ఒకప్పుడు నిత్యకళ్యాణం పచ్చతోరణం నేడేమో ఛిన్నాభిన్న శిథిలావరణం!


ఘన్‍పురం, ములుగు ఘనపురంగా అపురూప ఆలయ సముదాయానికి నిలయం. కాకతీయ గణపతిదేవచక్రవర్తి, తెలుగు నేలనంతా సుభిక్షంగా, సర్వకళాశోభితంగా, సాహితీ వైభవ తోరణంగా పాలిస్తున్న రోజుల్లో ఆయన సామంతుడైన గణపతి రెడ్డి ప్రభువుపై భక్తితో, ఆలయ నిర్మాణంపై అనురక్తితో, గణపతి దేవుని పేర, గణపురమనే పట్టణాన్ని, రామప్పను తలపించే గణపేశ్వ రాలయాన్ని నిర్మించి, గణపతి సముద్రమనే సువిశాల చెరువును తవ్వించి, చరిత్ర కెక్కాడు. అవును అందుకు నేనే నిలువెత్తు సాక్ష్యం అంటూ గణపతిరెడ్డి వేయించిన క్రీ.శ. 1254వ సం।।పు శాసనం ఇప్పటికీ ఆలయ సముదాయంలో మౌనరాగం తీస్తూనే ఉంది.


ఊరికి వెలుపల చుట్టూ ఎర్ర ఇసుకరాతి ప్రాకారం, లోపల ముమ్మూర్తులా రామప్పను పోలిన విశాల రంగమండపంతో గర్భాలయ, అర్ధమండపాలతో శిథిల సౌందర్యాన్ని ఒలకబోస్తున్న గణపేశ్వరాలయం, దానిముందు ఆనవాళ్లు కోల్పోయిన నంది మండపం, ఎడమవైపున అదే రీతిలో కొంచెం చిన్న ప్రమాణం లో నిర్మించిన మరో ఆలయం, చుట్టూ అలనాటి ఆలయవాస్తు వైవిధ్యానికి అద్దంపడుతున్న 19 ఉపాలయాలు, ఉత్తరంవైపు, ప్రవేశ మండపం అనీ, కళ్యాణ మండపమనీ, ప్రజలనోళ్లలో నానుతున్న 64 స్థంభాల మండపం, అన్నీ కలసి గణపురాన్ని, ఘనపురం చేశాయి.
గణపురంలో చుట్టూ మట్టి కోటతో ఉన్న ఈ ఆలయ సముదాయాన్ని కోటగుళ్లు అని, ఊరిలోపల ఉన్న మరో అద్భుత ఆలయాన్ని రెడ్డిగుడి అని పిలుస్తారు. ఆలనాపాలనా లేని రెడ్డి గుడి కూడ నడ్డివిరిగి, నేడో రేపో కూలటానికి స్ధింగా ఉంది.


గణపురం కోట గుళ్లలో, ప్రధానాలయం కుంగి, గోడలు వంగి, ద్వారశాఖలు పగిలి, మండపం కప్పు నేల రాలి, అపురూప శిల్పాలు చెల్లాచెదురై, అవును ఈశ్వరుడు పేదవాడు, అందుకే ఈ ఆలయం ఇలా కునారిల్లు తుందని చూపరులకు కూని రాగాన్ని విని పిస్తుంది. ఇక కళ్యాణ మండపం, ఎత్తైన అధి ష్టానంతో, మధ్యన రంగ శిల, చుట్టూ అరుగులు, వాటిపై శిల్పకళా శోభితమైన స్థంభాలు, చెల్లా చెదురుగా పగిలిన అద్దాన్ని తలపిస్తున్న పై కప్పు, ఆశతో చూడవచ్చిన వారసత్వ ప్రేమి కుల్ని కంటతడి బెట్టి స్తున్నాయి. బాబూ మీరన్నా మళ్లీ మాకు మునుపటి వైభవాన్ని కలిగించ టానికి చేతనైన సాయం చేయండని గడ్డం బుచ్చుకొని బతిమాలు తున్నాయి, బామాలు తున్నాయి. గణపురం ఆలయాలు చిక్కి శల్యమైనా అలనాటి గణపతిరెడ్డి ఆధ్యాత్మిక ఔదా ర్యాన్ని, శిల్పుల కళాకౌశలాన్ని ప్రతిరాయిలోనూ ప్రకటిస్తున్నాయి.


-ఈమని శివనాగిరెడ్డి-స్థపతి,
ఎ : 9848598446

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *