తెలంగాణ ప్రాంతంలో గ్రానైట్ అనే పేరు విననివారు ఉండరు. మన దైనందినజీవితంలో అడుగడుగునా గ్రానైట్లు కనిపిస్తాయి. రోడ్డువేసే కంకర, పక్కన ఉన్న మైలురాయి, అనేక రకాల స్తంభాలు, గోడలకు వాడిన రాళ్ళు, దేవాలయంలో మంటపాలు, శిల్పాలు ఇంట్లో ఫ్లోరింగ్, వంటింటి స్లాబ్ ఇలా ఒకటేమిటి ఎటుచూసినా మనచుట్టూ గ్రానైట్ కనిపిస్తుంది. ఇంతకీ అసలీ గ్రానైట్‍లో ఏముంది, మనదగ్గరే ఎక్కువ ఎందుకు ఉంది. దీని వివరాలు పరిశీలిద్దాం..
‘‘గ్రానైట్’’ అనే పదానికి ప్రాచీనభాషలలో మూలాలు ఉన్నాయి.
వ్యుత్పత్తి:
- ఫ్రెంచ్ ‘‘గ్రానైట్’’ నుండి (17వ శతాబ్దం)
- ఇటాలియన్ ‘‘గ్రానిటో’’ (16వ శతాబ్దం) నుండి తీసుకోబడింది.
- లాటిన్ ‘‘గ్రానమ్’’ నుండి ఉద్భవించింది అంటే విత్తనం లేదా గింజలు అనే అర్ధం.
- పురాతన లాటిన్ పదం ‘‘గ్రానరో’’తో కూడా సంబంధించినది కావచ్చు అనగా అంకురించు లేదా ఎదుగు అని అర్థం.
పూర్వం గ్రీకులు రోమన్లు గ్రానైట్ ను దాని కణస్వభావం వల్ల ‘‘లాపిడస్ గ్రానాటి’’ లేదా ‘‘లాపిస్ గ్రనటస్’’గా వ్యవహరించారు. ఇటలీలో మన్నికగా దృఢంగా పెద్దకణాలున్న రాళ్ళను ‘‘గ్రానిటో’’గా వర్తకులు వ్యవహరించేవారు.
ఫ్రెంచ్ భూవైజ్ఞానికులు 17వ శతాబ్దంలో గ్రానైట్ అనే పదం వాడుకలోకి తెచ్చారు. ఈ పదం ఇప్పుడు వైజ్ఞానికంగా వాణిజ్యపరంగా విశేషంగా వాడుకలోకి వచ్చింది. అయితే వాణిజ్య పరంగా గ్రానైట్ అనే పదం గ్రానైట్, గ్రానైటాయిడ్ లకే కాకుండా పెనిన్సులర్ గ్నిసిక్ కాంప్లెక్స్ (PGC)లో దొరికే అన్ని రకాల శిలలకూ వాడతారు.
గ్రానైట్ ఒక అగ్నిశిల, శిలాద్రవం యొక్క నెమ్మదిగా శీతలీకరణ జరగటం వల్ల ఏర్పడుతుంది. దాని విలక్షణమైన చుక్కల్ని (sparkled) లేదా (veins) సిరలరూపాన్ని కలిగి ఉంటుంది. ఖనిజ పరంగా ఇందులో క్వార్టజ్ సమృధ్ధిగా ఉంటుంది. ఫేల్డస్పార్ రెండవస్థానంలో ఉంది. బయోటైట్ కూడా ఉంటుంది. హార్న్ బ్లెండ్ వంటి ఖనిజాలు తక్కువ మొత్తంలో ఉంటాయి.
హైదరాబాద్ ప్రాంతంలో ఉన్న గ్రానైట్ భారతదేశంలో ఉన్న అన్ని గ్రానైట్ ప్లుటాన్‍లో కన్నా పెద్దది. ఇది తూర్పుధార్వార్ క్రటాన్‍లో భాగంగా ఉంది. ఆర్కియన్ క్రస్టల్ కారిడార్‍లో మూడురకాల ముఖ్యమైన శిలలు ఉంటాయి.
కస్టల్ కారిడార్ శిలలలో రకాలు:
1.ప్రారంభ దశలో ఏర్పడ్డ టోనలైట్‍బిట్రోండ్‍జెమైట్ బిగ్రానోడయోరైట్ (TTG)
2.గ్రీన్‍స్టోన్ బెల్ట్
3.చివరి దశలో అంతర్గమం చెందిన అనాటెక్టిక్ హై K గ్రానైటిక్ సీక్వెన్స్.
ఈ చివరిదశలో ఏర్పడిన గ్రానైట్‍లు క్రస్టల్ నిర్మాణంలో కీలకపాత్ర పోషించాయి. ఈ శిలాసమూహాలు అన్ని ధార్వార్ క్రటాన్‍లో కనిపిస్తాయి. ఈ ధార్వార్ క్రటాన్ తూర్పుభాగంలో ఉన్న హైదరాబాద్ ప్రాంతంలో బహిర్గతమైన విశాల గ్రానైటిక్ భూభాగాన్ని, హైదరాబాద్ గ్రానైట్ బాథోలిత్ (HGB)అని అంటారు. ఇది ఆప్లైట్స్, గ్రానైట్‍లు, గ్రానోడయోరైట్స్, మోంజోగ్రానైట్స్, సినోగ్రానైట్స్ అలస్కైట్స్ మొదలైన వివిధరకాల గ్రానెటాయిడ్‍ల సమూహం. ఈ గ్రానైటిక్ భూభాగాల వయస్సు 250 కోట్ల సంవత్సరాలు. ఈ శిలలు ఇదే ధార్వార్ క్రటాన్ లో ఉన్న క్లోజ్‍పేట్ గ్రానైట్‍లతో పోల్చదగినవి.
హైదరాబాద్ గ్రానైట్ బాథోలిత్ (HGB):
HGBలో మోలిబ్దినం మినిరలైజేషన్ కూడా పీరంచెరువు మరియు తారామతిపేటలో గుర్తించబడింది. హైదరాబాద్ ప్రాంతంలోని గ్రానైట్‍ల చుట్టూ ప్రీకేంబ్రియన్ గ్నీసిక్ కాంప్లెక్స్, కరీంనగర్ గ్రాన్యులైట్ బెల్ట్, గోదావరి గ్రాబెన్, కడప బేసిన్ మరియు దక్కన్ ట్రాప్లు ఉన్నాయి.
HGB 10 కి.మీ. కంటే ఎక్కువలోతు వరకు విస్తరించి, 10000 చ.కి.మీ విస్తీర్ణంలో వివిక్తమూలాన్ని కలిగి ఉంది. ఈ బాథోలిత్ లో పెద్ద మరియు చిన్న లీనియమెంట్స్ ఉన్నాయి. గ్రానైట్ పుట్టుకకు పూర్వం ఏర్పడిన భ్రంశాలు అక్కడక్కడ ఉండి అప్పుడప్పుడు సర్దుబాటుకు గురికావడం వల్ల నియోటెక్టానిక్ మార్పులకు కారణం అవుతాయి.
హైదరాబాద్ గ్రానైట్‍లు రసాయనిక కూర్పులో ఎక్కువ పెరలుమినస్, ఆల్కలీ నుండి ఆల్కలీ క్యాల్సిక్ స్వభావం కలిగి
ఉన్నాయని అధ్యయనాలు సూచించాయి. ప్రధానంగా సబార్డినేట్ ప్లాజియోక్లేస్‍తో K ఫెల్డ్స్పార్, క్వార్టజ్ మరియు బయోటైట్‍లను కలిగి ఉంటుంది. LRRE HREE కన్నా ఎక్కువ మరియు వీటిలో SrTiమరియు Nbఎనామలీ రుణాత్మకంగా ఉంది.
గ్రానైట్ రకాలు:
పింక్ గ్రానైట్: హైదరాబాద్‍లో విరివిగా కనిపించె ఈ గ్రానైట్‍లో గులాబీరంగు ఖ-ఫెల్డస్పార్ ఉంటుంది. దీనివల్ల గ్రానైటులు గులాబీరంగులో కనిపిస్తాయి. ఇవి ప్లాజియోక్లేజ్ మెటాసోమాటిజం చెంది K-ఫెల్డస్పార్‍గా మారటంవల్ల ఇలా జరుగుతుంది.
గ్రే గ్రానైట్: గ్రే గ్రానైట్‍లో ప్లాజియోక్లేజ్ ఎక్కువగా ఉంటుంది.
ఈ రెండు గ్రానైట్లలో క్వార్టజ్ సంవృధ్ధిగా ఉంటుంది. బయోటైట్ కూడా ఉంటుంది. ఇతర మాఫిక్ ఖనిజాలు తక్కువమొత్తంలో ఉంటాయి.
హైదరాబాద్‍లో ఉన్న కొన్ని ముఖ్యమైన గ్రానైట్ గుట్టలు
1.బంజారాహిల్స్ (17.402ON, 78.437OE)
2.జుబ్లీహిల్స్ (17.445ON, 78.461OE)
3.గోల్కొండ హిల్స్ (17.384ON, 78.401OE)
4.శామీర్ పేట హిల్స్ (17.533ON, 78.533OE)
5.ఖాజాగూడ హిల్స్ : (17O 22’0″N 78O 32′ 0″E )
6.రాచకొండగుట్టలు (హైదరాబాద్ శివారులో)
హైదరాబాద్ ప్లూటాన్ యొక్క భౌతికవ్యక్తీకరణ వ•త్తాకార రూపంలో ఉంటుంది. ఇందులో జుబ్లీహిల్స్ ఈ మార్ఫోటెక్టానిక్ ముడిమధ్య ఉంటుంది. ఈ ముడిభ్రంశాలు మరియు లీనియమెంట్స్ ఒకదానిని ఒకటి ఖండించుకోవడంవల్ల ఏర్పడినవి. వీటివల్ల స్థానికంగా కొద్దిపాటి భూకంపాలు రావచ్చని శాస్త్రజ్ఞుల అంచనా. మంజీరానది మరియు మూసీనదులు ఈ ప్లూటాన్ యొక్క వాయువ్య, ఆగ్నేయదిశల్లో విస్తరించలేకపోయిన భుజాల (failed arms)లో ఉంటాయి.
బ్లాక్ గ్రానైట్ (డోలరైట్): ఇది ఒక రకమైన అంతర్గమ అగ్నిశిల. ఇది భూమి యొక్క క్రస్ట్లో లోతైన శిలాద్రవం గ్రానైట్‍లోకి అంతర్గతం చెంది శీతలీకరణ జరగటంవల్ల ఏర్పడుతుంది.
బ్లాక్ గ్రానైట్ యొక్క నిర్దిష్ట లక్షణాలు:
1.అధిక ఇనుము మరియు మెగ్నీషియం ఉన్న కారణంగా ముదురురంగులో కనిపిస్తాయి.
2.యాంఫిబోల్ లేదా పైరోక్సిన్ ఖనిజాల ఉనికి ఉంది.
3.ఫైన్ నుండి మీడియం కణపరిమాణం కలిగి ఉంటుంది. సాంకేతికంగా దీన్ని డోలరైట్ డైక్ అంటారు.
సాధారణంగా ఇవి నలుపురంగులో ఉన్న చారలవలె దూరం నుంచి కనిపిస్తాయి. స్థానికంగా వీటిని ఏనెరాళ్ళు అంటారు.
ఈ డైక్‍లు తూర్పు ధార్వార్ క్రటాన్‍లో అయిదు క్లస్టర్ లుగా ఉన్నాయి. అందులో హైదరాబాద్ క్లస్టర్ ఒకటి.
ఇవి ఎక్కువగా ఉత్తర ఈశాన్యం నుండి దక్షిణ వాయవ్యం (NNE-SSW) ఒక్కోసారి పూర్తి ఉత్తర,దక్షిణంగా ఉన్న డైకులు తూర్పు ఈశాన్యం – పశ్చిమ నైరుతి (ENE-WSW) దిశగా ఉన్న డైకులను ఖండిస్తూ ఉంటాయి. ఇందులో ఎక్కువభాగం డోలరైట్ డైకులే. వీటి వయసు 147 కోట్ల నుండి 133 కోట్ల సంవత్సరాలు ఉండవచ్చని అంచనా. కొన్ని తూర్పు పడమరగా ఉన్న డైకులు 240 కోట్ల సంవత్సరాల వయస్సు కలవని, ఉత్తర దక్షిణంగా ఉన్న డైకులు 220 కోట్ల సంవత్సరాలనాటివి అని అంచనా వేస్తున్నారు. ఈ శిలలు నిర్మాణాలకు, అలంకరణకు మరియు శిల్పాలుగా ఉపయోగిస్తారు.
క్వార్ట్జ్ మరియు ఎమిధిస్ట్:
హైదరాబాద్ ప్రాంతంలో ఉన్న గ్రానైట్‍లో అక్కడక్కడ స్పటికరూపంలో ఉన్న క్వార్టజ్, ఎమిధిస్ట్ ఉన్నట్టు తెలుస్తోంది. ఇంతకు ముందు బోయినపల్లిలో ఉప్పల్‍లో ఎమిధిస్ట్ దొరికినట్లు సమాచారం. ఇటీవల మస్జిద్ బండ వద్ద క్వారీలో మంచి క్వార్టజ్ స్పటికాలు దొరికాయి.
మైసూరు శిలలు:
మైసూరు చుట్టూ ఉన్న శిలలు ఆర్కియన్-ధార్వార్ క్రేటన్‍లో భాగంగా ఉన్నాయి. మైసూరు చుట్టూ ఉన్న అతిపురాతనశిలలు సియాలిక్ (సిలికా మరియు అల్యూమినాతో సమృద్ధిగా ఉంటాయి). వీటిని పెనిన్సులర్ నీస్ అని పిలుస్తారు. Gneissic శిలలలోని జిర్కాన్ రేణువుల యొక్క U-Pb (యురేనియం మరియు సీసం) ఐసోటోపిక్ అధ్యయనాల వల్ల 3.4 ఈ శిలాల వయస్సు బిలియన్ సంవత్సరాలుగా తెలుస్తుంది. ఇటువంటి శిలలు ఇప్పుడు మైసూరు ప్రాంతం నుండి ఐరోపాకు అలంకారప్రయోజనాల కోసం ఎగుమతి చేయబడుతున్నాయి. క్వార్ట్జైట్‍లు, కార్బోనేట్‍లు, ఇనుపరాళ్లు మరియు పెలిటిక్ శిలలతో కూడిన మెటాసెడిమెంటరీ శిలలసమూహం ఈ basementశిలలపై నిక్షిప్తం చేయబడింది. మైసూరు నగరానికి నైరుతి దిశలో సర్గూర్ పట్టణం చుట్టూ ఈ శిలలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ శిలాసమూహానికి ‘సర్గూర్ సిస్ట్ బెల్ట్’ అనే పేరు వచ్చింది. ఈ ప్రాంతంలో అవక్షేపణ శిలలు ఉండటంవల్ల ఈ ప్రాంతం భౌగోళికగతంలో సముద్రంలో మునిగి పోయిందని సూచిస్తుంది.
ఈ బేస్మెంట్ లో ఉన్న అల్ట్రామాఫిక్-మాఫిక్ శిలలు డ్యూనైట్, హార్జ్బర్గిట్, లెర్జోలైట్, పెరిడోటైట్స్, పైరోక్సెనైట్స్ మరియు గాబ్రోస్ మొదలైన శిలలతో కూడి వైవిధ్యభరితమై ఉంటాయి.
గ్రానైటుశిల్పాలు:
అయోధ్య రాముడు:
అయోధ్యారాముడి విగ్రహం కొరకు ఉపయోగించిన శిల గురించి ఆసక్తి చాలామందిలో ఉంది. హెచ్‍డి కోటే తాలూకా లోని జయపుర హోబ్లీ వద్ద గుజ్జేగౌడనాపుర నుండి త్రవ్వబడిన ఆకాశనీలంరంగు క•ష్ణశిల నలుపు గ్రానైట్‍గా భావిస్తారు కాని ఇది ఒక ‘‘చీలికరాయి’’. సిస్ట్ (schist). దీనిలోని రేణువులు మధ్యస్థ-కణిత నుండీ సన్నటి రేణువులుగా ఉంటాయి. దీని రంగు ఆకాశ-నీలం-రంగు. ఇది ఒక రూపాంతరప్రాప్తశిల. విగ్రహాలను చెక్కడానికి ఇది చాల అనువైనది.
బుద్ధ విగ్రహం:
హుస్సేన్ సాగర్‍లో ప్రతిష్టించిన 350 టన్నుల బరువు, 18మీటర్ల ఎత్తున్న బుద్ధుని విగ్రహం తెలుపు గ్రానైట్ లో చెక్కబడింది. ఈ రాయి రాయగిరి ప్రాంతంలో ఉన్న గ్రానైట్ క్వారీ నుండి సేకరించారు. ఇక్కడి గ్రానైట్‍లో క్వార్టజ్ సమ•ధ్ధిగా ఉన్నట్లు తెలుస్తోంది. దీనిని ప్రపంచంలో కెల్లా అతిపెద్ద ఏకశిలా బుద్ధవిగ్రహం అని అంటారు.
ఐశ్వర్య గణపతి:
నాగర్ కర్నూల్ జిల్లా, తిమ్మాజీపేట మండలంలో ఉన్న ఆవంచ గ్రామంవద్ద 30 అడుగుల ఎత్తున్న వినాయకవిగ్రహం ఉంది. ఇది భారత దేశం లో అతిపెద్ద ఏకశిలా వినాయక విగ్రహం అంటారు. ఈ పదకొండవ శతాబ్దపు విగ్రహం గ్రానైట్ శిలపై చెక్కబడింది.
భూకంపాలు-గ్రానైట్లు:
హైదరాబాద్ ప్రాంతం భూకంపాలురాని సురక్షితప్రాంతం అని తొలుత భావించినా ఈ గ్రానైట్ బాతోలిత్ స్వరూప, స్వభావాలవల్ల కొద్దిపాటి భూకంపాలకు లోనయ్యే అవకాశం ఉంటుందని తెలుస్తోంది. 14 జనవరి 1982 నాడు ఉస్మాన్ సాగర్ ప్రాంతంలో 3.5 తీవ్రత గల భూకంపం వచ్చింది. తర్వాత మేడ్చల్ ప్రాంతంలో 30 జూన్ 1983 నాడు 4.5 తీవ్రత గల భూకంపం వచ్చింది. ఆ తర్వాత కుషాయి గూడలో 25 ఆగస్టు 1984 నాడు చిన్నచిన్న ప్రకంపనలు వచ్చాయి. 29 నవంబర్ అదే సంవత్సరంలో మూడు ప్రకంపనలు సరూర్ నగర్ లో వచ్చాయి. జుబ్లీహిల్స్లో 1994, 95, 98 మరియు 2000 సంవత్సరాలలో సూక్ష్మ ప్రకంపనలు వచ్చాయని రికార్డులు ఉన్నాయి.
వీటన్నింటికి అనేక భూవైజ్ఞానిక కారణాలు ఉన్నాయి. సాధారణంగా క్రటాన్ చాలాస్థిరంగా ఉండే భూభాగం. కాని భారత ఉపఖండంలో ఉన్న క్రటాన్ లలో భూమి కర్పరం (crust) ఎక్కువ మందంగా లేదు. ధార్వార్ క్రటాన్‍లో కూడా ఇదే పరిస్థితి. హైదరాబాద్ క్రింద ఉన్న కర్పరం సరాసరి మందం 34కి. మాత్రమే అని భూభౌతిక శాస్త్రజ్ఞుల అభిప్రాయం. ఈ అంశాలన్నీ కలిసి తక్కువ తీవ్రతలోనైనా సరే, భూకంపాలకు కారణం అవుతున్నాయి. మంజీరానది భౌమకాలంలో ఒకప్పుడు మూసీనదిలోకి ప్రవహించేది కాని నవీన విరూపణ (చీవశీ•వ••శీఅఱ•ఎ)వల్ల హైదరాబాద్ ప్రాంతం కొద్దిగా పైకిలేచినందున ఈ నది దిశను మార్చుకుంది.
విధ్వంసక దృశ్యం:
భూవిజ్ఞానశాస్త్ర పరంగా ఒక విధ్వంసంకర పరిస్థితిలో ఏర్పడిన షియర్ జోన్ రంగాపుర్ శివన్నగూడెం మధ్యలో ఇటీవల కనుగొన్నారు. ఇది తూర్పు ధార్వార్ క్రెటాన్ లోనే మెదటిది. ఇందులో బ్రిక్షియా, కెటాక్లాస్టైట్, మైలోనైట్ వంటి శిలలు ఉండటం, తీవ్రమైన ఫ్రాక్చరింగ్ వంటి లక్షణాలవల్ల ఈ శిలలు అత్యధిక విరూపణకు గురి అయినట్లు సూచిస్తున్నాయి.
భూగర్భజలాలు:
హైదరాబాద్ యొక్క పగుళ్లుకల గ్రానైట్‍లో హైడ్రోలాజికల్ పరిస్థితులు భిన్నమైనవి. నీటి రీఛార్జ్ శైధిల్యం చెందిన జోన్లో మొదలై క్రమంగా షీట్ జాయింట్‍లోకి జరుగుతుంది. దూరప్రాంతంలో నుండి శైధిల్యజోన్ వరకు భూగర్భజలాల రీఛార్జ్ యొక్క మూలాలు ఉన్నట్లు అధ్యయనాలు సూచిస్తున్నాయి. గ్రే మరియు పింక్ గ్రానైట్ మధ్య కాంటాక్ట్ జోన్ భూగర్భ జలాలకు అత్యంతఅనుకూలమైనది. భూగర్భజలాలు శైధిల్యంచెందిన శిలలలో మరియు పగుళ్లు, షీర్ జోన్‍లలో కన్ఫైన్డ్ సెమీ కన్ఫైన్డ్ పరిస్థితుల్లో ఉన్నాయి. భూగర్భజలాల క్షీణత చాలా వేగంగా జరుగుతోంది. నగరంలోని చాలా ప్రాంతాల్లో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయాయి. లోతైన భాగంలో లభించే నీటికోసం 1200 నుండి 1500 అడుగుల బోరుబావులు తవ్వుతున్నారు. సరస్సులు మరియు నీటి వనరుల సరైన రక్షణ చేపట్టకపోతే హైదరాబాద్‍లో బెంగళూరులాంటి పరిస్థితి ఏర్పడుతుంది.
గ్రానైట్స్లో సాంస్కృతిక విశేషాలు:
గ్రానైట్ గుట్టల్లో ఎన్నోచోట్ల రాతిచిత్రాలున్న తావులున్నాయి. దాదాపు 30వేల సంవత్సరాల కిందటి పురామానవులు గీసిన ఈ రాతిచిత్రాలలో నాటి పురామానవుల సంస్కృతి చిత్రించబడ్డది. అవి మన మానవవికాసాన్ని మనకు చెప్పే చితగ్రంథాలు. కాని, గ్రానైట్ రాళ్ళను క్వారీలుగా, క్రషింగ్ ప్లేసెస్ గా, రియల్ ఎస్టేట్లుగా మార్చిన తర్వాత ఆ రాతిచిత్రాల తావులు మాయమైపోతున్నాయి. కోకాపేట రాతిచిత్రాలు నేలగూలాయి. గుండ్లపోచంపల్లి రాతిచిత్రాలు కనుమరుగు కానున్నాయి. కరీంనగర్ ప్రాంతంలో వందలాది గుట్టలు క్రషింగ్‍కు గురైనాయి. వాటిలో ఎన్నెన్ని పురామానవుల ఆవాసాలు, రాతి చిత్రాల తావులు ధ్వంసమైపోయాయో.
కీసరగుట్టలో తొలి తెలుగు శాసనం ‘తొలుచువాన్డ్రు’ కూడా గ్రానైట్ రాతిగోడకే చెక్కివుంది. ఎన్నో అద్భుతమైన శిల్పాలు గ్రానైట్ శిలలమీద చెక్కబడ్డాయి. కాపాడుకుంటే కాపాడుకున్నంత చరిత్ర, లేకపోతే రాతి ఇటికెలో, కంకరో, రాతిపొడో మాత్రమే.
-చకిలం వేణుగోపాలరావు
డిప్యూటి డైరెక్టర్ జనరల్ జిఎస్సై(రి)
ఎ: 9866449348
శ్రీరామోజు హరగోపాల్,
ఎ : 99494 98698