పత్రికలు అంటే ప్రజల గొంతుకలు.. భావప్రకటనా స్వేచ్ఛ వాటి ఊపిరి

పత్రికలు అనధికార చట్ట సభల వంటివి. చట్టసభల్లో ప్రతిపక్షాల వంటివి. కృష్ణాపత్రిక, ఆంధ్రపత్రిక ఆవిర్భావంతో 20వ శతాబ్దపు తెలుగు పత్రికల చరిత్ర మొదలైంది. నీలగిరి, గోలకొండ, పత్రికలు తెలంగాణలో ప్రముఖ పత్రికలు. ఇవన్నీ రాజకీయ పత్రికలే. నిష్పాక్షికంగా ప్రజల తరపున నిలబడిన పత్రికలే. ఇవి స్థానిక విషయాల నుండి అంతర్జాతీయ విషయాల దాకా నిజాయితీగా సమాచారాన్ని యివ్వడమే కాక విచక్షణాపూర్వక సంయమనంతో విశ్లేషణలు చేస్తుండేవి. కృష్ణాపత్రిక ముట్నూరి కృష్ణారావు, ఆంధ్రపత్రిక కాశీనాథుని, మీజాన్‍ అడవి బాపిరాజు, గోలకొండ సురవరం ప్రతాపరెడ్డి వంటి ప్రముఖులు నైతిక విలువలకు అత్యధిక ప్రాధాన్యమిచ్చి సమాజ శ్రేయస్సే లక్ష్యంగా పత్రికలు నిర్వహించారు. ఆధిపత్య ధోరణలకు, అణచివేతకు, నిరంకుశపోకడలకు వ్యతిరేకంగా కలమెత్తిన సంపాదకులు. గోలకొండ పత్రిక సంపాదకులు సురవరం ప్రతాపరెడ్డి తెలంగాణా సామాజిక, రాజకీయ, సాంస్కృతికరంగ వైతాళికుడు.


పత్రికలు ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధులు మాత్రమే కాదు, సామాజిక రంగంలో నైతికతకు పునాదులు వేసి ప్రజల ఆలోచనా విధానాలకు, కర్తవ్యాలకు చోదకశక్తిగా పనిచేస్తాయి. జాతీయ ఉద్యమం నుండి వామపక్ష ప్రజా ఉద్యమాల నుండి, ప్రత్యేక తెలంగాణా ఉద్యమం దాకా ప్రజలను కదిలించి, చైతన్యపరిచి కార్యాన్మోఖులను చేయడంలో పత్రికలు ఘణనీయ పాత్రను పోషించాయి.


వ్యవసాయం, విద్య, వైద్యం, తాగు సాగు నీటి కొరత, ప్రతిరంగంలోనూ అక్రమాలు, అవినీతి, అన్యాయాలు, వెనకుబాటుతనం ఆంధ్రా, రాయలసీమ, తెలంగాణా ప్రాంతాల్లో ఎన్నో సామాజిక సమస్యలు, వీటికి వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న ప్రజల గొంతును ప్రతిధ్వనించేందుకు వేదికగా సెప్టెంబర్‍ 2012లో దక్కన్‍ల్యాండ్‍ ప్రారంభమైంది. వలసవాద ఆధిపత్యానికి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రత్యేక తెలంగాణా ఉద్యమానికి మద్దతుగా జరిగే అన్ని కార్యక్రమాలకు, చర్చలకూ, సాధన కృషికి వేదికగా నిలబడింది. ప్రజలను చైతన్య పరచడంలో, సంఘటిత పరచడంలో, ఉద్యమించడంలో బాధ్యతాయుతమైన పాత్రను నిర్వహించింది. ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించాక ఆ విజయాలను కాపాడుకునేందుకు, స్థిరపరచుకునేందుకు శక్తివంచన లేకుండా పత్రికారంగంలో కృషి చేసింది. ఆనాటి నుండి ఈనాటి వరకు ప్రజాశ్రేయస్సే పత్రిక లక్ష్యం.


ప్రజల పక్షాన పనిచేసే గొంతులను అణచివేయడం ప్రజాస్వామ్య రాజకీయాల్లోనూ అలవాటుగా మారింది. పత్రికా సంపాదకులను, జర్నలిస్టులను అరెస్ట్ చేయడం, తప్పుడు కేసులు పెట్టడం, వారి కర్తవ్య నిర్వహణకు భంగం కలిగించడం ఆనవాయితీగా మారింది. ఇది ప్రజాస్వామ్య రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించడమే. దీనిని మానవ హక్కుల ఉల్లంఘణగా భావించాలి.


పత్రికలంటే ప్రజల గొంతుకలు భావపక్రటనా స్వేచ్ఛ వాటి ఊపిరి. మే 3న జరగబోతున్న ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవాన్ని జయప్రదం చేద్దాం.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *