయారీ సామర్థ్యం: దిగుమతులపై ఆధారపడడాన్ని తగ్గించడానికి, ఇంధన రంగంలో స్వావలంబన సాధించడానికి, మెరుగైన ఉపాధి అవకాశాల కల్పనకు బలహీనంగా ఉన్న దేశీయ తయారీ సామర్థ్యాన్ని మెరుగుపరచడం ఎంతైనా అవసరం.


భారతదేశంలో రెన్యువబుల్‍ ఎనర్జీ స్థాపిత సామర్థ్యం:
ఆగస్ట్, 2024 నాటికి మనదేశం యొక్క పునరుత్పాదక ఇంధన వనరుల (పెద్ద తరహా జలవిద్యుత్‍శక్తితో కలిపి) స్థాపిత సామర్థ్యం 199.52 గిగావాట్లుగా నమోదు అయింది.
భిన్న రంగాల వారీగా వాటి వివరాలు కింది విధంగా ఉన్నాయి.
విండ్‍ పవర్‍-47.19 గి.వా, సోలార్‍ పవర్‍-89.43గి.వా బయోమాస్‍/ కోజనరేషన్‍-10.35గి.వా., స్మాల్‍ హైడ్రోపవర్‍- 5.07 గి.వా., లార్జ్ హైడ్రోపవర్‍-46.92గి.వా., వ్యర్థ పదార్థాల ఇంధనశక్తి-0.60గి.వా.
రెన్యువబుల్స్ గ్లోబల్‍ స్టేటస్‍ రిపోర్ట్-2024 ప్రకారం, పునరుత్పాదక ఇంధన స్థాపిత సామర్థ్యంలో ఇండియా ప్రపంచంలో 4వ స్థానంలోనూ, పవన విద్యుత్‍లో 4వ స్థానం, సోలార్‍ విద్యుత్‍లో 5వ స్థానంలో నిలిచింది.


భారతదేశంలో రెన్యువబుల్‍ ఎనర్జీ స్థాపిత సామర్థ్యంలో పెరుగుదల:
భారతదేశం యొక్క శిలాజేతర ఇంధన సామర్థ్యం గత 8.5 సం।।రాలలో 396% పెరిగింది. అణు మరియు పెద్ద తరహా జలవిద్యుత్‍తో కలిపి ఉత్పత్తి 207.76 గి.వా. కంటే ఎక్కువగా ఉంది. ఇది దేశం యొక్క మొత్తం సామర్థ్యంలో 46%గా ఉన్నట్లు అంచనా. UNFCCవారి COP 26 (గ్లాస్గో2021) సమావేశానన్ననుసరించి మనదేశం 2030 నాటికి 500 గి.వా. పునరుత్పాదక ఇంధన వనరులను ఉత్పత్తి చేయాలని లక్షిస్తోంది. పంచామృత్‍ ప్రతిజ్ఞ ననుసరించి పునరుత్పాదక ఇంధన వనరుల ఉత్పత్తిలో ప్రపంచంలోనే అతిపెద్ద విస్తరణ ప్రణాళికను మనదేశం అనుసరిస్తోంది.


రెన్యువబుల్‍ ఎనర్జీలో పరుగులు పెడుతున్న భారత్‍- ప్రధానిమోదీ
రెన్యువబుల్‍ ఎనర్జీలో మనదేశం వడివడిగా ముందడుగు వేసేందుకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలు సత్ఫలితాలనిస్తున్నాయని ప్రధాని మోదీ అన్నారు. ఇందులో భాగంగా హై ఫెర్మామెన్స్ బయోమాన్యుఫాక్చరింగ్‍ని ప్రోత్సహించడానికి ‘ౖ‘కొత్త బయో జు3’’ (బయోటెక్నాలజీ ఫర్‍ ఎకానమీ, ఎన్విరాన్‍మెంట్‍, ఎంప్లాయ్‍మెంట్‍) విధానం ఆమోదించామని తెలిపారు. ఇంకా ఆఫ్‍ షోర్‍విండ్‍ ఎనర్జీ ప్రాజెక్ట్ల కోసం వయబులిటీగ్యాక్‍ ఫండింగ్‍ పథకం కింద 7000 కోట్ల రూ।।లు కేటాయించారు. ఎలక్ట్రిక్‍ మొబలిటీ మరియు హైఫెర్ఫామెన్స్ బయోమాన్యుఫాక్చరింగ్‍ కొరకు 1 ట్రిలియన్‍ రూ।।ల పరిశోధన నిధి ఏర్పాటు చేశారు. పారిస్‍ ఒప్పందం నిర్దేశించిన పునరుత్పాదక ఇంధన లక్ష్యాలను నిర్దేశించిన గడుపుకన్నా 9సం।।రాల ముందుగానే లక్ష్యాన్ని చేరుకున్న తొలి జీ20 దేశంగా భారత్‍ నిలిచిందని ప్రధాని శ్లేఘించారు.
చివరిగా: పదేళ్ళుగా రెన్యువబుల్‍ ఎనర్జీలో దూకుడుగా ముందుకెళుతున్న చైనా ప్రధానంగా సౌర విద్యుదుత్పాదనలో మిగిలిన దేశాలకు అందనంత ఎత్తులో నిలుస్తోంది. ఏడాదిలో 300 రోజులు సౌరశక్తి అధికంగా ప్రసరించే ఇండియాలో సోలార్‍ విద్యుత్‍ ఉత్పత్తి అపార అవకాశాలున్నాయి. రకరకాల నిబంధనలు, ఖరీదైన ఉపకరణాల కారణంగా గ్రామీణ ప్రాంతాలలో సౌర విద్యుత్‍ ఫలకాల ఏర్పాటు ఆశించినంత వేగంగా సాగడంలేదు. సరఫరా వ్యవస్థల నిర్మాణంలోని ఇబ్బందులు పవనవిద్యుత్‍కు ఆటంకాలవుతున్నాయి. వాటిని పరిష్కరించడంతో పాటు పట్టణ భారతంలో పోగు పడుతున్న చెత్తను సద్వినియోగం చేసుకోవడం, జీవ ఇంధన తయారీని జోరెత్తించడం తదితరాలపై ప్రభుత్వాలు నిశితంగా దృష్టి సారించాలి. తద్వారా మనదేశం ఇంధన రంగంలో స్వావలంబన సాధించడంతో పాటు, ఉద్యోగ ఉపాధి అవకాశాలు సిద్ధించి, ప్రజారోగ్యం కూడా మెరుగుపడుతుంది.


-పుట్టా పెద్ద ఓబులేసు,
స్కూల్‍ అసిస్టెంట్‍, జిల్లా పరిషత్‍ ఉన్నత పాఠశాల
రావులకొలను, సింహాద్రిపురం, కడప
ఎ : 955029004

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *