ఆ గుడిలో ఒకప్పుడుండేది నాలుగువేదాలు వల్లించిన బడి. అది నిత్య కళ్యాణం, పచ్చతోరణంలా వెలుగొందిన శివుని గుడి. గర్భాలయ, అర్ధమండపాలతో, ఎత్తైన శిఖరం, దానిపైన ధగధగలాడిన బంగారు కలశం. గర్భాలయం మధ్యలో చక్కటి శివలింగం, అర్ధమండపం మధ్యలో నంది వాహనం. కప్పు నుంచి వేలాడుతున్న గణగణ మోగే కంచుగంట. మహామండపం లేని ఏక కూటాలయం. ఇది ఒప్పటి మాట. ప్రస్తుత వనపర్తి జిల్లా, గోపాల్‍పేట మండలం, బుద్ధారం అనే గ్రామంలో శిథిలావస్థలో ఉంది ఆ శివాలయం. ఇది ఇప్పటి మాట. నిజానికి ఆ వూరి పేరు బుద్ధవరం, గోనబుద్ధవరం. నాగర్‍కర్నూలు జిల్లా, బిజనేపల్లి మండలం, నందివడ్డమాను (వర్ధమానపురం) నుంచి పాలించి, రంగనాధ రామాయణాన్ని ద్విపదలో రాసిన గోనబుద్ధారెడ్డి క్రీ.శ.13వ శతాబ్దిలో కాదంబ నాగర శైలిలో నిర్మించిన చిన్నదైనా అందమైన గుడి.
నాకు ఈ ఆలయ ఫోటోలు పంపిన డా. బైరోజు శ్యాంసుందర్ ఇచ్చిన సమాచారం మేరకు, శేషాద్రిరమణ కవులు ఈ ఆలయాన్ని సందర్శించి, ఆ ఆలయంలో గోన బుద్ధారెడ్డి తన పేర బుద్ధేశ్వరున్ని ప్రతిష్టించి, గ్రామానికి గోనబుద్ధవరమనే పేరు పెట్టారని, ఇదే గ్రామానికి రామేశ్వరమనే పేరు కూడా ఉందని రాశారన్నారు. ఆలయ వాస్తు, ముమ్మాటికీ గోన బుద్ధారెడ్డి, తన రాజధాని వర్ధమానపురంలో నిర్మించిన ఆలయాల మాదిరిగానే
ఉండటం గమనించాల్సిన విషయం.
శిఖరం పడిపోయిన ఈ ఆలయం కుడివైపు కప్పు, గోడ భాగాలు కూలిపోయాయి. అర్ధమండపం ముందున్న చక్కటి ద్వారశాఖలు ముందుకు వాలిపోయాయి. గర్భాలయంలోని శివలింగంపై ఉండాల్సిన పై భాగం కనిపించకుండా పోయి శివలింగం మొండిదైంది. ఆలయం ఎడమవైపున్న నాగదేవత, వీరుల శిల్పాలు, ముందున్న రెండు నందులు అలనాటి చరిత్రకు మిగిలి ఉన్న ఆనవాళ్లు, ఎవరో ఒక మహానుభావుడు ముందుకొచ్చి, పూనుకొని, గోన బుద్ధారెడ్డిని తలచుకొని, ఆలయాన్ని పునరుద్ధరిస్తాడని, మునుపటి వైభవాన్ని కలిగిస్తాడని ఆశిద్దాం. మానవ మాతృలం, అంతకంటే ఏం చేయగలం? (డా. బైరోజు శ్యాంసుందర్ గారికి కృతజ్ఞతలు)
-ఈమని శివనాగిరెడ్డి-స్థపతి
ఎ : 9848598446