అనాది కాలం నుంచి ఆధునిక కాలం వరకు నదులే నాగరికత ఆలవాలంగా నిలిచాయి. నదులకు ప్రమాదం వాటిల్లితే నాగరికతకే కాదు, మానవ మనుగడతో పాటు సకల జీవరాశి ఉనికికే జీవన్మరణ సమస్యలు ఏర్పడుతాయి. కాబట్టి నదులను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి విద్యుక్త ధర్మం. గడచిన వేలు, లక్షల సంవత్సరాలుగా నదులను మానవులు ఎలా ఉపయోగించుకుని అభివృద్ధి చెందారు అనేది గుర్తు చేసుకుంటే నదుల పట్ల మన భావి బాధ్యతను గుర్తించే అవకాశం ఏర్పడుతుందని తెలియజేయడానికే ఈ వ్యాసం.
ప్రపంచంలో కొన్ని లక్షల నదులు ప్రవహిస్తున్నాయి. కాబట్టి వాటి ఆధారంగా వందల కోట్లాది ప్రజలు జీవనం సాగిస్తున్నారు. భారతదేశంలో ప్రవహిస్తున్న నదులను, ఉపనదులను కలిపి మానవ శరీరంలో ప్రవహిస్తున్న నాడీ మండలం / నరాల వ్యవస్థతో పోల్చారు. అంటే మన శరీరంలో ఎన్ని నరాలు రక్తాన్ని సరఫరా చేస్తాయో మన దేశంలో అన్ని నదులున్నాయనమాట. ప్రపంచ ప్రసిద్ధమైన ప్రాచీన నాగరికతలన్నీ నైల్, యూఫ్రటిస్ -టైగ్రిస్ సింధు మొదలైన నదుల మైదానాల్లోనే విలసిల్లాయి. కాబట్టి ఆయా నాగరికతలను వాటి సమీప నదుల పేర్లతోనే పిలుస్తారు. మన దేశంలో సింధూ నదీ లోయ నాగరికత అనేది క్రీ.పూ. మూడు వేల సంవత్సరాల క్రితమే ప్రభావిల్లి తదనంతర భారత జీవన సంస్కృతుల వికాసానికి ఎనలేని బాటలు వేసింది. సింధూ నాగరికత మ్రంగా తూర్పున ఉన్న గంగా నదీ మైదానం వైపు, దక్షిణాన ఉన్న నర్మద, గోదావరి, కృష్ణా-తుంగభద్ర, కావేరి నదీ తీర మైదానాల వైపు విస్తరించింది.
తెలంగాణా రాష్ట్రంలో గోదావరి, కృష్ణ, వాటి ఉపనదులు ప్రవహిస్తున్నాయి. కాబట్టి వాటి నీటిని వాడుకుని ప్రజలు ఎలా వృద్దిలోకి వచ్చారనేది తెలుసుకుంటే ఆయా నదుల పరిరక్షణ బాధ్యత ఎంత ప్రాధాన్యమైన అంశమో తలిపి వస్తుంది.
గోదావరి గంగ
ఉత్తర తెలంగాణ ప్రజలు తమ ఇంటికి ఉత్తరం వైపున్న దర్వాజాను ‘‘గంగ దర్వాజ’’ అంటారు. ఎందుకంటే, తమ ఇల్లు ఉన్న ప్రాంతానికి ఉత్తరం వైపున ‘గంగ’ ప్రవహిస్తున్నది కాబట్టి. తెలంగాణ ప్రజలు గోదావరిని ‘గంగ’ అనే పిలుస్తారు. పదిహేనవ శతాబ్ది ప్రారంభ దశాబ్దాల కాలపు శ్రీనాథుడు మొదలైన కవులు గోదావరిని ‘‘వృద్ధ గంగ’’ అని వర్ణించారు. అంటే, ఉత్తర భారత దేశంలో ప్రవహిస్తున్న ‘గంగా’ నది కంటే గోదావరి నదే ప్రాచీనమైనదని దీనికి నిదర్శనాలను జియాలజీ పరిశోధనలు చూపాయి. వాటి ప్రకారం సుమారు ఆరు కోట్ల సంవత్సరాలకు పూర్వం మహారాష్ట్రలోని మహాబలేశ్వర కొండల ప్రాంతంలో పెద్ద విస్ఫోటనం జరిగి భారీ స్థాయిలో లావా తూర్పు వైపు ప్రవహించింది. అత్యంత వేడితో ప్రవహించిన లావా భూమిని కోసుకుంటూ వెళ్ళడంతో దాని ప్రవాహ మార్గమే క్రమంగా గోదావరి నదీ మార్గమైంది. అయితే లావా వేడిలో ఆనాటి అత్యంత ఎత్తైన దట్టమైన అడవులు కాలిపోయి కాలక్రమేణా శిథిలమై బొగ్గు గనులుగా మారాయి. ఆ అడవులలో జీవించిన ఆనాటి డైనోసార్లు కూడా కాలిపోగా వాటి బొక్కలు ఇప్పటికీ గోదావరిఖని – సింగరేణి బొగ్గు గనులలో దొరుకుతున్నాయి.
ఆ తరువాత కాలక్రమంలో గోదావరి, దాని ఉపనదుల సమీపాలలో, వాటి జలపాతాల కింది గుండాల దగ్గర ఆది మానవులు తొట్టతొలి నివాసాలు ఏర్పరచుకున్నారు. సుమారు 18 లక్షల సంవత్సరాల క్రితం నుంచి లావా ప్రవాహంలో కాలిపోయిన వృక్ష శిలాజాలతో రాతి పనిముట్లు చేసుకున్నారు. మంచిర్యాల జిల్లా వేమనపల్లి నస్పూరు ప్రాంతాలలో, వాటికి తూర్పున సెలబాక, ఎలబాక ప్రాంతాలలో ఇలాంటి పనిముట్లు ఎన్నో లభించాయి. ఘన్‍పూర్, పొచ్చెర, కుంటాల, కోరెటికల్-బి, గద్దలసరి, గుండాల మొదలైన ఎన్నో జలపాతాల సమీపాలలో ఆది మానవుల పనిముట్లతో పాటు వారి ఆవాసాల జాడలు కూడా లభించాయి. ఎండకాలం వాగు వంకలలోని నీరు ఎడిపోతే జలపాతాల కింద ఏర్పడిన గుండాలలో కొంత నీరైనా నిలిచి ఉంటుంది. కాబట్టి వాటి సమీప ప్రాంతాలను ఆదిమానవులు ఆవాసాలుగా ఎంపిక చేసుకున్నారు. ఏటూరు నాగారం – తాడ్వాయి అడవులలో సుమారు 40-50 కిలోమీటర్ల పరిధిలో పదుల కొద్ది అరుదైన బృహత్ శిలాయుగపు ఆవాసాలున్నాయి. మల్లూరు గుట్టపైన కోట కూడా ఉంది.
గోదావరి నదిలో వాటి ఉపనదులు కలిసే చోట లేదా గోదావరి పెద్ద మలుపు తీసుకునే చోట ఏర్పడిన పెద్ద పెద్ద చెరువుల వంటి ‘మడుగుల’ సమీప ప్రాంతాలలో తొట్టితొలి రాజ్యాల రాజధానులు, పవిత్ర తీర్థ క్షేత్రాలు ఏర్పడ్డాయి. రెండున్నర వేల సంవత్సరాల నుంచి అలా తెలంగాణలో ఏర్పడిన మొట్టమొదటి నగరం బోధన్. దీనిని సుమారు రెండున్నర వేల సంవత్సరాల కిందట అశ్మకులు పసుపునది గోదావరిలో కలువడానికి కొన్ని కిలోమీటర్ల ఎగువన కట్టారు. ఆనాటి భారతదేశంలో మనుగడ సాగించిన పదహారు జనపదాలలో అశ్మక-బోధన్ (పోతన అనేది అసలు పేరు) ఒక్కటే దక్షిణ భారతదేశంలో ఉండేది.
బోధన్ తరువాత జగిత్యాల జిల్లా, వెల్గటూరు మండలంలో పెద్దవాగు గోదావరిలో కలిసే చోట శాతవాహన రాజుల పూర్వరాజులు ఈనాటి కోటలింగాల అనే చోట 120 ఎకరాల కోట కట్టి రాజ్యపాలన చేశారు. క్రీ.పూ. ఒకటవ శతాబ్దంలో దానినే శాతవాహనులు రాజధానిగా చేసుకొని దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి సామ్రాజ్యాన్ని నిర్మించారు. కోటిలింగాల నుంచి రోమన్ మ్రాజ్యంతో వ్యాపారం చేయగా రోమన్‍లు మన ప్రాంతీయులకు ఇచ్చిన బంగారు నాణేలు కోటిలింగాలతో పాటు ఇతర ప్రాచీన పట్టణాలలో ఇప్పటికీ బయల్పడుతున్నాయి. గోదావరి ఉత్తర దక్షిణ దిశలలో ఉన్న సారవంతమైన భూములలో అన్ని పంటలతో పాటు పత్తి కూడా విస్తారంగా పండేది. పత్తి నుంచి అతి సన్నని దారాలు తీసి పాలెగూడు (వెబ్) వంటి పల్చటి బట్టలు నేసి కోటిలింగాల ప్రాంతం నుంచి రోమన్ సామ్రాజ్యానికి ఎగుమతులు చేయగా వాటిని కట్టుకున్న రోమన్ స్త్రీల సంఔదర్యాని చూసి పురుషులు నీటి హద్దులు దాటుతున్నారని క్రీ.శ. 2వ శతాబ్దంలో ప్లినీ అనే పరిశోధకుడు రాశాడు. రోమన్‍ల సంపద కూడా భారత్‍కు తరలిపోతున్నదని, కాబట్టి భారత్‍తో వ్యాపారాన్ని నిలిపివేయాలని సూచించాడట.
బోధన్, కోటిలింగాలతో పాటు గోదావరి ఒడ్డున పెద్ద బొంకూరు, ధూళికట్ట, మొలుమూరు మొదలైన పట్టణాలు గోదావరి గట్లపైనే నెలకొన్నాయి. క్రీ.పూ.4వ శతాబ్దానికే ఇలాంటి కోటగోడలు ఆంధ్రులకు (తెలుగువారికి అని) ముప్పై ఉన్నాయని, మౌర్యుల తరువాత భారత్‍లో వీరే బలవంతులని మౌర్య చంద్రగుప్తుని ఆస్థానంలో గ్రీకు రాయబారిగా ఉన్న మెగస్తనీస్ తన ‘ఇండికా’ గ్రంథంలో రాశాడు.
పై ప్రాచీన పట్టణాలతో పాటు గోదావరి నదితో ఉపనదులు, వాగులు కలిసే సంగమ స్థలాలలో, లేదా గోదావరి వంకలు తిరిగే చోట ఏర్పడిన పెద్ద పెద్ద మడుగు ప్రాంతాలలో కందకుర్తి, బాసర, బ్రహ్మగిరి (కనకగిరి, సోన్, బాదనకుర్తి, హస్తినమడుగు, ధర్మపురి, మంథని, లండమడుగు, కాళేశ్వరం, భద్రాచలం మొదలైన తీర్థక్షేత్రాల పట్టణాలు ఏర్పడ్డాయి. గోదావరి నీటి వనరులను ఎండా కాలంలోనూ వాడుకోవడం కోసం 15వ శతాబ్దం నాటి ప్రసిద్ధ కవి బమ్మెర పోతన గోదావరి ఇసుక తిన్నెల పైనే తన తెలుగు భాగవతాన్ని ప్రారంభించి గోదావరి జలాల సౌందర్యాన్ని ఎంతగానో పొగిడాడు.
గోదావరి, కృష్ణ పరీవాహక ప్రాంతాలలో కాకతీయులు ఏడెనిమిది వందల ఏండ్ల కిందట సముద్రాలను తలపించే చెరువులు, వాటి నుంచే పారే అలుగులపై వరుసగా మరిన్ని చెరువులను… అంటే గొలుసుకట్టు చెరువులను కట్టించారు. రామప్ప, లక్నవరం, పాకాల, ధర్మవరం, కేసరి సముద్రం, గణ్‍పూర్ మొదలైన కాకతీయ చెరువులు ఇప్పటికీ వేలాది ఎకరాలకు నీరు అందించడ, మత్స్య సంపదకు ఆలవాలంగా ఉండడం చూడవచ్చు. ఆయా చెరువులను దైవ స్వరూపగా భావిస్తూ వాటి సమీపంలో కాకతీయులు ఆనాడే ప్రసిద్ధ దేవాలయాలను కట్టించారు. భారతదేశానికి స్వాతంత్య్ర వచ్చిన తరువాత నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తూ ఆనాటి ప్రధానమంత్రి జవహర్‍లాల్ నెహ్రూ ప్రాజెక్టులను ‘ఆధునిక దేవాలయాల’ని సంబోధించడం గమనార్హం.
స్వాతంత్య్ర రావడానికి మూడు నాలుగు దశాబ్దాల ముందే గోదావరి ఉపనది మంజీరపై ఆనాటి హైదరాబాద్ రాష్ట్ర నిజాం ప్రభుత్వం తెలంగాణలో మొట్టమొదటి బహుళార్థ సాధక ప్రాజెక్ట్ కట్టింది. పోచారం దగ్గర మరో ప్రాజెక్టును కట్టింది. స్వాతంత్య్ర తరువాత అదే నదిపై మంజీర, సింగూరు, శ్రీరామ్‍సాగర్, ఎల్లంపల్లి, కాలేశ్వరం ప్రాజెక్టులను కట్టుకోగా ఇంకా కింది వైపు ఆంధప్రదేశ్ ప్రభుత్వం పోలవరం, ధవళేశ్వరం ప్రాజెక్టులను కట్టుకున్నది.
గత శతాబ్దంలో మంచిర్యాల -గోదావరిఖని, రామగుడం ప్రాంతంలో బొగ్గుబావులు, ఎరువుల కర్మాగారాలు, విద్యుదుత్పత్తి పరిశ్రమలు కూడా గోదావరి జలాల ఆధారంగానే ఏర్పడ్డాయి. కాని ఆయా పరిశ్రమలు గోదావరిలోకే వ్యర్థాలను వదలడం వల్ల గోదావరి కలుషితమై జీవజాలానికి ప్రమాదం వాటిల్లుతున్నది.
కృష్ణవేణి
తెలంగాణకు దక్షిణ సరిహద్దుగా కృష్ణానది భీమ, తుంగభద్ర, మాజీ నదులను కలుపుకొని పారుతున్నది. వీటి జలాలను ఆధారం చేసుకొని అత్యంత ప్రాచీన కాలం నుంచి ఈనాటి దాకా ఆదిమానవులు నివాసాలు ఏర్పరచుకున్నారు. భారతదేశంలోనే ‘ఆదిమ మానవులు’గా గుర్తించబడిన చెంచు గిరిజనులు కృష్ణానదికి ఇరువైపులా విస్తరించి ఉన్న నల్లమల అడవులలో జీవిస్తున్నారు. 1940 ప్రాంతంలో వీరిపై విశేష పరిశోధన చేసిన ఆచార్య హైమెండార్ఫ్ వీరు ఇంకా రాతి యుగపు స్థితిలోనే జీవిస్తున్నారని రాశాడు. మరో పక్క వీరికి సమాంతరంగా క్రీ.పూ. 4వ శతాబ్దం నాటికే ‘నగ్నయతులు’ ఈ నదీ తీరాలలో సంచరిస్తున్నారని మెగస్తనీస్ రాశాడు. చెంచు అమాయక ప్రజలు, జ్ఞానులైన యతులు కృష్ణానది ఆధారంగానే జీవించడం గమనార్హం.
వర్షా కాలంలో వచ్చే వరదలు కృష్ణానది ఒడ్డును కోయడం వల్ల బయటపడే వజ్రాలు పలు వలసలను ఆహ్వానించాయి. క్రమంగా ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా వజ్రాల పరివ్రమ కృష్ణా లోయలోనే ఏర్పడింది. కాకతీయులు, కుతుబ్షాహీలు, నిజామ్‍ల కాలాల్లో ప్రపంచ ప్రసిద్ధి గాంచిన కోహినూర్, జాకోబ్, నిజామ్ మొదలైన వజ్రాలు ఎన్నో ఈ నది లోయలో లభించాయి. ఇప్పటికీ డిబీర్స్ వంటి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వజ్రాల కంపనీలు కృష్ణా పరీవాహక నల్లమల పర్వతాలలో వజ్రాలను వలెఇకి తీసే పరిశ్రమలు స్థాపించడానికి ఉవ్విళ్ళూరుతున్నాయి. మరి కొన్ని కంపెనీలు ఈ ప్రాంతంలో యురేనియం నిక్షేపాలను కొల్లగొట్టడానికి ప్రయత్నిస్తున్నాయి.
2300 సంవత్సరాల కిందట మౌర్య చంద్రగుప్తుడు పాటలీపుత్ర (పాట్నా)ను వదిలి దక్షిణాదికి వచ్చి శ్రీశైలం ప్రాంతంలో ఉన్న కృష్ణానదీతారంలోని ఆహ్లాదకరమైన వాతావరణం నచ్చి నాగర్ కర్నూలు జిల్లాలోని అమ్రాబాద్ మండలంలో ఉన్న నల్లమల అడవులలో సుమారు ఐదు కిలోమీటర్ల చదరపు వైశాల్యంలో ఒక పట్టణాన్ని కట్టించాడు. ఆ తరువాత ఆయన భద్రబాహు అనే జైన మునితో కలిసి కర్నాటకలోని శ్రావణ బెళగొళకు వెళ్ళగా ఆ పట్ణం శిథిలమైపోయింది.
అనంతరం సుమారు రెండు వేల సంవత్సరాల కిందట గౌతమీపుత్ర శాతకర్ణి అనే రాజు తన రాజధానిని కృష్ణా నదికి ఆవలి వైపు ఉన్న ధనకడ / ధరణికోట (ఈనాటి అమరావతి)కు మార్చాడు. కృష్ణానది ఒడ్డునే మరో శాతవాహన రాజైన విజయశ్రీ శాతకర్ణి తన పేర విజయపురి పట్టణాన్ని కట్టించాడు. అది శాతావాహన అనంతరీకులైన ఇక్ష్వాకులకు రాజధాని అయింది. శాతావాహనులు, ఈ నదిని వాణిజ్య సరుకులు సరఫరా చేసేందుకు వినియోగించుకోగా ఇక్ష్వాకులు దాని జలాలను వ్యవసాయ విస్తృతికి వినియోగించుకున్నారు. ఇందు కోసమై ఒక రాజు లక్ష నాగళ్ళును, ఎద్దులను పంచి పెట్టాడు. 1700 ఏండ్ల కిందట, అట్లని కృష్ణానది ఆధారిత అంతర్జాతీయ వాణిజ్యం, విద్యా ధార్మిక సంబంధాలను నిలిపివేయలేదు. శాతవాహన కాలంలో బౌద్ధ ఆచార్య నాగార్జునుడు స్థాపించిన మాధ్యమికవాదం / శూన్య వాదం, విశ్వవిద్యాలయం, రసవాదం ప్రపంచవ్యాప్తంగా బౌద్ధ శక్తులను, విద్యార్థులను, పరిశోధకులను, రసాయనికవాదులను విజయపురికి (ఈనాటి నాగార్జునసాగర్) ఆకర్షిస్తూనే ఉన్నాయి. నాటి రోమన్, వాస్తుశైలిలో కట్టిన ప్రేక్షకారాగారాన్ని నేటికీ నాగార్జున సాగర్‍లో చూడవచ్చు. శాతవాహన, ఇక్ష్వాకుల కాలంలోనే కృష్ణా ఒడ్డు మీద మొట్టమొదటి దేవాలయాలు నిర్మితమయ్యాయి.
ఇక్ష్వాకుల తరువాత క్రీ.శ.4వ శతాబ్దంలో విష్ణుకుండులు కృష్ణానది ఎడమ గట్టున నాగర్ కర్నూలు జిల్లాలో అమరగిలిని తమ తొలి రాజధానిగా చేసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా చోటు చేసుకున్న పలు పరిణామాల మూలంగా రోమన్ సామ్రాజ్యంతో వాణిజ్య సంబంధాలు ఆగిపోవడం వల్ల కాబోలు విష్ణుకుండులు క్రమంగా కృష్ణానదిని (అమరగిరిని, ఏలేశ్వరాన్ని) వదిలి దాని ఉపనది ఐన మూసీ నదివైపు వలస పోయారు. అలా వారు 5వ శతాబ్ది ప్రారంభం కాలం నుంచి హైద్రాబాద్ సమీపపు కీసరగుట్ట, చైతన్యపురి, ఇంద్రపాలనగరంలలో అనేక కట్టడాలు నిర్మించారు. కృష్ణానది సమకూర్చినంత ఎక్కువ జలాలను వాగు వంకలు సమకూర్చలేవు. కాబట్టి విష్ణుకుండులు ‘వాపీ కూప తటకాదులు’ (దిగుడుబావులు, చేదబావులు, చెరువులు-కుంటలు) నిర్మించారు.
కృష్ణా-తుంగభద్ర సంగమ ప్రాంతానికి (అలంపూరుకు) సమీపంలో ఉండిన తుమ్మెయనూరులో లభించిన రాగిరేకుల శాసనంలో చాళుక్యులు తమ జన్మభూమి ఇదేనని చెప్పుకున్నారు. ఇక్కడి నుంచి పశ్చిమంగా కర్ణాటకలో ఉన్న బాదామి (వాతాపి)కి వలసపోయి అక్కడి నుంచి యావత్ దక్షిణ భారతదేశాన్ని పాలించారు. వారి వారసులు, సామంతులైన ఇతర చాళుక్య శాఖలు, రాష్ట్రకూటులు మరిన్ని వందల సంవత్సరాలు దక్కనును పాలించారు. వారు అలంపూరు దగ్గరి సోమశిల- సంగమేశ్వరం లలో అనేక దేవాలయాలు కట్టించారు.
మలి చాళుక్యుపు సామంతులైన కాకతీయులు క్రీ.శ.12వ శతాబ్దంలో స్వతంత్రులైన 160 ఏళ్ళు యావత్ తెలుగు దేశాన్ని ఏకఛత్రాధిపత్యంగా ఏలూరు వారిలో అత్యంత గొప్పవాడైన గణపతి దేవ చక్రవర్తి సోదరి మైలాంబ కృష్ణానది ఒడ్డునున్న జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలం మల్లికార్జునస్వామి గుడిని కట్టించింది. 800 సంవత్సరాల కిందట. గణపతిదేవుని బిడ్డ రుద్రమదేవి తన పుట్టిన రోజున పురస్కరించుకుఇ ఈనాటి అమరావతి దగ్గరి మందడం – వెలగపూడి చరిత్రలో మొదటిసారిగా ప్రసూతి ఆసుపత్రిని కట్టించి దాని నిర్వహణకై అనేక దానాలు చేసింది. గణపతిదేవుని కాలంలోనే కృష్ణానదిలో మూసీనది సంగమించే వాడపల్లిలో మేలుగుంటు సోదరులు బతుకేశ్వర ఆలయాన్ని కట్టించి పలు దానాలు చేశారు. ఆ సంగమంలో బతుకమ్మను సాగనంపే ఉత్సవం ఆనాడు పెద్ద ఎత్తున జరిగేదని భావించవచ్చు.
అదే వాడపల్లి మీద పట్టుకోసమై కాకతీయ అనంతర రాజులైన రెడ్లు, పద్మనాయకులు పలు యుద్ధాలు చేశారు. అక్కడి నుంచే బంగాళాఖాతానికి ప్రపంచ వ్యాప్తంగా వాణిజ్యం చేసుకోవడానికి అవకాశముంటుంది కనుక. పద్మనాయకులలో తొలితరం రాజైన మాదా నాయకుడు నల్లమల అడవుల ప్రాంతంలో ఉమామహేశ్వర క్షేత్రం నుంచి అడవుల గుండా జాతర రేవు వరకు మెట్లు కట్టించాడు. శ్రీశైలం యాత్రికుల సౌకర్యం కోసం 650 ఏండ్ల కిందట.
కాకతీయ వారసత్వాన్ని కొనసాగిస్తూ పద్మనాయకులు, వారి తరువాత గోల్కొండ కుతుబ్షాహీలు తెలంగాణలో అక్కడక్కడా కొన్ని చెరువులు కట్టించారు. ఆ తరువాత రాజ్యపాలన చేపట్టిన అసఫ్‍జాహీలు చెరువులతోపాటు కృష్ణానది ఉపనదులైన డిండి, మూసీ నదులపై మధ్య తరహా ప్రాజెక్టులు కట్టారు. కతుబ్షాహీలు మాత్రం కృష్ణా నదీలోయలో వజ్రాల తవ్వకం పరిశ్రమ మీదనే ఎక్కువ దృష్టి పెట్టారు. 17వ శతాబ్దంలో ఇక్కడి వజ్రాలతో వ్యాపారం చేయడం కోసం ప్రపంచవ్యాప్తంగా వ్యాపారులు గోల్కొండ రాజ్యానికి, కృష్ణానదికి వచ్చేవారు గోల్కొండ కోటలో మోతీ దర్వాజా (వజ్రాల దర్వాజా) అని ఒక ప్రత్యేక దర్వాజానే ఉoది. అసఫ్‍జాహీలు కృష్ణానది లోయలో ముత్యాల పరిశ్రమలను నడిపారు. ఇప్పటికీ హైదరాబాద్ ముత్యాలకు పేర్గాంచింది.
స్వాతంత్య్రానంతరం కృష్ణానది మీద జూరాల, నాగార్జునసాగర్, శ్రీశైలం మొదలైన ప్రాజెక్టులను కట్టారు. పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా నీరు హైదరాబాద్ పరిసర ప్రాంతాల వరకు వస్తున్నాయి.
మలి తెలంగాణ ఉద్యమం ప్రధానంగా గోదావరి, కృష్ణా జలాలలో వాటా కోసమే జరగడం నదుల ప్రాధాన్యం మానవ మనుగడలో అత్యత కీలకం అని తెలియజేస్తుంది.
వేల సంవత్సరాలుగా పుష్కరాల పేరుతో, పుణ్య స్నానాల పేరుతో, గణపతి, బతుకమ్మ నిమజ్జనాల పేరుతో పూజలందుకున్న నదులలోకి గత అర శతాబ్దం కాలంగా పరిశ్రమల వ్యర్థాలను, ప్లాస్టిక్ వ్యర్థాలను వదులుతూ ఉండడంతో ఆయా నదుల నీరు జీవజాలం మనుగడకు పెను సవాలును విసరుతూ ఉంది. మూసీనది ఒడ్డున ఉన్న హైదరాబాద్ నగరం వల్ల మూసీతో పాటు, అది కలిసే నది కృష్ణా కూడా కలుషితమవుతున్నది. ఇలాంటి పరిస్థితులను ప్రజలు, ప్రభుత్వాలు అత్యంత బాధ్యతాయుతంగా చక్కదిద్దుకోకపోతే మానవాళి మనుగడే ప్రశ్నార్థకంగా మారుతుంది. పైన వివరించినట్లు ప్రతి రంగంలో అభివృద్ధికి నదుల నీరే కారణం అనే ప్రాథమిక సత్యాన్ని గ్రహిస్తేనే మనమందరం నదుల పరిరరక్షణకు పాటుపడగలం. గోదావరి నుంచి మల్లన్న సాగర్, ఉస్మాన్‍సాగర్, హిమయాత్‍సాగర్‍ల మీదుగా రెండున్నర టీఎంసీల నీటిని తరలించి వచ్చే సంవత్సరానికల్లా మూసీ ప్రవాహాన్ని ప్రక్షాళన చేయాలని ప్రభుత్వం ఇటీవలే నిర్ణయం తీసుకోవడం కొసమెరుపు.
- ద్యావనపల్లి సత్యనారాయణ,
ఎ : 94909 57078