ఉనికి: తమిళనాడు, భారత్
ప్రకటన తేదీ: 1987, ఎక్స్ టెన్షన్ 2004
కేటగిరీ: సాంస్కృతికం (గ్రూప్ ఆఫ్ మాన్యుమెంట్స్)
సార్వత్రిక విలువ:
ఈ సైట్ సామాన్య శకం 11 -12వ శతాబ్ది కాలానికి చెందిన, చోళ సామ్రాజ్యపు మూడు గొప్ప ఆలయాలను కలిగి ఉంది. గంగైకొండచోళీశ్వరమ్ వద్ద బృహదీశ్వరాలయం ఉంది. ఇది 53 మీటర్ల ఎత్తయిన గాలిగోపురాన్ని కలిగిఉంది. గోపురానికి గల మూలలు, పై దిశగా చెక్కి ఉండే నిర్మాణం ఈ గోపురం ప్రత్యేకతలుగా ఉన్నాయి. తంజావూరు లోని బృహదీశ్వరాలయం గోపురంతో పోలిస్తే నిర్మాణంలో, ఎత్తులో, దానికి కాస్తంత భిన్నంగా ఉంటుంది. దారాసురం లోని ఐరావతేశ్వర ఆలయం 24 మీటర్ల గాలిగోపురం, శివుడి రాతి విగ్రహాన్ని కలిగిఉంటుంది. కళ, ఆర్కిటెక్చర్ రంగాల్లో చోళులు సాధించిన అద్భుత విజయాలకు ఈ ఆలయాలు నిదర్శనాలుగా ఉంటాయి.
ప్రాథమ్యాలు: (i), (ii), (iii), (iv)
(i): ఈ మూడు ఆలయాలు కూడా ద్రావిడ ఆలయ రకానికి చెందిన వాస్తు శిల్ప కళావైభవానికి అద్దం పడుతాయి.
(ii): తంజావూరు లోని బృహదీశ్వరాలయం చోళ ఆలయాలకు అత్యంత గొప్ప నిదర్శనంగా నిలిచింది. మిగితా రెండు ఆ తరువాతి స్థానాల్లో నిలిచాయి.
(iii): ఈ మూడు ఆలయాలు కూడా ఉత్కృష్టతకు నిదర్శనంగా నిలిచాయి. చోళ సామ్రాజ్యం వాస్తు శిల్ప కళా వైభవానికి, దక్షిణ భారతదేశంలో తమిళ నాగరికతకు తార్కాణాలుగా ఉన్నాయి.
(iv): ఈ ఆలయాలు చోళ భావజాలానికి తిరుగులేని ప్రాతినిథ్యం వహిస్తున్నాయి.
చోళ సామ్రాజ్యం దక్షిణ భారతదేశంలో రూపుదిద్దుకుంది. సామాన్య శకం తొమ్మిదో శతాబ్దం నుంచి పదమూడో శతాబ్దం దాకా విలసిల్లింది. హిందూ మహాసముద్రం నుంచి ఆగ్నేయాసియాలోని ప్రాంతాల వరకూ తన ప్రభావాన్ని విస్తరించింది. సాహిత్యం, కళలు, ఆర్కిటెక్చర్ రంగాలను అమితంగా ఆదరించడంలో చోళ చక్రవర్తులు ప్రసిద్ధి చెందారు. చోళ చక్రవర్తులు సుమారుగా 300 దాకా ప్రసిద్ధ ఆలయాలను నిర్మించారు. చోళ ఆలయ శిల్పకళ అత్యున్నత సాంకేతిక, కళానైపుణ్యాలు కలిగిఉంది. మరీ ముఖ్యంగా ఈ మూడు ఆలయాలు వాటి తిరుగులేని సాంకేతిక, కళా నైపుణ్య విలువలకు పేరొందాయి.
ప్రసిద్ధ చోళ చక్రవర్తి రాజరాజ 1 సుప్రసిద్ధ బృహదీశ్వరాలయాన్ని నిర్మించాడు. శివుడు కొలువైన ఈ ఆలయం పదకొండో శతాబ్దం నాటిది. ఈ ఆలయంలో ఉన్న శాసనాలను బట్టి నాటి చోళ రాజులు ఆలయాలకు ఎంతో ఉదారంగా దానధర్మాలు చేసినట్లుగా తెలుస్తోంది.
తంజావూరులో ఉన్న ఆలయ కాంప్లెక్స్ కందాకాలు, ప్రవేశద్వారాలను కలిగిఉంది. ప్రధాన ఆలయం వరుసగా ఎన్నో మండపాలను కలిగిఉంది. నంది మండపం, ముఖ మండపం, మహా మండపం, అర్థ మండపం, అంతరాలయం, గర్భగృహాలు వీటి ఉన్నాయి. వీటికి తోడుగా పొడుగాటి వసారాలు ఉన్నాయి. దీని గొప్పదనం దీన్ని భారతదేశంలో ఇప్పటి వరకూ ఉన్న ఆలయాల్లో అత్యంత గొప్పదిగా చేసింది. ఆలయ శిఖరం ఎత్తు 61 మీటర్లు. ఇది 13 అంతస్తులతో ఉంటుంది. శిఖరం పై భాగంలో 25 టన్నుల బరువైన అమల్క ఉంటుంది. ఇది 81 టన్నుల బరువైన గ్రానైట్ శిలపై ఉండడం విశేషం. ఈ శిలలను ఎక్కడో ఉన్న క్వారీలనుంచి ఏనుగుల సాయంతో దొర్లించుకుంటూ తీసుకువచ్చారని, వాటిని శిఖరంపైకి చేర్చేందుకు ఎంతో మంది కార్మికులు పని చేశారని, సుమారుగా 6.5 కిలోమీటర్ల దూరం నుంచి తాత్కాలిక ర్యాంప్ ఏర్పాటు చేసి ఉంటారని భావిస్తున్నారు. ఇది ఆనాటి ఇంజినీరింగ్ నైపుణ్యాలకు తార్కాణంగా నిలుస్తోంది. బృహదీశ్వరాలయం అక్కడ ఉన్న శిల్పాలకు, గర్భగృహ వృత్తాకార మార్గం లోని పెయింటింగ్స్కు కూడా బాగా పేరొందింది.
రాజరాజ1 కుమారుడైన రాజేంద్ర1 తంజావూరుకు వాయువ్యంగా 55 కిలోమీటర్ల దూరంలో మరో రాజధాని నగరాన్ని నిర్మించాడు. దాన్ని గంగైకొండ చోళేశ్వరంగా వ్యవహరించారు. గంగను జయించిన చోళుడి నగరం అని ఆ పదానికి అర్థం. ఇక్కడ ఉన్న ఆలయం కూడా చోళ శిల్పకళకు బాగా ప్రఖ్యాతి చెందింది. ఆలయం దక్షిణ భాగంలోని చండేశ్ అనుగ్రహ విగ్రహం బాగా ప్రసిద్ధి చెందింది. నటరాజు, సరస్వతితో ఉన్న బ్రహ్మ, సావిత్రి, మహిషాసుర మర్దిని, నాట్యం చేస్తున్న గణేశుడి విగ్రహాలు కూడా ఆలయ గోడలపై ఉన్నాయి.
చోళుల పాలనకు దారాసురం కూడా మరో ప్రధాన కేంద్రంగా ఉంది. చోళులకు సంబంధించి ప్రసిద్ధి చెందిన మూడో ఆలయం కూడా ఇక్కడే ఉంది. ఇక్కడ కొలువుదీరింది ఐరావతేశ్వర. దీన్ని నిర్మించింది రెండో రాజరాజ. పన్నెండో శతాబ్ది మధ్య కాలంలో దీన్ని నిర్మించారు. మిగితా రెండింటితో పోలిస్తే, ఇది కాస్తంత చిన్నది. ఈ ఆలయం చుట్టూరా భారీ ప్రాకారం ఉంది. ఇక్కడ ఉన్న మండపం మిగితా రెండింటి మాదిరిగా గాకుండా, చెక్కిన స్తంభాలతో కూడిన మందిరంగా, రెండు భాగాలుగా ఉంటుంది. అగ్ర మండపం తరువాత అర్థ మండపం ఉంటుంది. ఆ తరువాత అంతరాళం, గర్భగృహ ఉంటాయి. అగ్ర మండపం వద్ద గుర్రాలు లాగుతున్న రథాన్ని చెక్కారు. లింగోద్భవ శిల్పం బాగా ప్రసిద్ధి చెందింది. కైలాసాన్ని కుదిపేస్తున్న రావణుడి శిల్పం కూడా ఉంది. శివపార్వతులు, నటరాజ, యోగా భంగిమల శిల్పాలు బాగా పేరొందాయి. ఈ మూడు చోళ ఆలయాలు కూడా ఏఎస్‍ఐ రక్షణ, నిర్వహణలో ఉన్నాయి.
జాహ్నవీజ్ శర్మ
అనువాదం : ఎన్. వంశి