సుస్థిర ప్రణాళికతోనే హైదరాబాద్‍కు విశ్వహోదా! (వరల్డ్ సిటీస్‍ డే సందర్భంగా)

ఒకప్పుడు నగరాలను జనాభాపరంగా లేదా విస్తీర్ణం పరంగా పెద్ద నగరాలుగా చెప్పేవారు. ఇప్పుడు ఈ రెండు కొలమానాలకు పెద్దగా ప్రాముఖ్యం లేకుండా పోయింది. గత యాభై ఏళ్లుగా రకరకాల కొత్త కొలమానాలు ప్రాచుర్యంలోకి వచ్చాయి. వాటిని బట్టి ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లోని నగరాలకు ఏటా వివిధ ర్యాంకులు ఇస్తుంటారు. పచ్చదనం, పార్కులు, మైదానాలు, పునరుత్పాదక ఇంధన వనరులు, సుస్థిరదాయక రవాణా, ప్రజా రవాణా, గ్రీన్‍ బిల్డింగ్స్, వృత్తాకార ఆర్థిక వ్యవస్థ, సోషల్‍ ప్లానింగ్‍, బాధ్యతాయుత వినియోగం, వ్యర్థాల నిర్వహణ, నీటి సరఫరా, డ్రైనేజీ వ్యవస్థ, వరద నీటి నిర్వహణ వ్యవస్థ, వాన నీటి సంరక్షణ, సంస్కృ తి – వారసత్వ పరిరక్షణ, జలాశయాల సంరక్షణ, కాలుష్య నివారణ, సుస్థిరదాయకత లాంటి అంశాలు ఈ ర్యాంకులలో కీలకపాత్ర వహిస్తాయి.


ప్రతీ నగరానికి మాస్టర్‍ ప్లాన్‍ అవసరం. మాస్టర్‍ ప్లాన్‍ ప్రకారమే ల్యాండ్‍ యూజ్‍ ఉండాలి. రెసిడెన్షియల్‍, కమర్షియల్‍, ఇనిస్టిట్యూషన్స్, కన్జర్వేషన్‍… ఇలా వివిధ అంశాలను పరిగణిస్తారు. అంతే కాదు, కనీసం 50 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచు కుంటారు. ప్లానింగ్‍లో సమగ్రత ఉంటుంది. రీజనల్‍ మాస్టర్‍ ప్లాన్‍ రూపొందించిన తరువాతనే నగరం ప్లానింగ్‍ చేయాలి. అయితే చాలా సందర్భాల్లో అందుకు భిన్నంగా జరుగుతుంటుంది. హైదరాబాద్‍ విషయంలోనూ అదే జరిగింది. రీజనల్‍ స్టడీ చేయకుండానే 1981లో హైదరాబాద్‍ మాస్టర్‍ ప్లాన్‍ తయారు చేశారు. సాధారణంగా మాస్టర్‍ ప్లాన్‍ను పదేళ్లకోసారి రివైజ్‍ చేయాలి. రహదారుల వెడల్పు లాంటి అంశాల్లో వచ్చిన మార్పులను పరిగణనలోకి తీసుకోవాలి. ఏం ప్లాన్‍ చేశామో, ఏం సాధించామో చూసుకోవాలి. అలాంటిదేమీ జరగలేదు. 1981 నుంచి ఒకదాని తరువాత ఒకటిగా ఎన్నో మాస్టర్‍ ప్లాన్స్ వచ్చాయి. HUDA (హైదరాబాద్‍ అర్బన్‍ డెవలప్‍మెంట్‍ అథారిటీ), BPA (బుద్ధ పూర్ణిమ అథారిటీ), QQSUDA (ఖులీ ఖుతుబ్‍ షా అర్బన్‍ డెవలప్‍మెంట్‍ అథారిటీ), CDA (సైబరాబాద్‍ డెవలప్‍మెంట్‍ అథారిటీ), HADA (హైదరాబాద్‍ ఎయిర్‍పోర్ట్ డెవలప్‍మెంట్‍ అథారిటీ)…. ఇలా ఒక్కోదానికి ఒక్కో మాస్టర్‍ ప్లాన్‍ వచ్చింది. ఇవి గాకుండా GHMC,HMDA,ORR Growth Corridorలకి వేరే మాస్టర్‍ ప్లాన్‍, తయారు చేసింది. MCH, కంటోన్మెంట్‍ తీరు మరో రకం. ఇలా హైదరాబాద్‍ నగరానికి ఎనిమిది మాస్టర్‍ ప్లాన్స్ వచ్చాయి. అవికాకుండా అవుటర్‍ రింగ్‍ రోడ్‍ కారిడార్‍కు వేరే మాస్టర్‍ ప్లాన్‍. వీటిని ఒక దానికి మరో దానితో సంబంధం లేకుండా తయారు చేశారు. దాంతో మొత్తం నగర మాస్టర్‍ ప్లాన్‍లో సమగ్రత లోపించి నట్లయింది. నగరానికి ఒక డిజైన్‍ అంటూ లేకుండా పోయింది. సైబరాబాద్‍లో డ్రైనేజీ వ్యవస్థ కూడా లేకుండా అభివృద్ధి జరిగింది. వరద నీటి కాల్వలు కూడా లేవు. హైదరాబాద్‍కు చేరువలో రాబోయే ఫోర్త్ సిటీ విషయంలో ఇలాంటి తప్పిదాలు జరగకుండా చూసుకోవాలి.


అసఫ్‍ జాహీల కాలంలో ప్రపంచంలోని అత్యుత్తమ నగరాల్లో ఒకటిగా పేరొందిన హైదరాబాద్‍, ఆ తరువాతి కాలంలో తాత్కాలిక చర్యలతోనే ముందుకు సాగింది. సరైన డిజైన్‍ అంటూ లేకుండా పోయింది. మాస్టర్‍ ప్లాన్‍ ఉన్నా అమలులో కానరాకుండా పోయింది. ఏదైతే జరగకూడదో అదే జరిగింది. ప్రభుత్వాలు మారినప్పుడల్లా విధానాలు మారాయి. నిజానికి ప్రభుత్వాలు మారినా అవే ప్రాజెక్టులను, పథకాలను కొనసాగించాల్సి ఉంటుంది. నగరాల్లో ఉండే సహజవనరులను చక్కగా వినియోగించుకోవాలి. ఓపెన్‍ స్పేస్‍లు అధికంగా నెలకొల్పాలి. ప్రజలకు రిక్రియేషన్‍ ఏరియాలు ఉండాలి. నగరాలు అభివృద్ధి చెందాలంటే… చుట్టుపక్కల గ్రామాలూ అభివ•ద్ధి చెందాలి. పట్నంలో పల్లె కనిపించాలి. పల్లెలో పట్నం కనిపించాలి. పట్నమైనా, పల్లె అయినా ప్రకృతితో మమేకమవ్వాలి.


అంతే కాదు, నగరాలు అభివృద్ధి చెందడంలోనూ కొన్ని పరిమితులు ఉండాలి. వలసలను నిరుత్సాహపరచాలి. వాటిని అడ్డుకునేందుకు కౌంటర్‍ మాగ్నెట్స్ను అభివృద్ధి చేయాలి. ఒక పరిమితి అంటూ లేకుండా నిరవధిక వలసలు భారీగా కొనసాగితే నగరాల్లోని మౌలిక వసతులపై భారం అధికమవుతుంది. నగరాలు మురికికూపాలుగా మారుతాయి. నరకానికి నకళ్లుగా మారుతాయి. నేడు దేశంలోని ఎన్నో నగరాలు ఇదే దుస్థితిలో ఉన్నాయి. అలాంటి దుస్థితి హైదరాబాద్‍కు రాకుండా జాగ్రత్త పడాలి. ట్రాఫిక్‍ నాణ్యతకు సంబంధించిన ర్యాంకింగ్స్లో భారతీయ నగరాలు బాగా ఇరుకైన నగరాలుగా ర్యాంకింగ్స్ పొందాయి. బెంగళూరు, ముంబై, దిల్లీ, హైదరాబాద్‍, పుణె ఇరుకైన నగరాలుగా పేరొందాయి.


ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్‍ (ఈఐయూ) తన గ్లోబల్‍ లివబిలిటీ ఇండెక్స్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా 173 నగరాల జాబితా రూపొందించింది. ఈ విధమైన మదింపు వేసేందుకు వివిధ విభాగాల్లో 30 సూచికలను పరిగణనలోకి తీసుకుంది. సుస్థిరత్వం, ఆరోగ్య సంరక్షణ, సంస్కృతి, పర్యావరణం, విద్య, మౌలిక వసతులు లాంటివి వీటిలో ఉన్నాయి. ఈ జాబితాలో వియన్నా (ఆస్ట్రియా), కోపెన్‍ హేగన్‍ (డెన్మార్క్), జ్యూరిచ్‍ (స్విట్జర్లాండ్‍), మెల్‍బోర్న్ (ఆస్ట్రేలియా), కాల్గరీ (కెనడా), జెనీవా (స్విట్జర్లాండ్‍), సిడ్నీ (ఆస్ట్రేలియా), వాంకోవర్‍ (కెనడా), ఒసాకా (జపాన్‍), అకులాండ్‍ (న్యూజీలాండ్‍) ఉన్నాయి. ఇక ఈ జాబితాలో కింది పది స్థానాల్లో ఉన్న నగరాలను చూస్తే…. వరుసగా…. డమాస్కస్‍ (సిరియా), ట్రిపోలి (లిబియా), అల్జీర్స్ (అల్జీరియా), లాగోస్‍ (నైజీరియా), కరాచీ (పాకిస్థాన్‍), ఢాకా (బంగ్లాదేశ్‍), హరారే (జింబాబ్వే) ఉన్నాయి.


ఇటీవల ఒక సంస్థ జరిపిన అధ్యయనంలో 2033 నాటికి ప్రపంచంలో వేగంగా వ•ద్ధిచెందే పది నగరాలలో బెంగళూరు మొదటి స్థానంలో నిలిచింది. మూడో స్థానంలో ఢిల్లీ నిలిచింది. హైదరాబాద్‍కు నాలుగో స్థానం దక్కింది. ముంబై ఐదో స్థానం పొందింది. ఆసియా, ఆఫ్రికా దేశాల నగరాలు శరవేగంగా అభివ•ద్ధి చెందుతున్నాయి. కాకపోతే… వాటి అభివృద్ధి తీరులో ఒక క్రమం ఉన్నదా లేదా అనే అంశమే ముఖ్యమైంది.


స్మార్ట్ సిటీస్‍కు సంబంధించిన మరో జాబితాలో 88.3 పాయింట్లతో మ్యూనిచ్‍ మొదటి స్థానంలో నిలిచింది. హంబర్గ్ 86.2 పాయింట్లతో రెండో స్థానం పొందింది. పాలన, శక్తి- పర్యావరణం, ఐటీ – కమ్యూనికేషన్స్, మొబిలిటీ, సొసైటీ- ఎడ్యుకేషన్‍ అనే అంశాల ఆధారంగా ఈ ర్యాంకింగ్స్ను ప్రకటించారు. మరో జాబితాలో టోక్యో, సింగపూర్‍, సిడ్నీ, కేప్‍టౌన్‍, వియన్నా మొదటి ఐదు స్థానాల్లో నిలిచాయి. అందమైన నగరాల జాబితాలో పారిస్‍, న్యూయార్క్ సిటీ, లండన్‍, వెనిస్‍ వంటివి ఉన్నాయి. ఇలాంటి జాబితాలు ఏవైనా సరే… వాటిలో భారతీయ నగరాలు ఉండాలని, అందుకు అనుగుణంగా ఆయా నగరాలు అభివృద్ధి చెందాలని మరీ ముఖ్యంగా హైదరాబాద్‍ నగరానికి అందులో స్థానం దక్కాలని కోరుకుందాం.


(రచయిత అక్టోబర్‍ 31న వరల్డ్ సిటీస్‍ డే సందర్భంగా ఆంధ్రజ్యోతి దినపత్రికకు రాసిన వ్యాసం)

  • వేదకుమార్‍ మణికొండ
    ఇంజనీర్‍, అర్బన్‍ & రీజనల్‍ ప్లానర్‍, హైదరాబాద్

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *