మానవ సమాజాలకు సహజ లేదా ప్రకృతి ప్రపంచానికి మధ్య ఉండాల్సిన సంబంధాలు ఎటువంటివి? అనే విషయంగా పర్యావరణ వేత్తలు తరుచుగా చర్చిస్తుంటారు. వాటికి ఒక సిద్ధాంత భూమికను, అవగాహన చేసుకోవలసిన దారులనూ చూపుతూ ఉంటారు. చాలాకాలం వరకు భారతీయ సామాజిక శాస్త్రవేత్తలు, చరిత్రకారులు మానవ జీవితాలకు సంబంధించి ఆవరణ వ్యవస్థల కోణాన్ని విస్మరించటం జరిగిందని పర్యావరణ అధ్యయన పరులు తరచుగా చెప్పేమాట భూస్వాములకు, రైతాంగ వర్గాలకు ఉన్న సంబంధం గురించి పలు అధ్యయనాలు కనిపిస్తాయి కానీ, వ్యావసాయిక జీవనం ఆయా కాలాల్లో అడవులు, నీరు, ఖనిజాలు మాత్రమే కాకుండా సహజ సందర్భాల చేత నియంత్రింపబడి ఉంటుందని చెప్పటం మరచిపోతుంటారు. సహజ ప్రపంచంలో మానవాళికి ఉండే పరస్పర చర్యలను సామాజిక సంస్థలు అదుపులో పెడుతూ ఉంటాయి. అయితే ఆయా సామాజిక సంస్థలు సహజవనరుల వినియోగం గురించి వివేకవంతమైన విషయాలను చెపుతాయా? లేదా దుష్ప్రచారాలకు వొడిగడతాయా అనేది అంత త్వరగా తేల్చటం కష్టతరమైన పని. పర్యావరణ హితాన్ని కోరటం, ఆకాంక్షించటం అందరూ సమానంగా చేస్తారని చెప్పటం కుదరదు. వనరులను వినియోగించే పద్ధతులు అనుసరించిన విధానాలకు ప్రకృతికి మధ్య భిన్న చారిత్రక కాలాల్లో విభిన్నమైన వైషమ్యాలు, సంఘర్షణలు, చర్యాప్రతిచర్యలు పర్యావరణ సుస్థిరత మీద ఎటువంటి ప్రభావం చూపాయనేది కూడా అందరూ తెలుసుకోవలసిన విషయం. ఆధునిక కాలంలో కంటే పూర్వాధునిక కాలాల్లోనే మానవ వ్యవస్థలకు, ప్రకృతి, పర్యావరణాల మధ్య సామరస్య పూర్వక సంబంధాలు కొనసాగాయనేది వాస్తవం. వనరులను వినియోగించుకోవటంలో అక్షరాస్యత లేని గ్రామీణ సమూహాలు ఆధునికులకంటే మెరుగ్గానూ, పర్యావరణ హితంగాను ఒక మెలకువను ప్రదర్శించారని చెప్పటంలో సందేహించాల్సిందేమీ లేదు. ఎందుకంటే ప్రకృతి అంటే ఏమిటో వారు అర్థం చేసుకున్నారు. తాము ప్రకృతి మీద ఆధారపడి ఉన్నమనే సత్యాన్ని గ్రహించారు. తాము ప్రకృతిపై ఆధిపత్యం వహించాలన్న భావన కూడా వారికి ఉండి ఉండదనేది ఒక వాస్తవం.
బ్రిటీష్ పాలకుల కాలంలో అనేక కొత్త చట్టాలు, సాంకేతికతలు, అడవుల నిర్వహణకు సంబంధించి అమలులోకి వచ్చాయని మనకు తెలిసిందే. సాంకేతికతలు, చట్టాలు ఉత్పన్నం చేసిన ఘర్షణలు ఉద్రిక్తలు ఎటువంటివో, అటవీ సంపదపై ఆధారపడి జీవించిన భిన్న సమూహాలపై అవి ఎటువంటి ప్రభావాన్ని చూపాయో కూడా మన ఎరుకలోని విషయమే. ఆ చట్టాలను ఏదో ఒక మేరకు కొనసాగిస్తూనే అడవుల ఉత్పాదనలను తీవ్ర తరం చేసింది స్వాతంత్య్రానంతర భారత ప్రభుత్వాలు. ఫలితంగా రైతులు, గిరిజనులు అంచులకు నెట్టివేయబడ్డారు. పర్యావరణ పరిరక్షలుగా ఉన్న పలు గిరిజన, ఆదివాస తెగల, సమూహాలు ఇలా అంచులకు నెట్టివేయబడటం వల్ల జీవ వైవిధ్యం కూడా దెబ్బతిన్నదనేది పలు అధ్యయనాలు తెలిపే కటువైన వాస్తవం.
1980ల నాటికి మనకు సామాజిక చరిత్ర, సాంస్కృతిక చరిత్ర, ఆర్థిక చరిత్ర, మహిళా చరిత్రల్లాంటివి వృద్ధిపొంది ఇవి ఉప అనుశాసనాలుగా కొనసాగుతూ ఉన్నాయి.
కానీ పర్యావరణ చరిత్ర యింకా శైశవదశలోనే ఉందనీ విషయాన్ని’This Fissured Land: An Ecological History of India’అనే గ్రంథ రచన ద్వారా చర్చకు తెచ్చారు. మాధవ్ గాడ్గిల్, రామచంద్రగుహలు ఈ గ్రంథం 1991లో వెలుగు చూసింది. 1991 అనేది భారతదేశ ఆర్థిక చరిత్రలో ఒక మలుపు. సమస్తమూ మార్కెట్ శక్తులకు అప్పగించబడిన కాలమది. తాము ఈ దేశపు పౌరులుగా, పర్యావరణ పరంగా స్పృహ, చైతన్యం గల పౌరులం కావటం చేత మా వృత్తి గత అనుభవాల విశ్లేషణ, స్వీయానుభవాల వివరణ ఫలితంగా ఈ గ్రంధం వెలువడిందని చెప్పుకున్నారు. భారతదేశంలో ఎన్నో పర్యావరణ చైతన్య ఉద్యమాలు గీత దశాబ్దాలలో నడిచాయి. వాటిల్లో చిప్కో ఉద్యమం ఒకటి. తమ అనేక పరిశోధనా ప్రయాణాలలో భారతదేశంలోని బహుప్రాంతాలలో పర్యావరణ క్షీణతలను స్వయంగా వీక్షీంచామని అంటారు. అడవులు తరిగిపోవటం, భూసారం క్షీణించటం, నదులు కలుషితం కావటం తదితరమైనవన్నీ గ్రామీణ, గిరిజన తెగలు, సమూహాల మీద ప్రతికూల ప్రభావాలను చూపాయని పేర్కొన్నారు. పర్యావరణం ఇంతగా దెబ్బతినడానికి, క్షీణించడానికి మూలాలు ఎక్కడున్నాయో వీరు గుర్తించారు. పట్టణ, పారిశ్రామిక ఆసక్తులను బట్టి వాటికి అనుకూలంగా ఉండే అభివృద్ధి వ్యూహాలు రూపొందింపజేసుకోవటం లోనే అసలు సమస్య ఉందని నిర్ద్వింద్వంగా ప్రకటించారు. పట్టణ, పారిశ్రామిక ఆసక్తులకు అనుకూలంగా ఉండే అభివృద్ధి నమూనాలకు రూపొందించుకోవటం వలన ప్రకృతిని వినియోగించుకోవటంలో వివేక, విజ్ఞతల కంటే వంచనా పూరిత వినియోగమే జరిగిందని భావించారు.
సృజనాత్మక పెట్టుబడికంటే క్రోనీ కాపిటలిజం దురాక్రమించిందని నిర్థారించారు. సృజనాత్మక ఆలోచనలున్న పారిశ్రామిక వేత్తల కంటే సత్సంబంధాలు కలిగి ఉన్న పారిశ్రామిక వేత్తలు త్వరిత గతిన సస్సంపనులయ్యారని సూచించారు. ప్రభుత్వాలతో ఇటువంటి వారికంటే పలుకుబడి వారి సమృద్ధతకు కారణం. భూమి, ఖనిజాలు, ఇతర సహజవనరుల కీలక నియంత్రణ ప్రభుత్వాల చేతుల్లో ఉంటుంది. క్రోనీ కాపిటిలిస్టులు ప్రభుత్వాలను సులభంగానే ప్రభావిత పరచగల వెసులుబాటును కలిగి ఉంటారు. సమాజహితమో, పర్యావరణ సుస్థిరతో వీరికి ప్రాథమ్యాంశాలుగా ఉండవు. వ్యక్తులు పెట్టుబడిదారులుగా రాజకీయ నేతలతో ఒప్పందాలు కుదుర్చుకోగలుగుతారు. ప్రజాధనం పై భారం పడినా పర్యావరణంపై భారం పడినా, సామాజిక హితానికి భంగం కలిగినా వారికేమీ పెద్దగా పట్టింపు ఉండదు.
ఆర్థిక సరళీకరణల క్రమం ఒకటి మొదలయ్యాక వనరుల వినియోగంలో వివేకంలేని లజ్జరహిత పద్ధతులను అనుసరిస్తున్నామని అంటారు. మాధవ్‍గాడ్గిల్, రామచంద్రగుహలు. 1980లలో ప్రవేశపెట్టిన న్యాయ పరిరక్షణ చట్టాలు గాలికి వదిలేయబడ్డాయి. జలసంరక్షణ, సుస్థిర ఇంధనం లాంటి కార్యక్రమాలు నిర్లక్ష్యం చివరకు తరిమివేయబడ్డాయి. కంటి తుడుపుగా ఏవైనాకార్యక్రమాలు జరిగినా అవి జనావళిని వంచించటానికే తప్ప మరొకటి కాదు. వీటితో పాటుగా ప్రజల జీవన విధాన శైలీ, సంస్కృతులలో పలు తీవ్ర మార్పులు సంభవించాయి. ఈ సరికొత్త జీవనశైలి సహజ వనరుల మరింత వినియోగాన్ని ఎప్పటి కప్పుడు కోరుతూ ఉంటాయి. సరళత, నిరాడంబరత లాంటివి అదృశ్యం అయ్యాయి. బుద్ధుడు, గాంధీలు ప్రవచించిన విలువలు ఒకప్పుడు గౌరవం పొందినట్లుగా ఇప్పుడు పొందటంలేదు.
వినిమయ వర్గాల కార్పోరేట్ల అవసరాలను తీర్చడానికి ప్రభుత్వాలు హడావిడిగా ఒక క్రమమంటూ, పద్ధతంటూ లేకుండా మధ్యభారత, ఉత్తర, ఈశాన్యరాష్ట్రాల గిరిజన ప్రాంతాలలో వనరుల అన్వేషణకు ప్రోత్సహిస్తున్నాయి. ఈ ప్రాంతాలు ఇప్పుడు కొత్త కాలనీలుగా మారాయి. మైనింగ్ హైడ్రోఎలక్ట్రిక్ పథకాలు స్థానిక ఆవరణ వ్యవస్థలను ఛిన్నాభిన్నం చేస్తున్నాయి. స్థానిక ప్రజలు విస్థాపితులవుతూ ఉన్నారు. విస్తృత స్థాయిలో అసంతృప్తులు రగులుతూ ఉన్నాయి. పర్యావరణం-వనరులు వినియోగంలో బాధ్యాతాయుత పౌరులందరూ వివేకవంతంగా ఆలోచించవలసి ఉంది. గణతంత్ర భారతం బీటలు బారిన నేల అని అది 1992లో కంటే మరింత నెర్రెలిచ్చిందని అంటున్న మాధవ్‍గాడ్గిల్, రామచంద్రగుహలు చెపుతున్న దేమిటో ఆలకించాలి. వయనాడ్ విషాదాలు మరింత ఉధృతంగా మున్ముందు సంభవించక ముందే మేల్కొనవలసి
ఉంది. వివేకవంతంగా ప్రవర్తించవలసి ఉంది.
- డా।। ఆర్. సీతారామారావు
ఎ : 9866563519