ఆర్యభట్టు(క్రీ శ 476), బ్రహ్మగుప్తుడు (క్రీ శ 598) వంటి గొప్ప శాస్త్రవేత్త ఆచార్య ద్వితీయ భాస్కరుడు. వీరు క్రీ శ 1114 సం లో జన్మించినట్టు చెబుతారు. ఇతని జన్మస్థలం కర్ణాటక ప్రాంతంలోని బీదరు లేదా బీజాపురం అని కొందరు భావిస్తే; మరికొందరు మహారాష్ట్ర ప్రాంతాల్లోని బీడ్ అని నమ్ముతారు.
భాస్కరాచార్యుడు క్రీ శ 1150లో రచించారని భావించే ‘లీలావతీ గణితం’ తొలిసారి 19వ శతాబ్దం ప్రారంభంలో పాశ్చాత్యుల దృష్టిలో పడింది. చార్లెస్ హట్టన్ (1737 -1823) రచించిన ఆంగ్ల గ్రంథంలో భారతీయ బీజగణితం గురించి ప్రస్తావిస్తూ ‘లీలావతీ గణితం’ గురించి ప్రస్తుతించారు. వివరాలు తరచి చూస్తే 1587లో అక్బర్ పాదుషా సలహా ననుసరించి ఫైజీ ఈ గ్రంథాన్ని పర్షియన్ భాషలోకి అనువదించారని తెలుస్తుంది. “నైరాశ్యంలో జీవితం వ్యర్థం కాకుండా, కుమార్తెను గణిత శాస్త్ర విశారదను చేశాడు. లీలావతీ గణితం గ్రంథం నిజంగానే జీవితేచ్ఛ గలిగించే స్ఫూర్తిదాయకమైన రచన”, అని నెథాన్ ఎ కోర్టు తన ‘మేథమేటిక్స్ ఇన్ ఫన్ అండ్ ఇన్ ఎర్నెస్ట్’ గ్రంథంలో రాశారు.
భాస్కరుడు తన కాలం వరకు భారతదేశంలో వృద్ధి చెందిన గణిత శాస్త్ర జ్ఞానమంతటిని క్రోడీకరించి, దోషాలు సవరించి, లోపాలు పూరించి ‘సిద్ధాంతశిరోమణి’ అనే సంస్కృత రచన చేశారు. ఇందులో గురుత్వాకర్షణ నియమం, కలన,సమాకలనగణితాలు ఉన్నాయి. అలాగే శూన్య సంఖ్య, సహజ సంఖ్యలు, ఋణ సంఖ్యలు, భిన్నాంకాలు, కరణీయ సంఖ్యలు వంటి భావనలను కూడా ప్రతిపాదించారు. ఋణాత్మక సంఖ్యలను పైన చుక్క పెట్టి గుర్తించే హేతుబద్ధమైన విధానాన్ని కూడా ప్రారంభించాడు. భాస్కరాచార్యులు రచించిన ‘సిద్ధాంత శిరోమణి’ నాలుగు భాగాలుగా ఉంటుంది. అవి 1. వ్యక్త (అంకె/పాటీ) గణితం 2. అవ్యక్త (బీజ) గణితం 3. గ్రహగణితం 4. గోళాధ్యాయం. వీటిలో తొలి భాగమే ‘లీలావతీ గణితం’గా ప్రఖ్యాతి చెందింది.
లీలావతి ఎవరు అనే సందేహం తప్పకుండా వస్తుంది. రకరకాల నమ్మకాలు ఉన్నా, ఎక్కువ మంది భావిస్తున్నది లీలావతి భాస్కరాచార్యుల కుమార్తె. ఆమె ఆనందం కోసం ఈ ‘లీలావతీ గణిత’ భాగాన్ని రచించారని నమ్ముతున్నారు. 19వ శతాబ్దం ఆరంభంలో కోల్ బ్రూక్, టేలర్, విల్కిన్ సన్ మొదలైన పాశ్చాత్య పండితులు లీలావతీ గణితాన్ని ఆంగ్లంలోకి అనువదించారు. ఇందులో 118సూత్రాలకు 149 శ్లోకాలు, 114 ఉదాహరణకు 119 శ్లోకాలుంటాయి.
తడకమళ్ళ వెంకట కృష్ణారావు అనే మద్రాసు తెలుగు పండితుడు లీలావతీగణితాన్ని మొదటి సారి తెలుగు లిపిలో 1863లో ప్రచురించారు. 1934 లో వావిళ్ళ వారు వేదం లక్ష్మీనారాయణ శాస్త్రి అనువదించి ఎనిమిది వందల పుటల గల పుస్తకాన్ని సంస్కృత శ్లోకాల మూలంతో పాటు ప్రచురించారు. తెలుగు టీకా, తాత్పర్య, ఉదాహరణలతో సహా పిడపర్తి కృష్ణమూర్తి శాస్త్రి 1936లో ‘లీలావతీ గణితము’ పేరున 560 పేజీల గ్రంధాన్ని వెలువరించారు.
తర్వాత తెలుగు అకాడమీ 2001 సంవత్సరంలో విద్వాన్ తెన్నేటి అనువాదం, వ్యాఖ్యానంతో ; ఆచార్య పి వి అరుణాచలం పరిష్కర్తగా ‘భాస్కరాచార్యుని లీలావతీ గణితా’న్ని వెలువరించింది. 300 పేజీల ఈ గ్రంథం మూడు,నాలుగు సార్లు పునర్ముద్రణ అయినట్టు తెలుస్తోంది. ఆసక్తి ఉన్న మిత్రులు తెలుగు అకాడమీ నుంచి ఒక ప్రతిని సంపాదించి, దాచుకోవడం ఉత్తమం. ఎందుకంటే మీరు పెద్దయిన తర్వాత కూడా ఎంతో ఆనందంగా చదువుతూ ఈ గణిత శాస్త్రాన్ని ఎంజాయ్ చేయొచ్చు కనుక.
డా నాగసూరి వేణుగోపాల్, 9440732392