ఎం.ఎస్‍. ఆచార్య

మాడభూషణం శ్రీనివాసాచార్య అనే పేరు చాలా మందికి పూర్తిగా తెలియదు. అందరికీ ఆయన ఎం.ఎస్‍.ఆచార్యగా మాత్రమే తెలుసు. ఆయన వరంగల్లు పత్రికారంగపు కురు వృద్ధులు. ‘మాట కటువు మనసు వెన్న’ అని చాలమంది విజ్ఞులచేత ప్రశంసించబడ్డ ఆచారిగారితో మాట్లాడుతున్నప్పుడు కాస్త ఒళ్ళూ మనసూ దగ్గరపెట్టుకుని స్ప•హతో మాట్లాడ్తే మంచిది అని ఎవరికి వారు తడుముకునేట్టు చేస్తూనే ఎన్నడూ ఎవరినీ భయపెట్టకనే భయపెట్టిన అమృత హృదయుడు. నాకు తెలిసి ఆయన అచ్చమైన మహా మానవుడు. నా వెంటబడి అద్భుతమైన కవిత్వాన్ని రాయించి, దాన్ని ‘జనధర్మ’ పత్రికలో సీరియలైజ్‍ చేసినారు.


‘ఇదేమిటి సార్‍.. కవిత్వాన్ని సీరియలైజ్‍!’… అనంటే… ‘ఔను!… నవలలనే చేయల్నా… మనం కవిత్వాన్ని కూడా సీరియలైజ్‍ చేసి… కవిత్వ సౌందర్యాన్ని కూడా చాటి చెబుదాం’’ అని చేసి చూపి… దాన్ని ‘శిలలు వికసిస్తున్నాయి’ అన్న మార్మిక మకుటంతో పుస్తకంగా వెలువరించారు. ఎం.ఎస్‍.ఆచార్య సాహసి. ప్రయోగశీలి, శ్రమజీవి. దేనికోసమూ వెంపర్లాడని నిరాడంబరుడు. నిరామయుడు.
కె.పి.ఎన్‍.రోడ్‍లో ‘జనధర్మ’ ఆఫీస్‍… అంటే… ముందు గది దర్వాజా దగ్గరే ఒక టేబుల్‍ ముందు కూర్చుని చెవుల్లో వినికిడి యంత్రంతో నిరంతరం అక్షరాలతో కుస్తీపడ్తూ ఒక యోగిలా కనిపించే ఆచార్య. వెనుక శృతిలా శబ్దిస్తూ అచ్చు యంత్రం… దాంతో కుస్తీ పడ్తూ ఇద్దరు వర్కర్స్… మా యెల్దండి రమేషో… (ఇప్పుడు ఆంధ్రజ్యోతి విలేకరి) లేక మా శ్రీధరో… (ఇప్పుడు భారత ప్రభుత్వ సమాచార హక్కు కమీషనర్‍)… అప్పుడప్పుడు మా రాజగోపాలాచారో (ఇప్పుడు విశ్రాంత ప్రొఫెసర్‍) కనిపించేవారు. ఎందుకో నాకు అక్కడికి వెళ్ళినప్పుడల్లా సర్వసతీ పాదమంజీరాల మృదుమధుర ధ్వని వినిపిస్తున్నట్టనిపించేది. ఎప్పుడూ ఎవరో ఒకరు సాహిత్య కారుల సందర్శనమే అక్కడ… కోవెల సంత్కుమార గారో, సుప్రసన్నగారో, కొండబత్తిని జగదీశ్వరరావుగారో, కొండొకచో కాళోజీగారో… అది అక్షర క్షేత్రం. ఎం.ఎస్‍.ఆచార్య అంతటా జ్ఞాన పరిమళం. ‘జనధర్మ’ వారపత్రిక నడుస్తూ నడుస్తూ… ‘జనధర్మ సాహిత్య ప్రత్యేక సంచికగా’ ముస్తాబవుతూండడం… దానికి మహామహులు తమ తమ రచనల్ని పంపుతూండడం… నాలాంటి నూనూగు మీసాల యువ కవులు తాజా వ్యాసాలనూ, రచనలనూ అప్పటికప్పుడు చదివే భాగ్యానికి మురిసిపోవడం… ఆచారిగారి అనుగ్రహంతో నేనుకూడా ఆ పెద్దలతో సమంగా అక్షర పంక్తిలో చేరిపోవడం… ‘‘మౌళీ… నీ కథ… నీ కవిత వీళ్ళకంటే ఏం తక్కువగా ఉందిరా… విజృంభించు…’’ అని ఆచారిగారు వెన్ను తట్టడం జరిగేది. ఆయన ఏ కొద్ది ప్రతిభ ఉన్న ఏ అక్షరకారునికైనా చేయందించి ప్రోత్సహించాడు. పరిష్ఠులైన రచయితలెందరో కె. జగదీశ్వరరావు… దేవులపల్లి సుదర్శనరావు, బి. నాగేశ్వరరావు, తురగా కృష్ణమోహనరావు, వరవరరావు, అంపశయ్య నీవన్‍, కోవెల సంపత్కుమార, కోవెల సుప్రసన్న, పేర్వారం జగన్నాథం, డా. ఇందుర్తి ప్రభాకరరావు, సురమౌళి, హీరాలాల్‍ మోరియా, తురగా జానకీరాణి, డా. మాదిరాజు రంగారావు, ప్రముఖ జర్నలిస్ట్లు డి. సాయిబాబా, టంకశాల అశోక్‍, యం. శ్రీధర్‍ రచనలు విరివిగా వచ్చేవి. ప్రతి రెండు నెలకొకసారి వెలువడే ‘జనధర్మ ద్వైమాసిక సాహిత్య పత్రిక’ నొకదాన్ని ఆచార్యగారు సుప్రసన్న గారి సంపాదకత్వంలో తెచ్చేవారు. అది రాష్ట్ర స్థాయిలో ఎంతో ప్రామాణికంగా వెలుగొందేది. దాంట్లో ఒక రచన వచ్చిందంటే… అప్పటి ప్రామాణిక పత్రిక ‘‘భారతి’’లో వచ్చినంత పొంగిపోయేవారు రచయితలు.


సాహిత్యంలో అనేకానేక ప్రయోగాలు కూడా చేశారు ఆచార్యగారు. ప్రముఖ రచయితలైన కె.ఎల్‍.నరసింహారావు, సింగరాజు లింగమూర్తి, గోపాలశాస్త్రి, మునిమాణిక్యం, నరసింహారావు, రావూరి భరద్వాజ గార్లతో గొలుసుకట్టుగా ‘పెళ్లి ముచ్చట్లు, పేచీలు, బస్తకాపురం, మరికొన్ని పేచీలు, స్వగ్రామానికి’ అన్న ఉపశీర్షికలతో రచించిన సమగ్ర నాటకాన్ని ప్రచురించి, ఒక కథా వస్తువును తీసుకుని వివిధ రచయితలు ఏ విధంగా విచిత్రమైన మలుపులు త్రిప్పి సమగ్రపరుస్తారనేదానికి నిదర్శనంగా ప్రయోగాత్మక జమిలి రచనను వెలువరించారు. ఐతే ఈ మొత్తం నాటకం పేరు ‘గిలిగింతలు’. (27-7-1961 నుండి 7-9-1961 దాకా ప్రచురితం). ఇది బహుళ జనాదరణ పొందింది.


ఎం.ఎస్‍. ఆచార్య గారి జీవితంలోకి తొంగి చూస్తే కొన్ని పరమ సత్యాలు గోచరిస్తాయి మనకు. అవి 1) మనిషికి జీవితం జన్మతః ఒక ఘటనగా సంభవించినా ‘ఎరుక’, ‘స్పృహ’ ఉన్న మనిషి తన జీవితాన్ని తనే నిర్మించుకోవచ్చని. 2) తన మనస్తతత్వాన్ని బట్టి చిత్తశుద్ధితో, క్రమశిక్షణతో, ఒక కార్యాచరణ ప్రణాళికతో గనుక మనిషి ప్రయత్నిస్తూ పోతే తప్పక లక్ష్యించిన జీవితాన్ని మనిషి తప్పక పొందగలుగుతాడని. 3) జీవితంలో మనిషి ఎక్కడా రాజీ పడకుండా కూడా అద్భుతంగా జీవించవచ్చని 4) అంతిమంగా మనిషి జీవితాన్ని ఒక ‘ఉత్సవ’ సదృశంగా జీవించవచ్చని.
బయట బాగా డబ్బున్న పెట్టుబడిదారుల ఆధిపత్యంలో దినపత్రికలు నడుస్తున్న 1980లలో.. సరియైన అర్థబలమూ, అంగబలమూ లేని ఆచార్య గారు తనకు అత్యంత అంతరంగికులైన ఎం. వీరాస్వామి గారిని, వసతి కోసం బేతి నర్సయ్య గారినీ, ఆలోచనా లోచనంగా, అక్షయ తూణీరంగా కొండబత్తిని జగదీశ్వరరావు గారినీ నమ్ముకుని వరంగల్లు జన జీవనంతో పెనవేసుకున్న తన అర్రద ప్రేమతో, అనుబంధంతో వరంగల్లు నగరంలో వెలవరించిన మొట్టమొదటి దినపత్రికగా ‘జనధర్మ’ ద్వై వారపత్రిక. అది ‘వరంగల్లు వాణీ’గా అవతరించింది. అప్పుడు ఆ అడుగు ఎంతో సాహసోపేతమైనదే కాకుండా ఆశ్చర్యకమైంది కూడా.


ఒక వ్యక్తి గురించిన విజయాలగురించి తెలుసుకోవడం కంటే ముందు ఆ వ్యక్తి అసలు బతకడమెలా నేర్చుకున్నాడో తెలుసుకోవడం అత్యంత స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. మా భూషణం శ్రీనివాసాచార్య సూర్యాపేటలో 3 అక్టోబర్‍ 1924న జన్మించారు. బాల్యమంతా వెల్లికుదురులో గడిచింది. వారిది పండితుల కుటుంబం. లక్ష్మీకటాక్షం లేదుగాని అందరూ సరస్వతీ పుత్రులే. తన నాన్నగారి దగ్గరే చిన్ననాడు సంస్క•తం నేర్చుకున్నారు. శబ్ద మంజరి, బాల రామాయణం, ధాతు మంజరి, రఘువంశం, కుమార సంభవం, మేఘ సందేశం, పంచోపనిషత్తులు, తిరుప్పావై వంటి ఆధ్యాత్మిక విద్యలన్నీ కంఠోపాఠమైపోయిన తర్వాత ఇక వాస్తవ జీవిత పఠనంలోకి ప్రవేశించారు. అప్పుడు సూర్యపేట కేంద్రంగా ఉవెవ్వత్తున సాగుతున్న ‘తెలంగాణా రైతాంగ సాయుధ పోరాటానికి’ రాష్ట్ర నాయకులైన దేవులపల్లి వెంకటేశ్వరరావుతో పరిచయం ఏర్పడి. . యువకుడైన ఆచార్య గారిలో ఉద్యమ స్ఫూర్తి రగిలి ‘సంగం’ పని మీద నల్గొండ జిల్లాలోని చందుపట్ల, రేపాల, టేకుమట్ల, వల్లభాపురం, నకిరేకల్‍ మొదలైన పలు గ్రామాల్లో పర్యటించేవారు. మనసునిండా అట్టుడుకుతున్న రజాకార్ల దేశ్‍ ముఖ్‍ల దౌర్జన్యాల ప్రతిఘటనేచ్చ.. మరోవైపు కేన్సర్‍ వ్యాధితో తల్లిగారి మరణం. ఆ కారణాలవల్ల కుటుంబమంతా ఉదర పోషణార్థం వరంగల్లుకు చేరుకుని… ఇక జీవికాన్వేషణ.


మొదట డాక్టర్‍ లక్ష్మణ్‍ సా పవార్‍ వద్ద నెలకు 12 రూపాయల జీతంపై కాంపౌండర్‍ ఉద్యోగం. తర్వాత బ్చెవాలా శ్రీ రాజన్‍ సా గారితో పరిచయమేర్పడి సికిందరాబాద్‍ ప్రయాణం. నెలకు 15 రూపాయల జీతం. దూరప్రాంతాలకు వ్యాపార నిమిత్తం పర్యటనలు.. చివరికి మళ్ళీ ఉమర్జీకర్‍ యొక్క ‘హిందూ సేవా సంఘం’ను వరంగల్లులో స్థాపించటానికి తిరిగి వరంగల్‍కు ప్రయాణం. యువజన ఆర్గనైజేషన్స్ నిర్వహణోల ‘ప్రతాప రుద్ర దళం’ ఏర్పాటు. ఖత్రీల పాఠశాలలో అధ్యాపక వృత్తి. నెలకు 25 రూపాయల జీతం… ఇలా.. ‘రోలింగ్‍ స్టోనే’ కాని గ్యాథరింగ్‍ సం మాస్‍.. చివరికి విధి ఆయన్ను పత్రికా రంగం వైపు తరిమింది. ముస్త్యాల శంకర్‍రావు రూపంలో వచ్చి, అప్పుడు ప్రాచుర్యమున్న ‘ఆంధ్ర పత్రిక’ ఏజంట్‍గా 1948లో… అటు తర్వాత అదే ‘ఆంధ్ర పత్రిక’కు విలేఖరి. అప్పుడు రోజూ 23 కాపీలు అమ్మే పత్రికను 1450 కాపీలు అమ్మే పత్రికగా తీర్చి దిద్ది… విజృంభించారు. అప్పుడు మదరాసు నుండి వచ్చే ‘ఆంధ్రపత్రిక’ కట్టల్లో నిజాంకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటానికి మద్దతుగా.. రహస్యంగా కొన్ని కరపత్రాల కట్టలను ఉద్యమకారులకు అందజేయుట.. ఇక్కడ వృత్తికీ, ప్రవత్తికీ మధ్య ఘర్షణ… అప్పుడప్పుడు పోలీసులకు పట్టుబడటం. మళ్లీ బయటకు రావడం ఈ లోగా ‘ఆపరేషన్‍ పోలో’ పోలీస్‍ చర్య.. నిజాం లొంగుబాటు.. అప్పటికి పి.వి.నరసింహారావు, పాలములపర్తి సదాశివరావు గారలు నడుపుతున్న ‘కాకతీయ పత్రిక’లో కొన్నాళ్లు పని చేయడం… ఈ పరంపరలో 1958 నవంబర్‍లో ముస్త్యాల శంకరరావు, యాదగిరి ఆర్య, దివ్వెల హనుమంతరావు, ఎం.ఎస్‍.ఆచార్య… నలుగురూ కలిసి ‘జనధర్మ’ వారపత్రికను ప్రారంభించారు. తర్వాత క్రమంగా ఒక్కరొక్కరు వాళ్ళ వ్యక్తిగత కారణాలవల్ల విడిపోవడంతో ఆచార్య గారొక్కరే 1971లో బాలాజీ ప్రింటింగ్‍ ప్రెస్‍ను ఆరంభించి.. ఒంటరి ప్రయాణం.


సర్వస్వతంత్ర, స్వావలంబన అన్న అతి మూలమైన స్వేచ్ఛకు సంబంధించిన అంశాల స్వాధీనతతో ఇక ఆచార్యగారు తనదైన పద్దతిలో పత్రికను నడిపి అనతికాలంలోనే వరంగల్లు పౌరుల్లో ‘జనధర్మ’ అంటే మన పత్రిక అన్న ఆత్మీయ భావనను పాదుకొల్పగలిగి తన పదునైన సంపాదకీయాలతో రాష్ట్ర స్థాయి సంపాదకులకు ధీటుగా వెలువరిస్తూ వరంగల్లు పేరునూ, కీర్తినీ, ప్రతిష్టనూ ఇనుమడింపజేశారు.
ఆ తర్వాత 1971లో ‘వరంగల్లు వాణి’ ఆవిర్భావం’ ఆచార్యగారి స్వప్న సాక్షాత్కరమే.
ముందే చెప్పినట్టు… ఆయన కలం పదునైనది. వాక్కు దారుణా ఖండల శస్త్ర తుల్యమైనది. అందుకే పచ్చి నిజాలను బహిర్గత పరిచే ఆయన నిజాయితి కొందరికి నచ్చేది కాదు. ఐనా నిప్పు తన దహించే గుణాన్ని మార్చుకోదుగదా.


వ్యక్తి ప్రతిభ ఎప్పుడూ తను పనిచేస్తున్న కార్యస్థానాన్నిబట్టి ప్రాచుర్యంలోకి వస్తుంది. వజ్రం కిరీటంలో ఉన్నదా, ముంజేతి కంకణంలో ఒదిగి ఉన్నదా… పాదరక్షను అంటిపెట్టుకుని భాసిస్తున్నదా అన్నది ప్రధానమైన అంశమే. కలంను కరవాలంగా ఝళిపించిన ఆచార్య ఢిల్లీలో ఉంటే జాతీయ స్థాయి జర్నలిస్ట్, హైదరాబాద్‍లో ఉంటే రాష్ట్ర స్థాయి జర్నలిస్ట్. కాని ఆయన వరంగల్లులోనే ఉన్నారు. తన జనజీవితంతో పౌరుల ఆత్మను ముడివేసుకుని.
ఎం.ఎస్‍.ఆచార్య ప్రజా హృదయ పీఠాన్ని అధిష్టించిన ‘హూమన్‍ జర్నలిస్ట్’… హృదయ లేఖకుడు. (తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ప్రచురించిన ‘తెలంగాణ తేజోమూర్తులు’ నుంచి)


-డా।। రామా చంద్రమౌళి

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *