ప్రకృతిని ప్రేమిద్దాం!మనల్ని మనం కాపాడుకుందాం?

ప్రకృతి, పర్యావరణం – ఈ రెండూ విడదీయలేని పదాలు. పర్యావరణం ప్రకృతి సంబంధిత అంశమే గానీ అది సామాజికమైనది కూడా. మానవ సమాజానికి ప్రకృతికి వున్న విడదీయరాని అనుబంధం వల్ల పర్యావరణం సామాజికమైనది. ఎప్పుడైతే సామాజికమైందో అప్పుడు అది రాజకీయ అంశమవుతుంది. సామాజిక అంశాలను నడిపేది, నిర్విహించేది రాజకీయ విధానాలే కనుక పర్యావరణం రాజకీయ అంశమవుతుంది. రాజకీయ విధానాలు ఆయా కాలాలలో వున్న వ్యవస్థల ప్రయోజనాలకు అనుగుణంగా ఉంటాయి. ఆయా విధానాలు మానవ జీవితంలోని ప్రతి సూక్ష్మ, పార్శ్వాన్నీ ప్రభావితం చేస్తాయి. ప్రకృతి, పర్యావరణం దీనికి మినహాయింపుకాదు.


ప్రకృతి ఒక్క మానవ సమూహానిది మాత్రమే కాదని సకల జీవరాసులదీ అని యిప్పుడు అందరూ అంగీకరిస్తున్నారు. సహజంగానూ, మానవ తప్పిదాల వల్లనూ ప్రకృతిలో అనేక మార్పులు వస్తున్నాయని అందువల్ల పర్యావరణంలో అసమతుల్యత ఏర్పడుతుందని కూడా అందరూ అంగీకరిస్తున్నారు.

మానవ ప్రమేయం లేకుండానే ప్రకృతి నిర్మాణంలోని వైచిత్రి కారణంగా సంభవిస్తున్న పరిణామాలు కూడా మానవ జాతికి విపరీతమైన నష్టాలు కలిగిస్తున్నాయి. అగ్ని పర్వతాలు పేలి అనేకమంది మరణించడమే కాక విపరీత భౌగోళిక పరిణామాలు సంభవిస్తున్నాయి. అలాగే మంచు కరిగి దీవులు అనేకం మాయమయ్యాయి. భూకంపాల విధ్వంసం కూడా తక్కువేమీ కాదు. సూక్ష్మంగా పరిశీలిస్తే ఈ పరిణామాలన్నిటికీ మానవతప్పిదాలే అంతిమ కారణమని అర్థమవుతున్నది. మనిషిలోని స్వార్థం, సుఖలాలస, వ్యవస్థల ఆలోచనలు విధి విధానాలు ఎలా కారణమో అందరికీ తెలుసు. వీటిని అధిగమించి ప్రకృతిని, పర్యావరణాన్ని రక్షించుకోవడం ద్వారా మనల్ని మనం కాపాడుకోగలుగుతాం.


పర్యావరణ పరిరక్షణ కోసం జరుగుతున్న కృషి ఈనాటిది కాదు. మన దేశంలో జరిగిన ఉద్యమాలలో చిప్కో ఉద్యమం ప్రధానమైనది. ఇందులో మహిళలే అత్యధికంగా పాల్గొన్నారు. కేరళలో సైలెంట్‍ వ్యాలీ వ్యతిరేక ఉద్యమం, మధ్యప్రదేశ్‍లో నర్మదా బచావో ఉద్యమం, చిలుకా సరస్సు కోసం ఒరిస్సా ప్రజల ఉద్యమం, కర్నాటకలో వృక్ష సంపదను కాపాడుకునే ప్రయత్నాలు, విశాఖ తీరంలో మత్య్స కార్మికుల ప్రతిఘటన మన దేశపు, మన ప్రాంతపు పర్యావరణ రక్షణ కోసం జరిగిన ఉద్యమాలే. పర్యావరణ ప్రేమికులు, శాస్త్రవేత్తలు, సామాన్య గ్రామీణ ప్రజలు ఎన్నో కష్టనష్టాలను అధిగమించి పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తున్నారు.


జూన్‍ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుకుంటున్నాం. ఇది నిరంతర పక్రియగా జరుగుతున్న పర్యావరణ ఉద్యమానికి స్ఫూర్తినిస్తూ, మనల్ని కార్యోన్మోఖుల్ని చేస్తుందని ఆశిద్దాం

 (మణికొండ వేదకుమార్‍)  
ఎడిటర్‍

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *