గడియారం రామకృష్ణ శర్మ

‘‘పరమ పావని తుంగభద్ర స్రవంతియే
పరుషమ్ములడగించు గంగాభవానీ
రసలింగ రూపుడౌ బ్రహ్మేశ్వర స్వామి
యెల్లరదన్పు విశ్వేశ్వరుండు
శుభకామనులు దీర్చు జోగులాంబ శ్తి
అఖిల జీవుల బ్రోచు అన్నపూర్ణ
వాస్తు శిల్ప విశేష వైభవాఢ్యము హేమ
లాపురంచే కాశికపురంబు
భవ్య చౌషష్ఠి ఘట్ట సంభరిత మగుచూ
తలప శ్రీగిరి పశ్చిమద్వారమగుచు
వ్యాసముని సన్నుతికి పాత్రమైన భూమి
భద్రగుణరాశి దక్షిణ వారణాశి’’
అని గొంతెత్తి గానం చేసి తెలంగాణలో ఏకైక శక్తిపీఠంగా వెలుగొందుతున్న, దక్షిణ కాశీగా ప్రసిద్ధిచెందిన అలంపుర ప్రాశస్త్యాన్ని చాటిన పండిత కవి కీర్తిశేషులు గడియారం రామకృష్ణ శర్మగారు.


ఇవాళ ఆలంపురాలోని అపురూప ఆలయాన్నీ విశ్వమంతా ప్రాచుర్యం పొందడానికి అవసరమైన చారిత్రక నేపథ్యాన్ని పలు మార్గాల్లో అందించిన మాన్యులు ప్రముఖ చారిత్రక విషయ పరిజ్ఞాన కవి, విమర్శకులు, మహావక్తలు బ్రహ్మశ్రీ గడియారం రామకృష్ణ శర్మగారు.
పాంచజన్యం (కవితా సంపుటి), చంద్రహాస, కువలయానంద సారం, భారీయ వాస్తు విద్య, కన్నడపు చిన్నకథలు వంటి పలు గ్రంథాల్ని రచించి తెలుగు పాఠక లోకానికి అందించిన బ్రహ్మశ్రీ గడియారం రామకృష్ణ శర్మ గారు తెలుగు దేశాన సుప్రసిద్ధులైన పండిత వర్యులు. వారి ప్రతిభ బహుముఖీనమైనది. అనేక కార్యక్షేత్రములకు వారి అసమాన ప్రతిభ కారణంగా చెప్పలేనంత మేలు జరిగింది. పలు వేదికలకు వ్యాపించిన వారి ప్రతిభ ఆయా వేదికలకే వన్నె తెచ్చింది. సాహిత్య, సామాజిక, రాజకీయ రంగాలకు విస్త•త సేవలందించిన వారి జీవితం ప్రతివ్యక్తి విధిగా అధ్యయనం చేసి నేర్చుకోవలసిన ఒక పాఠ్యాంశం అనడంలో ఎటువంటి సందేహం లేదు.
మహోజ్వల చారిత్రక నేపథ్యం కలిగి ఉన్న రాయలసీమలో జన్మించిన బ్రహ్మశ్రీ గడియారం వారు చిన్న వయసులోనే తెలంగాణకు వచ్చి ఇక్కడే స్థిరపడి ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అలంపురాతో పాటు యావత్‍ తెలంగాణకు తమ సేవలను విస్తరింపజేశారు.
అనంతపురం జిల్లాకు చెందిన ‘కదిరి’లో శ్రీ కాలయుక్తి నామ ఫాల్గుణ శుద్ధ చవితి (06.03.1919)న సుప్రసిద్ధ జ్యోతిష్యులు శ్రీ గడియారం జ్వాలాపతి శాస్త్రి, సుబ్బమ్మ దంపతులకు జన్మించారు. వారి ప్రాథమిక విద్య 1929 వరకు కదిరిలోనే కొనసాగింది. తన చిన్నాన్న గారైన రామశర్మగారి వద్ద తాడిపర్తిలో సంప్రదాయ విద్యగా అమరకోశం, శబ్బమంజరి, రఘువంశాది గ్రంథాలను అభ్యసించారు. వాటితో పాటు తెలుగు భాషా సాహిత్యంలోని భారత, భాగవతాదులను కూడా చదవడం ప్రారంభించారు.
కొన్ని ప్రత్యేక కారణాల వల్ల శర్మ గారు మహబూబ్‍నగర్‍ జిల్లాలోని ఆలంపుర గ్రామానికి 1929లో అంటే వారి 11వ యేట వచ్చి మరణ పర్యంతం తమ నివాసంగా దక్షిణ వారణాశి అని ప్రసిద్ది చెందిన ఆలంపురాన్ని స్థిరపర్చుకున్నారు. 1930-31లో శర్మగారు ఆలంపురాలోనే తమ మాధ్యమిక విద్యను పూర్తిచేశారు. దాంతో శర్మగారి జీవితంలో పాఠశాల విద్య ముగిసినట్లే. ‘‘పుణ్యగుణ భూమియైన ఈ తెలంగాణ సీమ’’ శర్మగారి వంటి మహా విద్వాంసుని తనవానిగా చేసుకుంది.


పాఠ్యశాల విద్య ఆగిపోయినా శర్మగారిలోని జ్ఞానతృష్ణ తననొక జిజ్ఞాసునిగా మార్చినది. ఆ తృష్ణే శర్మగారిని మహావిద్వద్వరేణ్యులు, శతావధానులు, బ్రహ్మశ్రీ వేలూరి శివరా శాస్త్రుల వారి సన్నిధికి చేర్చింది. వారివద్ద చేసిన శిష్యరికం శర్మగారి జీవితంలోనే ఒక మహత్తర ఘట్టం. సంప్రదాయక రీతిలో కావ్య నాటకాలంకార వ్యాకరణములను అభ్యసించిరి. శర్మగారిలోని సహజమైన ప్రతిభా పాండిత్యాలు గురువు గారి ప్రేరణ కారణంగా రాణించే సమయం రావడం వారి సహచర్యం వల్ల శర్మగారిలో నూతన వికాసం కలగడం వారి జీవితంలోనే అతిపెద్ద మలుపు. ప్రతి విషయంలోనూ ఉన్నత ఆదర్శాలకు మాత్రమే స్థానం కల్పించడం, త్రికరణ శుద్ధితో జీవన యానాన్ని సాధించడం, ఉత్తమ విలువలకు పెద్దపీట వేయడం, మానవతా దృక్పథానికి అంకితం కావడం వంటి సలక్షణాలు శర్మగారికి గురువు గారి వలన కలిగిన సుగుణాలు. 1937 నుంచి 1939 వరకు శర్మగారు శాస్త్రిగారి వద్ద శిష్యునిగా ఉండి పలు విషయాలపై విస్త•త అవగాహనను పొందారు. పుత్రవాత్సల్య సమమైన వారి శిష్య వాత్సల్యం శర్మగారి జీవితంపై గొప్ప ప్రభావాన్ని చూపించింది.
బ్రహ్మశ్రీ వేలూరి శివరామ శాస్త్రిగారి వద్ద నుంచి తిరిగివచ్చిన శర్మగారు మరింత దీక్షతో వారు చూపించిన మార్గంలోనే విద్యార్జన కృషి సాగించి పఠనాపాఠనాదులను కొనసాగించి తమలోని ప్రతిభకు మరింత వన్నెపెట్టిరి. కవితా కళను సాగిస్తూనే పాండితీ బలాన్ని కూడా పెంపొందింప జేసుకున్నారు. ఆంగ్ల, హిందీ, కన్నడాది భాషా సారస్వతాల అధ్యయనం చేసి స్వయంకృషితో ఎన్నో లోతులు సాధించారు.


ఆలంపురమే స్థిరనివాసంగా చేసుకున్న శర్మగారు అప్పటికే తాలూకాలో ప్రసిద్ధమైన గ్రంథాలయాలుగా పేరుబడ్డ ఉండవెల్లిలోని సరస్వతీ గ్రంథాలయంలోనూ ఆలంపురాలోని రామకృష్ణారెడ్డి స్మారక గ్రంథాలయంలోనూ వివిధ గ్రంథాలను అధ్యయనం చేసి తమ వైదుష్యాన్ని అభివృద్ధి చేసుకున్నారు. ఈ సమయంలోనే శర్మగారు తమచదువుతో పాటు.. స్వీయానుభావం వలన, స్వయంకృషి వలన అనేక విద్యా విషయాలతో పాటు… భావి జీవితానికి ఉపయుక్తములయ్యే పలు కార్యములకు సంబంధించిన విశేషజ్ఞాన సముపార్జన చేసి సమయాన్ని సద్వినియోగపర్చుకున్నారు.
కేవలం సాహిత్యవేత్తగానే గాక, శర్మగారు ఒక చరిత్ర పరిశోధకునిగా, వాస్తు, శిల్ప, లిపి, శాస్త్రాదులందు అభిరుచిగల జిజ్ఞాసునిగా తమను తాము మలుచుకొని ఆయా రంగాలలో అధికంగా పరిశ్రమించి జ్ఞాన సముపార్జనం చేశారు. వీటితోనే సరిపెట్టుకోక.. నాటక కళారంగ సేవ, సమాజ సేవ, గ్రంథాలయోద్యమ నిర్వహణ, భాష ప్రచారోద్యమ సేవ వంటి పలు రంగాలకు తమ సేవలను విస్తరించారు.


1940-59 మధ్యకాలంలో నాటక రంగానికి విస్త•త సేవలందించారు. అనేక నాటక ప్రదర్శనలు నిర్వహించి ఆలంపురాలో ‘ఆంధ్ర యువజన నాట్యమండలి’ని స్థాపించి దర్శకులుగా, నటులుగా హరిశ్చంద్ర, శ్రీకృష్ణ, బిల్వమంగళ, ఖడ్గ, నారాయణాది పాత్రలను తామే ధరించి తెలుగు నేలపై విశేష ఖ్యాతినొందారు.
నాటి నిజాం ఏలుబడిలో తెలుగును, తెలుగుదనాన్ని మరిచిన ప్రజలకు తెలుగు పరిమళాలను వెదజల్లే ప్రయత్నమే ఆంధ్రోద్యమమై వ్యాప్తి చెందింది. స్వాతంత్య్రోమంలో మిక్కిలి
ఉత్సాహంగా పాల్గొంటున్న శర్మగారు అంతకు రెండింతల ఉత్సాహంతో ఆంధ్రోద్యమంలోనూ పాల్గొన్నారు.


ఆంధ్రోద్యమంతో పాటు.. గ్రంథాలయోద్యమంలోనూ చురుకుగా పనిచేసిన శర్మగారి కృషి అసాధారణం. 1940 నుంచి 1956 వరకు ఈ ఉద్యమాలే ఊపిరిగా శర్మగారు పనిచేశారు. స్వాతంత్య్రానంతరం రాజకీయాల్లో కల్మషాలకు విసిగి ఆ రంగాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నారు.
పత్రికా రంగం పట్ల ఆసక్తి ఉన్నవారు శర్మగారు. 1950-53 మధ్యకాలంలో ‘‘సుజాత’’ మాసపత్రికకు సంపాదకులుగా వ్యవహరించారు. ‘‘తెలంగాణ సంచిక’’ ‘‘సప్తమ వార్షికోత్సవ సంచిక’’లుగా వారి సంపాదకత్వంలో వెలువడ్డ ప్రత్యేక సంచికలు. నేటికీ పలువురి ప్రశంసలకు పాత్రమవుతూనే ఉన్నాయి.
వారి మరో ప్రధాన రంగ చరిత్ర. విశేషమైన చరిత్ర కలిగిన ఆలంపురాలని శ్రీ బాలబ్రహ్మేశ్వర దేవస్థానానికి ట్రస్టు బోర్డు అధ్యక్షులుగా 1954 నుంచి కొన్ని దశాబ్దాల పాటు గణనీయమైన సేవలందించారు గడియారం వారు.


కీర్తిశేషులు గడియారం రామకృష్ణ శర్మగారు తమ 18వ యేటనే చంద్ర హాసోపాఖ్యానం అనే పద్యకావ్య రచన చేసి సాహిత్య రంగంలోకి అడుగుపెట్టారు. ఆలంపుర శిథిలములు, దక్షిణ వారణాశి ఆలంపుర క్షేత్రం వంటి చరిత్ర సంబంధించి రచనలతో పాటు.. భారతదేశపు చరిత్ర, ప్రపంచ రాజ్యముల వంటి గ్రంథములను వారు అందించారు. మన వాస్తు సంపదను గురించి వారు రాసిన గ్రంథము ఆ శాస్త్రంలో శర్మగారికి ఉన్న పాండిత్యానికి నిదర్శనం. చరిత్ర పరిశోధన మాత్రమే కాక… శాసన పరిశోధనలోనూ పరిణత ప్రజ్ఞ కలిగిన శర్మగారు వినయాధిత్యుని పల్లెపాడు తామ్ర శాసనం తెలంగాణ శాసనములు (రెండో భాగం) కూడా వెలువరించారు. వారు కన్నడం నుంచి అనువదించిన బి.ఎం. శ్రీ కంఠయ్య గారి గదాయుద్ధ నాటకమునుకు 1970లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది.


వీరిలోని కార్యదక్షతకు, మేధాశక్తికి అబ్బురపడిన అనేక సంస్థలు వారి సేవలను ఉపయోగించుకున్నాయి. వారు 1965 నుంచి 1975 వరకు ఆంధప్రదేశ్‍ సాహిత్య అకాడమీ సభ్యులు. 1968-70లలో కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు సలహా మండలి సభ్యులు. 1962 నుంచి దాదాపు ఒక దశాబ్ద కాలం వారు గ్రంథాలయ సంస్థ సభ్యులు. 1970 ప్రాంతంలో ఆంధ్రోద్యమ చరిత్ర నిర్మాణ సంఘంలో సభ్యులు. ఉస్మానియా విశ్వవిద్యాలయం అకాడమిక్‍ కౌన్సెల్‍లో 1970 నుంచి సభ్యునిగా సేవలందించారు. ఇవి మాత్రమే కాక ఆలంపుర తాలూకాలోని రైతుల కొరకు కృషి చేసి రైతులందరినీ సంఘటితపర్చి ‘‘ఆలంపుర వ్యవసాయ సంఘాన్ని’’ ఏర్పర్చిరి.


వీరిలోని మరో ఘనమైన పార్శ్వం సంఘ సంస్కరణ. మూఢాచారాలను తీవ్రంగా వ్యతిరేకించే శర్మగారు 1945 నుంచి 1965 వరకు స్త్రీ జనాభ్యుదయం కొరకు ఒక మహాసంస్థ వలె కృషి చేశారు. స్వయంగా వితంతు వివాహం చేసుకున్న శర్మగారు ఆ స్ఫూర్తితో ఆ రోజుల్లో హైందవ బాలవితంతువుల వివాహాలు తాము దగ్గరుండి జరిపించిచడమేగాక… ఎదిరించిన పండితులతో శాస్త్ర వాదములు చేసి పునర్‍ వివాహములు శాస్త్ర సమ్మతములేనని నిరూపించుకున్నారు. ఆలంపురాలో అనాథ స్త్రీల కొరకు ప్రత్యేక విదాల్యం స్థాపించి హిందూ, ముస్లిం, క్రైస్తవ విద్యార్థులకు శిక్షణ ఇప్పించారు. దానివల్ల పలువురు స్త్రీలు జీవనోపాధి పొందడం శర్మగారి కృషికి ఫలితం.


గడియారం రామకృష్ణ శర్మగారి జీవితం ఒక మహాత్ముని జీవితం వంటిది. స్వాభిమానంతో స్వతంత్ర జీవనాన్ని గడిపి తాము జీవించినంత కాలం లోకపకారమే లక్ష్యంగా సాగిన మాన్యులు శ్రీ రామకృష్ణ శర్మగారు 2006 జులై 25వ తేదీన తుదిశ్వాస విడిచారు. భౌతికంగా శర్మగారు లేకున్నా తెలుగు నేలపై సాహితీ సంస్కృతులు విలసిల్లినంత కాలం శర్మగారు చిరంజీవులే.
(తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ప్రచురించిన ‘తెలంగాణ తేజోమూర్తులు’ నుంచి)


-డా।। గన్నవరాజు గిరిజా మనోహర బాబు

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *