సమతుల్యం కోల్పోతున్న ప్రకృతిజూన్‍ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం

పంచభూతాలతో మమేకమై సాగిస్తున్న ప్రతి ఒక్కరి మజిలీ మరువలేనిది. ఇదే క్రమంలో మానవ మనుగడకు ఆధారమైన పర్యావరణాన్ని పరిరక్షించుకునే బదులు గొడ్డలిపెట్టు చర్యలకు పాల్పడటం సాధారణమైంది. తరాతరాలుగా ప్రకృతిని ఆరాధించే సంస్కృతిని విడిచి.. పర్యావ‘రణం’లో ఇమడలేకపోతున్నాడు. పరిశుభ్రత, పచ్చదనంతో పరిఢవిల్లే నేలతల్లే శ్రేష్ఠమైన జీవనానికి ఏకైక మార్గం అంటూ ‘నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం’ పిలుపునిస్తోంది. ఉభయ జిల్లాల్లోని ప్రకృతి వినాశక మార్గాలను విడనాడేందుకు ప్రతినబూనాల్సిన తరుణమిదే.

ప్రకృతికి మానవుడికి అవినాభావ సంబంధముంది. అది ఎంత దగ్గర సంబంధమంటే మనిషి ప్రకృతిలో పుడతాడు. ప్రకృతిలో ఆడుతూ పాడుతూ పెరుగుతాడు. ప్రకృతిని ఉపయోగించుకుంటూ ఎదుగుతాడు. చివరకు తన స్వార్థం కోసం ప్రకృతిని నాశనం చేయడానికి కూడా సిద్ధపడతాడు.

ఈ వినాశనానికి అడ్డుకట్ట వేయడానికే ప్రపంచ దేశాలు ఒక వేదిక మీదకు వచ్చి, ఒక్కో సంవత్సరం ఒక్కో దేశంలో మానవుల వల్ల నాశనమవుతున్న పర్యావరణాన్ని కాపాడడానికి చేపట్టాల్సిన చర్యల గురించి చర్చించాలని ఐక్యరాజ్యసమితి నిర్ణయించింది. అందుకే పర్యావరణ పరిరక్షణ కోసం ప్రత్యేకించి ఒక రోజు ఏర్పాటు చేస్తే మంచిదన్న ఉద్దేశ్యంతో జూన్‍ 5వ తేదీ ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకోవాలని ప్రపంచ దేశాలు నిర్ణయించాయి.

పెరుగుతున్న కాలుష్యం.. పర్యావరణంలో అసమతుల్యత.. తరిగిపోతున్న పచ్చదనంతో జరుగుతున్న పరిణామాలను మనం చూస్తూనే ఉన్నాం. వాతావరణంలో మార్పులు, భవిష్యత్తులో సంభవించే విపత్తులపై నిపుణులు హెచ్చరికలను వింటూనే ఉన్నాం. అయినా పట్టించుకోవడం లేదు. వాతావరణంలో భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఇంకా నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో మరిన్ని ఇబ్బందులు పడే అవకాశం ఉంది.

రాష్ట్రంలో కొన్నేళ్లుగా భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. అత్యధిక ఉష్ణోగ్రతలు, వర్షాకాలంలో వర్షాలు, చలికాలంలో చలి ఎక్కువే నమోదవుతున్నాయి. వాతావరణంలో సమతుల్యత దెబ్బతినడంతో ఇలాంటి పరిస్థితులు ఉంటాయని వాతావరణ నిపుణులు అంటున్నారు. అటవీ సంపద తగ్గిపోయి, ప్లాస్టిక్‍, ఇతర ఎలక్ట్రానిక్‍ వస్తువుల వాడకం పెరిగి పర్యావరణం దెబ్బతింటుందని వారి అభిప్రాయం.

నానాటికి పెరుగుతున్న జనాభా కారణంగా పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా సిమెంట్‍ రోడ్లు, తారు రోడ్లతో మట్టి అన్నదే కనుమరుగై పోయింది. భూమిలోకి వర్షపు నీరు ఇంకే అవకాశమే లేకుండా పోయింది. పెరిగిన జనాభాకు అనుగుణంగా ఇళ్లు నిర్మించడం కోసం చెట్లన్నీ నరికేస్తున్నారు. చివరకు పంట పొలాలు కూడా ఇళ్ల స్థలాలుగా మారిపోతుంటే భూతాపం పెరగక ఏమవుతుంది? ఎండలు పెరిగిపోతున్నాయి, వేడి పెరుగుతోంది అంటున్నారే కానీ దానికి కారణం ఎవరు? మనం కాదా! పది మంది నివసించే ప్రదేశంలో 100 మందికి పైగా ఉంటున్నారు. భూగర్భ జలాలన్నీ తోడేస్తున్నారు. అందుకే భూతాపం పెరిగిపోతోంది.

ఇక విచ్చలవిడిగా వాడుతున్న ప్లాస్టిక్‍ భూతం పర్యావరణానికి చేసే హాని అంతా ఇంతా కాదు. ఇలా ఎవరికీ వారు నేనొక్కడినే పడేస్తే ఏమవుతుందిలే! అని అనుకుంటూ ఎవరికి వారు శాయశక్తులా పర్యావరణానికి హాని చేస్తున్నారు.

భూమికి అత్యంత హాని చేస్తుంది మానవుడే! ప్రపంచ దేశాల ప్రభుత్వాలు రకరకాల వ్యర్థాలను సముద్రంలోకి పంపిస్తున్నాయి. దీనితో జలాలు కలుషితం అవుతున్నాయి. ఇక ప్లాస్టిక్‍ వ్యర్థాల సమస్య ఉండనే ఉంది. ఇటీవల కొన్ని సంస్థలు జరిపిన సర్వే ప్రకారం, చివరకు ఎవరెస్టు శిఖరం కూడా ప్లాస్టిక్‍ వ్యర్థాలతో నిండిపోయింది. పర్వతారోహకులు ఆహారపదార్ధాలు ఉంచిన ప్లాస్టిక్‍ కంటైనర్లు తమతో తీసుకెళ్లి అక్కడే వదిలేసి రావడంతో ఈ అనర్థం జరుగుతోంది.

ప్రకృతిని ప్రేమించడం కంటే గొప్ప విషయం ఏముంటుంది. అలా ఎవరైనా ప్రకృతిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తే పర్యావరణానికి హాని చేయలేరు. పర్యావరణాన్ని పాడు చేస్తే మానవ వినాశనం తప్పదు.

‘నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని’ అని ఓ సినీ కవి అన్నట్లుగా ఒకరిని ప్రశ్నించే ముందు, మనల్ని మనం సంస్కరించు కోవాలి. కొన్ని చర్యలు చేపట్టడం ద్వారా పర్యావరణ రక్షణకు మన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించాలి.

  • బజారుకు వెళ్లేటప్పుడు ఇంటి నుంచి సంచీలు తీసుకెళ్లడం అలవాటు చేసుకోవాలి.
  • విహారయాత్రలకు వెళ్ళినప్పుడు ప్లాస్టిక్‍ వాటర్‍ బాటిల్స్ను ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా చెత్తకుండీలో వేయాలి. లేదా అన్నీసేకరించి ప్లాస్టిక్‍ రీసైక్లింగ్‍ యూనిట్‍కు అందజేయాలి.
  • ప్రతి ఒక్కరు మొక్కలను నాటడం అలవాటు చేసుకోవాలి.
  • మీ బంధుమిత్రుల ఇళ్లల్లో పుట్టిన రోజులు, పెళ్లి రోజులు వంటి ప్రత్యేక సందర్భాల్లో వారికి పూల మొక్కను కానుకగా ఇవ్వాలి. మీరు కూడా అలాంటి కానుకలనే స్వీకరించాలి.
  • మన పిల్లలకు చిన్న వయసు నుంచే పర్యావరణ ప్రాధాన్యతను తెలియజేసి ప్రకృతి ప్రేమికులుగా మార్చాలి.
  • ఎవరో వస్తారు, ఏదో చేస్తారని ఎదురు చూస్తూ ఉండకుండా, మన పరిసరాలను మనమే శుభ్రంగా ఉంచుకోవాలి.
  • మన ఇంట్లో చెత్తను మనమే శుభ్రం చేసుకోవాలి.
  • మనం నివసించే మన వీధి, మన ఊరు, మన దేశాన్ని కూడా మనమే శుభ్రంగా ఉంచుకోవాలి.
  • చివరగా ప్రకృతిని ప్రేమిద్దాం – మనం ఆరోగ్యంగా ఉందాం – మన భవిష్యత్‍ తరాలకు ఆరోగ్యకరమైన సమాజాన్ని అందిద్దాం.

పర్యావరణ దినోత్సవం రోజున ప్రపంచ దేశాలన్నీ ఓ చోట సమావేశమై, భూమికి కలుగుతున్న రకరకాల కాలుష్యాలను తగ్గించడానికి చేపట్టాల్సిన చర్యల గురించి చర్చలు జరిపి నష్ట నివారణకు చేయవలసిన కార్యక్రమాల పట్ల తీర్మానాలు చేస్తాయి. అవగాహన కార్యక్రమాలు జరుపుతాయి.

జూన్‍ 5 పర్యావరణ దినోత్సవం సందర్భంగా పాఠశాలల్లో విద్యార్థులకు ఈ రోజు ప్రాధాన్యాన్ని ఉపాధ్యాయులు వివరిస్తారు.

ఐక్యరాజ్యసమితి అధ్వర్యంలో 1972, జూన్‍ 5వ తేదీన స్టాక్‍హోంలో మొట్టమొదటి ప్రపంచ పర్యావరణ సదస్సు జరిగింది. అప్పటి నుంచి ఏటా జూన్‍ అయిదో తేదీ ప్రపంచపర్యావరణ దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. ఏటా ఒక నినాదంతో పర్యావరణ దినోత్సవం నిర్వహిస్తారు.

‘‘ప్లాస్టిక్‍ కాలుష్యాన్ని ఎదుర్కోవడం’’, Beat Plastic Pollution అనే ప్రచార హ్యాష్‍ట్యాగ్‍తో. ఈ సంవత్సరం ప్లాస్టిక్‍ వ్యర్థాల ప్రపంచ సమస్య మరియు పర్యావరణం మరియు మానవ ఆరోగ్యంపై దాని ప్రభావాన్ని పరిష్కరించడంపై దృష్టి కేంద్రీకరించబడింది. ఐక్యరాజ్యసమితి పర్యావరణ కార్యక్రమం (UNEP) సమాజాలను సమీకరించడానికి మరియు ప్లాస్టిక్‍ వాడకాన్ని తగ్గించడానికి, పునర్వినియోగం చేయడానికి మరియు పునరాలోచించడానికి పరిష్కారాలను ప్రోత్సహించడానికి ప్రచారానికి నాయకత్వం వహిస్తోంది. రిపబ్లిక్‍ ఆఫ్‍ కొరియా 2025 ప్రపంచ పర్యావరణ దినోత్సవం కోసం ప్రపంచ వేడుకలను నిర్వహిస్తోంది.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *