‘డార్విన్‍ పీడకల’-పర్యావరణ విధ్వంసగాథ: ఒక మెటాఫర్‍


సురవరం ప్రతాపరెడ్డిగారు ‘మామిడిపండు’ గురించి వ్యాసం వెనకటికెప్పుడో రాశారు. ఆయన వ్యాసంలో మామిడి పుట్టు పూర్వోత్తరాలు, చరిత్ర, జాతిభేదాలు వ్యాప్తితో పాటు ఆర్థిక విషయాల గురించి ఆసక్తికరమైన విషయాలు తెలియజేశారు. మామిడి చెట్టు పెరగాలంటే ఎటువంటి నేలలు, ఏ శీతోష్ణస్థితిగతులు అవసరమో తెలియజేస్తూ మరికొంత ఆసక్తిని కలిగించే ఉదంతం కూడా రాశారు. ‘‘ఇంగ్లండు చలి ప్రదేశమగుట చేత అచ్చట దీనిని నాటినను పెరుగదు. విక్టోరియా రాణి కాలములో రాజబంధు వొకడు ఇండియా నుండి ఎర్రటిమన్ను బండ్ల కొలది తెప్పించి తన భూమి మన్ను తీసివేసి యీ మన్నును నింపి మామిడి నాటెను. దానికి చలి తగలకుండ విద్యుద్దీపమును తగినంత సప్లయి చేయించెను. ఆరేండ్లకు పెరిగి ఆరు కాయలు కాసెనట. వాటిని విక్టోరియా రాణికి కానుకగా నియ్యకోసెనట. తర్వాత చెట్టెండిపోయెనట’’ ఒక వాతావరణంలో పెరిగే చెట్లు చేమలు, జీవులు దానికి భిన్నమైన పరిస్థితులలో పెరగవు అని ఆర్థమవుతుంది దీనిని బట్టి. ఒకవేళ పెరిగితే ఆ జీవి వల్ల పరిసరాలకు ఎంత నష్టం జరుగుతుందో ఇప్పుడు చూద్దాం.


నైల్‍ సెర్చ్ అనేది ఒక పెద్ద చేప. ఇది మంచినీటిలోనే పెరుగుతుంది. ఆరడుగులు పొడవు, నాలుగువందల పౌండ్ల బరువు వరకు పెరగగల సామర్థ్యం సహజంగానే దానికి ఉంటుంది. ఈ చేప సబ్‍ సహారా ప్రాంతంలోని నదులలో పెరుగుతుంది. నైలు నదిలోనే కాకుండా కాంగో, నిగర్‍ లాంటి ఇతర స్థానిక నదులలోనూ లేక్‍ చాడ్‍, ఇతర ప్రధాన పరీవాహకంలోనూ ఉంటుంది. అయితే తూర్పు ఆఫ్రికాలోని విక్టోరియా సరస్సులో కూడా అర్థ శతాబ్దం క్రిందట పెరుగుతున్నట్లు గుర్తించారు. విక్టోరియా సరస్సుకు ఇది స్థానికం కాదు. ఒక ఆవరణ వ్యవస్థలో పెరిగే జీవన •లాలను మరొక ఆవరణ వ్యవస్థలోకి తీసుకురావటం వల్ల ఎటువంటి పర్యవసానాలు, పరిణామాలు తలెత్తుతాయో తెలుపటానికి దీనిని ఒక ఉదాహరణగా పేర్కొంటూ ఉంటారు. హ్యూబర్ట్ -సౌపర్‍ ‘డార్విన్స్ నైట్‍మేర్‍’ పేరిట అద్భుతమైన డాక్యుమెంటరీ కూడా తీశాడు. ఈ డాక్యుమెంటరీ ఆస్కార్‍కు కూడా నామినేట్‍ అయ్యింది. నైల్‍సెర్చ్ గురించి డాక్యుమెంటు తీశాక అది సృష్టించిన విధ్వంస తీవ్రత ప్రపంచానికి తెలిసొచ్చింది.


పరిమాణంలో అతిపెద్దది కావటం, బలం, దాని అత్యాశవల్ల ఏదైనా తింటుంది. తన సంతతిని కూడా వదలిపెట్టదు. ఇది ఇంచుమించు పదహారు సంవత్సరాలపాటు జీవిస్తుంది. కనుక అది సృష్టించే విధ్వంసం కూడా భారీగానే ఉంటుంది. ఈ నైల్‍ సెర్చ్ను వ్యాపార పంటగా వృద్ధిపరచటానికి విక్టోరియా సరస్సుకు తీసుకురాబడింది. ఎప్పుడైతే అది అక్కడికి చేర్చబడిందో ఆ సరస్సులో పెరిగే స్థానిక చేపలు ఇతర జలప్రాణులు అదృశ్యం కావటం మొదలైంది. అదొక్కటే కాదు అది సృష్టించిన సామాజిక, ఆర్థిక విధ్వంసం కూడా తక్కువేమీ కాదు. భారీ స్థాయిలో నైల్‍ సెర్చ్ను పెంచి అదే స్థాయి వాటిని పట్టేందుకు నిర్వహించే పనులవల్ల స్థానిక మత్స్యకారులు తమ సంప్రదాయ జీవనోపాధిని కోల్పోవలసి వచ్చింది. ఎగుమతుల కోసం ఉద్దేశించటం వల్ల అక్కడి మత్స్య వ్యాపారులు దెబ్బతిన్నారు. ఆ సరస్సు ఒడ్డున ఉండే మత్స్యకార్మికుల సంఖ్య పెరిగింది. ఆయా ఒడ్డున ఉండే పట్టణాలలోని కార్మికులకు ప్రాథమిక సేవలైన నీరు, విద్యుచ్ఛక్తి లాంటివి కూడా తక్కువయ్యాయి. స్థానికులు కొత్తగా వచ్చిన పట్టణ సంస్కృతి, నగదు మార్పిడి ఆర్థిక విధానాలకు అంత త్వరగా అలవాటు పడలేక పనిని వెతుక్కుంటూ తమ ఇళ్లను వదిలి పెట్టారు. వేశ్యావృత్తి పెరిగింది. ఎయిడ్స్ ప్రబలింది. మాదక ద్రవ్యాల వినియోగం కూడా విపరీతంగా అధికమైపోయింది.


ఇదిలా ఉంటే ఈ నైల్‍ సెర్చ్ను సంప్రదాయ బద్ధమైన సూర్యరశ్మిలో ఎండబెట్టడం సాధ్యం కాదు. అది ఎండదు. దానిని కట్టెలు మండించి ఎండబెట్టి భద్రపరచవలసి వచ్చింది. ఫలితంగా ఆ ప్రాంతంలో వంటచెరుకు కూడా తీవ్రస్థాయిలో తగ్గిపోయింది.
ప్రపంచమంతటా తాత్కాలిక లాభాల కొరకు ఎన్నో విధాలుగా ఇటువంటి ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. రాజ్యసార్వభౌమత్యం ప్రైవేట్‍ యాజమాన్యాలు డబ్బుతో ముడివడి సాగించే లావాదేవీల వల్ల పెద్ద మొత్తంలో లాభాలు కొద్ది మందికి అందుతున్నాయి. మరోవైపు స్థానిక సమూహాలకు, పర్యావరణానికి హాని జరుగుతూనే ఉన్నది. రాజ్యం, పెట్టుబడిదారీ యాజమాన్యాలు ముఖ్యంగా ట్రాన్స్నేషనల్‍ కార్పొరేషన్స్ ఇటువంటి వైఖరులను బైటపెడుతూనే ఉన్నాయి. ఏదో ఒక విధంగా బయట పడుతూనే ఉన్నాయి. చిన్న చేపను పెద్ద చేపలు మింగినట్లుగా ఈ వ్యవహారమంతా నడుస్తూనే ఉంది మన కళ్లముందు.


ప్రపంచం మొత్తం మీదా ఆహార కొరత, వ్యాధులు, అధిక జనాభా పెరుగుదలలు జరుగుతున్నాయి. తాత్కాలిక ఆర్థిక లాభాలు లేదా ఇతర మానవ కార్యకలాపాలు మొదలైనవి ఆర్థిక అంతరాలను పర్యావరణ క్షీణతను పెంచటంలో కీలక పాత్రను పోషిస్తూ ఉన్నాయి. నైల్‍సెర్చ్ రాక్షస భక్షకి లాగా తాను ప్రవేశించిన కొత్త ఆవరణ వ్యవస్థను తుడిచి పెట్టింది. లేక్‍ విక్టోరియాలో ఇంకేమీ మిగలకపోతే తనని తానే భక్షిస్తుందంటే అతిశయోక్తేమీ లేదు. మానవ నాగరికత ఉన్నతోన్నత జీవన రూపాలు భూమండలం నుండి తుడిచిపెట్టుకుపోయే పరిస్థితిలో మనమున్నాం. కాలాంతరంలో ఈ తక్షణ లాభాలు తవ్విపోసుకోవటం విధ్వంసం పూరిత చర్యలను మానుకోకపోతే, ఆధునిక పెట్టుబడిదారీ వ్యవస్థలు నైల్‍సెర్చ్లాగా ప్రపంచంలోని బహు ప్రాంతాలను సంస్కృతి, నాగరికతలను మటుమాయం చేయటం ఖాయం. దీనికి విరుగుడు ఏమిటంటే ముందుగా ఈ వ్యవస్థ ఎలా వచ్చిందనేది అర్థం చేసుకోవాలి. ఆధునికత కోసం పదిహేడవ శతాబ్దం నుండి ప్రకృతి నుంచి పిండేయటమనే ధోరణి వచ్చింది. పారిశ్రామిక యుగం దానిని బలపరిచింది. ఒక యాంత్రిక, భౌతిక దృష్టి ఆవరించింది. ఈ దృష్టి పథం మారవలసి ఉంది. తనకు సరిపడని నేలలో బలవంతంగా నాటిన మామిడి చెట్టు కేవలం ఆరుకాయలను మాత్రమే ఇచ్చి తనువు చాలించింది. అంతే తప్ప అది కలిగించిన హాని ఏమీ లేదు. కానీ, నైల్‍ సెర్చ్ వల్ల జరిగిన నష్టం అంతాయింతా కాదు.


తేటనీటిలో జీవించే నైల్‍సెర్చ్కు అనేక పేర్లున్నాయి. ఆఫ్రికన్‍ స్నూక్‍, గోలియల్‍సెర్చ్, ఆఫ్రికన్‍ బరాముండి, గోలియర్‍ బారాముండి లాంటి పేర్లతో పిలుస్తారు. విక్టోరియా సరస్సుకు తీసుకు రావడంతో విక్టోరియా సెర్చ్ అనే పిలవబడింది. కాంగో, నైల్‍, సెనెగల్‍, నిగర్‍ లేక్‍చాప్‍, వోల్టా, లేక్‍ తుర్కానా ఇతర నదీ బేసిన్లలో ఇది స్థానికం. తూర్పు ఆఫ్రికాలో ఆర్థిక, ఆహార భద్రత అనే రెండు కారణాల వల్ల పెంచబడింది. విక్టోరియా సెర్చ్ అనేది తప్పుదోవ పట్టించే వాణిజ్య నామం. హౌసా భాషలో గివాన్‍ రువా అంటారు. అంటే దీనర్థం ‘నీటి ఏనుగు’ అని నైల్‍ సెర్చ్ విధ్వంసమే కాదు పలు వివాదాలను కూడా సృష్టించింది. విక్టోరియా సరస్సు ఆవరణ వ్యవస్థను కాపాడాలని వాదించారు కొందరు. ఈ చేపకున్న ప్రాధాన్యం, ప్రాంతీయ ఆర్థికాలకు, పేదరిక నిర్మూలనకూ దీని పెంపకం అవసరమనే వాదం బలంగానే సాగింది. దీనిని ఎగుమతి కారణంగా స్థానికంగా చేపలు పట్టే మత్స్యకారులు కుటుంబాలలోని పిల్లలకు చేపల వల్ల అందే ప్రొటీన్‍ లోపం, పోషకాహార లోపాలు ఏర్పడి వారి ఎదుగుదలను దెబ్బతీశాయని తేలింది. మత్స్యకారుల కుటుంబాలకు చెందిన పిల్లల్లో 40.2% ఎదుగుదల నిలిచిపోయిందని ఒక అధ్యయనం తేల్చింది. అది సరస్సుకు సమీపాన ఉన్న కుటుంబాల్లోని పిల్లల పౌష్టికాహార లోటు, సరస్సుకు దూరంగా వ్యవసాయ భూముల్లో ఉన్న కుటుంబాల పిల్లల్లో కంటే తక్కువగానే ఉన్నట్లు తేలింది. తల్లుల్లో దీర్ఘకాలంగా 5.7% మేరకు పౌష్టికలోపం ఉందన్నదీ ఒక అధ్యయనం.


విక్టోరియా సరస్సుకు సరిహద్దులలో ఉన్న ఉగాండా, కెన్యా, టాంజానియా దేశాలు నెల్‍సెర్చ్ ఎగుమతుల మీద సుంకం విధించాలనే నిర్ణయాన్ని అంగీకరించాయి. నైల్‍సెర్చ్ వల్ల జరిగిన విధ్వంసాలను నివారించటానికి మరికొన్ని మార్గాలలో చర్యలనూ చేపట్టాయి. ముఖ్యంగా స్థానిక సమాజాలు స్థిరంగా ఉండటానికి మత్స్యకారులు, స్థానిక మత్స్యపరిశ్రమ ఉపయోగ పడాలని ఆశించాయి. విషాదం ఏమంటే పన్ను విధింపుకు అంగీకరించాయి. కానీ అమలుకు నోచుకోలేదు.
1954లో లేక్‍ విక్టోరియాలోకి ప్రవేశపెట్టబడిన నైల్‍ సెర్చ్ పర్యావరణ విధ్వంసాలకు ఒక ‘మెటాఫర్‍’గా పేర్కొంటు ఉంటారు పర్యావరణవేత్తలు, మన పరిసరాలలో ఉన్న జీవరాశులు ఏవి? బయటనుంచి ప్రవేశపెట్టబడినవి ఏవి? అనే వాటి పట్ల కనీస అవగాహన అవసరం.

  • డా।। ఆర్‍. సీతారామారావు
    ఎ : 9866563519

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *