‘‘దక్కన్‍ల్యాండ్’’ మాసపత్రిక పది సంవత్సరాల సందర్భంగా ప్రముఖలు అభిప్రాయలు తెలిపారు.
2024 ఆగస్టు మాసంతో 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా
మరికొందరి అభిప్రాయాలు ప్రచురించగలమని తెలియజేయుటకు సంతోషిస్తున్నాం.
తెలంగాణ అస్తిత్వ ఆత్మగౌరవ పతాకం
పత్రికొక్కటున్న పదివేల సైన్యము
పత్రికొక్కటున్న మిత్ర కోటి
ప్రజకు రక్ష లేదు పత్రిక లేకున్న…..
అంటారు పత్రికా రంగ వైతాళికుడు నార్ల వెంకటేశ్వరరావు. ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలంటే పత్రికల పాత్ర అనివార్యం. మానవజీవన వికాసంలో పత్రికలు ఎప్పటికప్పుడు తమ వంతు పాత్రను నిరంతరాయంగా పోషిస్తూ వస్తున్నాయి. ఆ క్రమంలో 10 ఏళ్ల క్రితం ఆవిర్భవించిన దక్కన్ ల్యాండ్ సామాజిక రాజకీయ మాసపత్రిక తెలంగాణ అస్తిత్వ ఆత్మగౌరవ పతాకగా నిలిచింది. మలిదశ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి ఊపిరులూదింది. తెలంగాణ రాష్ట్ర సామాజిక ఆర్థిక రాజకీయ రంగాలను ప్రతిఫలించే అద్దంగా, అన్యాయాలు అక్రమాలపై ప్రకటించిన యుద్ధంగా దక్కన్ ల్యాండ్ పాఠకులకు చేరువైంది. ఎలక్ట్రానిక్ మాధ్యమాలు, సోషల్ మీడియాలు ఉప్పెనలై సమాజాన్ని ముంచెత్తుతున్న ఈ తరుణంలో పత్రికలు నిర్వహించడం కత్తి మీద సామే. అందునా పదేళ్లపాటు నిరంతరంగా కొనసాగడం, ప్రకటనల పటాటోపాలు, వ్యాపార ధోరణులకు దూరంగా, పవిత్రంగా, పాఠకుల ప్రయోజనమే లక్ష్యంగా ఇన్నేళ్లు కొనసాగడం పత్రిక యాజమాన్యం సంపాదకవర్గం సిబ్బంది రచయితల అభిమానుల సమిష్టి క•షికి తార్కాణం.
వివిధ శీర్షికల రూపంలో దక్కన్ ల్యాండ్ ప్రకటిస్తున్న విషయాలన్నీ విస్తారమైన సమాచారంతో లోతైన విశ్లేషణ చక్కగా చిక్కుగా రూపొంది అభిరుచి గల పాఠకులను ఆకర్షిస్తాయి. ఇంతవరకు వెలువడిన సంచికలను తిరగవేస్తే ఎక్కడా పొల్లు రాతలు సొల్లు కూతలు మచ్చుకి కూడా కనిపించవు. ఇటువంటి సాధికార పత్రికలు సమాజంలో అరుదుగా కనిపిస్తుంటాయి. ఆ వరుసలో తెలుగులో దక్కన్ ల్యాండ్ అగ్రభాగాన నిలుస్తుంది. పాఠశాల స్థాయి నుండి విశ్వవిద్యాలయాల దాకా అన్నిచోట్ల వివిధ వ్యక్తులు వ్యవస్థలు నిర్వహిస్తున్న గ్రంధాలయాల్లో విశేషించి ఇంటింటా ఉండవలసిన పత్రిక దక్కన్ ల్యాండ్. పోటీ పరీక్షలకు అవసరమైన అమూల్యమైన సమాచారం దక్కన్ ల్యాండ్ అందిస్తున్నది. ప్రత్యేకించి విశ్లేషకులకు, వ్యాసకర్తలకు, పరిశోధకులకు, పరిపాలకులకు దక్కన్ ల్యాండ్ ప్రతి సంచిక ఒక కర దీపిక. వేదకుమార్ గారికి అభినందనలు.
- డా. అయాచితం శ్రీధర్, ఎ : 9849893238
నిబద్దతకు నిలువుటద్దం – దక్కన్‍ల్యాండ్
దక్కన్‍ల్యాండ్ మాసపత్రిక అంటే నిబద్దతకు, వాస్తవికతకు నిలువుటద్దం. చరిత్రను, వర్తమానాన్ని నిశ్శబ్ధంగా రికార్డు చేస్తున్న సామాజిక, రాజకీయ పత్రిక. విజయవంతంగా పదకొండేళ్లు పూర్తి చేసుకుని పన్నెండవ ఏట ప్రవేశిస్తున్న సందర్భంగా దక్కన్‍ల్యాండ్ యాజమాన్యానికి, సంపాదకులు మణికొండ వేదకుమార్ గారికి హృదయపూర్వక అభినందనలు.
అనివార్యంగా డిజిటల్ యుగంలోకి ప్రవేశించిన మనం పత్రికను నిరంతరాయంగా పదకొండేళ్లు పూర్తి చేసుకొని విజయవంతంగా పన్నెండో ఏట ప్రవేశించడం ఒక గొప్ప విజయం. దక్కన్ ల్యాండ్ ఏ సంచికకు ఆ సంచిక ప్రత్యేకమైనదే. వర్తమాన రాజకీయ పోకడలు, పర్యావరణం, మన చరిత్ర, మన సంస్కృతి వంటి అనేక అంశాలను అక్షరబద్ధం చేయడంలో కఠోర నియమాలు విధించుకున్నదని దక్కన్‍ల్యాండ్ పాఠకులకు తెలుసు. మనం మరిచిపోయిన అనేక విషయాలతో పాటు ఈ ప్రాంత అనేక విషయాలపట్ల పరిశోధనలు చేసి చక్కటి వ్యాసాలతో, విశేషాలతో భావితరాలకు పనికొచ్చే విధంగా నిబద్ధతతో తీర్చిదిద్దడంలో దక్కన్ ల్యాండ్ పత్రిక విజయవంతమైందనే చెప్పాలి. ఏ విషయం మీద రాసిన వ్యాసమైన నిజాయితితో, అతిశయోక్తలు లేకుండా విశ్లేషణాత్మకంగా, ఆలోచనాత్మకంగా ఉండటం ఒక ప్రత్యేకత తెలంగాణలో ఇంత రెగ్యులర్‍గా వస్తున్న మాసపత్రికలు లేవనే చెప్పాలి. ఈ నాటి యువతకు, విద్యార్థులకు వర్తమాన సామాజిక, రాజకీయ అంశాలపట్ల అవగాహన కలిగించడంలో దక్కన్ ల్యాండ్ పాత్ర ఎంతో ఉంది.
పత్రికలకు కొన్ని ఉద్దేశాలుంటాయి. తమ తమ ఉద్దేశాలను పాఠకుల మీద ప్రభావం చూపే ప్రయత్నమూ చేస్తాయి. కాని
ఉన్నదున్నట్లు జరిగిందీ, జరుగుతున్నది ఒక చారిత్రక ప్రయాణంలా ఎప్పటికప్పుడు పొందుపరచడం కష్టమైన పనే. నిజాయితీగా, నిబద్ధతతో, ఉన్నత విలువలతో దక్కన్ ల్యాండ్ పత్రికా రంగంలో ప్రత్యేకతను నిలుపుకుంటున్నందుకు మరోసారి అభినందిస్తూ…
‘పత్రికొక్కటున్న పదివేల సైన్యంబు’ అన్న నార్ల మాటను గుర్తు చేసుకుంటూ ఒక నాడు గొలకొండ పత్రిక ఆత్మ గౌరవాన్ని నిలబెడితే ఇవ్వాల దక్కన్ ల్యాండ్ పత్రిక వేదకుమార్‍గారి నేతృత్వంలో తెలంగాణ మట్టి పరిమళాన్ని మూటగట్టి భావితరాలకు అందిస్తున్నందుకు అభినందిస్తూ…
-కోట్ల వెంకటేశ్వరరెడ్డి, ఎ : 9440233261