ప్రపంచ రంగస్థల దినోత్సవం ప్రతి ఏట మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా రంగస్థల కళాకారులచే జరుపబడుతున్న ఉత్సవం. ఇది 1961లో ఇంటర్నేషనల్ థియేటర్ ఇనిస్టిట్యూట్ వారిచే ప్రారంభించబడింది.
నాటకం సర్వజననీయం, సర్వకాలీనం. ప్రాముఖ్యత కలిగిన ప్రాచీన కళల్లో నాటక కళ ఒకటి. ఒక దేశం ప్రేరణా, ప్రమేయం లేకుండా ఈ నాటక కళ వివిధ దేశాల్లో విడివిడిగా ఎదిగింది. దాదాపుగా ఒకే కాలంలో పాశ్చాత్య దేశాల్లోనూ, భారతదేశంలోనూ నాటక పక్రియ మొదలయ్యింది. కాలాన్ని బట్టీ, ప్రదేశాన్ని బట్టీ, సంస్కృతిని బట్టీ నాటకం రూపం మారుతుందేగానీ అంతర్లీనంగా దాని మూల సూత్రం మాత్రం అందరికీ ఒక్కటే ఉంటుంది. అందువల్లే నాటకం బహుళాదరణ పొందిన రంగస్థల పక్రియగావిరసిల్లుతుంది. ప్రస్తుతమున్న నాటకం కాలక్రమేణా రూపం మార్చుకుంటా విశ్వజననీయమయ్యింది. దాని గుర్తుగానే ప్రపంచ రంగస్థల దినోత్సవం పుట్టింది.
1961లో వియన్నాలో ఇంటర్నేషనల్ థియేటర్ ఇనిస్టిట్యూట్ వారు నిర్వహించిన 9వ ప్రపంచ కాంగ్రెస్‍లో ఆనాటి అధ్యక్షుడు ‘ఆర్వికివియా’ ప్రపంచ రంగస్థల దినోత్సవ ప్రతిపాదన చేశాడు. సభ్యులందరూ ప్రతిపాదనను అంగీకరించారు. ఆ తరువాత ఏడాది పారిస్‍లో జరిగిన రంగస్థల సమాఖ్యలో పూర్తి స్థాయిలో మొదలయ్యింది.
రంగస్థల దినోత్సవం ప్రపంచమంతా విస్తరించి ఐక్యరాజ్య సమితి, యునెస్కో లచే ప్రాధాన్యత పొందింది. ఈ వేడుకలలో భాగంగా అన్ని దేశాల్లో జరుగుతున్న నాటకాలు, ప్రదర్శనలు, పక్రియల ప్రమాణాలపై పరిశీలకులు, నాటక ప్రియులు వచ్చి సమీక్షించుకుంటారు. ప్రతి సంవత్సరం నాటకరంగంలో నిష్ణాతులైన ఒకరిని సమన్వయకర్తగా ఎంచుకొని, ప్రముఖుల మాటగా వారి మనోగత సారాన్ని ఆ సంవత్సరపు సందేశంగా రంగస్థల ప్రపంచానికి అందిస్తారు.1962లో మొదటి ప్రపంచ రంగస్థల దినోత్సవ సందేశాన్ని జీన్ కాక్టే (ఫ్రాన్స్) అందించాడు.

అప్పటి నుండి ప్రపంచ వ్యాప్తంగా కళా రంగాల్లో నిష్ణాతులు ఒకరు మార్చి 27 నాడు నాటకరంగంలో అన్నింటిని సోదాహరణగా వివరిస్తూ పత్ర సమర్పణ చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఆ రోజు నుండి ప్రతి సంవత్సరం ‘ప్రపంచ రంగస్థల దినోత్సవం’గా గుర్తించి,వివిధ దేశాల రంగస్థల కళాకారులంతా వారి వారి రంగస్థల వేదికలపై మార్చి 27 నాడు ఘనంగా ప్రదర్శనలు, చర్చలు జరుపుకుంటున్నారు. ఏ కళా రూపమైనా ఆలోచనతో మొదలయి సృజనాత్మకతతో ముగియాలి. అప్పుడే ఆ కళ.. దేశ భాషలు, సంస్కృతి సంప్రదాయాలకు అతీతంగా నిలుస్తుంది. అంతర్జాతీయ సమస్యలను ప్రపంచదేశాలకు ఏకీకృతంగా చూపించగలుగుతుంది.
మూస పద్ధతిలో ప్రదర్శిస్తున్న నాటకాల పోకడలకు కొత్త బీజం వేస్తూ రచయితలు సామాజిక సమస్యల్ని రాజకీయ సమస్యలను మహిళల మీద జరుగుతున్న అత్యాచారాల్ని మన హక్కుల కోసం పోరాటం లాంటి స్వరూప స్వభావాలతో, సహజత్వంతో కూడిన సందేశాలతో, సార్వజనీనకంగా ఉన్న రచనలు, రచనల్లో సమగ్రంగా చూపించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి నాటకాలను దర్శించడానికి ప్రయోక్తలు, టెక్నీషియన్స్ ఎన్నో అధ్యయనాలు చేసి సంగీతంలోనూ, లైటింగ్ లోనూ పాత్రల ఫ్రీజింగ్ లాంటివి సాంకేతికంగా చొప్పించి, వాస్తవికంగా చూపించి ప్రదర్శించడానికి కృషి చేస్తున్నారు.
అంతర్జాతీయ రంగస్థల దినోత్సవం (థియేటర్ డే) నాడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న రంగస్థల నిష్ణాతులు మార్చి 27 నాడు నాటక ప్రియులకు తమ అనుభవాలు, కొత్త ప్రయోగాలు, సిద్ధాంత వ్యాసాలు అందిస్తున్నారు. ఈ సంవత్సరం పాకిస్థాన్ లోని ప్రముఖ నాటక రచయిత షాహిద్ నదీమ్ సందేశాన్ని అందించారు. ప్రపంచ రంగస్థల దినోత్సవం సందర్భంగా నాటకం దశ, దిశ గురించి విస్తృతంగా చర్చించుకోవడానికి మార్చి 27 ఎంతో తోడ్పడుతుంది. ఈ ఉత్సవ వైశిష్ట్యాన్ని ముందుతరం కళాకారులకు అందించి ప్రోత్సహించాల్సిన గురుతర బాధ్యత ఈనాటి కళాకారులందరి మీదా ఉన్నది.
లక్ష్యాలు
- ప్రపంచవ్యాప్తంగా అనేక రూపాలలో నాటకాన్ని ప్రోత్సహించడం
- ప్రజలకు నాటకం యొక్క ప్రాముఖ్యతపై అవగాహన కలిపించడం
- విస్త•త స్థాయిలో నాటక సంస్థలకు ప్రోత్సహించడంలో ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులకు అవగాహన కలిపించి వారి ద్వారా నాటకరంగాన్ని అభివృద్ధి చేయడం
- మానసిక ఉల్లాసంకోసం నాటకాన్ని ఆస్వాదింపజేయడం
- నాటకం ద్వారా పొందుతున్న మానసిక ఉల్లాసాన్ని ఇతరులతో పంచుకోవడం.
- దక్కన్‍న్యూస్