సురపురం రాజా వెంకటప్పనాయక్‍

1857 మార్చి నెలలో ఉత్తర భారత దేశంలో ప్రారంభమైన సిపాయిల తిరుగుబాటు కొంచెం ఆలస్యంగా జూన్‍ నెలలో హైద్రాబాద్‍ దక్కన్‍కు కూడా వ్యాపించింది. హైద్రాబాద్‍ పట్నంలో అదే జూన్‍ నెలలో తుర్రేబాజ్‍ఖాన్‍, సయ్యద్‍ మౌల్వీ అల్లా ఉద్దీన్‍ల నాయకత్వంలో తిరుగుబాటు తలెత్తింది. కోఠీలో ఉన్న రెసిడెంట్‍ భవనంపై దాడి జరిగింది. భీకరమైన పోరు జరిగినా ఆ తిరుగుబాటు విఫలమైంది. ఆ నాయకులిద్దరూ తప్పించుకొని పారిపోయినా తిరిగి అరెస్టు చేశారు. తుర్రేబాజ్‍ ఖాన్‍ను తూప్రాన్‍లో పట్టుకొని చంపివేసి కోఠిలోని పుత్లీబౌలి చౌరస్తాలో రోజుల తరబడి అతని శవాన్ని అట్లనే వ్రేలాడదీశారు. మౌల్వీ అల్లా ఉద్దీన్‍ మాత్రం అండమాన్‍ జైలుకు పంపారు. అక్కడ అతను 26 సంవత్సరాల పాటు నరక ప్రాయమైన జీవితాన్ని గడిపి 1884లో అక్కడనే మరణించాడు.


ఈ ఇద్దరు అమరవీరుల్ని హైద్రాబాద్‍ నగరం ఎప్పుడూ మరిచిపోదు. 1857లో అటు ఉత్తర భారతదేశంలోనూ ఇటు హైద్రాబాద్‍ దక్కన్‍లోనూ సిపాయి తిరుగుబాట్లు జరుగుతున్న సందర్భంలోనే సురపురం రాజా వెంకటప్ప నాయక్‍ కూడా తిరుగుబాటు బావుటాను ఎగురవేశాడు. అది మరొక అమరగాథ.
ఆనాటి నైజాం ‘‘హైద్రాబాద్‍ రాజ్యంలో సురపురం ఒక సంస్థానం. ఇది రాయచూర్‍ ‘సుబా’లో కృష్ణానది తీరాన వెలిసిన సంస్థానం. గద్వాల, వనపర్తి సంస్థానాధీశుల మాదిరిగానే సురపురం రాజాకూడా ప్రతి ఏటా నిజాంకు కప్పం చెల్లించేవాడు. ఆ సంస్థానంలో మెజార్టీ ప్రజలు ‘బేడర్‍’ కులస్థులు. వీరిది పౌరుషం గల జాతి. ఎవరికీ తలవంచని జాతి. తిరుగుబాటు ప్రారంభమయ్యే నాటికి సురపురం రాజా వెంకటప్ప నాయక్‍కు సరిగ్గా ఇరవై నాలుగేండ్ల వయస్సు.
రాజాకు ఏడేండ్ల వయస్సులోనే ‘పితృయోగం’ సంభవించింది. అతను మైనర్‍, ఆ పరిస్థితులలో హైద్రాబాద్‍లో ఉన్న బ్రిటిష్‍ రెసిడెంటు ‘‘ఫిలిఫ్స్ మెడాస్‍ టేలర్‍’’ను సురపురం సంస్థానానికి రాజకీయ పరిపాలకుడిగా మైనర్‍ రాజుకు ‘‘సంరక్షకుడి’’గా నియమించాడు. దానికి నిజాం రాజు ఆమోదముద్ర కూడా లబించింది. మేడాస్‍ టేలర్‍ సమర్థవంతమైన పరిపాలకుడే గాక చక్కటి చిత్రకారుడు మరియు రచయిత. ఆనాటి హైద్రాబాద్‍ రాజ్యం, ప్రజల స్థితిగతుల్ని తన జీవిత చరిత్ర, నవలల ద్వారా గ్రంథస్తం చేశాడు. అతను నిజమైన ప్రజాసేవకుడు. ప్రజలను మనసావాచా ప్రేమించిన వాడు.
టేలర్‍ సురపురం అధికారిగా సంస్థానాన్ని చక్కగా పరిపాలించాడు. మైనర్‍ రాజాకు నిజమైన పోషకుడిగా, సంరక్షకుడిగానిలిచి తండ్రి ప్రేమను అందించాడు. వీరిద్దరి మధ్య తండ్రికొడుకుల సంబంధమే పెనవేసుకుంది. కృష్ణదేవరాయల వారికి తిమ్మరుసుకు మధ్య వున్న సంబంధమే వారిరువురి సంబంధం.
1843 నుండి 1853 వరకూ టేలర్‍ సుపురాన్ని సుభిక్షంగా ఒక తండ్రిలా పరిపాలించాడు. ప్రజలకు ఉపయుక్తమైన అనేక ప్రజాసంక్షేమ పథకాలను అమలు చేశాడు. రాజ్యం శాంతి భద్రతలతో చల్లగా వర్థిల్లింది. ప్రజలు సుఖశాంతులతో జీవించారు.
1853లో రాజా వెంకటప్పనాయక్‍కు మైనార్టీ తీరింది. రాజకుమారునికి రాజ్యాన్ని అప్పగిస్తూ గవర్నర్‍ జనరల్‍ లార్డ్ డల్హౌసీ ఒక ఉత్తర్వును హైద్రాబాద్‍లో ఉన్న రెసిడెంటుకు జారీ చేశాడు. దాని ప్రకారంగానే టేలర్‍ స్వయంగా తన చేతులతో అతనికి పట్టాభిషేకం చేసి స్వర్ణఖచిత సింహాసనంపై అధిష్టింప చేశాడు. ఆ రోజు సురపురం సంస్థానంలో ఉత్సవ సౌరంభం ఇంతా అంతా కాదు. సంబరాలు అంబరాన్ని అందుకున్నాయి. మూడు రోజులు రాత్రింబవళ్లు, ఉత్సవాలు జరిగాయి.


పట్టాభిషేకం మహోత్సవాన్ని చూడటానికి వివిధ స్థాయిలకు చెందిన ప్రజలు చాలా మంది వచ్చారు. అతిధులందరికీ అత్తరులను పూసి మెడలో పూలదండలు వేశారు. అందరికీ వస్త్రాలు దక్షిణ ఇచ్చారు. పండ్లు తాంబులాలు పంచారు. బ్రాహ్మణులకు సత్కారాలు చేశారు. విందులు గోవిందులు రెండు రోజులపాటు సాగినై. రాజ బంధువులందరికీ తలపాగాలు, ఉత్తరీయాలు బహుమతులుగా ఇచ్చారు. వారి విడిది కోసం ఊరంతా రంగు రంగుల డేరాలతో గుడారాలు వెలిసినై. మేళతాళాలు పెట్టారు. కొమ్ములు, బూరాలు ఊదారు. గాలిలో తుపాకులు పేల్చారు.
పట్టాభిషేకం జరిగిన ఆ రాత్రి రంజుగా రాణించింది. చెట్లన్నింటికీ కాగడాలను కట్టారు. రంగురంగుల దీపాలతో చెట్ల కొమ్మలను అలంకరించారు. ప్రక్కన మైదానంలో అం•రాన్ని చుంబించే బాణాసంచా ప్రదర్శనలు సరేసరి. రెండు వందల పటాకులతో ఆకాశంలోకి ఎగిరి పూలు ఈనే బాణాసంచా ప్రత్యేకంగా అందరినీ ఆకర్శించింది. ఆ రాత్రంతా చెట్ల క్రింద రాయచూరు, గుల్బర్గా, బీజాపూర్‍నుండి వచ్చిన భోగంమేళాల ఆటపాటల నృత్యాలు జరిగాయి.
ఆ విధంగా సురపురం రాజా వెంకటప్ప నాయక్‍ 1853లో అధికారం చేపట్టినాడు. ఆ తర్వాత బ్రిటిష్‍ రెసిడెంటుగారు మెడాస్‍ టేలర్‍కు పదోన్నతి కల్పించి ‘బిరార్‍’కు తబాదలా (ట్రాన్స్ఫర్‍) చేశాడు.
ఆ వార్త వినగానే రాజా వెంకటప్ప నాయక్‍ ఆనందమంతా ఆవిరైపోయింది. తన హోదా దర్పం అన్నీ మరిచి తనే స్వయంగా టేలర్‍ నివాసానికి వెళ్లాడు. టేలర్‍ కనబడగానే గట్టిగా కౌగలించుకుని ‘‘అప్పా మీరు నిజంగానే వెళ్లిపోతారా? మీ మార్గదర్శకత్వం, మీ సలహాలు లేకుండా ఈ రాజ్యభారాన్ని నేను నిర్వహంచగలనా? మీరు లేకుండా నేను ప్రజలకు ఎటువంటి మంచి పనులు చేయలేను. నన్ను విడిచి వెళ్లకండి అప్పా’’ అని కండ్లనిండా నీళ్లు నింపుకున్నాడు.


‘‘లేదు రాజా నేనొక మామూలు ప్రభుత్వ అధికారిని. మా అధికారులు ఎక్కడికి వెళ్లమంటే అక్కడికి వెళ్లి ఉద్యోగం చేయాలి. తప్పదు, అయినా జాగ్రత్తగా వ్యవహరిస్తే మీరు మంచిరాజుగా, పరిపాలకులుగా మన్ననలు పొందుతారు’’ అన్నాడు టేలర్‍.
‘‘అప్పా నేను మళ్లీ చిన్న పిల్లవాడిగా మారితే ఎంత బాగుంటుంది! మీరు నన్ను ఎత్తుకుంటారు. ఒడిలో కూచో బెట్టుకుంటారు. కథలు చెబుతారు. మళ్లీ ఆ రోజులు రావు కదా. ఎందుకొచ్చిన ఈ రాజ్యభారం ఈ ముళ్లకిరీటాలు?’’ వైరాగ్యంతో అన్నాడు రాజు
‘‘బాధపడకు రాజా నేనక్కడికి వెళ్లినా నా మనస్సులో నువ్వే ఉంటావు. నీకు ఏం కష్టం వచ్చినా రెక్కలు కట్టుకొని వాలుతాను. ‘‘రా’’ అని ఒక్క అక్షరం రాస్తే చాలు’’ అన్నాడు టేలర్‍. ‘‘నేను మీ బిడ్డడనే సంగతి మరచిపోకండి అప్పా’’ అని టేలర్‍ కాళ్లకు దండం పెట్టినాడు రాజు. ఇద్దరి కండ్లల్లో కన్నీళ్లు జల•లారాలుతుండగా టేలర్‍ తన అధికార నివాసానికి చేరుకున్నాడు.
కాల వాహిని అలల వాలున కాల చక్రం గిరగిరా
నాలుగేళ్లు తిరిగి 1857లోకి ప్రవేశించింది. తుర్రేబాజ్‍కాన్‍, సయ్యద్‍ మౌల్వీ అల్లా ఉద్దీన్‍ల తిరుగుబాటు ఉప్పెనతో హైద్రాబాద్‍ నగరం అల్లకల్లోలానికి గురై అప్పుడప్పుడే చల్లబడుతున్నది. హైద్రాబాద్‍ నగరంలోని తన నివాసంలో ‘‘దివాన్‍ఖానా’’లో కూచొని టేలర్‍ మరాఠీ భాషలో తన ఆత్మకథ రాసుకుంటున్నాడు.


ఇంతలో ఒక చప్రాసీ లోపలికి వచ్చి వొంగివొంగి మూడుసార్లు సలాం చేశాడు.
‘‘రాస్తున్న పెన్నును ఆపి ఏమిటి సంగతి అన్నట్లు కళ్ళద్దాల నుండి చూశాడు.
‘‘హుజూర్‍! ఆప్‍కే లియే లష్కర్‍ ఖైద్‍ఖానాసే జైలర్‍ సాబ్‍ ఆయే హైఁ’’ అన్నాడు వినయంగా.
‘‘పేష్‍ కరో’’
తలమీది రూమీ టోపీ తీసి చంకలో పెట్టుకున్న ‘‘జైలర్‍’’ గదిలోకి వినయంగా వచ్చి వొంగి వొంగి సలాములు చేశాడు.
‘‘క్యాబాత్‍ హై’’
‘‘జైల్లో మిమ్మల్ని కలవటానికి ఓ ఖైదీ ఎదురు చూస్తున్నాడు. అతడి చివరి కోరిక అదొక్కటే’’.
‘‘వాట్‍! ఏ ఖైదీ ఫర్‍ మీ!!’’ ఆశ్చర్యంతో అడిగాడు టేలర్‍.
‘‘యస్‍ సార్‍!’’
‘‘హూ ఈజ్‍ హీ?’’
‘‘జీ హుజూర్‍! హిజ్‍ నేమ్‍ ఈజ్‍ రాజా వెంకటప్ప నాయక్‍’’
‘‘వ్వాట్‍? ఆర్యూ మాడ్‍?’’ కోపంతో వొణికాడు టేలర్‍.
‘‘సారీ సర్‍! హి ఈజ్‍ ఇన్‍ ది ప్రిజన్‍’’
‘‘ఓ మై గాడ్‍!’’ రెండు చేతులతో తల పట్టుకుని టేబుల్‍పై వాలిపోయాడు టేలర్‍.
‘‘మై సన్‍. మై సన్‍’’ అని రోదిస్తున్నాడు.


× × ×


జైలు గదిలోకి టేలర్‍ అడుగు పెట్టగానే ‘అప్పా’ అని గట్టిగా కావలించుకుని కళ్లనీళ్లు పెట్టుకున్నాడు రాజా వెంకటప్ప నాయక్‍. దారి తప్పిన పిల్లవాడు తండ్రిని కలుసుకుని దుఃఖిస్తున్నట్లే ఉంది. తన ఒడిలో ఆడుకున్న పిల్లవాడు, తన ఒడిలో ఓనమాలు దిద్దిన పిల్లవాడు. తను పెంచి పెద్ద చేసిన లేత చిన్నారి కొమ్మ రత్నఖచిత సింహాసనం నుండి కింద పడి దుమ్ముధూళి పేరుకున్న ఈ చీకటి గదిలో ఒంటరిగా..
దుఃఖాన్ని బలవంతంగా నిగ్రహించుకున్నాడు టేలర్‍.
రాజా వెంకటప్ప నాయక్‍ గద్గదస్వరంతో సురపురంలో ఏం జరిగిందో వివరించాడు. ఆ సంగతులన్ని ఓపికగా విన్నాడు టేలర్‍.
ఒకప్పుడు సురపురం మరాఠాల కింద ఉన్న సామంత రాజ్యం. ఆ తర్వాత బ్రిటిష్‍ అధినంలోకి వెళ్లింది. 1857 తిరుగుబాటు సందర్భంగా బ్రిటిష్‍ వారి నుండి స్వతంత్రం పొందాలని ఆలోచన చేశాడు రాజు వెంకటప్ప నాయక్‍. అట్లనే హైద్రాబాద్‍ సంస్థానం పెత్తనం నుండి కూడా విముక్తి పొందొచ్చని ఆశపడ్డాడు. దానికి తోడు నానా సాహెబ్‍, రాయచూర్‍ జమీందార్లు కూడా అతనిని ప్రోత్సహించి గెలిచిన తర్వాత సురపురం నుండి రామేశ్వరం వరకూ దక్షిణ మహార్రా రాజ్యానికి రాజును చేస్తామని ప్రలోభపెట్టారు.
ధైర్యం చేసిన రాజు చివరికి తిరుగుబాటు బావుటా లేవనెత్తాడు. కాని ఏం ఫాయిదా? ఆ భగావత్‍ విఫలమయ్యింది. హైద్రాబాద్‍ నుండి వచ్చిన బ్రిటిష్‍ ఫౌజ్‍ సురపురాన్ని దిగ్భంధనం చేసింది. పెద్ద ఎత్తున ఆస్తినష్టం ప్రాణనష్టం జరిగి బలగాలన్ని చెల్లాచెదురైన తర్వాత రాజు ఒంటరిగా మిగిలిపోయాడు. బయటి నుండి ‘సహాయం’ వాగ్దానాలకే పరిమితమయింది తప్ప ఎవరూ ముందుకు రాలేదు. అటువంటి క్లిష్ట సమయంలో సురపురం నుండి సైన్య దిగ్భంధనాన్ని ఛేదించుకుని తన ఒకప్పటి సంరక్షకుడు, తండ్రిలాంటి వాడైన ‘‘టేలర్‍’’ను కలుసుకుని సలహా తీసుకుందామని హైద్రాబాద్‍ నగరానికి రహస్యంగా చేరుకున్నాడు.
రాజా నగరానికి రాగానే ముందు రెసిడెన్సీ బజారుకు వెళ్లి టేలర్‍ కోసం విచారించగా ఆయన దౌరాకు (క్యాంపుకు) వెళ్లాడని ఒకటి రెండు రోజులలో రావచ్చని సమాచారం తెలిసింది. నిరీక్షించటం తప్ప మరో మార్గం లేదు కావున కాశీ యాత్ర ముగించుకొని వస్తున్న ఒక హిందూ ‘‘ముసాఫిర్‍’’ లాగ వేషం మార్చుకొని మారువేషంలో నగర సంచారానికి బయలుదేరాడు.
ఆ సాయంత్రం ఒక అంజాన్‍ ‘ముసాఫిర్‍’ లాగానే నడుచుకుంటూ మక్కామసీద్‍ను, చార్మినార్‍ను సందర్శించాడు. కాసేపు విశ్రమించడానికి చార్మినార్‍ చబూత్రా మీద కూచున్నాడు.


కాలం కలిసిరానపుడు పచ్చికట్టెకూడా పామై కరుస్తుంది.
‘‘కుఫియాలు’’ నలముమూలల్నుండి చుట్టుముట్టి ఆ సురపురం రాజాను ‘గిరఫ్తార్‍’ చేసి లష్కర్‍లో ఉన్న తిర్మల్‍గిరి ఖైద్‍ఖానాకు తరలించారు.
కేసు విచారణలో వుంది.


× × ×


అంతా సావధానంగా విన్న టేలర్‍ ‘‘రాజా రెసిడెంటు గారిని కలుస్తావా?’’ అని అడిగాడు.
‘‘లేదప్పా! నేను కలువను. నాకు ఇష్టం కూడా లేదు. నేను ప్రాణభిక్షకోసం క్షమాభిక్ష కోసం ప్రార్థించాలని ఆయన ఆశిస్తాడు. ఎంతైనా నేను మీ పెంపకంలో పెరిగాను. నా ఆత్మగౌరవానికి వ్యతిరేకంగా నేను వెళ్లను. మరణదండననైనా స్వీరిస్తాను గాని పిరికివాడిగా మాత్రం బకతలేను.
‘‘సరే రాజా! కనీసం కోర్టు విచారణలోనైనా అన్ని సంగతులు ధైర్యంగా చెప్పు. న్యాయం భగవంతుడికే వదిలేద్దాం.’’
‘‘నాకు సంబంధించినవి మాత్రము చెప్పగలను అప్పా! నాకు సహకరించిన వారి పేర్లు చెప్పి వారిని మోసం చేయలేను. నన్ను ఉసిగొల్పిన వారి పేర్లు కూడా చెప్పను’’.
‘‘నీకు ఇంగ్లీషు వాళ్ల మీద అంత కోపమెందుకు రాజా నేనూ ఇంగ్లీషు వాడినే కదా?’’
అప్పా! తండ్రి ప్రేమ ఏమిటో తెలియని అభాగ్యుణ్ణి నేను. మీరే నాకు తండ్రి లాంటి వారు. మీతో అబద్ధం చెపుతానా? నాకు వ్యక్తిగతంగా ఎవరి మీదా కోపం లేదు. ఇంగ్లీషువారి పెత్తనం మీదే నా కోపమంతా.
టేలర్‍ ఒడిలో తలపెట్టుకుని ప్రశాంతంగా పడుకున్నాడు రాజా. మళ్ళీ చిన్ననాటి సురపురం రోజులు వచ్చినట్టనిపించింది ఇద్దరికీ. రాజా వీపును ప్రేమగా నిమురుతున్నాడు… తండ్రి.
‘‘అప్పా! నాకు మీరొక సహాయం చేస్తారా’’ తలెత్తకుండానే చిన్న పిల్లాడిలా గోముగా అడిగాడు.
‘‘ఏంటదీ?’’
‘‘ఎట్లాగూ నాకు మరణదండన శిక్షనే విధిస్తారు. దానికి నేను సిద్ధమే. భయపడనుగాని ఉరి మాత్రం తీయొద్దని చెప్పండి. దొంగలను బందిపోట్లను ఉరితీసినట్లు నన్ను ఉరితియ్యొద్దు. మరణంలో కూడా నేను గౌరవాన్నే కోరుకుంటాను. అయినా నేనేమంత పాపం చేశాను? దేశం కోసం పోరాడటం పాపమా? దేశభక్తి ఉండటం నేరమా?’’
‘‘లేదు బేటా. నువ్వేమీ తప్పు పని చేయలేదు.’’ టేలర్‍ కంఠం వొణికింది. కన్నీళ్లు జలజలా రాలి తల మీద పడ్డాయి.
‘‘నన్ను ఫిరంగి మూతికి కట్టిపడేసి పేల్చివేసినా నేను బయపడను అప్పా. కాని నన్ను ఉరి మాత్రం తీయొద్దు. అట్లనే జైలు శిక్ష కూడా నాకు ఇష్టం లేదు. రాజుగా బ్రతికిన నేను ప్రతిక్షణం కృంగి కృశించి మరణించడం కంటె ఫిరంగి మూతికి కట్టి పేల్చేసినా ఫరవాలేదు.’’
సున్నితంగా తన చేత్తో అతడి పెదాలను మూశాడు టేలర్‍.
టేలర్‍ వెళ్లడానికి లేచి నిలబడగానే రాజా అతని పాదాలకు ప్రణామం చేశాడు.


× × ×


కోర్టు విచారణ ముగిసింది. ముందు ఉరిశిక్ష ఖాయం చేశారు. కాని మెడాస్‍ టేలర్‍ జోక్యం వలన చెంగల్‍పట్టు కోటలో ఆ జైలు శిక్ష అనుభవించాలని తీర్పు వచ్చింది. ఆ తీర్పును యావజ్జీవ శిక్షగా మార్చి, రాజాను హైద్రాబాద్‍ నుంచి మద్రాస్‍కు తరలిస్తుంటే శంషాబాద్‍ ప్రాంతంలో సైనికులు కొంతసేపు విశ్రాంతి కోసం ఆగారు. ఒక సైనికుడు తన బెల్టుకు ఉన్న పిస్టల్‍ను చెట్టుకింద పెట్టి స్నానానికి పక్కకు వెళ్ళగానే రాజా ఆ పిస్టల్‍ను చేతిలోకి తీసుకుని కణతకు గురి పెట్టుకుని పేల్చుకున్నాడు.
సరిగ్గా ఆ రోజుకు అతనికి ఇరవై నాలుగు సంవత్సరాలు నిండాయి. ఒక రోజు కూడా అటూ ఇటూ తేడా లేదు.
నాలుగు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన సురపురం సంస్థానం నైజాం రాజ్యంలో 1861లో విలీనం అయ్యింది.


-పరవస్తు లోకేశ్వర్‍, ఎ: 91606 80847

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *