దక్కన్ ల్యాండ్ నవంబర్ 2024 సంచికలో ప్రచురించిన ఈమని శివనాగిరెడ్డి గారి వ్యాసం ‘‘ఒకప్పుడు నిత్య కళ్యాణం పచ్చతోరణం – నేడేమో చిన్నాభిన్నశిథిలావరణం’’ వ్యాసం అక్షర సత్యం. అక్టోబర్ 9, 10 తేదీల్లో వరంగల్ జిల్లా పర్యటనకు కుటుంబంతో వెళ్ళాను. అక్టోబర్ 9 న మొదట రామప్ప దేవాలయం, రామప్ప చెరువు చూసాము. ఆ తర్వాత రామప్ప దేవాలయానికి సుమారు 20-25 కిలోమీటర్ల దూరంలో ఘనపురం గ్రామంలో ఉన్న ‘‘కోట గుళ్ళు’’ అని ప్రజలు పిలుచుకుంటున్న గణపేశ్వరాలయ సముదాయాన్ని చూడటానికి వెళ్ళాము. శివనాగిరెడ్డి గారు చెప్పినట్టు అచ్చం రామప్ప దేవాలయాన్ని పోలి ఉన్న ప్రధాన గణపేశ్వరాలయం, దాని చుట్టూ 19 చిన్నచిన్న గుడులు, ఎడమ వైపున అదే పద్దతిలో నిర్మించిన మరో చిన్న ఆలయం చూపరులను ఆకట్టుకుంటాయి. అయితే అవన్నీ శిథిలావస్థలో కునారిల్లుతున్నాయి. కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడు నిర్మించిన ఈ ఆలయ సముదాయం రామప్ప దేవాలయంతో పోలిస్తే ఏ మాత్రం వెనుకబడి లేదు. అద్భుతమైన ఆలయ వాస్తు వైవిధ్యంతో, శిల్ప సంపదతో కను విందు చేస్తాయి. రామప్ప దేవాలయాన్ని కాపాడిన పాలకులు/జిల్లా నాయకులు/శిల్ప కళారాధకులు/ ప్రజలు కోటగుళ్ళు ఆలయ సముదాయాన్ని విస్మరించడం దారుణం.
అక్కడ ప్రధాన దేవాలయంలో ఇంకా పూజా పునస్కారాలు కొనసాగుతుండడం చూసాము. పూజలు రాష్ట్ర దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్నట్టు పూజారి చెప్పినాడు. ప్రధాన ఆలయం కూడా శిథిలావస్థలో ఉన్నప్పటికీ కొంత మంది దాతల సహకారంతో మరమ్మతులు జరిగి పూజా పునస్కారాలు జరుపుకోవడానికి అనుకూలంగా మారింది. ఈ కోట గుళ్ళు ఆలయ సముదాయం దుర్భర పరిస్థితిని చూసిన తర్వాత తీవ్రమైన ఆవేదన కలిగింది. కోటగుళ్ళ పునరుద్దరణ కోసం రెండుసార్లు ప్రారంభోత్సవాలు జరిగినట్టుగా ఆలయ ప్రాంగణంలో ఉన్నరెండు శిలాఫలకాలు తెలియజేస్తున్నాయి. ఒకటి 2009 లో రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఆనం రాంనారాయణ రెడ్డి గారు వేసింది. రెండవది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 లో ఆనాటి అసెంబ్లీ స్పీకర్, ఇప్పుడు శాసన మండలి సభ్యులు శ్రీ మధుసూదనాచారి గారు వేసింది. ఈ రెండు సందర్భాలలో కూడా శిలాఫలకాలు వేయడంతో అయిపోయింది తప్ప ఆలయ సముదాయం పునరుద్దరణ మాత్రం జరగలేదు. ‘‘కోటగుళ్ళు సముదాయం పునరుద్దరణ విషయంలో కేసిఆర్ ప్రభుత్వం మీద మాకు ఆశmఉండింది. కానీ వారు కూడా శిలాఫలకంతోనే సరిపెట్టుకున్నారు’’ అని ఆలయ పూజారి వాపోయాడు. ఏది ఏమైనా అద్భుతమైన కోటగుళ్ళు ఆలయ సముదాయం ఈ రకంగా అందరి నిర్లక్ష్యానికి గురికావడం శోచనీయం అని చెప్పక తప్పదు. భారతీయులకు చారిత్రిక సంపదను పరిరక్షించుకోవడం పట్ల నిర్లక్ష్యం ఏ విధంగా ఉంటుందో ఎక్కడకు పోయినా కనిపిస్తాయి. కోటగుళ్ళు అందుకు ప్రభలమైన సాక్ష్యం. అయిదారేళ్ల క్రితం చూసిన రామప్ప దేవాలయ పరిసరాలు యునెస్కో గుర్తింపు వచ్చిన తర్వాత సుందరంగా మారినాయి. సౌకర్యాలు మెరుగుపడినాయి. పర్యాటకుల సంఖ్య కూడా పెరిగింది. ఇది సంతోషించదగిన అంశం. అయితే పర్యాటకులకు మంచి భోజన హోటల్ మాత్రం అక్కడ లేదు. భోజన సౌకర్యం మెరుగుపడేందుకు టూరిజం శాఖ చర్యలు తీసుకోవాలి. కోటగుళ్ళు శిథిలావస్థను అందరి ద•ష్టికి తీసుకువచ్చిన మిత్రులు ఈమని శివనాగిరెడ్డి గారికి అభినందనలు.
ఆదిలాబాద్ జిల్లా గోండుల గుసాడి నృత్య విశేషాలను సమగ్రంగా తెలియజెప్పిన చరిత్రకారులు ద్యావనవల్లి సత్యనారాయణ గారికి కూడా అభినందనలు.
- శ్రీధర్‍రావ్ దేశ్‍పాండే,
ఎ : 94910 60585