సంగారెడ్డి జిల్లా పటాన్-చెరు మండలంలో ఇంద్రేశం, ఐనోల్, కర్దనూర్, క్యాసారం, చిట్కుల్, చిన్నకంజర్ల, నందిగావ్, పాటి ఘన్‍పూర్, పాశమైలారం, పెద్దకంజర్ల, పోచారం, పటాన్‍చెరు, బచ్చుగూడ, భానూర్, ముతంగి, ఇస్నాపూర్, రామేశ్వర్‍బండ, రుద్రారం, లక్దారం గ్రామాలున్నాయి. గ్రామనామాలను విశ్లేషిస్తే ఎక్కువమట్టుకు శైవసంబంధమైన పేర్లే ఎక్కువ.
ఇంద్రేశంలో చరిత్రపూర్వయుగం నుంచి ఈ ప్రాంతంలో మానవుల ఆవాసాలుండేవని తెలిపే ఆధారాలు కొత్తరాతియుగం మానవులు తమ రాతిగొడ్డండ్లకు పదునుపెట్టుకున్న నూరుడు గుంటలు దొరికాయి.
వేల సంవత్సరాల మనిషి చరిత్ర ఇక్కడుంది. బుద్ధుని కాలంలోనే బౌద్ధం వచ్చిందిటువైపు. మౌర్యసామ్రాజ్యం, సాతవాహన, ఇక్ష్వాక, వాకాటక, విష్ణుకుండిన, బాదామీచాళుక్య, రాష్ట్రకూట, కళ్యాణీ చాళుక్య, కాకతీయ, ముసునూరు నాయక, వెలమనాయక, బహమనీ, మొఘల్, ఆజంజాహీలందరి పాలనలో ఉన్నది ఈ ప్రాంతం.
ఒకప్పుడు రాష్ట్రకూటుల నుంచి చాళుక్యుల పాలనదాక రాజపోషణలో జైనమత ప్రాభవం వుండేదిక్కడ. చాళుక్య చక్రవర్తి జయసింహుని(జగదేకమల్లుడు, క్రీ.శ.1014-1044) భార్యలలో ఒకరైన సుగ్గలదేవి శైవభక్తురాలు. రాజేమో జైనమతానుయాయి. జైనులకు బసదులు కట్టించడం, జైనమునులకు, జైనశ్రావకులకు ప్రాధాన్యతనివ్వడం, వారికోసం రాజధనం వెచ్చించడంతో జైనం రాజాశ్రయ మతంగా అతిశయించడం ఇష్టంలేని శైవమతగురువులు రాణితో శైవమతాన్ని కాపాడాలని కోరారు. రాణి రాజును శైవమతానికి ఆశ్రయం కల్పించమని, శైవమతగురువులు గొప్పవారని నిరూపిస్తానన్నది. రాజు జైనులు ఓడిపోయిన పక్షంలో తాను శైవం స్వీకరిస్తానన్నాడట. శైవగురువు గెలవడంతో మాటప్రకారం రాజు జైనులను వెళ్ళగొట్టాడట. జయసింహుడు శైవుడైనాడట. శైవమతస్తులు 800మంది జైనులను హింసించి, చంపి, వారి 500 జైనబసదులను(దేవర దాసమయ్య) కూల్చారని గొప్పగా చెప్పుకున్నారు. (పండితారాధ్య చరిత్ర) కాలక్రమంలో రాష్ట్రకూటులనోడించిన పశ్చిమ/కళ్యాణీ చాళుక్యులు ఈ ప్రాంతపాలకులైనారు. వారిలో చాలామంది జైనాన్ని పోషించారు. కొందరు చాళుక్యులు మాత్రం శైవమతానికి ప్రాధాన్యతనిచ్చారు.
జయసింహుని తర్వాత రాజ్యానికి వచ్చిన త్రైలోక్యమల్లుని కాలంలో ఆరాధ్యశైవ గురువుల పేరన పంచమఠస్థాపన చేసి, పోషణకు దానాలు చేయడంతో అక్కడ శైవమత కేంద్రం ఏర్పడ్డది. అక్కడ జైనులకు, కాలాముఖులకు నిత్యసంఘర్షణలు జరుగుతుండేవి. 1034లో జగదేకమల్లుడు(జయసింహుడు) ముచ్చెనపల్లి గావుండాగా అగ్గలయ్య వినతిమేరకు యాదాద్రి-భువనగిరి జిల్లాలోని ఇక్కుర్తి, ముచ్చెనపల్లిలలోని రెండు జైనబసదులకు దానాలు చేసినట్లు సైదాపురం శాసనం చెప్తున్నది. పటాన్-చెరు ప్రాంతంలో జైనమతావలంబకులు ఎక్కువగా ఉండడం చేత గ్రామాలపేర్లలో కొన్ని జైనమత సంబంధమైన పేర్లతో గ్రామాలు ఏర్పడ్డాయి. అటువంటి గ్రామమే ఇంద్రూరు. శైవమత ప్రాభవం పెరిగిన తర్వాత అది ఇంద్రేశంగా మారింది. భట్టారక నామం జైనంతో ఎక్కువగా ముడివడివుండే పేరు.
ఇంద్రేశంలోని దేవాలయ నిర్మాణవాస్తు, శిల్పాలశైలిని పరిశీలించినపుడు అవి ఎక్కువగా బాదామీ చాళుక్యులు, రాష్ట్రకూటులు, కళ్యాణీ చాళుక్యుల కాలాలకు చెందినవిగా గుర్తించడం జరిగింది.
చిన్న పరుపురాతిబండమీద కట్టిన శివాలయానికి ముందర ప్రవేశం కొరకు నిలిపిన దేవాలయ ద్వారతోరణాలు రెండు వేర్వేరు కాలాలవి. మొదటి ద్వారతోరణం శైలిరీత్యా ఈ ద్వారతోరణం రాష్ట్రకూటులకాలానిదే. జైనదేవాలయ ప్రవేశద్వారమని చెప్పవచ్చు.
ద్వారస్తంభానికి ద్వారపాలక స్థానంలోని శిల్పం ద్విభుజి. కుడిచేతిలో తామరమొగ్గ, ఎడమచేతిలో కలశం ధరించి త్రిభంగిమలో నిల్చున్న ద్వారపాలికకు స్తూపపట్టకిరీటం/జటామకుటం? వుంది. మెడలో హారం వుంది. చెవులకు వేలాడుతున్న జూకాలున్నాయి. చేతులకు కంకణాలున్నాయి. కాళ్ళకు కడియాలున్నాయి. అర్ధనగ్న దేహం. ఈమె నదీదేవత అని చరిత్రకారుడు ఈమని శివనాగిరెడ్డిగారి అభిప్రాయం. ద్వారానికి రెండోవైపు గణపతి శిల్పముంది. తలపై కిరీటమకుటంతో, లలితాసనంలో కూర్చుని వున్న గణపతికి నాలుగు చేతులు. ముందర కుడిచేతిలో విరిగిన దంతం, ఎడమచేతిలోని మోదకాన్ని అందుకుంటున్న తొండంతో, ఉదరంపై నాగబంధంతో గణేశుడు అగుపిస్తున్నాడు. ఈ తోరణద్వారస్తంభం ఒకదాని మీద శాసనం వుంది. దీనిని అచ్చుతీసి పరిష్కరించవలసి వుంది.
రెండవ తోరణ ద్వారంపై అంచున చూరుకు చెక్కిన 15గూటిశిల్పాలున్నాయి. తోరణదూలానికి కిందివైపు 5మొగ్గలు (డ్రాప్స్) వున్నాయి. ఈ ఐదు బొడిపెలవలె కాక దిమ్మెలరీతి చెక్కిన వీటి నడుమ ఆరు అర్ధవలయా లున్నాయి. ఈ తోరణద్వారానికి ద్వారస్తంభాలు ఉత్తరాశిని కలిపేచోట రెండువైపుల 4సింహాల బ్రాకెట్లున్నాయి. ఈ సింహాల నోట్లోంచి బయటకు వస్తున్న నాలుకలను రెండు ముందరికాళ్ళతో పట్టుకున్నాయి. ఆ నాలుకలు లతలుగా, వైవిధ్యమైన రూపాలతో వాటి వెనుకకాళ్ళకిందదాకా సాగాయి. సింహాల తలలు పైనున్న తోరణం పై దూలాన్ని మోసే భారవాహకులుగా బ్రాకెట్లలో పెట్టబడ్డాయి. స్తంభాలపై నలువైపుల కుడులు, కీర్తిముఖాల నుంచి జారుతున్న ముత్యాల సరులు, నాలుగుకొసలకు హంసలుగా అవతరిస్తున్న లతలు, కింద హంస, పుష్పాలు, రెండు హంసలతోకలు కలిసిన శ•ంగం, వాటి తోకల లోపల మళ్ళీ రెండు హంసలతో కూడిన రాష్ట్రకూట చిహ్నం చెక్కబడ్డాయి. దానికిరువైపుల మళ్ళీ హంసలే. హంసలను రాష్ట్ర కూటులు దేవాలయాల ప్రస్తరాలలో, గోడల మీద, స్తంభాల మీద చెక్కించారు. ఇది వారి ప్రత్యేకమైన శైలి. కాకతీయతోరణాలకు ముందరి కాలానికి, వాటికి ఆదర్శప్రాయమైన ద్వారతోరణాలు ఈ ప్రాంతంలో నందికంది, వెల్దుర్తులలో వున్నాయి.
ధ్వజస్తంభం: ఈ స్తంభానికి పైన వుండవలసిన మంటపపుగూడు లేదు. స్తంభం కిందివైపు 4పలకలు, మధ్యలో 8పలకలు, పైన గుండ్రంగా వుంది. స్తంభానికి రాతివేదిక అమర్చివుంది. ఈ పధ్ధతి, ఈ స్తంభశైలి మనకు జైనమానస్తంభాలలోనే కనిపిస్తుంది. జైనమానస్తంభాలు కొలనుపాకలో, అక్కడికి సమీపంలోని అమ్మనబోలులో కనిపిస్తాయి.
నందులు: ఇక్కడ దేవాలయ ప్రాంగణంలో మూడునందులు కనిపిస్తున్నాయి. రెండు నందులు ముక్కలుగా విరిగిపోయి వున్నాయి. ఒక నంది శిల్పంలో మూతిలేని నందితల మూపురం వరకు విరిగిన ముక్క వుంది. నంది రత్నాలంకృత ముఖపట్టం మీద కీర్తిముఖం బిళ్ళ వుంది. మెడలో వేలాడుతు కనిపిస్తున్న గంటలపట్టెడ, దానికి లోపల మెడకు కట్టిన పూసలదండ కనిపిస్తున్నాయి. రెండవ నంది కూడా సరిగ్గా మొదటి నందిలెక్కనె మూపురం వరకు విరగగొట్టబడివుంది. నంది ముఖపట్టం అలంకృతమై వుంది. పిడికెడు కొమ్మలు, చెవులు రిక్కించి వున్నాయి. మెడలో రెండు వరుసల పూసలదండ వుంది. కొంచెం గంటలపట్టెడ అంచు కనిపిస్తున్నది. నంది నడుము భాగం కొంచెం దూరంలో వుంది. నందిమూపుమీద నుంచి ముందుకు మెడకు, వెనుకకు తోకకిందుగా కట్టిన గంటల పట్టెడ శైలి చాళుక్యశైలి అనిపిస్తున్నది. మూడవ నంది దెబ్బతినకుండా సంపూర్ణంగా వున్న శిల్పం. చక్కని ముఖవర్చస్సు, ముఖంమీద కట్టిన పట్టం, పిడికెడు కొమ్ముల కిందనుంచి కట్టిన పట్టికకు గొలుసులకన్నెలు తోరణాల రీతిగా అలంకరించబడివున్నాయి. చిన్న చెవులు. నంది మెడలో ముడులు కట్టిన రెండువరుసల తాడు వుంది. చక్కటి నంది మూపురం వెనక దర్బముడి వేసిన పెద్దగంటల పట్టెడ మెడకిందనుంచి వేలాడుతున్నది. ముడిచిన వెనకకాళ్ళ మీద కూర్చుని ముందరి కాళ్ళమీద ఒరిగిన నంది. చక్కని శిల్పకళ. ఇది బాదామీ చాళుక్యుల శిల్పశైలి.
సప్తమాతృకలు: యజుర్వేదంలోని 16వ అధ్యాయం శతరుద్రీయ హోమమంత్రాలలో 24వ మంత్రం ‘ఉత్కృష్ట సేవికలతో కూడిన బ్రాహ్మీ మొదలైన మాతృకలకు వందనం. బాధించు సామర్థ్యంగల దుర్గ మొదలైన మాతృకలకు వందనం’ అంటుంది. చతుష్షష్టీ యోగినులలోని సప్తమాతృకలు అర్థదేవతలు, యుద్ధదేవతలని తంత్రసారం చెప్తున్నది. పరిపాలకులైన బాదామీ చాళుక్యుల నుంచి కళ్యాణీచాళుక్యుల వరకు తాము సప్తమాతృకాపరిరక్షితులమని చెప్పుకున్నారు. ఇంద్రేశంలో సరస్వతి, వినాయకులతో కూడిన సప్తమాతృకల శిల్పపట్టిక వున్నది. ఈ మాతృకాశిల్పపట్టిక బాదామీచాళుక్యులు లేదా రాష్ట్రకూటులనాటిది కావచ్చు.
భట్ట వినాయకుడు: ఇంద్రేశంలో చెరువుకట్టమీది రాతిగుండుపై చెక్కివున్న ఒక శాసనాన్ని పురావస్తుశాఖ మెదక్ జిల్లా శాసన సంపుటిలో 104వ శాసనంగా 209వ పేజీలో ప్రచురించారు. ఈ సంస్కృతభాషా శాసనంలో ‘‘శంకరదాసి వీణాచార్య జోగీశ్వరభట్ట గణపతిని ప్రతిష్టించి’’నట్లు చెప్పబడింది. (10-11వ శ.) జైనాన్ని అణిచి వేయడంలో పేరుగన్నవారు కూడా శంకరదాస పేరుతో వుండడం గమనార్హం.
శాసనపాఠం:
శ్రీసంకర, 2. దాసి వీ, 3. ణాచార్యం, 4. జోగీశ్వర, 5. భట్ట గణ, 6. పతి ప్రతి, 7.ష్టితా క్రితం
సరస్వతి శిల్పం: సరస్వతి విగ్రహం శకలమైంది. సరస్వతిదేవి చేతుల్లో అంకుశం, పాశం, పుస్తకం కనిపిస్తున్నాయి. అక్షమాల వుండే కుడిచేయి విరిగిపోయింది. సిద్ధాసనంలో పద్మపీఠంపై కూర్చుని వుంది దేవత. జైన సరస్వతి శిల్పమిది.
నాగశిల్పాలు: ఇంద్రేశంలో 3తలల నాగశిల్పం, జంటనాగుల శిల్పం, 7పడగల నాగశిల్పం అగుపిస్తున్నాయి. కుడిచేతిలో పుష్పం, ఎడమచేతిలో జలపాత్రతో, రెండువైపుల నాగులతో కనిపిస్తున్న ఈ నాగదేవత యక్షిణి అనిపిస్తున్నది. చెరువుకట్ట రాతిగుండుకు కూడా నాగులబొమ్మలు చెక్కివున్నాయి.
శివలింగం: చతురస్రాకారపు పానవట్టం తొడిగివున్న 9అడుగుల శివలింగం బయటపడివున్నది. లింగంమీద బ్రహ్మసూత్రం వుంది. చాళుక్యశైలి శివలింగమిది.
త్రిపురసంహారమూర్తి: ఇంద్రేశం దేవాలయం గోడమీద కనిపిస్తున్న నటరాజ తాండవశిల్పం వుంది. శివుడు మూడుతలలతో కనిపిస్తున్నాడు. కుడిపక్క బ్రహ్మ, ఎడమపక్క విష్ణువు, శివుని కుడికాలివైపు వినాయకుడున్నారు. తాండవ భంగిమలో నిల్చున్న శివుని ఎడమవైపు ఆరుచేతులలోని ఆయుధాలలో విల్లు ప్రధానంగా కనిపిస్తున్నది. కుడివైపు ఆరు చేతులలోని ఆయుధాలలో బాణం కనిపిస్తున్నది. ఇది త్రిపురసంహారమూర్తి శిల్పమే. ఎర్లీ కాకతీయ శైలి.
దశానన తాంత్రిక స్వచ్ఛంద భైరవుడు:
ఇదొక అరుదైన తాంత్రికమూర్తి. 10తలలు(దశాననుడు), 20 (వింశతి హస్తుడు) చేతులు, చేతులలో ఖడ్గం, ఖేటకం, పరశువు, ముద్గరం, ఢమరుకం, గంట, వజ్రం, విల్లు, బాణం, రక్తపాత్ర, ఖట్వాంగం, త్రిశూలం, చక్రం, పాశం, అంకుశం, శిరస్సు, (వీణ)వంటి 17 ఆయుధాలున్నాయి. కుడివైపు రెండవ చేతిలో అక్షమాల ప్రత్యేకం. ముందు కుడిచేయి అభయహస్తం. ఎడమచేయి ముద్రపట్టినట్లున్నది. వీరాసనంలో కూర్చున్న శైవమూర్తి కుడికాలికింద అసుర శిరస్సు, మడిచిన ఎడమకాలికింద రెండు శిరస్సులున్నాయి. మూర్తికి ఉదరబంధం, మెడలో నాగహారం, భుజాల మీద నుంచి ముండ(కపాల)మాల కనిపిస్తున్నాయి. కుడివైపు కుడికాలిపై ఎడమకాలు వేసి కూర్చున్న కాలాముఖగురువు ఎడమ చేయెత్తి వ్యాఖ్యానముద్రపట్టి, అతని కిందవైపు కనిపిస్తున్న శిష్యునికి స్వచ్ఛందభైరవ తంత్రాన్ని ఉపదేశిస్తున్నట్లున్నాడు. భైరవమూర్తి చుట్టు తోరణం చెక్కినట్లు కనిపిస్తున్నది. చెరువుపక్క రాతిగుండుకు చెక్కివున్న ఈ దశాననభైరవుని శిల్పం స్వచ్ఛందతంత్ర భైరవమూర్తి.
‘స్వచ్ఛంద భైరవచ్చండః క్రోథ ఉన్మత్త భైరవః గ్రంథాంతరాణి చత్వారి మంత్రపీఠం వరాననే’ (స్వచ్ఛంద తంత్రం-212) అంటుంది తంత్రశాస్త్రం. ఇపుడీ స్వచ్ఛందతంత్ర భైరవుడు ఒక మంత్రపీఠానికి చెందినవాడని శాస్త్రార్థం చెప్పుకోవచ్చు.
జైన దేవాలయ ద్వారస్తంభం: ఈ దేవాలయ పరిసరాల్లో లభిస్తున్న విడివిగ్రహాలలో నాగుల శిల్పాలతో పాటు జైనాలయ ద్వారానికి ఎడమవైపున నిలిపిన స్తంభం లోపలి అంచు మీద 11మంది జైనతీర్థంకరులు వరుసగా ఒకరి కింద మరొకరి ప్రతిమలు చెక్కివున్నాయి. రెండవవైపు కూడా 11మంది తీర్థంకరులను చెక్కిన కుడి ద్వారస్తంభముండి వుంటుంది. ఇంద్రేశంలో తొలుత జైన దేవాలయం వుండేదని, కాలక్రమంలో దానిని తొలగించి, శివాలయం కట్టివుంటారని తెలుస్తున్నది.
పద్మపీఠం: ఒక చతురస్రాకారపు రాతిబిల్లమీద వికసిత అష్టదళపద్మం చెక్కివుంది. దీనిమీద ఒక గుండ్రని రాతితొలి లోతుగా, మరి రెండు లోతుతక్కువ 4అంచుల తొలులున్నాయి. తొలులనుబట్టి ఆసనస్థితిలో వున్న ప్రతిమను ప్రతిష్టించివుండాలి. జైనతీర్థంకరుని ప్రతిమ వుండేదేమో.
వైష్ణవమూర్తి శిథిల శిల్పం: బయట దొరుకుతున్న శిథిల, జీర్ణ శిల్పాలలో ఒక విరిగిన పాదాల జత కనిపించింది దానికింద ఉన్న రాతిపీఠం ఎదుటి అంచుమీద గరుడుని శిల్పం ఛాయగా కనిపిస్తున్నది. ఆ పాదాలకు ఎడమవైపు విరిగిన మరొక శిల్పం కాలు సగం కనిపిస్తున్నది. ఈ పీఠం వెనక ఒక స్త్రీ దేవతామూర్తిని చెక్కిన తోరణస్తంభంలోని కొంతభాగం కనిపిస్తున్నది. వీటిని కలిపి చూసినపుడు ఈ ఇది వైష్ణవమూర్తి విగ్రహమున్న పీఠమని, ఇవన్నీ ఆ శిథిల శిల్పంలోనివే నని అర్థమవుతుంది.
- ఇంద్రేశంలో పెద్ద రాతిగుండుకే ఒకచోట సూర్యచంద్రులు, పొడవైన లగుడం బొమ్మ గీసి వున్నాయి. సూర్య, చంద్రుల కింద ఒక పంక్తి లిపి కనిపిస్తున్నది. సూర్య, చంద్రులు, లిపి కనిపిస్తే శాసనం అని గట్టిగా చెప్పొచ్చు.
- వైవిధ్యభరితమైన శిల్పాలతో ఇంద్రేశం ఒక చారిత్రకక్షేత్రం. జైన, శైవమతాల ప్రాభవ, పతనాలను ఒకేచోట దాచుకున్న కాలనాళిక.
ధన్యవాదాలు: ‘ఇంద్రేశం’ మీద మోనోగ్రాఫ్ తేవడానికి సంపూర్ణ సహకారమందించిన చరిత్రకారుడు, రచయిత, భాస్కరుని వేంకట భద్ర గిరీశ్ గారికి(కెమికల్ ఇంజనీర్, కాలుష్య నియంత్రణ మండలి, తెలంగాణ ప్రభుత్వం). ఫోటో కర్టెసీ: బీవీ భద్రగిరీశ్, చౌడం పురుషోత్తం, వేముగంటి మురళీకృష్ణ, డా. ఈమని శివనాగిరెడ్డిగార్లకు.
- శ్రీరామోజు హరగోపాల్, ఎ : 99494 98698