చదువురాని సోగ్గాడు

కథ: రామ రామ రామ రామ – రామా రామా
రాజులమ్మ రాడవేణి రామ – రామా రామా
కోనరావుపేట మండలంలో తెల్ల కాగితం మీద నల్ల గీత తెలుపని సోకుల వడుతున్న కొండయ్య కతేందో ఇందామా!
వంత: నీ యవ్వ గీతలెందుకు తెలువయి ఒకటి రొండో లెక్కేసుకొని శెప్పచ్చు గదా!
కథ: ఓరి ఎర్రి ఎంగలయ్య అక్షరాలు రావని అర్థం..
వంత: అ ఆ… ఇ ఈ గన్వి రావానే..!
కథ: ఒరే మోకాళ్ల మెదడున్నోడా! సదువు రానోడని అర్థం.
వంత: గట్లయితే జర్ర జెప్పే..!
కథ: కోనరావు పేటలోన రామా రామా!
సోగ్గాడు కొండయ్య రామా రామా!
పనికేమో శేతగాడు రామా రామా!
తిండి కేమో బండయ్య రామా రామా!
అయ్యవ్వను హరిగోసజేసి రామా రామా!
పైసలేమో లాగుతాడు రామా రామా!
సిర్సిల్ల సీనిమాలకు రామా రామా!
సిందు లేస్తు పోతాడు రామా రామా! హరి హరి రామా
హరి గోస వెడుతూ.. అడ్డమైన తిరుగుళ్లకు అలవాటు వడ్డడు రామా..! అయ్యవ్వ పెద్దసారుకు మొరవెట్టుకుండ్రు రామా! సదువచేటట్లు చెయ్యి మన్నరయ్యా రామా..! ఒగనాడు కొండయ్య ఇంటికి పెద్దసారు ఎట్ల బయలు దేరినాడు రామా..!
మా ఊరి పెద్దసారు రామా రామా!
రాతిరనక పగలనక రామా రామా!
టకాటికా నడ్చుకుంటు రామా రామా!
కొండయ్య ఇంటికి బోయే రామా రామా!

కొండయ్యను బడికెందుకు తోలలేదని రామా! రాత్రి బడికైన పంపుండి! లేకుంటే నీ కొడుకు ఎందుకు గొరగాని రౌడీ అవుతడమ్మా..! రామా! ఓయి పంతులయ్య వాని ఈ పంత పల్లగొట్టి బర్లెకు తీసుకుపోండ్రి అని ఏడ్సిండ్రు నాయినా..! కొండయ్య
ఉన్నప్పుడు మల్లా వస్తానని పెద్దసారు పోయిండు నాయనా..!
ఒగనాడు పట్నంల సోపతిగాడు రంగని పెండ్లికోసం ఇంగెట్లు తయారైతుండు కొండయ్య రామా..!


అయ్యవ్వ నదరగొట్టి రామా రామా!

అంగిలాగు దొడిగినాడు రామా రామా!
టక్కుబిక్కు వేసిండు రామా రామా!

టై గట్టి బూట్లు వేసిండు రామా రామా!
సెంటు గింటు రాసుకొని రామా రామా!
టక్కుటిక్కు బస్సు ఎక్కి రామా రామా!
ఇమ్లీబన్‍ బస్టాండులో రామా రామా!
దిగీ దిక్కులు జూస్తుండు రామా రామా!


అమీర్‍పేట్‍ పంక్షన్‍ హాల్లో పెళ్ళి జరుగుతంది రామా! బుర్రు బర్రు మోటార్ల, ఆటోల, కార్ల హోరు జూసి ఎవ్వరిని అడుగాలో ఏమీ దిక్కుతోచని స్థితిలో ఉన్నడూ నాయనా? గిదంత గమనిస్తున్న ఆటోడ్రైవర్‍! యాడికి బోవాలె సార్‍ అని అడిగిండు నాయనా..! సార్‍ అనగానే కొంచెం పొంగిపోయి, అమీర్‍పేట్‍ ఏ బస్సు పోతుంది? అని కొండయ్య అడుగానే పేరు సదువుకోని ఎక్కండి? సార్‍.. అనగానే నీళ్ళు నములుతున్నడయ్యా రామా! గిది పూర్తిగా అర్థం జేసుకున్న డ్రైవర్‍ నా ఆటోలో రాండి సార్‍.. పొగ్గించి ఆటోలో కూకుండు బెట్టుకోని రామా!


సందు గొందు తింపుతుండు రామా రామా!
గంటలు గంటలు దింపిండు రామా రామా!
అమీర్‍పేట చౌరస్తాల రామా రామా!
ఆపిండు ఆటో ట్రైవర్‍ రామా రామా!
మీటరు జూసి పైసలియ్యు రామా రామా!
అన్నడయ్య డ్రైవరయ్యా రామా రామా!
రాజులమ్మ రాడవేణి రామా రామా!


సదువు కొండయ్య మీటర్‍ జూడుమంటే దిక్కులు అటూ ఇటూ జూసి రామా..! ఎంత అని మళ్ళడిగిండు కొండయ్య రామా..! వీడొక అన్నాడి సదువురాని మొద్దు అనుకొని వందరూపాయలు మీటరు చార్జీ ఉంటే రెండు వందలన్నడయ్యా రామా! కొండయ్య గుండెలో దడ మొదలయ్యి నా కాడ అరువై రూపాయలే ఉన్నయి అనగానే ముక్కోపి డ్రైవర్‍ ఎడాపెడా వాయించి ఉన్నయి దీసుకొని ఎక్కడి దరిద్రపోడు సూటుబూటు ఏసుకున్నడు సదువురాని సన్నాసి అంటు బూతులుగక్కుత వెళ్ళిండు నాయనా..!
పంక్షన్‍ హాలు కోసం హాలు సుట్టే 20 సుట్ల దిరిగిండు నాయనా! ఇంగ్లీషులో పేరు రాసి ఉన్నయి గాని సదువురాని సన్నాఇ కొండయ్య గప్పుడే గంట గంగయ్య కొండయ్యను శూశాడు నాయనా! విషయమంత తెలుసుకున్న గంగయ్య ఏమంటాడు రామా..!


పెళ్ళి కొడుకు పేరు రామా రామా!
పెళ్ళి కూతురు పేరు రామా రామా!

కమాను ముందటా రామా రామా!
రాసి ఉన్నాయి గదరా! రామా రామా!
సదివితే తెలిసేది గదరా! రామా రామా!
పరేశాను ఎందుకైనావు రామా రామా!
సూటుబూటు సేకున్నవు రామా రామా!
కళ్ళకద్దాలు వెట్టుకున్నవు రామా రామా!
బడి దొంగ వైతివెందుకు రామా రామా!
సదువురాని సన్నాసివైయ్యి రామా రామా!
నల్లుట్ల నవ్వులపాలైతివి రామా రామా!
నేల గీతలు గీయవడ్తివి రామా రామా!


ఓరి కొండయ్య నువు ఒక్కనివి ఇంగ ఎటు పోకు నాయనా..
ఇంగ అక్షంతలేసి బుక్కెడ బువ్వ దిని మేము వచ్చిన ప్రయివేటు బస్సు గిదే ఇంగో నెంబరు జూసుకో..! ఇంగ వచ్చి గిండ్లనే కూకోరా కొండయ్య..! మల్ల నవ్వు కాటగలిసి మమ్ము పరేషాన్‍ చెయ్యకురా..! రామా..! ఇంగ పెళ్ళికాడికి… బువ్వ కాడికి పోదారారా కొండయ్యా..! పెళ్ళి జూపిచ్చిండు! బువ్వ దినే కాడికి దొల్కపోయిండు. ఇద్దరు బువ్వ దిన్నరు. బస్సుల కూకున్నరు నాయినా..! కొండయ్య మనసున పడ్తలేదు.


సదువు నేర్చుకోక నేను.. రామా రామా!

గిన్ని కట్టాలు వడితి గాద… రామా రామా!

వింత జంతువు వోలే.. రామా రామా!
నా గతి అయి పాయే.. రామా రామా!
పెద్దల మాట సద్దిమూట.. రామా రామా!
సదువు కున్న తెలివి… రామా రామా!

ఎట్లా ఉంటదో తెలినాది… రామా రామా!
ఇంటికి పోయి నంకా.. రామా రామా!
రాత్రి బడికి వోయి నేను.. రామా రామా!
సదువు నైతే నేర్చుకుంటా.. రామా రామా!
ఏవో ఏవో ఆలోచనలు… రామా రామా!
మనుసు నిండ తిర్గవట్టే.. రామా రామా!

కోనరావుపేటకు బస్సు జేరుకున్నది నాయనా! కొండయ్య గంపెడు సిగ్గుతో తలవంచుకొని ఇంటికి వోయిండు గానీ! రాత్రంత నిదురవోక ఆలోచనలో పడ్డడు. తప్పుజేసినోన! తెల్సుకున్నడయ్య.. పొద్దుగాల లేసి కాలకృత్యాలు తీర్చుకొని పెద్దసారు దగ్గరికి దండాలు బెట్టి రామా! నాకు సదువు వచ్చే తొవ్వ జూపుండ్రి సారూ అని కాళ్ళమీద వడ్డడయ్యా!


బిడ్డా! కొండయ్య! నీ ఇష్టంతోని సదువు నేర్చుకుందామని వచ్చినవు. నువ్వు మంచి విద్యావంతునివి ఇంకెంతో మందికి నువ్వు తొవ్వ జూపుతవు బిడ్డా! అని రాత్రిపూట బడికి పోవాలె! ఆదివారం నా దగ్గరి రావాలే గట్లయితే కొద్ది రోజుల్లోనే సదువత్తది బిడ్డా! అని ముద్దుగ జెప్పినాడు నాయనా!
పలక బలపం బట్టినాడు రామా రామా!
పట్టుబడి సదువు తుండు రామా రామా!
వారం రోజుల వరకు రామా రామా!
అక్షరాలు ఒంట బట్టే రామా రామా!
గుణింతాలు నేర్చి నాడు రామా రామా!
రొండు వారాల వరకు రామా రామా!
బాల శిక్ష జదివినావు రామా రామా!

కొండయ్య మొద్దు నిద్ర మానిండు పెద్దసారు అండదండలతో పదో తరగతి పీజు గట్టించిండు నాయనా! ఏనుగు లెక్కన్న మనిషి కట్టెపుల్లోలె ఎండిపోయ్యిండు అయ్యవ్వ చిత్ర పతుతుండ్రు. పదిల పాసై, ఇంటర్‍, డిగ్రీ పూర్తిజేసి బిఈడి ప్రయివేటు జేసిండు నాయనా! ఉడుంపట్టువట్టి డిఎస్సీలో ఉపాధ్యాయ ఉద్యోగమే అందుకుండు నాయనా..! తన కథనే జెప్పుకుంటూ పిల్లలను విద్యావంతులు తీర్చిదిద్దుతుండు నాయనా!
ఊరు జనమంతా రామా రామా!
ముక్కు మీద వేలేసుకొని రామా రామా!
సదువేమి రానోడూ రామా రామా!

సారు ఎట్ల అయ్యినాడు రామా రామా!
బోయ వాడు వాల్మీకి రామా రామా!
అయ్యి నట్లు రాత మారే రామా రామా!
సంకల్పం గట్టి గుంటే రామా రామా!
పట్టుదల గట్టి గుంటే రామా రామా!
జగతిలోన అన్ని గూడ రామా రామా!
సాధించ వచ్చు నయ్య రామా రామా!


గప్పటి నుంచి ఊరోళ్ళందరు ఎవ్వలకు సదువురాకున్న నాయనా ఏమి రాని కొండయ్య ఎట్లెదిగినాడో జూడుండ్రి నాయనా! గందుకే ‘‘కష్టేఫలి’’ అన్నరు పెద్దలు నాయనా! కష్టపడిన వాళ్ళకు ఫలితము తప్పక దక్కుతుంది నాయనా! అందరికి తొవ్వ జూపిన వాడు అయ్యిండు రామా..! అందరు కష్టాని ఇష్టపడి మీ గమ్యస్థానాన్ని చేరుకోండి.
మంగళంబు కథ విన్నవాళ్ళకు రామా రామా
మంగళంబు కష్టపడేవాళ్ళకు రామా రామా!

  • డా।। జనపాల శంకర్‍
    ఎ : 807472710

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *